Saturday 21 July 2018

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితా - Anakalita sadrusya chubuka sri virajita

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

అగాధేఽత్ర సంసారపఙ్కే నిమగ్నమ్

కలత్రాదిభారేణ ఖిన్నమ్ నితాంతమ్|

మహామోహపాశౌఘబద్ధమ్ చిరన్మామ్

సముద్ధర్తుమమ్బ త్వమేకైవ శక్తా||

(దేవి భుజంగ స్తోత్రమ్)

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితా

 

కలిత లభ్యమైన; అనాకలితఅలభ్యమైన

సాదృశ్యసమమైన

చిబుకముగడ్డము

శ్రీశోభ

విరాజితావిరాజిల్లుతల్లి

 

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితాయై నమః

 సమమైన ఉపమానము లేని గడ్డపుశోభతో విరాజిల్లు తల్లికి నమస్కారము.

 

వశిన్యాదివాగ్దేవతలు తల్లీ!! నీ ముక్కు సంపంగిపూవు వంటిది, కన్నులు చేపలవంటివి, కనుబొమలు మన్మధునివిల్లువంటివి, పెదవులు బింబఫలము వంటివి, చెక్కిళ్ళు పద్మరాగశిలల అద్దములవంటివి, మొత్తముగా వదనము చంద్రబింబము వంటిది అని వర్ణించి, గడ్డము దగ్గరకు వచ్చేసరికే, అమ్మా!! నీగడ్డమును పోల్చుటకు మాకు నీసృష్టిలోనుంచి ఏమీ దొరకుటలేదు. అందుచే ఉపమానరహితమైన గడ్డమునుగల తల్లికి నమస్కారము అని గడ్డపుశోభకు దీటైన వస్తువేదీ లేదని తేల్చి చెప్పారు.

 

కానీ అదే బ్రహ్మాండపురాణమునందలి లలితోపాఖ్యానమునందు వ్యాసులవారు తల్లి గడ్డమును 

ముఖదర్పణవృన్తాభ చిబుకా (లలితోపాఖ్యానము అ33 – శ్లో82)

తల్లీ!! నీ చిబుకము (గడ్డము), నీ ముఖమనెడు గుండ్రటి అద్దమునకు పిడివలే ఉన్నది, అని వర్ణించారు.

 

మరి ఈ అద్దపుపిడిని పట్టుకున్న వారెవరో తెలుసుకొనుటకు సాక్షాత్ శివస్వరూపులైన శంకరభగవత్పాదుల సౌన్దర్యలహరిని ఆశ్రయించాలి. సౌన్దర్యలహరి 67వ శ్లోకము కరాగ్రేణ స్పృష్టమ్ తుహినగిరిణా వత్సలతయా నందు, వాత్సల్యముతో తండ్రియైన హిమవత్పర్వతరాజు, అధరపానాకులతతో పతిదేవుడైన గిరీశుడు ముఖమనెడి అద్దమునకు పిడివలెనున్న ఉపమానరహితమైన నీ గడ్డమును స్పృశించారు తల్లీ!! అని వర్ణించారు.


ఇచ్చట ముఖమును అద్దముతో పోల్చుటకు కారణము పరిశీలిద్దాము.

మనోజాతమాణిక్యసద్దర్పణాకార వక్త్రాంబుజ ప్రోజ్వలన్మంజరీ వృన్త రేఖాకనచ్చౌబుక శ్రీయుతే!! (రాజరాజేశ్వరీ దండకము)

మనస్సునుండి జనించిన సంకల్పమాత్రమున ఏర్పడిన మాణిక్యపుటద్దమువలేఉన్న ముఖారవిందమునందు ప్రజ్వలిస్తున్న అద్దపుపిడివలె ప్రకాశిస్తున్న చిబుకముతో శోభిల్లుతల్లీ!!

 

ఎవరి మనస్సు? పరమాత్మ (సృష్టిచేయ) సంకల్పమాత్రముననే, ఏకవస్తువుగా ఉన్న ప్రకాశవిమర్శశక్తులు సృష్టి కార్యార్ధము రెండుగా విభజించబడి, బ్రహ్మాత్మకశక్తి అద్దమువలే ప్రకాశించినది (కామకలావిలాసము). ప్రకాశబిందువు చైతన్యవంతమైన బ్రహ్మస్వరూపము. విమర్శబిందువు తదంతర్గత శక్తి.

 

విమర్శబిందువును రెండవసూత్రమునందు మలినములేని (నిర్మల) అద్దము(ఆదర్శము)గా చెప్పబడినది.

సా జయతి శక్తిరాద్యా నిజసుఖమయ నిత్యనిరుపమాకారా

భావిచరాచరబీజమ్ శివరూపవిమర్శనిర్మలాదర్శః

(కామకలావిలాసము సూ 2)

నిర్మలమైన అద్దమువంటి విమర్శబిందువు బ్రహ్మాత్మకమైన శక్తిస్వరూపము. ఆమెయే కామేశ్వరీదేవి అని చెప్పుకున్నాము కదా!! ఆమె కుంకుమచ్ఛాయగలదిగనుక మాణిక్యపుటద్దము (కెంపుటద్దము) అని చెప్పబడినది.

 

అమ్మయొక్క అద్దమువంటి ముఖమునందలి పిడివంటి గడ్డముపట్టుకొని మహామోహపాశములతో కూడిన జన్మజలధినుండి దాటించుతల్లీ అని బతిమలాడుతూ

 

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment