Friday 21 June 2019

devarshi-gana-sanghata-stuyamanatma-vaibhava దేవర్షీగణసంఘాతస్తూయమానాత్మవైభవా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
వేదమయీమ్ నాదమయీమ్ 
బిందుమయీమ్ పరపదోద్యదిందుమయీమ్।
మంత్రమయీమ్ తంత్రమయీమ్ 
ప్రకృతిమయీమ్ నౌమివిశ్వవికృతిమయీమ్।। (మూకపంచశతి)

మహాయాగాంతమున లోకరక్షణార్ధము, చిదగ్నికుండమునుండి పరాశక్తి, స్థూలరూపమును గ్రహించి లలితామహాత్రిపురసుందరిగ ఆవిర్భవించినది. తదనంతరము లలితమ్మతల్లిని దేవతలు, ఋషులు, గణసమూహములు స్తుతించి, భండాసురుని బారినుండి కాపాడమని ప్రార్ధించినట్లు బ్రహ్మాండపురాణమునందు చెప్పబడినది. యుద్ధమునకు సన్నద్ధమైన తల్లి, నిప్పునుండి అదేతత్త్వముగల్గిన నిప్పుకణములనేకములు వెలువడినట్లు, తననుండి అనేక శక్తిసమూహములను ఉత్పన్నముజేసి, వారికి వివిధ కార్యనిర్వహణభారమునొసగినది. ఇకపై వచ్చు కొన్ని నామములు తల్లియొక్క యుద్ధలీలావిలాసమును వర్ణించునవి.  అయితే, ఈ నామములు పంచభూతాత్మక, జీవభావమయ, మాయప్రపంచ సంకేత భండాసురుని జయించుటకొరకు సాధకులగువారలయందు ఉత్తేజితమగు అంతర్లీనశక్తులపరముగాకూడా అన్వయించబడినవి. 

దేవర్షీగణసంఘాతస్తూయమానాత్మవైభవా
దేవాశ్చఋషయశ్చ దేవర్షయః – బ్రహ్మాది దేవతలు, వశిష్టాది ఋషులు
దేవర్షయః – నారదాది దేవఋషులు
దేవర్షయశ్చ దేవర్షయశ్చ దేవర్షయః - ఏకశేష ఏకవిభక్తౌ మరలమరల వచ్చుయెడల ఒకసారి చెప్పిన చాలునను పాణిని వ్యాకరణసూత్రముననుసరించి ఇచ్చట ఒక పర్యాయము మాత్రమే దేవర్షయః యని చెప్పబడినది.

ఆదిత్యవిశ్వవస్తుషితాభాస్వరానిలాః। 
మహారాజికసాధ్యాశ్చరుద్రాశ్చ గణదేవతాః
 (అమరకోశము-స్వర్గవర్గము-10)
గణాః – ఆదిత్యాదులు (ఆదిత్యులు, విశ్వేదేవతలు, వసువులు, తుషితులు, భాస్వరులు, అనిలులు, మహారాజులు, సాధ్యులు, రుద్రులు)

దేవర్షీగణ – దేవ (బ్రహ్మాదులు), ఋషి (నారదాదులు), గణ (ఆదిత్యాదులు)
సంఘాత – మహాసముదాయము
స్తూయమాన – స్తుతించబడిన
ఆత్మ - ఆత్మ/స్వరూపము
వైభవా –వైభవము/వ్యాపకత్వము గలిగినది
దేవతలు, ఋషులు, గణ మహాసముదాయములజేత స్తుతించబడిన దివ్యస్వరూపముగలిగిన తల్లికి నమస్కారము.
అంతరార్ధము
శంకరభగవత్పాదులు మనస్త్వమ్ వ్యోమత్వమ్.. శ్లోకమునందు త్వయి పరిణతాయామ్ నహి పరమ్ సమస్త దృశ్యాదృశ్య ప్రపంచము నీయొక్క పరిణామము మాత్రమే, వేరేమీ కాదుయని వర్ణించినవిధముగ, వాగ్దేవతలు తల్లియొక్క విశ్వవ్యాపకత్వమును(వైభవమును) వర్ణించు నామమిది.

స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వవిగ్రహా। (తంత్రరాజతంత్రము – 35.13)
సదానందపూర్ణా స్వాత్మైవ పరదేవతా లలితా (భావనోపనిషత్తు-23)
ఆత్మాభిన్నదేవతాయాః వైభవమ్ విభుత్వమ్ అనంత శక్తి సంవృతత్వరూపమ్ ప్రాభవమ్ యస్యాః సా ఇతి వర్ణనీయమ్ 
 (భాస్కరరాయలవారి భాష్యము)
దేవతలు, ఋషులు, గణ మహాసమూహములజేత సర్వత్రావ్యాపించియున్న ఆత్మస్వరూపయని స్తుతించబడినతల్లి, లలితామహాత్రిపురసుందరి.

చైతన్యమేవ ఆత్మయను శివసూత్రముననుసరించి విశ్వవ్యాపిత చైతన్యము తల్లివిభూతిగ తెలియబడుచున్నది.  అవ్యక్త పరాశక్తి, చరములందు చిచ్ఛక్తిగనూ, అచరములందు జడశక్తిగనూ, వ్యక్తీకరింపబడుచున్నది.

సహస్రనామస్తోత్రమును శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీయను నామములద్వారా తల్లి పరా రూపముతో ఆరంభించిన వాగ్దేవతలు, సృష్టిసూచక స్థూలరూపవర్ణన తదుపరి, సమస్తచరాచరసృష్టియందలి చైతన్యాత్మక పరాశక్తి రూపమును మరల స్తుతించుచున్నారు.

వ్యక్తీకృత పరారూపస్వరూపిణి తల్లి, అతిశీఘ్రముగ అవ్యక్తపరానుభవమును కలుగజేయవలెనని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః