Thursday 15 October 2020

పూర్వభాగము తరువాయి Previous post continued

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్యా

హ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్

సముత్పత్య తాతం శ్రయంతం కుమారం

హరాశ్లిష్ట గాత్రమ్ భజే బాలమూర్తిం|| 

(సుబ్రహ్మణ్య భుజంగము-18)

 

లలితమ్మతల్లి, లక్ష్మీ, సరస్వతుల స్థానముల గురించిన వివరణ:

 

లక్ష్మీదేవి, సరస్వతీదేవి లలితమ్మ తల్లికి కుడివైవు, ఎడమవైపున ఉండటము సరియా? లేదా ఎడమవైపు, కుడివైపు ఉండటము సరియా? లలితాసహస్రనామ స్తోత్రమునందు సచామరరమావాణిసవ్యదక్షిణసేవితా యను ఒక నామముగలదు. ఎడమవైపు(సవ్య) రమాదేవి, కుడివైపు(దక్షిణ) సరస్వతీదేవీల చేత వింజామరములతో సేవించబడు తల్లియని అర్ధము. సంస్కృతమున సవ్యమనిన కుడి, ఎడమయని రెండు అర్ధములగుటచే సందర్భానుసారము తీసుకొనవలసియుంటుంది.  ఇక్కడ సవ్యతోపాటు దక్షిణయని చెప్పబడినందువలన, సవ్యమనిన ఎడమయని తీసుకొనడమైనది.

 

కానీ, కొన్ని గ్రంథములందు వాణీ, రమాదేవి ఇరువురు కుడిఎడమప్రక్కల ఉన్నట్లు వర్ణించబడినది. ఉదాహరణకు అందరికీ సుపరిచితమైన మీనాక్షీపంచరత్నస్తోత్రమునందు ఆదిశంకరులు తల్లిని వాణీరమానిషేవితాం యని స్తుతించారు. ఈ సందర్భములో తల్లికి కుడివైపు సరస్వతీదేవి, ఎడమవైపు లక్ష్మీదేవి తల్లిని సేవించుకున్నట్లు అర్ధము వస్తున్నది. మరి ఈ రెండు అమరికల అంతరార్ధము ఏమిటి

 

సరస్వతి -లలిత- లక్ష్మి

దృషశ్చంద్రార్కదహనా దిశస్తే బాహవోమ్బికే|

మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శ్రుతయోఖిలాః||  

(లలితోపాఖ్యానము-బ్రహ్మాండపురాణము-3.13.10)

విరించిం దక్షిణేనాక్ష్ణా వామేన హరిమైక్షత||  

కా నామ వాణీ మా నామ కమలా తే ఉభే తతః ప్రాదుర్భూతే ప్రభాపుఞ్జే పఞ్జరాంత ఇవ స్థితే || (ibid – 3.39.66)

సూర్యచంద్రులను నేత్రములుగగల్గిన అమ్మవారు,  దక్షిణనేత్రముతో బ్రహ్మదేవుని(విరించి), వామ/వామనేత్రముతో హరిని వీక్షించినప్పుడు, కా నామ సరస్వతి(వాణి), మా నామ లక్ష్మీదేవి (కమల) ఉభయులు ప్రభాపుంజములుగా ప్రాదుర్భవించారు.

 

తల్లి నేత్రములనుండి ఆవిర్భవించిన కా, మా నామ సరస్వతీ, లక్ష్మీదేవతలు, లలితామహాత్రిపురసుందరి తల్లిని జయజయకామాక్షీయని స్తుతించారు (ibid-3.39.67).

 

గరుడపురాణమునందు(3.4), ఈ దేవతాత్రయ ఆవిర్భావ ఘట్టము కొంచము వ్యత్యాసముగా వర్ణింపబడినది.  శ్రీకృష్ణపరమాత్మ మూలప్రకృతినుండి జనించిన త్రిగుణసామ్యతను (equilibrium), తద్వారా ఏర్పడు గుణవైషమ్యమును (imbalance) వివరిస్తూ, విష్ణుశక్తి/మూలప్రకృతియైన లక్ష్మీదేవినుండి సాత్త్వీక శ్రీదేవి, రాజసిక భూదేవి, తామసిక దుర్గాదేవి ఆవిర్భవించినట్లు, తదనుగుణముగా పురుషుడు, విష్ణు, బ్రహ్మ, శివస్వరూపములను పొందినట్లు  చెప్పినాడు. ఒక్క ముఖ్యమైన విషయమును గమనించవలసినది. కొన్నిసందర్భములలో పరమాత్మయొక్క విమర్శాంశను మూలప్రకృతియని చెప్పబడగా, మరి కొన్నిగ్రంథములందు బిందువునుండి ఆవిర్భవించిన ప్రథమ త్రికోణమును మూలప్రకృతి, అవిద్యయని చెప్పబడుచున్నది.

 

సౌన్దర్యలహరి రెండవశ్లోకమునందలి సృష్టిరహస్యముననుసరించి, త్రిగుణసంతులితమును సూచించు సరస్వతి-లలితామహాత్రిపురసుందరి-లక్ష్మి దేవతాత్రయము, బిందువునుండి ఆవిర్భవించిన ప్రథమత్రికోణమందలి శక్తుల సూచితము.

 

ఇందుమూలముగా కుడివైపు సరస్వతీదేవి, ఎడమవైపు లక్ష్మీదేవి వింజామరములను వీచుచూ సేవించునపుడు సహస్రారాంతర్గత సచ్చిదానంద చైతన్య సంకేత స్థూలరూపము, లలితాపరాభట్టారికాదేవిగ తెలియుచున్నది.

 

లక్ష్మి-లలిత-సరస్వతి

నాడులపరముగా అన్వయము:

ఇడా పింగళా సుషుమ్నాః తిస్రోనాడ్యః ప్రకీర్తితాః|

ఇడావామేస్థితా భాగే పింగళా దక్షిణే స్థితా|| 

(ధ్యానబిందూపనిషత్తు – 55)

నాడ్యస్తు తా అధోవదనాః పద్మతంతునిభాః స్థితాః|

పృష్ఠవంశం సమాశ్రిత్య సోమసూర్యాగ్నిరూపిణీ|| 

(శివ సంహిత -2.17)

ఇడా చ భారతీ గంగా పింగలా యమునామతా|

ఇడాపింగళయోర్మధ్యే సుషుమ్నా చ సరస్వతీ|

 (రుద్రాయామల ఉ తన్త్రము అ 25-45)

ఇడా దేవీచ చంద్రాఖ్యా సూర్యాఖ్యా పింగలా తథా|

సుషుమ్నా జననీ ముఖ్యా సూక్ష్మా పంకజతన్తువత్|| 

(రుద్రాయామల ఉ తన్త్రము 25- 50,51)

సుషుమ్న (అగ్ని) నాడి, సరస్వతి ప్రవాహముతో సంకేతింపబడునది. సుషుమ్ననాడికి వామభాగమందలి ఇడ, చంద్రనాడి,  గంగా ప్రవాహముతో సంకేతింపబడునది. సుషుమ్ననాడికి దక్షిణభాగమందలి పింగళ, సూర్యనాడి, యమునా ప్రవాహముతో సంకేతింపబడునది.

 

వేదములందు ఇడాపింగళానాడులు అశ్వినీదేవతలతో సూచించబడినవి. అశ్వములు, ఇంద్రియములకు సంకేతము.  ఇడానాడికి జ్ఞానేంద్రియములతో(గోవులు), పింగళానాడికి కర్మేంద్రియములతో(అశ్వములు) అనుబంధముగలదు (ఋగ్వేదము 1.38.2,8.20.23).  అశ్వినీదేవతల అంశముతో జన్మించిన నకుల, సహదేవులు, అజ్ఞాతవాసమునందు వరుసగా అశ్వముల, గోవుల కాపరులుగనుండుట కాకతాళీయముకాదు.

 

కందస్థానమునుండి ప్రారంభించి పింగళ(రజోగుణము)-సుషుమ్న(తమోగుణము)-ఇడ(సత్త్వగుణము) నాడులద్వారా ప్రవహించు సూక్ష్మశక్తుల సంగమము, ముక్తత్రివేణియనబడు ఆజ్ఞాచక్రస్థానమునందు జరుగును.

 

రజః ప్రధానా తత్రాహం మహాశ్రీః పరమేశ్వరీ

మదీయం యత్తమోరూపం మహామాయేతి సా స్మృతా||

మదీయం సత్త్వరూపం యన్మహావిద్యేతి సా స్మృతా

అహం చ తే చ కామిన్యౌ తా వయం తిస్ర ఊర్జితాః ||

 (లక్ష్మీతంత్రము – 5.4,5)

లక్ష్మీతంత్రముననుసరించి పింగళానాడియందలి శక్తి మహాశ్రీ/లక్ష్మీదేవి, ఇడానాడియందలిశక్తి సూచకముగ మహావిద్య/సరస్వతీదేవి, సుషుమ్నాంతర్గత శక్తి మహామాయగనూ తెలియుచున్నది.

గో భూ వాచస్త్విడా ఇళాః (అమరకోశము)

ఇడా, ఇళా శబ్దములు భూమికి, ఆవునకు, వాక్కునకు పేర్లు.

వాగ్ వై సరస్వతీ (గోపథబ్రాహ్మణము, ఐత్రేయబ్రాహ్మణము, శతపథబ్రాహ్మణము)

 

ఆజ్ఞాచక్రస్థానమునందు త్రివేణీసంగమ తత్త్వమును (శ్రీం-ఓమ్-హ్రీం, సూర్య-అగ్ని-సోమ),  వివిధపురాణములందు సందర్భానుసారము, వివిధ దేవతల స్థూలరూపములతో (లక్ష్మీదేవి-శ్రీలలితామహాత్రిపురసుందరి-సరస్వతి, వల్లీ-సుబ్రహ్మణ్యేశ్వరస్వామి-దేవసేన, లక్ష్మీదేవి-గణపతి-సరస్వతి (గణపతి పరంబ్రహ్మస్వరూపము), రుక్మిణి-కృష్ణపరమాత్మ-సత్యభామ, శ్రీదేవి-వెంకటేశ్వరస్వామి-భూదేవి) సంకేతింపబడుటయందలి రహస్యమిదియే. మూలాధారాది సహస్రారపర్యంత ఏడుచక్రముల సంకేతమైన ఏడుకొండలమీద విరాజిల్లు వెంకటాచలపతికి, శ్రీదేవీభూదేవిసమేత వెంకటేశ్వరస్వామియని జెప్పినప్పుడు మలయప్పనామము సిద్ధముగనున్నది. రెండు దేవతాశక్తులతోకూడిన ఈ స్వామి ముక్తిదాయకుడు.

 

శివ*గణపతి-శక్తి*సుబ్రహ్మణ్యస్వామి

గీర్వాణపృతనాపాలం బాలం లాలయదేకతః

ఉత్సఙ్గే గణసమ్రాజమర్భకం బిభ్రదన్యతః || 

(ఉమాసహస్రము 21.3)

ప్రకృతి/పార్వతీదేవినుండి జన్మించిన గణేశుని కుడిభాగమందలి పింగళానాడి సంబంధిత దేవతామూర్తిగానూ, పురుషుడు/శివుని రేతస్సునుండి ఆవిర్భవించిన జ్ఞానమూర్తి, సుబ్రహ్మణ్యుని ఎడమభాగమునందలి ఇడానాడి సంబంధముగానూ సూచించుట ఒక సంప్రదాయముగలదు.  ఈ రూపవిశేషమును అర్ధముచేసుకుంటే, గణేశ, కుమారస్వాముల మధ్య భూమినిచుట్టి రావడమను పోటియొక్క యోగపర అన్వయము తెలుస్తుంది.

  
శక్తి అంశజుడైన గణపతి, ప్రణవస్వరూపుడు(ముద్గలపురాణము 6.29.25) మరియు సాక్షాత్తు శివునకు ప్రణవమునకు అర్ధమును బోధించినవాడు, శివాంశుడైన సుబ్రహ్మణ్యుడు. ఈ దృక్పథముతో కామకలావిలాసమునందు జెప్పబడిన నామరూపశాఖలతో అంతర్వేశనము(interpolate)జేసిన, పరాదిచత్వారి వాగాత్మకమైన గణేశుడు, నామసంబంధిత దేవతాస్వరూపముకాగా, జ్ఞానాధిదేవతయైన స్కందుడు రూపసంబంధిత దేవతారూపముగ తోచుచున్నది. అనగా సుబ్రహ్మణ్య, వినాయకులు, వరుసగా ఇడాపింగళనాడుల సంబంధిత దేవతలు. శివ-గణేశ--శక్తి-స్కంద తత్త్వములను ఈ కోణమునుండి జూచిన, శరీరమునందలి కుడిభాగ నిర్వహణ ఎడమమెదడుతోనూ, ఎడమభాగ నిర్వహణ కుడిమెదడుతోనూ జరుపబడుటకు సంకేతమువలెనున్నది. సుషుమ్నానాడియందు ప్రవహించునది శివశక్తైక్యతత్త్వ కుండలిని. ఈ సందర్భమున ఆజ్ఞాచక్రస్థానమునందలి త్రివేణీసంగమము, శివ*గణపతి-శక్తి*స్కందుల ఐక్యతకు సూచితము. ఈ రూప ధ్యానము ముక్తిదాయకము.

 

ఇందువలననే కాబోలు, శంకరభగవత్పాదులు లలాటమ్ లావణ్యద్యుతి విమలమ్ ఆభాతి తవయత్శ్లోకమునందు, లలాటరూప పైఅర్ధచంద్రాకారమును, కిరీటమునందలి క్రింది అర్ధచంద్రాకారమును విపర్యముగా/వ్యతిరేకముగా కలిపితే పూర్ణచంద్రుడు స్ఫురిస్తాడని చెప్పినట్లున్నది.  నిజానికి శ్లోకమునందు చెప్పబడిన వరుస క్రమములో (లలాటము, మకుటము/సహస్రారము) అర్ధచంద్రులను ఒకదానిమీద ఒకటిపెట్టిన పూర్ణచంద్రరూపము వస్తుంది.  కానీ వ్యతిరేకించి పెట్టాలని చెప్పడము కుడిఎడమ శరీరభాగములు, మెదడు అర్ధగోళముల సంబంధిత రహస్యమువలెనున్నది.  దీని ఆధారముగా, శివునిఒడిలో కార్తికేయుడు, శక్తిఒడిలో విఘ్నేశ్వరుని కలిగిన రూపముయొక్క  అంతరార్ధమును మీరు గ్రహించే ఉంటారు!!

***

వల్లీ-సుబ్రహ్మణ్య-దేవసేన

కందపురాణముననుసరించి విష్ణుపుత్రికలైన అమృతవల్లి, సుందరవల్లి దేవతలే సుబ్రహ్మణ్యస్వామి పత్నులైన (వరుసగా) దేవయాని/దేవసేన, వల్లీదేవి. ఇంద్రునిచే పెంచబడి ఇంద్రపుత్రికయని పేరుపొందిన దేవసేన ఇడానాడిసంబంధిత దేవతారూపము, అడవిరాజుచే పెంచబడిన వల్లీదేవి, పింగళానాడి సంబంధితము.  దేవసేనను (ఇడానాడిశక్తి) వివాహమాడిన పిదప, వల్లీసుబ్రహ్మణ్యుల కళ్యాణమునకు విఘ్నేశ్వరుడు సహాయపడు ఘట్టము, మూలాధారమూర్తియైన విఘ్నేశ్వరుని అనుగ్రహముతోనే సాధన(కార్యసిద్ధి/క్రియాశక్తి/పింగళనాడిశక్తి)సఫలీకృతమై, సుబ్రహ్మణ్యస్వామి (సుషుమ్నశక్తి) అనుగ్రహము (జాగృతము) కలుగునని సూచించున్నట్లున్నది.   

***

శివశక్తుల ఏకరూపముగా విఘ్నేశ్వర తత్త్వమును, పింగళ-సుషుమ్న-ఇడనాడుల సంబంధముగ వల్లీ-సుబ్రహ్మణ్య-దేవసేనలను జూచినాము. ఒక దేవతారూపమునకు వెవ్వేరు అన్వయములు. పురాణములందు చెప్పబడిన వివిధ కథనములు, తద్దేవతారూపముయొక్క వివిధ అంశముల ప్రాముఖ్యతను జూపునవి. ఈ వైవిధ్యతను వేదములందుకూడా జూడవచ్చును. మానవులందు పరిశుద్ధత, పరమాన్నధనములనిచ్చి సునృతులు, సుమతులనుజేయు దేవతాస్వరూపముగ సరస్వతీదేవిని ఋగ్వేదమునందు జెప్పబడగా, అథర్వవేదమునందు వాక్కుగానూ, శతపథబ్రాహ్మణమునందు వాగ్దేవతగాను జెప్పబడినది.  సమస్తము పరమాత్మ అభివ్యక్తీకరణ మాత్రమే. 

 

మనము శ్వాసించు ఒకే ప్రాణవాయువునందలి ప్రాణశక్తి, అది ప్రవహించు శరీరభాగమునుబట్టి ప్రాణ,అపాన,వ్యాన,ఉదాన,సమానమను ఐదుపేర్లతో పిలవబడినట్లు, ఒకేపరమాత్మకు కార్యనిర్వహణానుసారము అనేక తత్త్వములు, రూపములు!! వీనిలో ఏఒక్కటి సరిగ్గా పనిచేయకపోయిననూ/లోపించిననూ, శరీరమను వ్యవస్థ తాళజాలదు.

 

వేదములు, పురాణేతిహాసములు, ఉపనిషత్తులు మొదలగు సమస్త వాఙ్మయములందునూ సూక్ష్మాతిసూక్ష్మముగ పరమాత్మ లీలలను ఋషులు మనకు అందజేసారు.  ఎక్కడో ఆవల ఉన్న పరమాత్మ కాదు, మనలోనూ, మనచుట్టూ ఉన్న పరమాత్మ, ఎందువలననంటే, బ్రహ్మాండ లక్షణమ్ సర్వమ్ దేహమధ్యే వ్యవస్థితమ్ (జ్ఞానసంకలనతంత్రము-29)!! ఏకోవిష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః||

 

మరియొక ముక్తత్రివేణీసూచిత దేవతారూపము గజలక్ష్మీదేవి.

సింహవాహిని గజలక్ష్మి:

గజః సర్వస్య బీజం (ముద్గల పురాణము 4.48.30)

గజాఖ్యా  బీజమ్ ప్రవదన్తి వేదాః (ibid 4.43.22)

గజశబ్దాఖ్యమ్ బ్రహ్మ వేదే ప్రకీర్తితమ్ (ibid 4.41.46)

గజశబ్దము సర్వసృష్టిబీజ సంకేతమనియు, గజశబ్దాఖ్యము బ్రహ్మ సంకేతమనునది శృతివాక్యమనియు ముద్గలపురాణమునందు చెప్పబడినది.

 

ఐతరేయోపనిషత్తు మొదటిమంత్ర భాష్యమునందు ఆదిశంకరులు ఏతత్సత్యమ్ బ్రహ్మ ప్రాణాఖ్యమ్| ఏష ఏకో దేవః | ఏతస్యైవ ప్రాణస్య సర్వేదేవా విభూతయః|  బ్రహ్మయే ప్రాణశక్తి మరియు ప్రాణశక్తి నుండియే సర్వదేవతలు ఆవిర్భవించినట్లు వివరించారు.

 

ఈ విధముగా గజ శబ్దము, శరీరమునందలి సూక్ష్మనాడులద్వారా ప్రసరించు సూక్ష్మ ప్రాణశక్తి సూచకము. ఇది ప్రాణవాయువు కాదు, అతి సూక్ష్మమైన ప్రాణశక్తి.

 

స్థూలశరీరమునందలి 72,000 నాడీమండలమునందు ప్రవహించు ప్రాణశక్తి నియంత్రణముద్వారా మూలాధారమునందు నిద్రించు కుండలినీశక్తి జాగృతిజేయుటకు అనేకమార్గములను యోగ ఉపనిషత్తులందు వివరింపబడినవి.  జాగృతిచెందిన అగ్నితత్త్వ కుండలినీశక్తి సహస్రారమునుజేరుటవలన అచటినుండి ప్రవహించు అమృతస్రావముతో సమస్తనాడులు ఆప్యాయనము పొందును.  అయితే  శరీరమునందు ఎన్నోవేలకొలది నాడులున్ననూ, పదినాడులు ముఖ్యమైనవిగా చెప్పబడుచున్నవి. ఈ పదినాడులందుకూడా ముఖ్యమైనవి మూడు నాడులు, ఇడ, పింగళ, సుషుమ్న.

 

సహస్రశీర్షాపురుషః సహస్రాక్షః సహస్రపాత్ - అనంతమైన విరాట్విశ్వము పరిమితినిపొందినప్పుడు ఏర్పడిన ముఖ్యమైన దశదిక్కులందలి దేవతాశక్తులు/దిక్-దేవతల (దిక్-గజములు) వివరణ, మనుస్మృతి, ఉపనిషత్తులవంటి గ్రంథములలో చూడవచ్చును. పదిముఖ్యనాడులద్వారా ప్రసరించు ప్రాణశక్తికి, పదిదిక్కుల సంబంధిత దేవతారూపములతో అనుబంధముండుటచే (త్రిశిఖిబ్రహ్మణోపనిషత్తు), నాడులందు ప్రసరించు ప్రాణశక్తి దిగ్గజముల సూచకముగ పరిగణించవచ్చు.

 

ఇప్పుడు గజలక్ష్మి తత్త్వమును తెలుసుకుందాము. తల్లిని అమృతాభిషేచనము జరుపు గజములు, ఇడ, పింగళ నాడులద్వారా ప్రవహించు ప్రాణశక్తి సూచకము (అథర్వవేదము 9.1.7). ఈ విధముగా లక్ష్మీదేవిని సుషుమ్నానాడిగుండా ప్రసరించు కుండలినీశక్తి సంకేతముగా జూచిన, గజలక్ష్మీదేవి, త్రివేణీసంగమస్థానమైన ఆజ్ఞాచక్రమునందు ఉత్తేజితశక్తిగా భావించుట సంప్రదాయము. తల్లియొక్క మంగళగృహమునకు తోరణమువంటి భృకుటీస్థానమునందలి ఆజ్ఞాచక్ర సంబంధితమగుటచే, గజలక్ష్మిని దేవాలయద్వారములమీద, గృహద్వారములమీద అలంకరించుట ఐశ్వర్యదాయకము. 2, 4, 8 గజములతో అభిషేచించబడు లక్ష్మీదేవి రూపమును వివిధ గ్రంధములలో వర్ణింపబడినది. ఇందుమూలముగా, తల్లిని అభిషేచించు గజములసంఖ్యకు దశనాడులకు సహసంబంధముగలదు.

 

ఈ దేవతామూర్తికి, ఆజ్ఞాచక్రస్థానమునకుగల సహసంబంధమును తెలియజేయునవి ఖజురాహో, బిల్సాద్ ప్రదేశములలో లభించిన సింహవాహిని గజలక్ష్మీదేవి శిల్పములు.

సింహవాహిని గజలక్ష్మి- శిలాస్తంభము (బిల్సాద్, ఏటాజిల్లా, ఉత్తరప్రదేశము)

 

నరసింహావతార విశేషములను వివరించుకొనినప్పుడు, సింహము మధ్యభాగమైన మేరుదండమునందు ఉత్తేజిత శక్తిసంబంధముగా చెప్పుకున్నాము కదా. ఇందుమూలముగా, భృకుటీస్థానమునందు ప్రేరేపింపబడిన శక్తి సూచకముగ గజలక్ష్మీదేవిని సింహవాహినిగా శిల్పించినట్లున్నది.


గంగ-వరుణ-యమున

గంగ/యమున-వరుణ-యమున/గంగ నదీదేవతాత్రయముకూడా పింగళ-సుషుమ్న-ఇడ నాడుల సంబంధిత దేవతాతత్త్వ సంబంధితము.  దీనిఅంతరార్ధమును చూద్దాము.

 

వామభాగమున కచ్ఛపవాహిని యమునాదేవి, దక్షిణమున మకరవాహిని గంగాదేవిలతోకూడిన ఏడుహంసల వాహనారూఢుడైన గౌరీవల్లభ వరుణదేవుని స్వరూపమును విష్ణుధర్మోత్తరపురాణమునందు (3.52.1-21) వర్ణింపబడినది.

 

వేదములందు వరుణుని నిర్దేశించబడిన విశేషణములు: మాయ(ప్రజ్ఞ), అగ్ని, ఋత, దివ్య, అసుర (పరిపూర్ణ దివ్యత్వము), రాజు, సమ్రాట్టు, విరాట్టు, మహత్తు, మేధ, ప్రభూతి, ప్రచేతస్సు.  ఈ విశేషణములతో ఏకీభవించు సహస్రనామస్తోత్రమందలి నామములను పరిశీలించిన, వేదములందు భూమి, ద్యులోకములకు సమ్రాట్టని చెప్పబడిన యమున, గంగాదేవిలతోకూడిన వరుణదేవుడు, సహస్రారాంతర్గత శివశక్తైక్య/లక్ష్మీనారాయణ తత్త్వస్వరూపునిగా తెలియుచున్నది.


ఉదయగిరి

 

 

దియో(దేబ/దేవ)ఘర్ దశావతార ఆలయద్వారము

 

మైత్రం వా అహః | వారుణీ రాత్రిః |(తైత్తిరీయబ్రాహ్మణము 1.7.10.1)

అట్టి భూమి-అంతరిక్షముల రారాజు వరుణుడు, పిమ్మట, రాత్రిసంబంధితముగ జెప్పబడుటయేగాక, స్థానపతనము పొందినట్లు జెప్పినదిజూచిన, పరమాత్మ అంతర్లీనశక్తి, స్వర్లోకాంతర్గత సహస్రారకమలమును వదలి, భూతత్త్వ మూలాధారమునందలి సుషుమ్నానాడి ద్వారమునుజేరి కుండలినీశక్తిగ నిద్రించుటకు సంకేతముగనున్నది.

 

వారిధిరూప వరుణుడు అంతర్హితుడని ఋగ్వేద 8.41.8 మంత్రము.  స్థానభ్రంశముచెంది భూలోకము జేరిన వరుణుని, జలసంబంధిత దేవతారూపముగ జెప్పబడినది (ఋగ్వేదము 1.161.14, 7.49.2,3). ద్యులోకమునందు ప్రాథమికజలములకు, భూలోకమునందు సముద్రజలములకు అధిదేవత వరుణుడు.  (ఋగ్వేదము 1.34.8)

 

ఇడాపింగళానాడులపరముగ అన్వయము:

ఋగ్వేదమునందు పలుమార్లు చెప్పబడిన దేవతాత్రయము అర్యమా, వరుణ, మిత్ర-ల గురించి ఒకమాట. వేదములందు అతిముఖ్యత్వమును అపాదించబడిన అదితిపుత్రులు మిత్ర-వరుణ-అర్యమాత్రయము(8.47.9), పింగళ-సుషుమ్న-ఇడ నాడుల తత్త్వసంబంధితమని ఋషులు సంకేతమాత్రముగ వర్ణించారు.

 ఉదయగిరి

పితృదేవతలందు శ్రేష్ఠునిగ చెప్పబడిన అర్యమా తానేయని విభూతియోగమునందు కృష్ణభగవానుడు చెప్పినాడు (భగవద్గీత-10.29). హిరణ్మయవర్షమందు కచ్ఛపరూప విష్ణుభగవానుని అర్యమా ప్రార్ధించినట్లు శ్రీమద్భాగవతమునందు చెప్పబడినది (5.18.29). సూర్యోదయముతో సూచించబడిన మిత్ర (అథర్వవేదము – 13.3.13),  క్రియాశక్తి సంకేత సూర్య సంబంధమైనందువలన యజ్ఞకారకుడు.  దీనివలన వేదములందు ప్రతిపాదితమైన అర్యమామిత్రులు వరుసగా ఇడా, పింగళానాడుల సంబంధిత దేవతలని విదితమగుచున్నది.

 

తత్కారణముచే పింగళ(సూర్య), ఇడ(చంద్ర) నాడుల సంబంధిత వల్లీ, దేవసేన దేవతలు వరుసగా యజ్ఞాచరణ, వంశావళి/పితృదేవతల సంబంధితము. ఇందుమూలముగా సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రమునందు శంకరభగవత్పాదులు సుబ్రహ్మణ్యస్వామిని, వల్లీదేవిపతి, దేవసేనాదేవిపతియని సంబోధించిన సందర్భములందలి అంతరార్ధము తేటతెల్లమగుచున్నది. 11, 19వ శ్లోకములందు జీవులందలి ఆసురీగుణములను సూచించు తారకాసురుని శత్రువు (తారకారి)యైన సుబ్రహ్మణ్యస్వామిని వల్లీదేవిపతిగా సంబోధించగా, 30వశ్లోకమునందు, పుత్రుల అపరాధములను తల్లితండ్రులు క్షమించు విధముగ, లోకమునకుతండ్రియైనటువంటి నువ్వు మా అపరాధములను క్షమించవలసినదని ప్రార్ధించు 30వశ్లోకమునందు దేవసేనాపతే యని సుబ్రహ్మణ్యస్వామిని సంబోధించుట జరిగినది.   

 

వరుణునిచే మూయబడిన శాలద్వారమును మిత్రద్వారా తెరవబడుగాక-యను అథర్వవేద మంత్రము (9.3.18), మూలాధారమునందు కుండలినీశక్తితో మూయబడిన సుషుమ్నానాడి ద్వారము, యజ్ఞము/కర్మ/సాధన ద్వారా తెరవబడునని చెప్పినట్లున్నది.  ఇచ్చట శాల, సుషుమ్నానాడి సంకేతము.

ఇడా భగవతి గంగా

పింగళా యమునా నాడీ

ఇడాపింగళాయోర్మధ్యే

సుషుమ్నా చ సరస్వతీ (జ్ఞానసంకలనతంత్రము-11)

ఇదియే తంత్రగ్రంథములందు పింగళనాడిని యమునాప్రవాహముతోనూ, ఇడానాడిని గంగాప్రవాహముతోనూ అంతర్వాహిని సరస్వతి సుషుమ్నానాడి సంబంధితముగనూ సూచించుటయందలి రహస్యము.

 

మమైవసాపరామూర్తిస్తోయరూపాశివాత్మికా| బ్రహ్మాండనామనేకానామధారః ప్రకృతిః పరా|| (27.8,9)

స్కందపురాణాంతర్గత కాశీఖండమునందు గంగానదీమతల్లి మహాత్మ్యమును వర్ణించుచూ పరమశివుడు గంగాదేవి, సాక్షాత్తు తనయొక్క జలరూపమనియు, అనేకబ్రహ్మాండములకాధారమైన ప్రకృతియనియు చెప్పినాడు.

 

కుడివైపు గంగ, ఎడమవైపు యమునలతో విరాజిల్లు సహస్రారాంతర్గత జలాధిదేవత వరుణదేవుడు, పురుషప్రకృతుల సంబంధిత ఇడపింగళనాడులపరముగా అన్వయించినపుడు గంగాయమునల స్థానము మారునని గ్రహించవలసినది.

 

ముక్తత్రివేణీశక్తిని ప్రార్ధిస్తూ 

 

శ్రీమాత్రేనమః