Friday 21 February 2020

36 తత్త్వములు 7 ప్రమాతలు మరియు భగవద్గీత 36 Tattvas - 7 Pramatas and Bhagavadgita


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
మనస్త్వమ్ వ్యోమత్వమ్ మరుదసి మరుత్సారథిరసి
త్వమాపస్త్వమ్ భూమిస్త్వయి పరిణతాయామ్ నహి పరమ్
త్వమేవస్వాత్మానమ్ పరిణమయితుమ్ విశ్వవపుషా
చిదానందాకారమ్ శివయువతి భావేవభిభ్రుషే (సౌన్దర్యలహరి – 35)

సమస్త చరాచరసృష్టి 1. శివ 2. శక్తి 3. సదాశివ/సాదాఖ్య 4. ఈశ్వర/ఐశ్వర్య 5.సద్విద్య/శుద్ధవిద్య 6.మాయ 7.కల 8. కాల 9. విద్య 10. నియతి 11. రాగ 12. పురుష 13. ప్రకృతి 14. బుద్ధి 15. అహంకారము 16. మనస్సు 17-21. పంచ జ్ఞానేంద్రియములు (శ్రోత్రత్వక్చక్షుజిహ్వాఘ్రాణ) 22-26. పంచ కర్మేంద్రియములు (వాక్పాణిపాదపాయూపస్థ) 27-31. పంచ తన్మాత్రలు (శబ్దస్పర్శరూపరసగంధ) 31-36. పంచ భూతములను (ఆకాశవాయువహ్నిసలిలపృథ్వి) 36తత్త్వములతో కూడినది.
షట్కంచుకములు: మాయపరిమితత్వము; కలపరిమిత కర్తృత్వము; విద్యాకించిత్ జ్ఞత్వము; రాగఅసంపూర్ణత్వము; కాలకుచించబడిన అనంత కాలపరిమితి; నియతిపరిమిత వ్యాపకత్వము
పరమావరణమ్ మల ఇహ సూక్ష్మమ్
మాయాది కంచుకమ్ స్థూలమ్ |
బాహ్యమ్ విగ్రహరూపమ్
కోశత్రయవేష్టితో హ్యాత్మా|| (పరమార్థసారము 24)
ఆత్మనిఆవరించియున్న బాహ్యవిగ్రహరూపము, దీనికన్నా సూక్ష్మమైన మాయాది కంచుకములు, వీనికన్నా సూక్ష్మమైన మలత్రయమనబడు మూడు కోశములు ఇక్కడ చెప్పబడుచున్నవి. 
మాయాపరిగ్రహవశాద్
బోధో మలినః పుమాన్ పశుర్భవతి।
కాలకలానియతివశాద్
రాగావిద్యావశేన సంబద్ధః।। (పరమార్థసారము-16)
వరిబీజమును కప్పుచూ ధాన్యము, పసుపు-తెలుపు (తవుడు) పొర, వెలుపలి పసుపురంగు ఊకపొట్టు ఉన్నట్లేమాయకులోబడిన శుద్ధచైతన్యము కల, కాల, విద్య, నియత, రాగము పొర/కంచుకములతో కప్పబడుటచే అశుద్ధమై, పశువు/పురుషుడనబడుచున్నది. మలత్రయమనుపాశము ఈ మాయామోహిత పశువులను బంధించుచున్నది.

బ్రహ్మాద్యాః స్థావరాంతాశ్చ దేవదేవస్య ధీమతః
పశవః పరికీర్త్యంతే సంసారవశవర్తినః
తేషామ్ పతిత్వాద్భగవాన్ రుద్రః పశుపతిః స్మృతః  
 (లింగపురాణము ఉత్తరభాగము 9.11-13)
మలత్రయమును పాశముతో బంధించబడిన (మాయాదికంచుకములతో ఆవరింపబదడిన జీవాత్మ) ఈ పశువులను పాలించు పరమాత్మను శైవులు పశుపతియనియు, వైష్ణవులు గోపాలుడనియు పూజిస్తున్నారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే!

ముప్పైయారు తత్త్వములు రెండువిధములుగ విభజించబడినవి. మాయాది క్షితిపర్యంతముగలవి (7-36) అశుద్ధ/అపర తత్త్వములు, శివాది శుద్ధవిద్య పర్యంతముగలవి (1-5) శుద్ధ/పరతత్త్వములు. 3-6 తత్త్వములు సదాశివ, ఈశ్వర, శుద్దవిద్య/సద్విద్యా తత్త్వములను శుద్ధాశుద్ధ/పరాపరతత్త్వములని చెప్పబడుచున్నవి. అయితే జీవుల సంస్కారములనుబట్టి వారియందలి ఉత్తేజితమైన తత్త్వస్థాయి ఉంటుంది.  సంసారవిషయాసక్తులైన వారియందు అశుద్ధ తత్త్వములు ఉధృతముగనూ, శుద్ధతత్త్వములు నిద్రాణముగనూ యుండును. జీవునియందలి నిద్రాణమైయున్న అంతర్లీన శివతత్త్వమును సాక్షాత్కరించుకొనుటయే మోక్షము. మోక్షసాధకులైనవారియందు అశుద్ధతత్త్వనాశనము జరుగుటద్వారా వారు ఉత్తమస్థితిని పొందుతారు. 

జీవులు వారివారి గుణకర్మానుసారముపొందు తాత్త్వీకస్థితిననుసరించి 7 పేర్లు.  సకలకల, ప్రళయాకల, విజ్ఞానకల, మంత్ర, మంత్రేశ్వర, మంత్రమహేశ్వర, శివయని 7ప్రమాతల ఆరోహణక్రమము కశ్మీరశైవమతమునందు చెప్పబడినది. ఈ ప్రమాతలనుగురించి మరింత వివరించుకుందాము. 
1. సకలకల ప్రమాత:
సకలప్రమాతయందు అశుద్ధ తత్త్వములు ఉధృతముగనూ, శుద్ధతత్త్వములు నిద్రాణముగనూ యుండుటయేకాక, మాయాజనిత మలత్రయమును (అణవ, మాయీయ, కార్మీక మలములు) పాశములతో బంధింపబడుటచే పశువబడుచున్నాడు.  పూర్తిగా సుఖదుఃఖములవంటి ద్వందములకులోనై, ద్వైతభావన కలిగిన స్థితి.
2. ప్రళయాకల ప్రమాత:
ఈ ప్రమాత, యోగసాధనద్వారా కార్మికమల క్షయమును మాత్రము సాధించిన జీవుడు.  నిజానికి ఇక్కడ క్షయమనిన సంపూర్ణక్షయము కాదు, కార్మీకమలము అణచబడిన స్థితి. ఈ స్థితిలో జీవుడు రెండుమలములు ఆణవమలము, మాయీయమలములచేత మాత్రమే బంధింపబడియుంటాడు. రాగ కంచుకము మాంద్యమైన స్థితి.
3.  విజ్ఞానకలప్రమాత:
మాయీయమల క్షయమైన ప్రళయకల ప్రమాత.  అంటే విజ్ఞానకలప్రమాతను ఒక అణవమలము మాత్రమే బంధించియుంటుంది.  మాయీయమల క్షయమగుటచే విజ్ఞానకలప్రమాతయందు మాయాతత్త్వము బలహీనమైయుంటుంది.  కానీ ఆణవమలము ఇంకనూ ఉండుటచే ఈ ప్రమాత, శుద్ధవిద్యాతత్త్వస్థితిని  పొందలేదు.  ఈ ప్రమాత శుద్ధవిద్యాతత్త్వమునకు, మాయాతత్త్వమునకు మధ్యఅవస్థను గలిగియుంటాడు.  దీనిని మహామాయాతత్త్వస్థితియని చెప్పబడుచున్నది. రాగ, కలా, విద్యా, మాయా కంచుకములు బలహీనములైన స్థితి.
4. మంత్ర ప్రమాత:
అశుద్ధతత్త్వములు స్తబ్ధమై,  శుద్ధవిద్యాతత్త్వము ప్రభావితమైన జీవస్థితి, శుద్ధవిద్యా ప్రమాత. ప్రపంచమే నేను, నేనే ప్రపంచమను భావనకలిగిన స్థితి.  కానీ ఇది అస్థిరమైన స్థితి. నిద్రాణమైన ఏ ఒక్క అశుద్ధతత్త్వము మరల ఉత్తేజితమొందిననూ ఈ శుద్ధవిద్యాప్రమాత పతనమును పొందుతాడు.  అలాకాకుండగా అభ్యాసమును కొనసాగించుతూ ఊర్ధ్వతత్త్వ స్థాయిని పొందుటద్వారా మోక్షమును పొందగలడు. కాల, నియత పొరలు తొలగిన స్థితి.

శుద్ధవిద్యాతత్త్వస్థితిని దాటిన మంత్రప్రమాత, మిగిలిన నాలుగు ఊర్ధ్వ శుద్ధతత్త్వములస్థాయిని సహజముగ పొందగలడు. అనగా మంత్రప్రమాత స్థితిని సాధించిన మోక్షము పొందినట్లే.
5. మంత్రేశ్వర ప్రమాత: సృష్టియంతటా తానేయను (ఇదమ్-అహమ్) భావన కలిగిన ఈశ్వర తత్త్వము ఉత్తేజితమైన ప్రమాత మంత్రేశ్వర ప్రమాత.
6. మంత్రమహేశ్వర ప్రమాత:
తానే సృష్టియను (అహమ్-ఇదమ్) భావన కలిగిన సదాశివ తత్త్వము ఉత్తేజితమైన ప్రమాత, మంత్రమహేశ్వరప్రమాత.
7. శివ ప్రమాత:
పూర్ణహంతా భావన - శివ,శక్తి తత్త్వములు

7 ప్రమాతలందలి చైతన్యవంతమైన తత్త్వము(ల)ను క్రింది చిత్రపటమునందు చూడవచ్చు.
7 ప్రమాతలందలి కంచుకములు, ఆవరణముల వివరములను క్రింది చిత్రపటమునందు చూడవచ్చు.

మోక్షమునుగురించి మాట్లాడుకొనునప్పుడు శ్రీకృష్ణపరమాత్మచే బోధింపబడిన మోక్షగ్రంథము భగవద్గీతను చెప్పుకొనకపోయినచో అసంపూర్ణమగును. శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతయందు అర్జునునికి బోధించిన సాంఖ్య, కర్మ, జ్ఞాన, సన్యాస, ధ్యాన (ఆత్మసంయమన), విజ్ఞానయోగములు, మోక్షసాధకులు ఆరోహించవలసిన ఉత్తమోత్తమ తత్త్వసోపానములు.

సమత్వమ్ యోగముచ్యతే (2.48) సమత్వమును కలిగియుండుటయే యోగము. త్రిగుణరహితమై, ద్వంద్వరహితమైన స్థితిని పొంది నిత్యము సత్తాసక్తుడై ఆత్మచిత్తుడైయుండవలసినదని అర్జునకు యోగమును వివరించాడు (2.45). యోగమనిన మోక్షము. అయితే మోక్షమును పొందుటకు సాంఖ్య, కర్మ, జ్ఞాన, సన్యాస, ఆత్మసంయమన యోగములను వేరుగ కనిపించు ఆరు మార్గములను భగవద్గీతయందు  ఉపదేశించిననూ, ఏ ఒక్కదాని మూలముగనైననూ మోక్షము సాధించవచ్చు.  కానీ ఒకదానినుండి పైదానికి త్రోవచేయు వరుసక్రమమును సాధకులసౌలభ్యముకొరకు రెండునుంచి ఏడవ అధ్యాయమువరకు కృష్ణపరమాత్మ వ్యాఖ్యానించాడు.

సుఖదుఃఖములందు సమబుద్ధిని కలిగియుండుట సాంఖ్యయోగము, కర్మఫలసంగరహిత కర్మానుష్ఠానము కర్మయోగము, తారతమ్యరహిత సమబుద్ధి జ్ఞానయోగము, సంకల్పసన్యాసము సన్యాసయోగమునందు, ఆత్మావలోకనము ఆత్మసంయమన యోగమునందును వివరింపబడినవి. 
నిజానికి ఆత్మసంయమనయోగమునందు కృష్ణభగవానుడు, ఇంతవరకుచెప్పిన అన్నియోగములను సాధించిన వ్యక్తిగా యోగారూఢుని వర్ణిస్తాడు.
యదా హి నేన్ద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే
సర్వసంకల్పసన్న్యాసీ యోగారూఢ స్తదోచ్యతే (6.4)
ఏవ్యక్తి  శబ్దాదివిషయములందు (ఇంద్రియార్థములు), కర్మలయందు ఆసక్తినుంచక, సర్వసంకల్పములను త్యజించుతాడో అతడు యోగారూఢుడని చెప్పబడుచున్నాడు.

ఇందులో మొదటిది సాంఖ్య, రెండవది కర్మ, మూడవది జ్ఞాన మరియు సన్యాస (6.8,9) యోగముల సూచితము.

ఏ ఒక్కమార్గమనుసరించి మోక్షముపొందుటకు సాధ్యమని చెప్పబడిననూ, సాధకులకు కర్మాచరణకు ముందు సాంఖ్యయోగము (2.38, 3.41), జ్ఞానముయోగమునకు ముందు కర్మయోగసాధన (4.41, 5.6) తప్పనిసరియని గీతాచార్యుడు బోధించాడు. 


కృష్ణయ్య మోక్షసాధకులకు వివిధ సులభతరమైన క్రియాశీల(practical) మార్గములను భగవద్గీతయందు ఉపదేశించిననూ, ప్రమాతస్థితులను స్పష్టముగ (explicitly) ఎక్కడా నిర్దేశించలేదు. కానీ వాటిని నిగూఢముగ పొందుపరచి యోగారూఢత్వమును వివరించాడు గీతాచార్యుడు.  అవ్విధముగ గర్భితముగనున్న  ప్రమాతలస్థితులు, లక్షణములను ఇప్పుడు తెలుసుకుందాము.

సకలకలాప్రమాత స్థితి
మొదటి అధ్యాయమైన అర్జునుని విషాదయోగము, సకలప్రమాతయైన జీవుడు అనాత్మవిషయములను ఆత్మారోపణ జేయుకారణముగ ఏర్పడు రాగమువలన పొందు దుఃఖమునకు సూచితము.
సకలప్రమాతప్రళయాకల ప్రమాత
రెండవ అధ్యాయమునందు కృష్ణయ్య సాంఖ్యమునందలి తత్త్వములను (కర్మేంద్రియములు-2.13, తన్మాత్రలు-2.14, పురుషుడు – 2.21, జ్ఞానేంద్రియములు-2.29, పంచమహాభూతములు-2.21,24, మనస్సు, బుద్ధి – 2.25, ప్రకృతి – 2.27) గుప్తముగా సూచించుచూ, ఈ తత్త్వముల ప్రభావమువలన జీవులు, సత్యము(2.16), అవినాశము(2.17), అజ(2.19), నిత్యము (2.18), శాశ్వతము(2.20),  అవ్యక్తము, అచింత్యము, సద్వస్తువు (2.25) అయిన ఆత్మను అనిత్యము, అసత్తుగా భావించుటయు, కాలబద్ధమై, అశాశ్వతమైన దేహమును నిత్యముగ భావిస్తూయుంటారు, కానీ అది తగదని ఉపదేశము జేసాడు (2.16).

ఇంద్రియములను ఇంద్రియార్థవిషయములవైపు పోనీకుండా శబ్దస్పర్శాదులందు, సుఖదుఃఖములందు సమభావమును కలిగియుండుటయే సాంఖ్యాయోగము. మనము ముందు చెప్పుకున్నవిధముగా, మోక్షసాధకులకిది తొలిమెట్టు.

ఇప్పుడు భగవద్గీతయందు శ్రీకృష్ణుడు బోధించిన నిగూఢ తత్త్వార్ధములను తెలుసుకుందాము.

కర్మఫలాసక్తిరహితముగ కర్మములనాచరించుటయే (2.47) కార్మికమల క్షయముగావించుట. కార్మికమల క్షయమైన ప్రమాత, ప్రళయకాల ప్రమాత.

ప్రళయకాల ప్రమాత లక్షణములను ఈ అధ్యాయమునందు గమనించవచ్చు. ద్వంద్వములను సమముగ గ్రహించుట (2.51), ఆత్మనిష్ఠత్వము(2.53,2.55), స్థితప్రజ్ఞత్వము (2.56), తాబేలు తన అవయములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థములనుండి, ఇంద్రియములను వెనక్కి మళ్ళించుకొను బుద్ధిని కలిగియుండుట (2.58), సర్వభూతముల జాగృతము రాత్రిగనూ, వారి రాత్రిని జాగృతవస్థగనూ కలిగియుండుట (2.69) మొదలగు లక్షణములను నిత్యానుష్ఠానమును జేయుటద్వారా సకలప్రమాత కార్మికమలమునుండి విముక్తుడగుతాడు (3.31). ప్రళయకాలప్రమాతలందలి రాగతత్త్వ కంచుకము జాడ్యముగనుండును.
ప్రళయాకల ప్రమాతవిజ్ఞానకల ప్రమాత
కార్మికమలక్షయమైన ప్రళయకాలప్రమాత, మాయీయ, ఆణవమలములతో బంధింపబడిన పశువు. నాల్గవ అధ్యాయములో భగవంతుడు, జ్ఞానయోగము/విద్యాతత్త్వముద్వారా మాయీయమలక్షయమును గావించుకొనుటనుపదేశించాడు.
భిన్నత్వ సంకేతమైన మాయీయమలముతో ప్రేరేపింపబడి కర్మాచరణజేయుటద్వారా జీవులు అనేక జన్మలను పొందుతున్నారు.  కానీ మలత్రయమువలన పరిమితత్వమును పొందిన జీవులకు ముందు జన్మలు జ్ఞప్తికిరావు.  మలత్రయరహితుడగుటచే పరమాత్మ అధీనమైన మాయాశక్తితో దుష్టశిక్షణ, శిష్టరక్షణార్ధము ఎత్తిన పెక్కు జన్మలు పరమాత్మునికి తెలుసు(4.5-8). ఏకత్వభావనతో, కర్మఫలాపేక్షరహిత కర్మాచరణము జీవులందలి కార్మీక, మాయీయమలములను నశింపజేయును.  తద్వారా కలా, విద్యా తత్త్వ కంచుకములుకూడా మాంద్యమగును.

జీవులందలి వారివారి గుణములు, కర్మలకు తగినట్లు తారతమ్యములతో కూడిన చాతుర్వర్ణ రచనను జరిపినట్లు, స్వయముగా భగవంతుడు 4.13 శ్లోకమునందు చెప్పినాడు.

తారతమ్యరహితమై, అంతటా బ్రహ్మానుభవమును పొందిన మాయీయమలము నశించినట్లే కదా!   సర్వత్రా బ్రహ్మభావనను కలిగియుండుట జ్ఞానము. అట్టి జ్ఞానముచే మాయీయమల క్షయముగావించుకొనిన  జీవి బ్రహ్మమేయగును (4.24). అయితే ఇట్టి స్థితిలో తననుంచి ప్రపంచము వేరుగా ఉన్నట్లుభావించిననూ, అంతా బ్రహ్మమేయను భావన కలిగియుంటాదు జీవుడు.

ప్రళయప్రమాత జ్ఞానయోగముద్వారా మాయీయమల నిర్మూలనగావించుకొనిన పిదప విజ్ఞానకలప్రమాత స్థితిని పొందుతాడు.  వీరు కర్మలనాచరించిననూ కర్మసంగత్వము ఏర్పడదు (4.19-23, 4.41).
అట్టి విజ్ఞానకాల ప్రమాత లక్షణములు ఈ విధముగ చెప్పబడినవి.
1. అకర్తృత్వమునందు కర్తృత్వత, కర్తృత్వమునందు అకర్తృత్వమును గలిగినవాడు (4.18)
2. కామసంకల్పవివర్జితుడై, జ్ఞానాగ్నితో కర్మలను దగ్ధముచేసినవాడు (4.19)
3.కర్మఫలత్యాగముతో, నిత్యతృప్తుడై, నిరాశ్రయుడైయున్నవాడు (4.20)
4. ఆశలేనివాడు, నిగ్రహింపబడిన చిత్తముగలవాడు, సమస్త వస్తుస్వీకారమును విడిచినవాడు (4.21)
5. అయాచితముగ దొరికినదాతో తృప్తిచెందువాడు, ద్వందాతీతుడైనవాడు, మాత్సర్యరహితుడైనవాడు, సమబుద్ధిగలవాడు (4.22)
6. విషయ సంగరహితుడై, ఇంద్రియార్ధములనుండి ముక్తిని పొందినవాడు, ఆత్మజ్ఞానమునందు చిత్తమును నిలుపుకొనువాడు, యజ్ఞభావనతో కర్మలనుజేయువాడు (4.23)
7. మోహకాలుష్యరహితుడై సమస్తప్రాణులను తనయందు, పరమాత్మయందు చూచువాడు (4.35)

అట్టి విజ్ఞానకల ప్రమాత, పంచతన్మాత్రలు, మనస్సుబుద్ధి, అహంకారముతోకూడిన పుర్యష్టకమనబడు సూక్ష్మదేహాభిమానమును వదిలినవాడగుతాడు (5.8,9). విద్యాసంపన్నుడైన బ్రాహ్మణునియందును, పశువు, ఏనుగు, శునకము, శునకమాంసమును తినువానియందునుకూడ విజ్ఞానకలప్రమాత బ్రహ్మభావనను కలిగియుందురని (5.18) చెప్పుట వీరి సమత్వభావనను సూచిస్తుంది. ఈ ప్రమాత సర్వత్రా బ్రహ్మభావన కలిగియున్ననూ, అణవమలావరితులగుటచే, మహామాయాతత్త్వాధీనులైన అస్వాతంత్రులు.  వీరు తనను సృష్టియందు, సృష్టిని తనయందు దర్శింపజాలరు. ఈ అధ్యాయమునందు సాధకుల గుణకర్మలననుసరించి చేయదగిన వివిధములైన జ్ఞానతపస్సులను వివరిస్తాడు భగవంతుడు.

విజ్ఞానకల ప్రమాతశుద్ధవిద్యా/మంత్ర ప్రమాత
అణవమలావరిత విజ్ఞానకాలప్రమాత సాధనద్వారా అణవమల క్షయము గావించుకొని శుద్ధాధ్వ మంత్రప్రమాతస్థితిని పొందుతాడు. పరిమిత దేహాత్మ్యైక భావము  అణవమలసూచితము. సంకల్పములు ఆణవత్వ సూచకమగుటచే సంకల్పక్షయము అణవమలరాహిత్యమునకు సంకేతము.  అంతేకాదు సంకల్పములు కారణశరీర సూచితము. 
సంకల్ప(అణవమల) నాశనము, (ఇంద్రియార్థ) శబ్దాదివిషయములందు అనాసక్తి (మాయీయమల), కర్మాఫలాసక్తిరహితము (కార్మికమలము)ను పొందిన మనుజుడు యోగారూఢుడని చెప్పబడును (6.4). అట్టి యోగారూఢుడే శుద్ధవిద్యా  ప్రమాత. అశుద్ధతత్త్వములన్నీ క్షీణించి, శుద్ధతత్త్వములందు మొదటిదైన సద్విద్య/శుద్ధవిద్యా తత్త్వము ఉత్తేజితమైన జీవి మంత్రప్రమాత.

శుద్ధవిద్యా/మంత్ర ప్రమాత లక్షణములు.
ఆత్మను జయించినవాడు, ద్వంద్వరహిత స్థితిని కలిగి (6.7), ఇంద్రియములను జయించి (6.8), అందరియందు సమదృష్టిని కలిగియున్నవాడు (6.9) యోగారూఢుడు.  అట్టి యోగి ఆత్మ సంతుష్టుడై, ఆత్మద్వారా ఆత్మసందర్శనముజేయగలుగుతాడు (6.20) మరియు సర్వభూతములందు తనను, తనయందు సర్వభూతములందునూ చూడగలుగుతాడు (6.29). సర్వత్ర సమమ్ పశ్యతి (6.32).

అయితే ఈ శుద్ధప్రమాతస్థితి అస్థిరమైనది.  నిద్రాణించిన అశుద్ధతత్త్వములే ఒక్కటి ఉత్తేజితమైననూ, పతనము తథ్యమని చెప్పుకున్నాము. భగవంతుడు 6.24,25 శ్లోకములందు అశేష సంకల్పసన్యాసము, సమస్త(ఇంద్రియ)విషయములనుండి సంపూర్ణనిగ్రహము, ధృడమైన బుద్ధితో మనస్సును బాహ్యప్రపంచమునుండి మెల్లిమెల్లిగా అంతర్ముఖముజేసి ఆత్మేతరమును చింతింపకయుండవలెనని ఉపదేశించినది జూచిన, నిరంతర యోగారూఢత్వమునకు కొద్దినియంత్రణ చాలదు, పరిపూర్ణ నియంత్రణ ముఖ్యమని చెప్పినట్లున్నది.

దీనికి, అర్జునుడు మనస్సు బహుచంచలమైనది కదా, దానిని నిరోధించుట మిక్కిలి కష్టమైనది, మరి  అలా శ్రద్ధకలిగియు, నిగ్రహశక్తిలోపించిన సాధకులు ఎవ్విధముగ మోక్షమును పొందుతారని భగవంతుని ప్రశ్నిస్తాడు(6.33,34). భగవంతుడు అభ్యాసము, వైరాగ్యములద్వారా మనసుని నియంత్రణను సాధించవచ్చని (6.35) చెపుతూ, ఉత్తమస్థాయినుండి పతనము చెందినవారి స్థితిని ఇక ముందు వచ్చు శ్లోకములందు వివరిస్తున్నాడు. అట్టి జీవులు వారివారి సంస్కారములకు తగిన ఉత్తమ వంశములలో జన్మించి, పట్టుదలతో ప్రయత్నించి సర్వోత్తమ మోక్షమును పొందుతారని 6.40-45 శ్లోకములందు యోగభ్రష్ఠులైన జీవుల గతులనుగురించి వివరించాడు. 

శుద్ధవిద్యాప్రమాత నిరంతర సాధనతో తరువాయిస్థాయియైన మంత్రేశ్వరప్రమాతస్థితిని జేరుకొనవచ్చు. ఈ స్థాయినిజేరిన సాధకులందు ఊర్ధ్వతత్త్వములు అప్రయత్నముగనే ఉత్తేజితమగును. 

మూడుమలములతో బంధింపబడిన సకలకల, రెండుమలములతో బంధింపబడిన ప్రళయాకల, అణవమలముతోమాత్రము బంధింపబడిన విజ్ఞానకలప్రమాతలు వరుసగా స్థూల, సూక్ష్మ మరియు కారణదేహ బంధిత జీవస్థితులు.

ఈ విధముగ మోక్షాసక్తులైన జీవులు, త్రిగుణాతీత, మలత్రయరహిత స్థితిని సాధించుటకు అవసరమైన, అతిసులువైన, అనుభవపూర్వకమైన, ఉపాయములను శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతయందలి 2-7 అధ్యాయములందు వివరించాడు.

ముఖ్యముగా సకలకల, ప్రళాయకల, విజ్ఞానకల-శుద్ధవిద్యాప్రమాతల వరకు  (2-7 అధ్యాయములు) మాత్రమే కృష్ణభగవానుడు అర్జుననుకు ఉపదేశముజేసిన భగవద్గీతను  వివరించడము జరిగినది. మిగిలిన అధ్యాయముల విశదీకరణ వేరే సందర్భములో చూద్దాము.

మోక్షమనిన ఎక్కడో, ఎప్పుడో దొరికేది కాదు. మనలో అనేక ఆవరణలతో కప్పబడి, పాశములతోబంధింపబడిన అంతర్లీన పరమాత్మతత్త్వమును ఎరుగుటయే మోక్షము. అది తెలిసిన తరువాత సర్వత్ర భగవంతుని సాక్షాత్కారమే.
తత్త్వమయియైన అమ్మను ప్రార్ధిస్తూ 

శ్రీమాత్రేనమః