Sunday 24 January 2021

శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా-శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ Srimadvagbhavakutaika svarupa mukhapankaja-Saktikutaikatapanna katyadhobhagadharini

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

శివః శక్తిః కామః క్షితిరథ రవిః శక్తికిరణః

స్మరో హంసః శక్రస్తదను చ పరామారహరయః |

అమీహృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా

భజన్తే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్||

(సౌన్దర్యలహరి-32)

సహస్రనామస్తోత్రమునందలి మొదట కొన్నినామములయందలి కేశాదిపాదాంతవర్ణనలో పాశము, అంకుశము, చెరకువిల్లు, పువ్వులబాణములు ధరించిన తల్లి స్థూలరూపమును తెలుసుకున్నాము. తరువాత భండాసురునితోవధించుటకు తల్లిసమకూర్చిన శక్తిసేనలను, యుద్ధవిన్యాసములను తెలుపునామములందు మూలాధారాది సహస్రారాంతర్గత పరా/చైతన్యస్వరూపమును తెలుసుకున్నాము.  ఇకపై కొన్ని నామములు తల్లియొక్క సూక్ష్మరూపమును తెలుపునవి.

 

సూక్ష్మరూపము సూక్ష్మ(యంత్ర), సూక్ష్మతర (మంత్ర), సూక్ష్మతమ(కుండలినీ)యని మూడువిధములు. మంత్ర, యంత్రముల సహాయముతో దేవతాశక్తిని ఉత్తేజితపరచు పద్ధతిని తెలిపునవి తంత్రములు. యంత్రం మంత్రమయం ప్రోక్తమ్ దేవతా మంత్రరూపిణీ (కులార్ణవతంత్రము-6.85). ఏ దేవతరూపముకైననూ దేవత, మంత్ర, యంత్ర, తంత్రములు అవినాభావములు.  అందువలననే సహస్రనామస్తోత్రమునందు  వాగ్దేవతలు మంత్ర, యంత్ర, తంత్ర సంబంధిత నామములను ఒక వరుసగా కూర్చినట్లున్నది (సర్వమంత్రస్వరూపిణీ-సర్వయంత్రాత్మికా-సర్వతంత్రరూపా; మహాతంత్రా-మహామంత్రా-మహాయంత్రా). 

 

ఇకపైవచ్చు పదినాల్గునాములు కూడాను మంత్ర,యంత్ర,తంత్ర సంబంధితముగనున్నవి. మొదటిమూడు నామములు, పంచదశీమంత్రమును ఉద్దేశించునవిగనూ (శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖపంకజా-శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ), తదుపరి రెండునామములు శ్రీయంత్రము/శ్రీచక్రమును ఉద్దేశించునవిగనూ (మూలమంత్రాత్మికా, మూలకూటత్రయకళేబరా), మిగిలిన తొమ్మిది నామములు, శ్రీవిద్యాతంత్రమును ఉద్దేశించు నవావరణ సంబంధితముగనూ (కులామృతైకరసికా-సమయాచారతత్పరా) ఉన్నవి. దీని రహస్యమును ఇప్పుడు చూద్దాము.   

 

మననాత్ త్రాయతే ఇతి మంత్రమ్ మననముజేయువారిని రక్షించునది మంత్రము. సదసి న మంత్రం ప్రకాశయేత్ మంత్రములు అతిరహస్యమైనవియగుటచే సభలయందు ప్రకాశింపజేయరాదు. సాధకులు గురువనుగ్రహముతో పొందిన మంత్రములను మాత్రమే సాధనజేయవలెను. అయితే మంత్రద్రష్టలైన ఎందరో ఋషులు, బీజాక్షరములను నిగూఢపరచిన శ్లోకములద్వారా మంత్రోపదేశములేకుండగనే తత్ఫలమును పొందుటకు మనలను అనుగ్రహించినారు.  

 

శంకరభగవత్పాదులవారు దర్శించిన తల్లియొక్క అతిరహస్యమైన పంచదశాక్షరీ మంత్రస్వరూపమును సౌన్దర్యలహరిస్తోత్రమునందలి శివః శక్తిః కామః శ్లోకమునందు నిక్షిప్తపరచారు.  త్రిపురోపనిషత్తునందలి క్రింది శ్లోకముకూడా పంచదశీమంత్రమును ఆవిష్కృతము జేయునది.

కామోయోనిః కామకలా వజ్రపాణిర్గుహా హసా మాతరిశ్వాభ్రమింద్రః|

పునర్గుహా సకలా మాయయా చ పూరుచ్యేషా విశ్వమాతాఽఽదివిద్యా||

(త్రిపురాఉపనిషత్తు 8)

కామ, యోని, కామకల, వజ్రపాణి, గుహ, -, మాతరిశ్వ, అభ్రము, ఇంద్ర, గుహ, -క-ల, మాయలందు గోప్యపరచబడిన పంచదశీమంత్రమును సాధకులు గుర్తించవచ్చు.

 

పంచదశీ మంత్రము వరుసగా 5, 6 మరియు 4 అక్షరములతోకూడిన వాగ్భవ, కామరాజ మరియు శక్తికూటములుగ విభజించబడినది.  భాస్కరరాయలవారు, మూడుకూటసంబంధిత మంత్రములను ఈ క్రింది వరివస్యారహస్యశ్లోకములద్వారా అందించారు .

వాగ్భవకూటము:

క్రోధీశః శ్రీకంఠారూఢః కోణత్రయం లక్ష్మీః|

మాంసమనుత్తరరూఢం వాగ్భవకూటం ప్రకీర్తితం ప్రథమమ్||

(వరివస్యారహస్యము 1.9)

కామరాజకూటము:

శివహంసబ్రహ్మవియచ్చక్రాః ప్రత్యేకమక్షరారూఢాః|

ద్వైతీయకమ్ కూటమ్ కథితమ్ తత్ కామరాజకూటమ్|| 

(ibid 1.10)

శక్తికూటము:

శివతోవియతో ముక్తమ్ తృతీయమిదమేవ శక్తికూటాఖ్యమ్|

హృల్లేఖానామ్ త్రితయమ్ కూటత్రితయేపి యోజ్యమన్తే స్యాత్||

(ibid1.11)

 

తద్విమర్శస్వభావా హి సా వాచ్యా మంత్రదేవతా (తంత్రలోకః 16.286) మంత్రముద్వారా తెలియబడునది దేవతారూపము. లలితాసహస్రనామస్తోత్రమునందలి క్రిందిమూడునామములు పంచదశీమంత్రముయొక్క మూడు కూటములను, తత్సంబంధిత అమ్మ అవయవములను వర్ణించునవి.

శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజాయైనమః

వాగ్భవకూటమును ముఖపద్మముగా గల్గిన తల్లికి నమస్కారము. 

కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణ్యై నమః

మధ్యకూటమైన కామరాజకూట స్వరూపముగా కంఠక్రిందిభాగమునుండి కటిపర్యంతమునుగల్గిన తల్లికి నమస్కారము.

శక్తికూటైకత-ఆపన్నకట్యధోభాగధారిణ్యై నమః

కట్యధోభాగమును శక్తికూటముతో సమన్వయించబడిన తల్లికి నమస్కారము.

ఈమూడు నామములందలి  శివ-శక్తితత్త్వ రహస్యమును ఇపుడు చూద్దాము.

 

మంత్రాః వర్ణాత్మకాః సర్వేవర్ణాః శివాత్మకాః (శివసూత్రవిమర్శిని 2.3) మంత్రములువర్ణాత్మకములు, వర్ణములు శివాత్మకములు. వ్యక్తమంబామయమ్ సర్వమ్ అవ్యక్తమ్ తు మహేశ్వరమ్ స్థూలరూపము వ్యక్తకృతముకాగా, మంత్రసంబంధిత వాగ్భవ, కామరాజ, శక్తికూటములు రహస్యము/అవ్యక్తమగుటచే, శివశక్తుల సామరస్యమును తెలుపు నామములివి.

 

కత్రయమ్ హద్వయమ్ చైవ శైవో భాగః ప్రకీర్తితః |

శక్త్యక్షరాణి శేషాణి హ్రీంకార ఉభయాత్మకః||

పంచదశీమంత్రమునందలి మూడులు, రెండులు శివస్వరూపములు, మిగిలినవి శక్తిస్వరూపములుకాగా, హ్రీంకారము ఉభయాత్మకములు.

 

దీనిననుసరించి వాగ్భవ, శక్తికూటములు ఒకే ఒక శివాక్షరమును గల్గియుండగా, కామరాజ/మధ్య కూటమునందు మూడు శివాక్షరములుగలవు.  ఈ మూడునామములందలి మొదటి, మూడవకూటములతో మాత్రమే కలిపివచ్చు ఏక’ (వాగ్భవకూటైక, శక్తికూటైక), ఈ కూటములందు ఒక శివాక్షరము మాత్రమేగలదని సూచించుచున్నట్లున్నది. 

 

పంచదశాక్షరరూపిణిని ప్రార్ధిస్తూ,

శ్రీమాత్రేనమః