Friday 30 August 2019

Rudra-Bhairava; రుద్రుడు-భైరవుడు

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
రుద్రాణీ దరహసితాన్యస్మాకమ్ సంహరస్తు దురితాని
యేషాముదయో దివసో భూషాపీయూష కిరణస్య।।
  (ఉమాసహస్రము 9.7)

శాక్తేయగ్రంథములననుసరించి, దక్షయజ్ఞ ధ్వంసానంతరము, సతీదేవి, హిమవంతునిపుత్రిక పార్వతిగా అవతరించుట, సతీవియోగముతో శివుడు స్థాణ్వాశ్రమమునందు నిస్సంగత్వముతో తపోనిష్ఠుడైయుండుట, జీవులపరముగ అన్వయించుకున్నాము. మేరుదండము ఊర్ధ్వభాగమునందు కాలాతీత పరమాత్మ స్థాణువైయుండగా, అధోభాగమునందు పర్వతరాజపుత్రి పార్వతీదేవి నిద్రిస్తున్న కుండలినీశక్తిగా విరాజిల్లుతున్నది.  మేరుదండ ఊర్ధ్వభాగమున స్థాణువైయున్న కాలాతీత పరమాత్మకు మహాకాలుడని పేరు. ఇప్పుడు చలనత్వమును ప్రకటించు శివుని రూపమును తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.

తతశ్చిద్రూపమేవైకమ్ సర్వసత్తాన్తరస్థితమ్।
స్వానుభూతిమయమ్ శుద్ధం దేవమ్ రుద్రేశ్వరమ్ విదుః।।
(యోగవాశిష్ఠము నిర్వాణప్రకరణ పూర్వార్ధము 36.1)
రుద్రుడు, సమస్త సృష్టియందలి శుద్ధచైతన్యము.
పాపైః పాపే క్రియమాణే హి చైల
తతోరుద్రో జాయతే దేవ ఏషః।
 (మహాభారతము శాంతిపర్వము 73.17)
పాపులు పాపములు చేసినప్పుడు రుద్రుడు ఉద్భవిస్తాడు.

ఆత్మారుద్రో హృదయే మానవానామ్
స్వమ్ స్వమ్ దేహమ్ పరదేహమ్ చ హన్తి। 
 (ibid 73.19)
మానవుల హృదయమునందు ఆత్మరూపములోనున్న రుద్రుడు, స్వదేహములను, పరదేహములను కూడా హింసిస్తాడు. శివునియొక్క సంహారరూపము రుద్రుడు.

కాలస్వరూపుడు:
స్థాణువైన (Static state) పరమాత్మయే కాలాతీతుడైన మహాకాలుడు.

సప్తచక్రములతోనూ, సప్తనాభులతోనూ, అమృతత్త్వమను అక్షదండముతోనూ సమస్తవిశ్వమును నడిపించు కాలము, సృష్టియందలి ప్రథమదైవము (అథర్వవేదాంతర్గత కాలసూక్తము-2).

సమస్తసామాన్యతయా భీమః కాలో మహేశ్వరః
దృశ్యసత్తామిమామ్ సర్వాం కవలీకర్తుముద్యతః। 
(యోగవాశిష్ఠము-వైరాగ్యప్రకరణము 23.5)
సమస్త దృశ్యప్రపంచమును కబళించు భయంకర కాలము, మహేశ్వర స్వరూపము. దీనినే సర్వేకాలపరాధీనా న కాలః కస్యచిద్వశే యని సూతసంహితయందు చెప్పబడినది. ప్రళయకాలమాసన్నమైనపుడు కాలరూపుడైన రుద్రుడు, (కాలాగ్ని) అగ్నిజ్వాలలతో సమస్త సృష్టిని దహించివేస్తాడు. (మహాభారతము 13.14.348,349)

కూర్మపురాణము ఉత్తరార్ధము 45వ అధ్యాయమునందు, మహాప్రళయ కాలాగ్నిస్వరూపమును క్రిందివిధముగ వర్ణించబడినది.
కాలాగ్నిర్భస్మసాత్కర్తుమ్ చరతే చాఖిలమ్ జగత్। …।సహస్రనయనో దేవః సహస్రాక్ష ఇతీశ్వరః। సహస్ర హస్త చరణః సహస్రర్చ్చిర్మహాభుజః। దంష్ట్రాకరాలవదనః ప్రదీప్తానలలోచనః । పీత్వా తత్పరమానందమ్ ప్రభూతమమృతమ్ స్వయమ్। కరోతి తాండవమ్ దేవీమాలోక్య పరమేశ్వరః। జ్యోతిఃస్వభావమ్ భగవాన్దగ్ధ్వా బ్రహ్మాండమండలమ్।...। ఇత్యేష భగవాన్రుద్రః సంహారమ్ కురుతే వశీ।

స్థాణువైన మహాకాలుడు, చలనశీలుడగు కాలుడు, రెండునూ శివుని రూపములే. కాలునికి సమయము, మృత్యువు రెండునూ పర్యాయపదములు.

కల్పేకల్పేఖిలమ్ విశ్వమ్ కాలయేద్యః స్వలీలయా।
తమ్ కాలమ్ కలయిత్వా యో మహాకాలోభవత్కిల।
(కాశీఖండము 1.7.91)
కల్పాంతమునందు సంపూర్ణవిశ్వసంహారముగావించిన కాలుడు, మహాకాలునితో సంవేశమౌతాడు.

స్కందపురాణాంతర్గత మహేశ్వరఖండమునందలి రెండవఖండము కౌమారీఖండమునందు, తారకాసురునితో నారాయణుడు కల్పేకల్పే సృజామిదమ్ బ్రహ్మాది సకలమ్ జగత్ (21.280) బ్రహ్మతోసహా సకల జగత్తును ప్రతికల్పమునందు నేను సృజిస్తున్నానుయని చెప్పినందువలన, ఇచ్చట చెప్పబడిన కల్పాంతము ప్రాకృతిక/మహాప్రళయ సూచితముగాని నైమిత్తిక ప్రళయముకాదు. కాలబద్ధజగత్తునుండి కాలాతీత స్థితిని జేరుటయే మహాప్రళయము.

పిండాండస్థాయిలోజూచిన,
ఆయోర్హి స్కమ్భ ఉపమస్య నీలే పథామ్ విసర్గే ధరుణేషు తస్థౌ।।
(ఋగ్వేదము 10.5.6) 
పరమాత్మ, జీవుల ఆయుష్షు రూపములో మేరుదండము/స్కంభముద్వారా ప్రతిఫలిస్తున్నాడు. స్కంభము ఊర్ధ్వభాగమున పరమాత్మ స్థాణువుగ, కాలాతీతునిగయున్నాడు.

ఆత్యంతికస్తు ప్రళయో జ్ఞానాదేవ స జాయతే।
తచ్చ జ్ఞానమ్ మహేశస్య భక్తిలభ్యమితి శృతిః।  
(సౌర పురాణము 33.10-13)
గతియుత కాలస్వరూపములైన గ్రహ, నక్షత్రములద్వారా భ్రమించు మాయామయ ప్రపంచసృష్టియందలి కాలబద్ధస్థితినధిగమించి కాలాతీతస్థితిని పొందుటయే ముక్తి. ఇదియే ఆత్యంతిక ప్రళయము. ఇది శివభక్తి వలన కలుగు జ్ఞానముద్వారా మాత్రమే సంభవించును.  

భైరవుడు
కశ్మీరశైవమతమునందు జ్ఞానస్వరూపుడైన భైరవారాధనకు మిక్కిలిప్రాముఖ్యముగలదు.

భైరవః పూర్ణరూపోహి శంకరస్య పరమాత్మనః
 (శివమహాపురాణము-రుద్రసంహిత-8.2)
భైరవుడు, పరమాత్మ శంకరుని పూర్ణరూపము అనగా జ్ఞానమయ, శుద్ధచైతన్యరూపము.  

శివమ్ తత్సచ్ఛివమ్ సాక్షాల్లక్ష్యతే భైరవాకృతి
తథా స్థితో జగచ్ఛాన్తౌ పరమాకాశ ఏవ సః।।
(యోగవాశిష్ఠము-నిర్వాణప్రకరణము-ఉత్తరార్ధము 81.5)
స భైరవశ్చిదాకాశః శివ ఇత్యభిధీయతే।
అనన్యామ్ తస్య తాం విద్ధి స్పన్దశక్తిమ్ మనోమయీమ్।।
(ibid 84.3)
భైరవుడు, చిదాకాశమయ సద్రూప పరమశివుడు. జ్ఞానసూచితమగు చిదాకాశము, శరీరమునందలి ఆజ్ఞాచక్రస్థానము. శివుని స్పన్దశక్తి మనోమయి.

ప్రాహిణోత్పురుషమ్ కాలమ్ భైరవమ్ లోకదాహకమ్  
(శివమహాపురాణము-2.31.29)

ఉద్యమోభైరవః (శివసూత్రము 5) శక్తిచక్రసంధానే విశ్వసంహారః (ibid 6)
సమిష్టిస్థాయిలోజూచిన, మహాప్రళయకాలమునందు కాలాగ్నిరుద్రుడుజేయు విశ్వసంహార తదనంతరము సమస్త సృష్టి, మహాకాలునియందు లయమగును.

వ్యష్టిస్థాయిలో ఆత్యంతికప్రళయమునందు క్రమముగా శక్తిచక్రసంధానముద్వారా విశ్వసంహారము జరుగును. సృష్టి సంహారము, కాలసంహారము. ముక్తి సాధకులందలి చిదాకాశ స్థానమైన ఆజ్ఞాచక్రము ప్రచోదితముజేయుట ద్వారా, సృష్టి/కాలసంహారము జరిపి జీవులకు కాలాతీతస్థితిని ప్రసాదించుటవలన, జ్ఞానస్వరూప చైతన్యమయ భైరవునికి కాలభైరవుడని పేరు. కాలునిపై విజయ సూచకముగ, కాలభైరవుడు కాల సూచకమైన శునకమును (మహాభారతము-వానప్రస్థపర్వము-3వ అధ్యాయము) వాహనముగ గలిగియున్నాడు.

లింగ, వామన, శివ, స్కాంద, కూర్మపురాణములననుసరించి అహంకార, కామపూరితుడై విశ్వమునందు ఆధిక్యతను ప్రకటించుకొను బ్రహ్మదేవుని శిరస్సు ఖండించుటకు పరమశివుని ఆజ్ఞాచక్ర/జ్ఞాననేత్రస్థానమైన భృకుటినుండి ఆవిర్భవించిన శివుని పూర్ణరూపము భైరవుడు. కాలాగ్ని/జ్ఞానాగ్ని స్వరూపుడు.  ఆ విధముగ ఖండించబడిన బ్రహ్మదేవుని కపాలము, బ్రహ్మహత్యదోష సూచకముగ భైరవుని చేతికి అంటుకొనగా, కపాలవిముక్తికొరకు భైరవుడు ముల్లోకములు తిరుగుతూ హిమవత్పర్వత ప్రాంతమునందలి దేవదారువనమును జేరుకున్నాడు.

కపాలవిముక్తి
తదనంతరము కపాలభైరవుడు, విష్ణులోకద్వారపాలకుడైన విష్వక్సేనుని వధించి విష్ణులోకమునుజేరి విష్ణుపత్ని లక్ష్మీదేవిద్వారా మనోరథ (విద్య) భిక్షనుపొంది, వారణాసినిజేరి కపాలవిముక్తుడైనట్లు శివపురాణమునందు చెప్పబడినది.

దారువనవృత్తాంతము
సతీదేవి తనువుచాలించిన పిదప, ఒంటరివాడైన శివుడు/భైరవుడు, హిమాలయపర్వతప్రాంతమునందలి దేవదారువనమునందు చేతిలోని బ్రహ్మకపాలమును భిక్షపాత్రగాజేసికొని, దిగంబర భిక్షువుగ తిరుగుచుండెను. అచటి ప్రవృత్తిమార్గముననుసరించి యజ్ఞయాగాదులు నిర్వహించు మునిగణములను అనుగ్రహించి నివృత్తిమార్గమునకు మరల్చుటకొరకు దిగంబర కాలభైరవుడు, మాయారూప విష్ణుమూర్తిని పార్శ్వభాగమున పత్నిస్థానమున ధరించి సంచరిచుచుండగా, పరమాత్మతత్త్వమునెరుంగక మునులు శివుని, లింగమును అచటనే విడుచునట్లు శపించారు.  లింగమనిన సూచకము/గుర్తు. ఆ తరువాయి బ్రహ్మదేవుని ఉపదేశము మేరకు మునులు మరల ప్రార్ధించగా, పరమశివుడు ప్రత్యక్షమై జన్మరాహిత్యమునొసగు నివృత్తిసోపానపథమైన శివజ్ఞానమును ప్రసాదించినట్లు కూర్మపురాణమునందు చెప్పబడినది. శివతత్త్వోపాసకులై పునర్జన్మరాహిత్యము పొందిన మునులకు కోటిసూర్యసమాన ప్రకాశముతోకూడిన జ్వాలామాలవలె గిరిజాపుత్రి అంతరిక్షమునందు జ్వలించుచూ దర్శనమిచ్చినది. శివపార్వతుల దర్శనముపొంది దేవదారువన మునులు ధన్యులైనట్లు కూర్మపురాణము ఉత్తరభాగమునందలి 37వ అధ్యాయమునందు వర్ణించబడినది.

ఈ సంఘటనలు దివ్యలోకమునందు జరిగిననూ, పిండాండ, బ్రహ్మాండములకు సమన్వయముండుటవలన, జీవుల పరముగ వీటి సంకేతార్ధములను తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.

కపాలమోచన వృత్తాంత అంతరార్ధము:
యత్తత్కారణమవ్యక్తమ్ నిత్యమ్ సదసదాత్మకమ్। 
తద్ విసృష్టః స పురుషో లోకే బ్రహ్మా – ఇతి కీర్త్యతే।।
(మనుస్మృతి – 1.11)
బ్రహ్మదేవుడు పురుషుడు/జీవాత్మ సూచితము.

పరమశివునికి పంచకృత్యములనుసూచించు ఐదుముఖములు. జీవాత్మ, పరమాత్మ ప్రతిబింబమగుటచే, పరమశివుని వలెనె, ఆరంభమున బ్రహ్మదేవుడు కూడా ఐదుశిరస్సులు గల్గియున్నాడు. పరమశివుని ఊర్ధ్వశిరస్సు తురీయాతీతస్థితిని గల్గియుండగా, బ్రహ్మదేవుని ఊర్ధ్వశిరస్సు కామపూరితమై, అహంకారయుక్తమై ప్రవర్తించినట్లు పురాణములందు చెప్పబడినది.

శివుని జ్ఞాననేత్రమునుండి ఆవిర్భవించిన భైరవుడు బ్రహ్మదేవుని ఐదవశిరస్సును ఖండించగా, బ్రహ్మదేవుని కపాలము, భైరవుని చేతికంటుకున్నదువలన కపాలభైరవుడైనాడు. బ్రహ్మకపాలము జీవ సూచితము, భైరవుడు చైతన్యసూచితము. అందువలన ఈ సంఘటన, కామపూరితకర్మాచరణజేయు అహంకారపూరిత పురుషుడు కర్మఫలానుసారము భూలోకజన్మ సూచకము. కాలభైరవుని మెడలోని కపాలమాల, అహంకారపూరితుడైన జీవి మరల మరల పొందు అసంఖ్యాక జన్మల సూచితము.

శివసంహితయందలి 2.25,26,5.133 సూత్రములననుసరించి మన శరీరమునందలి ఇడ, పింగళా నాడులు వారణ, అసి సూచితములు మరియు ఈ రెండునాడుల మధ్యస్థలమైన ఆజ్ఞాచక్రస్థానము విశ్వనాథ క్షేత్రము వారణాసి సూచితము. 

భైరవుడు త్రికాలబద్ధమైన సృష్టియందలి చైతన్యస్వరూపము. కపాలమునుండి విముక్తికొరకు ప్రయత్నించిన కపాలభైరవుడు, మోక్షాసక్తుడైన జీవి సూచితము. కాలబద్ధమైన మాయామయ ప్రపంచమునుండి, గ్రంథి భేదనముద్వారా కాలాతీతస్థితిని పొందుటయే ఆత్యంతికప్రళయము లేదా మోక్షము. కపాలవిముక్తి (జీవన్ముక్తి)కొరకు ముల్లోకములు తిరిగి విష్ణులోకద్వారపాలకుడు విష్వక్సేనుని వధించి విష్ణులోకమునకు, తదనంతరము వారణాసినిజేరి కపాలమునుండి విడుదల పొందుట, మోక్షాసక్తుడైన జీవుడు మూలాధారస్థాన బ్రహ్మగ్రంథి, మణిపూరచక్రస్థాన విష్ణుగ్రంథి, ఆజ్ఞాచక్రస్థాన రుద్రగ్రంథి విభేదనము జేసుకుంటూ జన్మరాహిత్య ముక్తిని పొందుటకు సూచితము. కాలబద్ధత్వమునుండి కాలాతీతస్థితిని పొందుటయే ముక్తి. కపాలవిముక్తి శక్తిచక్రసంధానమునకు, విశ్వసంహారమునకు సంకేతము.

దారువనవృత్తాంత అంతరార్ధము:
మూలాధారమునందలి ప్రాణశక్తి పర్వతరాజపుత్రి పార్వతీదేవి సూచితముగ చెప్పుకున్నాము.  సతీవియోగ పర్యంతము శుద్ధచైతన్యుడగు కాలాతీత పరమాత్మ, దిగంబర భైరవునిగ హిమవత్పర్వత ప్రాంతమునందలి దేవదారువనములందు మాయాశక్తి సహితముగ సంచరించి, అచట ప్రవృత్తిమార్గాచరణజేయు మునులకు నివృత్తిమార్గబోధన గావించినట్లు చెప్పబడినది.

హిమాలయపర్వత పరిధిలోని దారువనము మూలాధార సూచితము. పూర్వకర్మఫలానుసారము భూలోకమునందు జన్మించు జీవాత్మ కపాలభైరవుని సూచితము.  భైరవుని సగభాగముగనున్న విష్ణుమాయ, ప్రపంచమునందలి మాయాశక్తి సూచితము.  ప్రవృత్తిమార్గాచరణజేయు మునులు, మాయాబద్ధులై విషయాసక్తులై యజ్ఞయాగాదులను నిర్వహించు జీవులు. మోక్షాసక్తులగువారు అమితమైన శివభక్తితో తాపసిక జీవనశైలిననుసరించుటద్వారా జననమరణచక్రమునుండి తప్పించుకొనగలరు.  శివభక్తిద్వారా జ్ఞానాగ్ని రగిల్చబడి, కార్మికమల నిర్మూలము జరిగి, రుద్రగ్రంథి భేదనము జరుగును.  దారువనప్రాంత మునులు శివభైరవునిద్వారా (చైతన్యమేవ ఆత్మ) జన్మరాహిత్యజ్ఞానమును పొందిన పిదప, పార్వతీదేవి కోటిసూర్యప్రభల జ్వాలామాలినిగా దర్శనమిచ్చినది. ఇది సాధకులందు, మూలాధారమునందు నిద్రిస్తున్న కుండలినీశక్తి సుషుమ్నానాడిద్వారా ఊర్ధ్వదిశగా ప్రయాణిస్తూ గ్రంథిభేదనము జరుపుటకు సూచకము.  జ్ఞానస్థాన సూచితమైన ఆజ్ఞాచక్రము/చిదాకాశమునందు తల్లి జ్వాలామాలినిగ దర్శనమిచ్చినది. జ్వాలామాలిని సాక్షాత్కారము రుద్రగ్రంథిభేదన సూచితము. శివతత్త్వజ్ఞానము కార్మిక-మల నిర్మూలనముగావించి జన్మరాహిత్యమును ప్రసాదిస్తుంది. 

చిదాకాశమునందు జ్వాలామాలిని సాక్షాత్కారమే చిదంబరక్షేత్రమునందలి చిదంబర రహస్యము.  దీనిని గురించి మరింత తరువాత తెలుసుకుందాము.

 
కాలభైరవుడు, నృసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఒకే తత్త్వముగలిగిన దేవతామూర్తులు. లక్ష్మీనృసింహస్వామి సహస్రనామములందు సుబ్రహ్మణ్యుడు, భైరవుడను నామములు గలవు. సాక్షాత్తు శివుని రేతస్సునుండి ఆవిర్భవించిన సుబ్రహ్మణ్యస్వామి శివచైతన్య స్వరూపుడగుటచే, భైరవతత్త్వము గలిగిన దేవతామూర్తి. శ్రీమద్భాగవతమునందు వ్యాసులు పలుసందర్భములలో నృసింహుని కాలభైరవ తత్త్వమును వర్ణించారు. సుబ్రహ్మణ్యస్వామిని నృసింహావతారుడిగా శంకరభగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగస్తోత్రము భజేహమ్ కుమారమ్ భవానీ కుమారమ్ నందు స్తుతించారు.

భైరవపత్ని భైరవిని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః