Thursday 29 July 2021

muladharaika nilaya-bisatantu taniyasi; మూలాధారైకనిలయా-బిసతంతుతనీయసీ

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

కుండలి కుమారి కుటిలే

చండి చరాచర సవిత్రి చాముండే |

గుణినిగుహారిణి గుహ్యే

గురుమూర్తే త్వామ్ నమామి కామాక్షీ ||

 

కుండలినీ శక్తి:

సహస్రారమునందలి శివుని వదలి మూలాధారమునుజేరి నిద్రించు శక్తి, కుండలినీశక్తియని చెప్పబడుచున్నది. మరి శివశక్తులు అవినాభావులుగదా!! మరి శివశక్తుల వియోగము ఎలా సంభవము? దీనియందలి అంతరార్ధమును ఇప్పుడు చూద్దాము.

 

 

సృష్ట్యోన్ముఖుడైన నిర్గుణ, నిరాకార పరమేశ్వరుని అంతర్లీన చైతన్యశక్తి, వ్యాపకత్వమును పొందుటద్వారా త్రిగుణాత్మక-పంచభూతమయ-స్థూలరూప సాకార విశ్వము సృజనాత్మకమగుచున్నది. అవాఙ్మానసగోచరమైన సచ్చిదానంద పరంబ్రహ్మ చైతన్యశక్తి వ్యాపకత్వమును చెందినప్పుడు, వారివారి వాసనలు, సంస్కారములకు తగినట్లు  పరంబ్రహ్మ ఆవరింపబడి, పంచభూతాత్మక సగుణరూపముతో వ్యక్తీకరింబడుటయే సృష్టి. జీవుల ప్రారబ్ధకర్మననుసరించి సహస్రారమునందలి పరంబ్రహ్మ అంతర్లీన చైతన్యశక్తి పరిణామముజెంది, మూలాధారమునుజేరి చుట్టలుచుట్టుకున్నసర్పమువలే విశ్రమించి నిద్రావస్థను పొందుచున్నది. వర్తులాకారముతో కూడినదిగావుననే ఈశక్తికి కుండలినీశక్తియనిపేరు. ప్రాపంచికోన్ముఖులైనవారియందు నిద్రించుచుండు కుండలినీశక్తి, మోక్షాసక్తులై సాధనజేయువారియందు జాగృతిచెందును. ప్రపంచస్ఫురణయున్న పరమాత్మైక్యత(సమాధి) సాధ్యముకాదు. పరమత్మైక్యత ఏర్పడినప్పుడు ప్రపంచస్ఫురణయుండదు.

 

 

వ్యక్తమంబామయమ్ సర్వమ్ అవ్యక్తమ్ శివమయమ్-యని చెప్పబడుటచే సహస్రారమునందలి పరంబ్రహ్మ శివుని సూచించగా, వ్యాపకత్వమునుపొంది వ్యక్తీకృతమైన జీవుల మూలాధారమునందు విశ్రమించు పరంబ్రహ్మ, శక్తిసూచితము. అవ్యక్తస్థితిని వదలి వ్యక్తీకృతమగుటనే, శివుని వదిలి శక్తి మూలాధారమును జేరినట్లు చెప్పుబడుచున్నది.

 

పంచ- భూత, తన్మాత్ర, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో కూడిన జీవులందు, సృష్ట్యోన్ముఖ పరంబ్రహ్మ శుద్ధసచ్చిదానందమయమై సహస్రారమునందుండగా, ఆఖరుదైన భూతత్త్వసంబంధిత మూలాధారచక్రమునందు, ఆ సచ్చిదానంద తత్త్వమునందలి 

 

సత్-తత్త్వము -  నాశరహిత (అక్షరములతోకూడిన) శబ్దము

చిత్,చైతన్యశక్తి - కుండలినీశక్తి

ఆనందతత్త్వము - శివ(అ)-శక్తి(హ) అహం

 

గానూ పరిణామముచెందుచున్నవి. బ్రహ్మసత్యమ్ జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరః (బ్రహ్మజ్ఞానావళీమాల-20).

 

భూర్భువస్స్వర్లోకములు/అగ్నిసూర్యసోమమండలములతోకూడిన జీవుల స్థూలశరీరమునందలి మూడు సూక్ష్మగ్రంథులు, బ్రహ్మ, విష్ణు మరియు రుద్రగ్రంథులు. ఈ గ్రంథులు, వరుసగా స్థూలశరీరాంతర్లీన సూక్ష్మశరీరము, తదంతర్లీన కారణశరీరములతో జీవాత్మను బంధించునవి. బ్రహ్మగ్రంధిభేదనముతో స్థూలశరీరాభిమానము, విష్ణుగ్రంథి భేదనముతో సూక్ష్మశరీరాభిమానము, రుద్రగ్రంథిబేదనముతో కారణశరీరాభిమానము తొలగిపోవును. రుద్రగ్రంథిభేదన పర్యంతము, లలాటచక్రమునందలి బ్రహ్మరంధ్రద్వారమునందు కుండలినీశక్తి ప్రవేశింపజేయుటద్వారా సమాధిస్థితిని పొందెదరు.

 

కశ్మీరశైవసిద్ధాంతముననుసరించి (శ్రీతంత్రలోకః 3.137-141) మూలాధారముజేరి నిద్రించు కుండలినీశక్తి, కులకుండలిని యనబడుచున్నది. కొన్ని తంత్రగ్రంథములందు మూలాధారమునందు నిద్రించు కుండలినీశక్తిని పరాకుండలినియనుట గమనించదగినది. అపరతత్త్వ/కులసంబంధిత చక్రములైన మూలాధారాదిఆజ్ఞాచక్రపర్యంతము గ్రంథిభేదనముజరుపుకుంటూ ఆజ్ఞాచక్రమును జేరునపుడు, ఈ శక్తికి ప్రాణకుండలినీయని పేరు. ఆజ్ఞాచక్రస్థానమునుండి అకుల/పరాపర తత్త్వసంబంధిత బ్రహ్మరంధ్రద్వారస్థానమైన లలాటచక్రమును పొందునపుడు, ఈ చైతన్యశక్తికి  శక్తికుండలినియని పేరు. చివరగా, సహస్రారాంతర్గత చైతన్యశక్తి, పరాకుండలిని. పరాకుండలిని, కులకుండలినీ రెండునూ అణువునందలి ధన (protons), ఋణ (electrons)విద్యుత్కణములవలే ఒకదానికి మరియొకటి ఆలంబనము.  

 

తదుపరి పదినాలుగు నామములు, తల్లియొక్క సూక్ష్మతమరూపమైన కుండలినీశక్తి సంబంధితమైనవి. మూలాధారైకనిలయా నుండి బిసతంతుతనీయసీ వరకుగల నామములు, కుండలినీశక్తి తత్త్వమును, సుషుమ్నానాడిద్వారా కుండలినీ ప్రయాణమును వర్ణించునవి.

 

కుండలినీ ప్రయాణము:

ప్రకాశమానామ్ ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానామ్|

అంతః పదవ్యామనుసంచరంతీమ్ ఆనందరూపామబలామ్ ప్రపద్యే|| (దేవీ గీత 12.3) 

కుండలినీశక్తిరూపిణియైన దేవి, సుషుమ్నానాడిగుండా ఊర్ధ్వదిశగా (ప్రథమప్రయాణమునందు) సూక్ష్మమైన అగ్నిశిఖగా సహస్రారమునుజేరును. తద్వారా సహస్రారమునుండి జరుగు అమృతస్రావముతోతడిసి, అధోదిశగా(ప్రతిప్రయాణము) మూలాధారమును జేరును.

 

కుండలినీశక్తి ప్రయాణమును ఆదిశంకరభగవత్పాదులు సౌన్దర్యలహరి మహింమూలాధారే.., సుధాధారా సారైః.. శ్లోకములందు వర్ణించారు.  సహస్రారముజేరిన కుండలినీశక్తి, పతితో విహరించి, అక్కడే ఉండిపోకుండా, స్వస్థానమైన మూలాధారమును జేరునని చెప్పబడుచున్నది. మొదటి శ్లోకము (మూలాధార-సహస్రార) ఊర్ధ్వకుండలినిని వర్ణించగా, రెండవశ్లోకము (సహస్రార-మూలాధార)అధఃకుండలినిని వర్ణించునది. వరివస్యారహస్యము 103-106శ్లోకములందు భాస్కరరాయలుకూడా సహస్రారముజేరి అమృతాభిషేచయై మూలాధారముజేరు కుండలినిని స్తుతించారు.

 

సహస్రనామస్తోత్రమందలి నామములవరుసను ఇప్పుడు చూద్దాము.

 

మూలాధారైకనిలయా-సుధాసారాభివర్షిణీ

మూలాధారము స్వస్థానముగాగల్గి విద్యుల్లతప్రభలతోకూడిన తామరతంతువంటి కుండలినీశక్తి, జాగృతిచెందినపుడు వర్తులాకారమునువదలి ఋజుత్వమునుపొంది ఊర్ధ్వదిశగా ప్రయాణము ప్రారంభిస్తుంది.   సహస్రదళపద్మమునందలి శివునిజేరుట వలన స్రవించు అమృతధరలతో సాధకుని శరీరము ప్లుతమగును. వాగ్దేవతలు, మూలాధారైకనిలయా, బ్రహ్మగ్రంథివిభేదినీ, మణిపూరాంతరుదితా, విష్ణుగ్రంథివిభేదినీ, ఆజ్ఞాచక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ, సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ నామములందు, కుండలినీశక్తి ఊర్ధ్వచలనమును వర్ణించారు.

 

మొదటి నామమునందలిఏకనిలయా”, మూలాధారస్థానము ఒక్కటి మాత్రమే కుండలినీశక్తికి ఆవాసమని సూచించునది. అణువునందలి ఋణవిద్యుత్కణము ఉత్తేజితమొంది కేంద్రము దిశగా ప్రయాణించిననూ, మరల స్వస్థానమునుజేరి స్థిరత్వమును పొందునట్లు, కుండలినీశక్తి జాగృతిచెంది ఊర్ధ్వచక్రములను జేరిననూ, మరల మూలాధారమును జేరినప్పుడు మాత్రమే స్థిరత్వమును గల్గియుండునని చెప్పబడుచున్నది.

 

స్వస్థానమును జేరుటయందు అమితాసక్తి (మహాసక్తిః) గల్గిన కుండలినీశక్తి అధోదిక్కు ప్రయాణమునే వాగ్దేవతలు, సుధాసారాభివర్షిణీ నామము తర్వాత వచ్చు  తటిల్లతాసమరుచిః, షట్చక్రోపరిసంస్థితా, మహాసక్తిః, కుండలినీ, బిసతంతుతనీయసీ నామములందు వర్ణించారు.

 

సుషుమ్నానాడి సహస్రారకమలముయొక్క తంతువువంటిది. (షట్చక్రోపరిసంస్థితా) షట్చక్రములపైన (తటిల్లతాసమరుచిః) విద్యుల్లతవంటిప్రభలతోయున్నశక్తి, (కుండలినీ) వర్తులత్వమును పొందుటయందుగల (మహాసక్తిః) ఆసక్తితో (బిసతంతుతనీయసి) తామరకేసరదండమువంటి తనువుతోకూడి సుషుమ్నానాడిద్వారా మూలాధారమునుజేరుచున్నది. ఈ నామములందలి మహాసక్తిః, కుండలినీ, రెండు వరుసనామములు మూలాధారమునుజేరి వర్తులత్వమును పొందుటయందు ఆసక్తిగల తల్లిని సూచించునవి. అందువలన ఈ ఐదునామములు కుండలినీశక్తియొక్క దిగువ ప్రయాణ సంబంధితము.

***

జీవాత్మను స్థూల, సూక్ష్మ, కారణశరీరములతో బంధించు బ్రహ్మ, విష్ణు, రుద్రగ్రంథి స్థానములు (మూలాధార, మణిపూర, ఆజ్ఞాచక్రములు) అగ్ని, సూర్య, సోమమండలములతో కూడిన త్రిపుముల సంబంధితము. జాగృత్స్వప్నసుషుప్తుల మూడింటియందు ఉంటూనే వాటికి అతీతమైన నిర్గుణ నిరాకార సచ్చిదానందమయ పరమాత్మస్థానము  సహస్రారకమలము, తురీయము. 

 

మూలాధారమునందలి క్షీరసముద్రమును గురించి ద్రావిణీముద్ర postనందు, ఆజ్ఞాచక్రస్థాన సంబంధిత రుక్మిణీసత్యభామాసమేత కృష్ణభగవానుని గురించి మహాఙ్కుశముద్ర postనందు చర్చించడమైనది.

 

మనకందరికీ సుపరిచితమైన విష్ణుసహస్రనామస్తోత్ర మూడు ధ్యానశ్లోకములు, ఈ మూడుగ్రంధులసంబంధిత విష్ణుస్వరూపాన్వయములుకాగా తరువాతవచ్చు ప్రణవముతో సూచించబడినది తురీయము.

 

1. క్షీరసముద్రమునందు ఆసీనుడైన ముకుందుని వర్ణించు క్షీరోదన్వత్ప్రదేశే శ్లోకము

2. భుజగశయనుడైన విష్ణువును వర్ణించు శాంతాకారమ్ భుజగశయనం శ్లోకము

3. పారిజాతవృక్షముక్రింద ఆసీనుడైన రుక్మిణీసత్యభామసమేత కృష్ణునివర్ణించు ఛాయాయాం పారిజాతస్య శ్లోకము,

 

క్షీరోదన్వత్ప్రదేశే..

స్ఫటిక ఇసుకతిన్నెలతో కూడిన క్షీరసముద్రమునందు ముక్తాహారములతో అలంకరించబడిన ఆసనముమీద  కూర్చొని అమృతపు చినుకులతో ప్లుతమగు ముకుందుడు, స్థూలదేహాభిమానమును పోగొట్టి ముక్తిని ప్రసాదించు విష్ణుస్వరూపము.

 

ముక్తాశ్రయమ్ యర్హి నిర్విషయమ్ విరక్తమ్

నిర్వాణమృచ్ఛతి మనః సహసా యథార్చిః|

ఆత్మానమత్ర పురుషోSవ్యవధాన మేక

మన్వీక్షతే ప్రతినివృత్త గుణప్రవాహః || (శ్రీమద్భాగవతము 3.28.35)

దీనిననుసరించి, మొదటిశ్లోకమునందు పునరుక్తమగు  ముక్త”, అగ్నిమండల సంకేతము.

 

ఆదిశంకరభగవత్పాదులు మాతృకాపుష్పమాలాస్తోత్రము రెండవశ్లోకమునందు అగ్నిసూర్యసోమమండల త్రిపురములను (శ్రీచక్రము) ఏణాంక-అనల-భానుమండలములద్వారా వర్ణించగా, మీనాక్షీపంచరత్నస్తోత్రమునందలి రెండవశ్లోకమునందు అగ్నికి సంకేతముగా ముక్తాహారమును, సూర్యసంకేతముగా అమ్మ కిరీటమును (కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా),  సోమమండలసంకేతముగా పూర్ణేందువక్త్రమును ఉదహరించారు  (ముక్తాహార-లసత్-కిరీట-రుచిరాం-పూర్ణేందువక్త్రప్రభామ్).

 

శాంతాకారం భుజగశయనం...

శంఖచక్రములు, కిరీటము, కుండలములు, కౌస్తుభము ధరించిన  పీతాంబరధారియైన చతుర్భుజ శేషశాయి రూపము, మణిపూరకచక్రమునందలి విష్ణుగ్రంథి సంబంధితము.  మధ్యభాగమునందలి విష్ణుగ్రంధి విభేదనముద్వారా, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణములతో కూడిన సూక్ష్మశరీరాభిమానమును తొలగించి, భవభయమును హరించు భుజగశయనుడై, శాంతమూర్తియైన పద్మనాభుని వర్ణించునది రెండవధ్యానశ్లోకము.

 

ఈ శ్లోకమునందలి పద్మము, కమలము,  సూర్యమండల సంకేతము.  

 

ఛాయాయామ్ పారిజాతస్య....

మూడవదైన రుద్రగ్రంథి స్థానము, ఆజ్ఞాచక్రము. ఇది రుక్మిణీసత్యభామసమేత కృష్ణమూర్తి స్థానముగ చెప్పుకున్నాము. పారిజాతవృక్షముక్రింద బంగరుసింహాసమునలంకరించిన రుక్మిణీసత్యభామసహిత చంద్రవదన కృష్ణుని స్తుతించు మూడవశ్లోకము రుద్రగ్రంథిస్థాన దేవతామూర్తి.

 

మూడవశ్లోకమునందలిచంద్ర”, చంద్రమండల సంకేతము.

 

హరిః ఓం

నాల్గవదైన ప్రణవము బ్రహ్మరంధ్రస్థానమునందలి నిర్గుణ, నిరాకార సచ్చిదానందమయ పరమాత్మ సూచకము.

 

వైకుంఠపెరుమాళ్ దేవాలయము, కాంచీపురము:

ఒకదానినొకటి ఆవరించు స్థూల, సూక్ష్మ, కారణశరీర సంకేతముగ ఒకదానిలోపల ఒకటిగల్గిన మూడుప్రాకారములు, మూడుగ్రంథులసంకేతముగా మూడుఅంతస్థులుగల్గిన గర్భగృహములతో కూడిన కాంచీపురమునందలి దేవాలయము, వైకుంఠపెరుమాళ్ దేవాలయము. పల్లవ వాస్తుకళాత్మకమైన ఈ దేవాలయము అతిపురాతనమైనది. ఈ మూడుప్రాకారములకు మధ్యనున్న నాల్గవప్రాకారమునందలి నాల్గవ అంతస్థు గర్భగృహము నిర్గుణ, నిరాకార పరమాత్మకు సంకేతముగా రిక్తముగానున్నది.


Vaikunta Perumal Temple

Pallava Architecture by Alexander Rea, ASI, Superintendent

 

ఈ దేవాలయమునందలి మూడుగర్భగృహమూర్తులు విష్ణుసహస్రనామ స్తోత్రమునందలి ధ్యానశ్లోకములను అనుసరించి ఆసీన, శయన, ఆసీన భంగిమలోయుండుట విశేషము.

 

పద్మనాభసహోదరిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః