Thursday 26 September 2019

భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా Bhandasura-Vadhyodyukta-SaktiSenaa-Samanvita

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః

మాయాకంచుక భేదినీ మనోన్మయీ
షట్త్రింశత్తత్వమయీ పాహి చిన్మయీ

భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితాయై నమః
భండాసుర-వధ-ఉద్యుక్త-శక్తిసేనా-సమన్వితా
భండాసురుని వధించుటకొరకు సన్నద్ధమైన శక్తిసేనలతోకూడియున్న తల్లికి నమస్కారము.

పురుషసంకేత బ్రహ్మదేవుని అహంకార/కామపూరిత చర్యలు భండాసుర గుణములు.  అట్టి ఆసురీగుణ నిర్మూలనము భండాసురుని వధించుటకు సంకేతము. తల్లినుండి ఆవిర్భవించిన శక్తిసేనలను, ఇచ్చటినుండి వచ్చు కొన్నినామములను వివరించుకొనుటకుముందు తెలుసుకొనుటకు ముందు అసురగుణోత్పత్తికి మూలకారణమును తెలుసుకొనవలెను.

పరమాత్మ స్వాతంత్ర్యశక్తితో ముప్పదియారు తత్త్వములతోకూడిన విశ్వముగ భాసిస్తున్నాడు (లలితోపాఖ్యానము 37.58-60, శివపురాణాంతర్గత వాయుసంహిత పూర్వభాగము – 33.12-15).  ముత్తుస్వామిదీక్షితులు ఆఖరిగా స్తుతించిన కీర్తన ఏహీ అన్నపూర్ణే సన్నిదేహీయందు తల్లిని షట్త్రింశతత్త్వవికాసినిగా వర్ణించారు. షట్త్రింశత్తత్త్వ సృష్ట్యావిష్కరణను కశ్మీరశైవసిద్ధాంత త్రికప్రకరణమునందు శివ-విద్యా-ఆత్మ/ పర-పరాపర-అపర/ శుద్ధ-శుద్ధాశుద్ధ-అశుద్ధమను మూడువిధములుగ విభజించబడినది. 36 తత్త్వములను మరింత వివరముగ వేరే సందర్భములో తెలుసుకుందాము.

శివ తత్త్వములు
శివ, శక్తి, సదాశివ, ఈశ్వర, శుద్ధవిద్య
మాయ/విద్య తత్త్వములు
మాయ, కల, విద్య, కాల, రాగ, నియతి, పురుష
ప్రకృతి/ఆత్మ తత్త్వములు
ప్రకృతి, బుద్ధి, అహంకారము, మనస్సు – అంతఃకరణములు
ఆకాశవాయువహ్నిసలిలభూమి – భూతములు
శబ్దస్పర్శరూపరసగంధ- తన్మాత్రలు
త్వక్చక్షుశ్రోత్రజిహ్వాఘ్రాణ – జ్ఞానేంద్రియములు
వాక్పాణిపాదపాయూపస్థ - కర్మేంద్రియములు

చిద్వత్తచ్ఛక్తిసంకోచాత్ మలావృతః సంసారీ (క్షేమరాజ ప్రత్యభిజ్ఞహృదయము-9)
హతస్వాతన్త్ర్యరూపా ఇచ్ఛాశక్తిః సంకుచితా సతీ అపూర్ణమన్యతా స్వరూపమ్ ఆణవమలమ్;

జ్ఞానశక్తిః క్రమేణ సంకోచాత్ భేదే సర్వజ్ఞత్వస్య కించిత్-జ్ఞాత్వాప్తేః అంతఃకరణ-బుద్ధీన్ద్రియతాపత్తిపూర్వమ్ అత్యంతం సంకోచగ్రహణేన భిన్నవేద్యప్రథారూపమ్ మాయీయమ్ మలమ్;

క్రియాశక్తిః క్రమేణ భేదే సర్వకర్తృత్వస్య కించిత్-కర్తృత్వాప్తేః కర్మేంద్రియరూప-సంకోచగ్రహణపూర్వమ్ అత్యంతమ్ పరిమితతామ్ ప్రాప్తా శుభాశుభానుష్ఠానమయమ్ కార్మమలమ్;

పరమాత్మయొక్క అప్రతిహతస్వాతంత్ర్యరూప ఇచ్ఛాశక్తి, అపూర్ణత్వముతోకూడిన ఆణవ-మలముగనూ; సర్వజ్ఞ-జ్ఞానశక్తి, కించిత్-జ్ఞత్వమునుపొంది అంతఃకరణములద్వారా భిన్నత్వమును ప్రతిఫలించు మాయీయ-మలముగనూ; సర్వకర్తృత్వ క్రియాశక్తి, కర్మేంద్రియములద్వారా కించిత్-కర్తృత్వమును ఆపాదించు కార్మీక-మలముగనూ ఆవరించుటచే పరమాత్మ, జీవాత్మభావమును పొందుతున్నది.  స్వాతంర్గత శక్తి సంకోచముచే (ఆణవ, మాయీయ మరియు కార్మిక) మలావృతుడైన సచ్చిదానంద పరమాత్మ, పురుషుడు/సంసారియనబడుచున్నాడు.

తథా సర్వకర్తృత్వ-సర్వజ్ఞత్వ-పూర్ణత్వ-నిత్యత్వ-వ్యాపకశక్త-యః సంకోచం గృహ్ణానా యథాక్రమమ్ కలా-విద్యా-రాగ-కాల-నియతరూపతయా భాన్తి;
 (ప్రత్యభిజ్ఞహృదయ 9వ సూత్ర వివరణము)
మాయాపరిగ్రహవశాద్
బోధో మలినః పుమాన్ పశుర్భవతి।
కాలకలానియతివశాద్
రాగావిద్యావశేన సంబద్ధః।। (పరమార్థసారము-16)
వరిబీజమును కప్పుచూ ధాన్యము, పసుపు-తెలుపు (తవుడు) పొర, వెలుపలి పసుపురంగు ఊకపొట్టు ఉన్నట్లే,  మాయకులోబడిన శుద్ధచైతన్యము కాలము, కల, నియతుల ద్వారా రాగము మరియు అవిద్యలను పొర/కంచుకములతో కప్పబడుటచే అశుద్ధమైన పశువు/పురుషుడనబడుచున్నాడు. మలత్రయమనుపాశము ఈ మాయామోహిత జీవులను పశువులను బంధించుచున్నది.

మాయాశక్తి ప్రభావముచే పరమాత్ముని 
1.సర్వశక్తిత్వము/కర్తృత్వము (Omnipotence) కలాతత్త్వముగ ప్రతిఫలించుచున్నది. స్వాత్మైవ దేవతాప్రోక్తా లలితా విశ్వవిగ్రహా పరమాత్మ జీవాత్మగా ప్రతిఫలించినప్పుడు, మాయాబద్ధ పురుషుడు కించిత్కర్తృత్వముగలిగిన అల్పశక్తిమంతునిగ భావించుచున్నాడు. 
2.శుద్ధవిద్యాతత్త్వము/సర్వజ్ఞత్వము/సర్వసాక్షిత్వము (Omniscience), (అశుద్ధముగ) పరిమిత విద్యగ తెలియబడుచున్నది. ఇక్కారణముగ పురుషుడు అల్పజ్ఞత్వముతో బంధింపబడుచున్నాడు. దీనినే రెండవ శివసూత్రమునందు జ్ఞానమ్ బంధః యని చెప్పబడినది. 
3. శాశ్వతము/అనంతము/అనాది/ఆద్యంతరహితత్వము (Eternity), పురుషుని కాలపరిమితితో బంధిస్తున్నది 
4.సర్వవ్యాపకత్వము (Omnipresence), ప్రకృతిధర్మమును నిర్దేశించు వస్తు/జీవసంబంధిత కార్యకారణత్వమునాపాదించు నియతగా పరిణామముచెందుచున్నది.  ఉదాహరణకు, (బీజమునుండి వృక్షము) సృష్టిక్రమమును, బీజమునుబట్టి పుష్ప/ఫలములను ఉత్పత్తిజేయు బీజధర్మములను నియంత్రించు పద్ధతులనేర్పరుచునది నియతి. సర్వవ్యాపకత్వమును కుచించునది నియతత్వము. 
5.పరిపూర్ణత్వము, పురుషునియందలి రాగముగ ప్రతిఫలింపబడుచున్నది. రాగరహితమైన స్థితి పరిపూర్ణత్వము. మాయాబద్ధులైన రాగపూరిత జీవులు అసంపూర్ణతకు సూచకము.  

సుఖానుశయీ రాగః (పతంజలియోగసూత్రములు 2.7)
సుఖమును కలిగించు వానియందు కలుగు ఆసక్తి రాగము. రాగమును, ఒకసారి ఆ సుఖముననుభవించిన వారియందు మరల కలుగు కోరికగ తెలుసుకొనవలెను.

మరి రాగమును గురించి తెలుసుకొని దాని ద్వంద్వమును తెలుసుకొనవలెను కదా!

దుఃఖానుశయీ ద్వేషః (పతంజలియోగసూత్రములు 2.8)

జీవులయందీ రాగద్వేషములు ఇంద్రియములందు, ఇంద్రియార్థములందు (శబ్దాదులయందు) ఏర్పడియున్నట్లు శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతయందలి క్రింది శ్లోకమునందు చెప్పుచున్నాడు.

ఇన్ద్రియస్యే ఇన్ద్రియస్యార్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ।
తయోర్న వశమాగచ్ఛేత్తౌ హ్యస్య పరిపన్థినౌ।। 
(భగవద్గీత 3.34)

ఇంద్రియాణ్యశ్వరూపాణి; ఇంద్రియాన్యార్థాన్ గజాన్।
(తంత్రరాజతంత్ర-8వభాగము-5.24,25)

శ్రోత్రత్వక్చక్షుజిహ్వాఘ్రాణములను జ్ఞానేంద్రియములు, వాక్పాణిపాదపాయుపస్థలను కర్మేంద్రియములు అశ్వరూపములు. శబ్దస్పర్శరూపరసగంధ, వచన, దాన, గతి, విసర్గ, ఆనందములను పది ఇంద్రియార్థములు, గజరూపములు. ఇంద్రియార్థ నిగ్రహ సూచిత ఆయుధము అంకుశము.

ప్రకాశవిమర్శయుక్తమైన సత్-చిత్-ఆనంద అవ్యక్త పరమాత్మ సృష్టిసంకల్పముజేసినప్పుడు, మూలప్రకృతిరూపమైన మాయాశక్తికారణముగ స్వాభావిక అంతర్లీన స్వాతంత్ర్య చైతన్య, ఆనంద, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు సంకోచితముచెందుటచే సూక్ష్మతర ఆణవ, మాయీయ, కార్మిక మలత్రయము ఏర్పడును.  మలసంఘాతము వలన పరమాత్మయొక్క పూర్ణత్వము, సర్వజ్ఞత్వము, సర్వకర్తృత్వము, సర్వశక్తిత్వము మొదలగునవి కల, కాల, నియతి, రాగము మొదలగు సూక్ష్మ ఆవరణ/పొరలచే కప్పబడి, 24 ప్రకృతితత్త్వములతో కూడిన స్థూలసృష్టి వ్యక్తమగుచున్నది.

నిష్కల, నిర్గుణ, అభేదతత్త్వ పరమాత్మ, శివాదిక్షితిపర్యంత షట్త్రింశతత్త్వములద్వారా స్థూలత్వమును పొందినపుడు, మాయాశక్తిజనిత కంచుకముల(పొరల)తో కప్పబడుటచే విశ్వమును భిన్నత్వముతో ప్రతిఫలింపజేస్తున్నది.  భిన్నత్వము నుండి ఏకత్వమును పొందుటయే పరమాత్మైక్యత. పరమాత్మతో ఏకత్వమును పొందుట, విశ్వసంహారము.  అదియే భండాసురసంహారము.

అంతర్లీన పరమాత్మతత్త్వమును ఎరుగక, పరిమితత్వమునాపాదించుకొను మలత్రయ/కంచుకావృత జీవభావము భండాసుర సూచకము. తత్ఫలితముగా, పరంబ్రహ్మైక్యతను పొందుటకు సాధకులు ఈ ఐదు పొరలను ఛేదించుటకు ప్రయత్నించవలెను.  భండాసురునితో యుద్ధముజేయుటకు సాధకులందు తల్లి సృష్టించిన శక్తిసేనలు, ఈ ఐదుపొరలను ఛేదించునవిగయున్నవి.

ఇంద్రియ, ఇంద్రియార్ధ సంబంధిత రాగాదులను నియంత్రించుటకు సంపత్కరీదేవి మరియు అశ్వారూడాదేవి, కలాతత్త్వమునధిగమించుటకు కలాతీతయైన లలితామహాత్రిపురసుందరి, విద్యాతత్త్వమును జయించుటకు శుద్ధవిద్యాధిదేవత మంత్రిణీదేవి, నియతత్వమునధిగమించుటకు దండనాథాదేవి, కాలతత్త్వమును జయించుటకు జ్వాలామాలిని మొదలగు తిథినిత్యాధిదేవతలను శక్తిసేనలను, తల్లి సిద్ధముజేసినట్లున్నది.  

షట్త్రింశత్తత్వరూపిణిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః