Thursday 26 December 2019

భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా-మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా; Bhandasainya vadhodyukta sakti vikrama harshita - Maha Ganesa nirbhinna vighna yantra praharshitaa

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
శివశ్శక్త్యాయుక్తో యదిభవతి శక్తః ప్రభవితుమ్
నచేదేవమ్ దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యామ్ హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుమ్ వా కథమకృతపుణ్యః ప్రభవతి!

భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా
విక్రమము; హర్షితా-సంతోషింపబడినది
భండసైన్యమును వధించుటకు ఉద్యుక్తమైన శక్తిసేనల శౌర్యము/విక్రమమునుజూచి హర్షించిన తల్లికి నమస్కారము
నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా
ఆటోపము; సముత్సుకా
నిత్యాదేవతల పరాక్రమమునుజూచి సంపూర్ణముగ ఉత్సాహమును పొందిన తల్లికి నమస్కారము
భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా
వధ; విక్రమము; నందితా
భండపుత్రును వధించుటకు ఉద్యుక్తురాలైన బాలమ్మ విక్రమమును చూచి ఆనందించిన తల్లికి నమస్కారము
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా
విరచిత; వధ; తోషిత
విషంగుని వధించిన మంత్రిణీదేవిని చూచి సంతోషించిన తల్లికి నమస్కారము
విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా
ప్రాణహరణ; వీర్యము; నందితా
విశుక్రుని ప్రాణములను హరించిన వారాహీదేవినిజూచి ఆనందించిన తల్లికి నమస్కారము
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా
ఆలోక; కల్పిత
కామేశ్వరునిముఖము అవలోకించుటద్వారా శ్రీగణేశ్వరుని కల్పించిన తల్లికి నమస్కారము
మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా
నిర్భిన్న; ప్రహర్షితా
విఘ్నయంత్రమును భేదించిన (నిర్భిన్నముజేసిన) మహాగణేశునిజూచి ప్రకృష్టముగా హర్షించిన తల్లికి నమస్కారము.

క్రిందటిసారి మాయాది కంచుకములతో కప్పబడిన పరమాత్మను తెలుసుకొనుటకొరకు ప్రయత్నించు సాధకులందు, మూలాధారాది ఆజ్ఞాచక్రపర్యంతము ఉత్తేజితమగు సంపత్కరీ, అశ్వారూఢా, మంత్రిణీ, దండనాథాదేవి మరియు తిథినిత్యాదేవతలు మొదలగు వారితోపాటు అనేక అక్షౌహిణులసైన్యముతో కూడిన తల్లిసేనలనుగురించి తెలుసుకున్నాముకదా. ఇపుడు భండాసురుని సేనలను, వాటి సంకేతములను చూద్దాము.

విషంగ మరియు విశుక్రుడను ఇద్దరు తమ్ములు, ముప్పదుగురు పుత్రులు, పదిహేను ముఖ్యసేనానాయకులు మరియు అనేక అక్షౌహిణులసైన్యమునుగలిగినవాడు భండుడు. లలితోపాఖ్యానమునందు సేనాధిపతి విశుక్రుడు, మంత్రి విషంగుడు వరుసగా, భండాసురుని కుడి, ఎడమ భుజములనుండి ఉత్పన్నమైన భండసోదరులుగ చెప్పబడినది. తల్లి ఆజ్ఞమేరకు వాగ్దేవతలచే రచింపబడిన సహస్రనామస్తోత్రమందలి యుద్ధవర్ణనకు, లలితోపాఖ్యానమునందలి యుద్ధవర్ణనకు కించిత్తు భేదముగలదు.  సహస్రనామమునందు విషంగుని మంత్రిణీదేవి, విశుక్రుని దండనాథాదేవి సంహరించినట్లు చెప్పబడగా, లలితోపాఖ్యానమునందు వ్యతిరేకముగా చెప్పబడినది.  అయితే ప్రస్తుత వివరణమునందు వాగ్దేవతల వరప్రసాదమైన సహస్రనామస్తోత్రమును ప్రమాణముగ తీసుకొనుటజరిగినది.

దీనికి ముఖ్యకారణములు రెండు. 
1. ఈ గ్రంథములందలి యుద్ధవివరణక్రమమునందుగల భేదము.  అవ్యక్తముగా వెనకనుంచి యుద్ధముజేసిన దమనకాది భండసైన్యమును నిత్యాదేవతలు తుదముట్టించినతర్వాత జ్వాలామాలినీదేవి అగ్నివలయమును సృష్టించినట్లు బ్రహ్మాండపురాణమునందు చెప్పబడినది. కానీ సహస్రనామస్తోత్రమునందు జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా నామము తరువాత వచ్చునామమునందు నిత్యాపరాక్రమాటోపనిరీక్షణసముత్సుకాయని వర్ణించారు వాగ్దేవతలు. అంతేకాదు లలితోపాఖ్యాన వర్ణన ప్రకారము విఘ్నయంత్రమును రచించినది విశుక్రుడు, మహాగణేశుడు విఘ్నయంత్రభేదన జరిపిన పర్యాయము విశుక్రుని వధ జరుపడినది.  కానీ ఈ స్తోత్రమునందు విశుక్రప్రాణహరణవారాహీవీర్యనందితా నామముతరువాత మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితాయను నామము గలదు. 

మనము క్రిందటిసారి తత్త్వపరముగ విశ్లేషించినపుడు, సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా నామమునుండి జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా నామము వరకు, సాధకుల మూలాధారమునుండి ఆజ్ఞాచక్రమువరకు వరుసగా ఉత్తేజితమై, షట్కంచుకములను భేదించుశక్తుల సూచితముగ జూచినాము. అందువలన సహస్రనామస్తోత్రమునందలి వర్ణన, క్రమములను వాగ్దేవతలు నిగూఢ తాత్త్వికార్ధముల ప్రకారము జేసినట్లున్నది.

2. యుద్ధమునందు పోరాటము, సమహోదావీరులమధ్య జరగవలెననునది ఒక నియమము (మహాభారతము-భీష్మపర్వము-1.29).  లలితోపాఖ్యానము, సహస్రనామస్తోత్రము రెండింటియందునూ భండసైన్యమును శక్తిసేనలు, భండపుత్రులను లలితమ్మతల్లి హృదయాత్మికయైన పుత్రిక బాలాత్రిపురసుందరీదేవి, భండాసురుని లలితామహాత్రిపురసుందరి వధించినట్లు చెప్పబడినది.  అందువలన, మంత్రిణీదేవి భండుని ఎడమభుజమునుండి ఉత్పన్నమైన మంత్రి విషంగుని, దండనాథురాలై వారాహీదేవి భండుని కుడిభుజమునుండి ఉత్పన్నమైన దండనాథుడైన విశుక్రుని వధించుటచే సంతోషించిన తల్లిని స్తుతించిన వాగ్దేవతల వర్ణనను గ్రహించుట దోషముకాదని భావించుట జరిగినది.

సహస్రనామక్రమము మాత్రమే సరియైనది, లలితోపాఖ్యానక్రమము తప్పైనదన్న అభిప్రాయము మాత్రము కాదు. సవ్యాపసవ్యమార్గస్థాయైన తల్లికదా!! దేనికదే సరియైనదియని తీసుకొనుటమైనది.

తత్త్వపరముగ:

కశ్మీరశైవమతమునందు సృష్టిక్రమమును 36 తత్త్వములద్వారా వివరింపబడినది.  త్రికసిద్ధాంతప్రకారము, ఈ 36 తత్త్వములు, పర,  పరాపర మరియు అపరతత్త్వములను మూడు భాగములుగ విభజించబడినవి. మాయాది షట్కంచుకములు, తద్వారా ఏర్పడిన పంచభూతములు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచతన్మాత్రలు, ప్రకృతి, పురుషుడు, మనస్సు, బుద్ధి, అహంకారము మొదలగు 31 తత్త్వములు, అపరాతత్త్వములు.

 
శుద్ధవిద్యా తత్త్వము అపరతత్త్వములను, పరతత్త్వములను జతజేర్చు తత్త్వము. అపరతతత్త్వాతీత ఐదుతత్త్వములు, సత్-చిత్-ఆనందమయ పరతత్త్వాత్మకమగుటచే ఆనందమయమైనవి. అపరతత్త్వసంకేత భండుని సైన్యము, పుత్రులు, మంత్రి, సేనాపతుల సంహారమును సూచించు భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా నామమునుండి మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా వరకుగల నామములు హర్షిత, ఉత్సుక, నందిత, తోషితలను గలిగియుండుటయందలి రహస్యము. కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా నామమునందు హర్ష సంబంధిత వార్త లేదనుకోకండి. గణేశుడు ఆనందశక్తి రూపుడు.

చిద్వత్తచ్ఛక్తిసంకోచాత్ మలావృతః సంసారీ (క్షేమరాజ ప్రత్యభిజ్ఞహృదయము-9)
 
హతస్వాతన్త్ర్యరూపా ఇచ్ఛాశక్తిః సంకుచితా సతీ అపూర్ణమన్యతా స్వరూపమ్ ఆణవమలమ్;
 
జ్ఞానశక్తిః క్రమేణ సంకోచాత్ భేదే సర్వజ్ఞత్వస్య కించిత్-జ్ఞాత్వాప్తేః అంతఃకరణ-బుద్ధీన్ద్రియతాపత్తిపూర్వమ్ అత్యంతం సంకోచగ్రహణేన భిన్నవేద్యప్రథారూపమ్ మాయీయమ్ మలమ్;
 
క్రియాశక్తిః క్రమేణ భేదే సర్వకర్తృత్వస్య కించిత్-కర్తృత్వాప్తేః కర్మేంద్రియరూప-సంకోచగ్రహణపూర్వమ్ అత్యంతమ్ పరిమితతామ్ ప్రాప్తా శుభాశుభానుష్ఠానమయమ్ కార్మమలమ్;
 

భండసైన్యము

భండసేన సంకేతము

సంహరించిన శక్తి

త్రికసంకేతము

చక్ర సంకేతములు

దుర్మదుడు

మదము/గర్వము

సంపత్కరీదేవి

అపర/అవిద్య/అశుద్ధ

(మాయ, కల, కాల, విద్య, నియతి, రాగము మొదలగు షట్కంచుకములు

పంచజ్ఞానేంద్రియములు

పంచకర్మేంద్రియములు

పంచతన్మాత్రలు

పంచమహాభూతములు

మనస్సు, బుద్ధి, అహంకారము, ప్రకృతి, పురుషుడు)

శ్రీచక్రము: త్రైలోక్యమోహనాది సర్వరక్షాకర /భూపురము నుండి అంతర్దశార చక్రపర్యంత చక్రములు

శరీరము: మూలాధారాది ఆజ్ఞాచక్రపర్యంత చక్రములు  

కురుండుడు

దుష్ట తలంపులు

అశ్వారూఢాదేవి

కరంగకాది ఐదు ముఖ్యసేనాపతులు

దుష్టవాచకత్వము

నకులీశ్వరి

వలాహక మొదలగు ఏడు సేనానాయకులు

దుష్టదృష్టి

తిరస్కరిణి

దమనకాది పదిహేను సేనాపతులు

సిద్ధులు, యోగులనుకూడా బాధించి పతనముజేయు పంచదశ దోషములు

తిథినిత్యా దేవతలు

చతుర్బాహు, కోలాక్షాది ముప్పది పుత్రులు

అహంకారపూరిత జీవులందు ముప్పది చంద్రకళల ద్వారా ఏర్పడు దుష్టగుణములు

బాలాత్రిపురసుందరి

 

పరాపర/విద్యావిద్య/శుద్ధాశుద్ధ

 

శ్రీచక్రము: అష్టకోణ/సర్వరోగహరచక్రము

శరీరము: లలాట చక్రము  

మంత్రి విషంగుడు

విరుద్ధ/దుష్టసంగము

మంత్రిణీదేవి

జ్ఞానశక్తి

పర/విద్యా/శుద్ధ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

పరంబ్రహ్మ

శ్రీచక్రము: త్రికోణ/సర్వసిద్ధిప్రదచక్రము

శరీరము: సహస్రార చక్రము

సేనాపతి విశుక్రుడు

శుక్రరాహిత్యము, శోకాది (శుక్ రాతీ దదాతి శుక్రః) దుఃఖములు

వారాహీదేవి

క్రియాశక్తి

అష్టతామసికదేవతలతో ఆవాహన జేయబడిన

జయ-విఘ్నయంత్రము

కార్యవిముఖత

గణేశ్వరుడు

-శివశక్తి ఏకరూపము

ఇచ్ఛాశక్తి

భండాసురుడు

కామాసురుడు

లలితామహా

త్రిపురసుందరి

చిచ్ఛక్తి

శ్రీచక్రము: బిందువు/సర్వానందమయచక్రము

శరీరము: బ్రహ్మరంధ్ర చక్రము

 
చైతన్యమయమైన పరమాత్మ, స్వాతంర్గత శక్తి సంకోచమువలన (ఆణవ, మాయీయ మరియు కార్మిక) మలములచే ఆవరింపబడి పురుషుడు/సంసారియగుచున్నాడు.  పరమాత్మయొక్క అప్రతిహతస్వాతంత్ర్యరూప ఇచ్ఛాశక్తి, అపూర్ణత్వముతోకూడిన ఆణవ-మలముగనూ; సర్వజ్ఞ-జ్ఞానశక్తి, కించిత్-జ్ఞత్వమునుపొంది అంతఃకరణములద్వారా భిన్నత్వమును ప్రతిఫలించు మాయీయ-మలముగనూ; సర్వకర్తృత్వ క్రియాశక్తి, కర్మేంద్రియములద్వారా కించిత్-కర్తృత్వమును ఆపాదించు కార్మీక-మలముగనూ ఆవరించుటచే పరమాత్మ, జీవాత్మభావమును పొందుతున్నది.  ఈ మలత్రయము మనము ముందు చెప్పుకున్న షట్కంచుకములద్వారా కాలబద్ధసృష్టిని నడిపిస్తూ ఉంటాయి.

వాసనాహంకారపూరిత జీవాత్మ భండాసురసూచకమని చెప్పుకున్నాము. జీవునితోపాటు సహజముగ ఏర్పడు కోరికలు/వాసనలు, అపూర్ణత్వాత్మక అణవమలము.  కోరికలకు జన్మస్థానమైన మనసునకు అధిదేవత చంద్రుడు (బృహత్ జాతకము 2.1).

తేషామ్ మనఃకారణత్వాత్ చంద్రస్య మనోరూపత్వాత్ స్నేహశశాంకాదిత్యుపదేశేన చంద్రవశాత్ సుఖ-దు:ఖమ్ నిరూపణీయమితి సూచితమ్

ఈ కారణముచే చంద్రకళల ప్రభావమునకులోనైన జీవులు సుఖదుఃఖములకు లోనగుచున్నారు. సముద్రపుఆటుపోటుల మీదనూ, స్త్రీలఋతుచక్రమునందునూ ప్రత్యక్షముగా తెలియబడుచున్న చంద్రకళల ప్రభావము పరోక్షముగా ప్రతిజీవిమీద తప్పక ఉంటుంది. మానసిక రుగ్మతలు, అనారోగ్యముగలవారిపై పూర్ణిమ, అమావాస్యల ప్రభావమునుకూడా చాలామందికి తెలిసియుండొచ్చు.  పౌర్ణమి, అమావాస్య మాత్రమేకాకుండా, మనము తెలుసుకొన్ననూ, లేకపోయిననూ ప్రతియొక్క శుక్లపక్ష, కృష్ణపక్ష చంద్రకళ ప్రభావము, సృష్టియందలి ప్రతిజీవిపై రెండువిధములుగ (మంచి, చెడు) తప్పక ఉంటుంది. ముప్పది చంద్రకళలయందు వాసనామయ జీవుల మనస్సును ఘాతముజేయు ఆసురీప్రవృత్తులే ముప్పది భండపుత్రులు (భవంతఃసుకృతైర్లబ్ధా మమపూర్వజనుః కృతైః – లలితోపాఖ్యానము 23.8). సత్కర్మసంస్కారములు చంద్రకళల దుష్టప్రభావమును నియంత్రించుటకు దోహదకారకములు.

అణవమల కారణముచే ఏర్పడు అల్పజ్ఞత్వము మాయీయమలము, కించిత్కర్తృత్వము కార్మిక మలము. భండపుత్రులు అణవమల సూచకముకాగా, విషంగుడు మాయీయ, విశుక్రుడు కార్మీక-మలముల సూచితము.
*** 
గణపతి పరంబ్రహ్మస్వరూపము.  వేదములందు గణపతిని బ్రహ్మణస్పతి, దంతియని వర్ణించబడినది. 
సృష్ట్యోన్ముఖుడైనపరమాత్మ - శివ తత్త్వము,
తత్కారణముగ పరమాత్మయందు ప్రకటితమైన శక్తి – శక్తి తత్త్వము
ఈ రెండింటి ఏకరూప తత్త్వము శివ-శక్తి తత్త్వము/ఆనందతత్త్వము/గణేశ తత్త్వము. ఈ తత్త్వము ప్రజననశక్తి/ఫలదీకరణశక్తి సూచితము.  ప్రకటితమవబోవు సమస్త సృష్టిని తనయందు గలిగిన బీజస్థితి.

గణపతి తత్త్వము, శివశక్తుల ఏకరూప తత్త్వము. ఇందుమూలముగా శివశక్త్యాత్మకమైన వ్యక్తీకృత విశ్వము, గణపతి స్వరూపము. గణపతికి, చతుర్ధితిథికిగల అనుబంధము, దర్శ, దృష్ట, దర్శత, విశ్వరూపా మొదలగు 15తిథులనామములందలి (తైత్తిరీయబ్రాహ్మణ-3.10.1) నాల్గవతిథి నామమును పరిశీలించిన విదితమగును.  
 
త్రిమూర్తులు గణేశునికి తొలిపూజాధికార పట్టమును కట్టిన సందర్భమును శివపురాణమునందలి రుద్రసంహిత 18వ అధ్యాయము 23వశ్లోకమునందు చెప్పబడినది.  ప్రతియొక్క కార్య, కావ్య, స్తోత్రారంభమునందు గణపతిస్తుతిని మనము గమనించవచ్చు.  సాక్షాత్తు పరమశివునిచే ఆవిష్కరించినదని చెప్పబడుచున్న సౌన్దర్యలహరి ప్రథమభాగమైన ఆనందలహరి మొట్టమొదటి శ్లోకమును శివఃశక్త్యాయుక్తః యని ప్రారంభించి, పరమశివుడు శివ, శక్తియుక్త స్వరూపము గణపతియని నిగూఢముగ తెలియజేసినాడు.  శివానన్దలహరియందలి మొదటి శ్లోకమునందు ఆదిశంకరులుకూడా శివాభ్యామ్-అని, శివాశివుల ఏకరూపుడైన గణపతిని స్తుతించారు. 

మరియొక రహస్యము.  శివ, పార్వతి, గణేశులకు మాత్రమే శిరోధారమైన చంద్రలేఖ. చంద్రుడు ప్రజననకారకుడు. శివపార్వతుల శిరోధారమైన చంద్రవంక సృష్టికర్తృత్వమునకు సంకేతము. వారి తనయుడైన గణపతి కూడా చంద్రరేఖను కలిగియుండుట అదేతత్త్వమును కలిగియుండుటకు సూచితము. అదేమిటండీ, మరి విష్ణువుకు చంద్రలేఖ లేదు కదా! అంటే విష్ణువుకు ప్రజననశక్తి లేదాయని వైష్ణవులు అడగవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానము విష్ణువును ప్రధాన దైవముగా భావించు వైష్ణవసంప్రదాయమునందు విష్ణుపత్నియైన ఐశ్వర్యప్రదాయిని, చంద్రసహోదరి. పతి అంతర్గత శక్తియే పత్ని.  శ్వేతాశ్వతరోపనిషత్తునందు రుద్ర, సవిత, ఈశ, శివ తత్త్వములు పిండాండ, బ్రహ్మాండమునందు ప్రతిఫలిస్తున్న ఒకటే సచ్చిదానంద స్వరూపముగ చెప్పబడినది. ఈ విధముగ సూర్యుడు కూడ ప్రజననకారకుడని నిగమాగమములందు చెప్పబడుటచే పంచాయతనమునందు పరంబ్రహ్మ సంకేత శివ, శక్తి, గణేశ, విష్ణు, సూర్య దేవతలారాధనము జేయబడుచున్నది.

గణపతి జననమునుగురించి వివిధపురాణములలో పలురకములుగ చెప్పబడినది.  దీనిద్వారా ఒక్కొక్క పురాణములో గణేశుని తత్త్వమునందలి ఒక్కొక్క మౌళిక విషయమును సూక్ష్మముగ పొందింపబడినది. అంతేగానీ అవన్నీ ఒకదానికి ఒకటి సంబంధములేని కట్టుకథలని మాత్రము కాదు.  ఉదాహరణకు బ్రహ్మాండపురాణమునందలి సహస్రనామస్తోత్రమునందలి కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా యను నామము ఆనందశక్త్యాత్మక శివశక్తితత్త్వమును సూచిస్తుంది.  రుద్రుడు ఉమాదేవిని వీక్షించుటద్వారా అనంతాకాశరూపుడైన గణేశుడు ఆవిర్భవించినట్లు వరాహపురాణము (23.11-15) నందు చెప్పబడినది.  వ్యోమమని చెప్పిన వెంటనే దిక్కులు స్ఫురిస్తాయి. శివ, మత్స్య, వామన పురాణములందు, తల్లి అభ్యంగనస్నానసమయమున తనశరీరమునుండీ తీసిన హరిద్రాలేపనమునకు రూపమిచ్చి, ప్రాణముపోసి, గణేశుడనిజెప్పి, తన అంతఃపురమునకు ద్వారపాలకునిగ నియమించినట్లు చెప్పబడినది.  తల్లి అంతఃపురద్వారపాలకుడని చెప్పబడిన గణేశుడు, మూలాధారమూర్తి గణపతికి సంకేతము. గణపతి అనుగ్రహముతో మాత్రమే కుండలినీశక్తి ఉత్తేజితమై, సుషుమ్నానాడిద్వారా ఊర్ధ్వదిశగా ప్రయాణము జేయగలదు. అంటే గణపతి అనుగ్రహములేనిదే మోక్షము అసాధ్యము. 

విశుక్రునిచే (శుక్రరాహిత్య సూచితము) అష్టదిక్కులందు తామసికదేవతలతో ఆవాహనజేయబడిన విఘ్నయంత్రభేదనకు ప్రజననకారకుడు, వ్యోమరూపుడైన గణపతిని సృష్టించినది తల్లి.   అలస (అలసత్వము భగవద్గీత-18.28), కృపణ (అల్పత్వము-కర్మఫలాపేక్షను కలిగియుండుట – ibid 2.49 దుర్బలత్వము), దీన (దీనత్వము), నిద్ర (ibid 14.8,18.39), తంద్ర (సోమరితనము ibid 14.8,18.39), ప్రమీలిక (కునికిపాటు), క్లిబ (అధైర్యము, నీరసత, నంపుంసకత ibid 2.3) మొదలగు తామసికదేవతలతో అష్టదిక్కులందు ప్రయోగించబడిన జయ-విఘ్నయంత్రము నపుంసకత్వమునకు సంకేతము.  ఆకాశమునందలి అష్టదిక్కులందు ప్రయోగింపబడిన విఘ్నయంత్రమును భేదించిన అపరిమితమైన వ్యోమసంకేత ఆనందమయ శివశక్తిరూప గణేశునిజూచి అమితానందమును పొందిన తల్లిని ఈ నామమునందు వాగ్దేవతలు వర్ణించారు. 

ఇక భండాసురునితో తల్లియుద్ధమును తదుపరి భాగమునందు చూద్దాము.
సదానందస్వరూపిణియైన తల్లిని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః