Thursday 16 July 2020

దశముద్రలు-దశావతారములు - మత్స్య, కూర్మావతారములు; Dasa mudras - Dasavatara - Matsya, Kurma avataras

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

పఞ్చయుగ్మవేషభృత్ పరాత్పరా సురార్చితా

పఞ్చవక్త్ర వక్త్రపద్మ చఞ్చరీక లోచనా

వఞ్చకాన్తరఙ్గశత్రు సఞ్చయ ప్రణాశినీ

ప్రేతమఞ్చశాయినీ కులం చిరాయ పాతుమే||

(ఉమాసహస్రము36.20)

దశవేషధారిణీ, పరాత్పరీ, సురార్చితా, పఞ్చవక్త్రుడైన శివుని వదనపద్మమునాశ్రయించు తుమ్మెదలవంటి దృష్టిగల ఓ తల్లీ, వంచకమైన అంతరంగశత్రువుల (కామక్రోధమోహాదులు) సంచయమును  నశింపజేయు, ప్రేతాసనస్థితా!! మా కులమును సదా రక్షించుము.

 

తల్లి చేతివేళ్ళగోళ్ళనుండి నారాయణుని దశాకృతులు ఆవిర్భవించినట్లు కరాంగుళినఖోత్పన్ననారాయణ దశాకృతిః నామమునందు చెప్పుకున్నాము కదా.  చేతివేళ్ళగోళ్ళ ప్రస్తావనయందలి విశేషములను ఇప్పుడు చూద్దాము.


ముదమ్ స్వరూపలాభాఖ్యమ్ దేహద్వారేణ చాత్మనామ్|

రాత్యర్పయతి యత్తేన ముద్రా శాస్త్రేషువర్ణితా||

(తంత్రలోకతంత్రము 25.3)

పిండాండ, బ్రహ్మాండసమన్వయముద్వారా దేహాంతర్గత  స్వస్వరూప ఆత్మజ్ఞానోదయముగావించి, మోదమును కలిగించునది ముద్రయని శాస్త్రములందు చెప్పబడినది.


ముద్రాచతుర్విధా కాయ-కర-వాక్-చిత్తభేదతః

(తంత్రలోకతంత్రము 32.9) 

అంగులీన్యాసభేదేన కరజా బహుమార్గగా;

సర్వావస్థాస్వేకరూపా వృత్తిముద్రా చ కాయికీ;

మంత్రతన్మయతా ముద్రా విలాపాఖ్యా ప్రకీర్తితా;

ధ్యేయతన్మయతా ముద్రా మానసీ పరికీర్తితా;

చేతివేళ్ళు, శరీరభంగిమలు (స్థూల), మంత్రములు (అక్షరాత్మకాః-సూక్ష్మ), చిత్తధ్యానము (పరా) ద్వారా ముద్రలను నాలుగువిధములుగ చూపించవచ్చు.

 

దశావతారములుదశముద్రలు

సంక్షోభిణ్యాది త్రిఖండాంతా దశముద్రాః తాభిః కరణభూతాభిః సమ్యక్ నిత్యాహృదయోక్త వాసనానుగుణ్యేనారాధ్యా

 (సౌభాగ్య భాస్కరము-977)

సర్వసంక్షోభిణి,  సర్వవిద్రావిణి,  సర్వాకర్షిణి, సర్వావేశకరి, సర్వోన్మాదిని, సర్వమహాఙ్కుశ, ఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండయను పదిముద్రలతో లలితామహాత్రిపురసుందరీతల్లి ఆరాధనను యోగినీ హృదయమునందు చెప్పబడినది.  వీనియందలి పదవ త్రిఖండముద్ర, కొన్ని గ్రంథములందు (ఉదాహరణకు యోగినీహృదయము) ప్రథమముగనూ, కొన్నిటియందు  (ఉదాహరణకు జ్ఞానార్ణవతంత్రము) ఆఖరిముద్రగనూ ఉల్లేఖించబడినది.

 

దశముద్రల ప్రయోగమువలన విశ్వలయక్రమమునందు బహురూపయైన తల్లినుండి ఆవిర్భవించు పదివిధములైన ఇంద్రియాతీతశక్తులు, అంతర్ముఖులైన సాధకులకు మోక్షసోపానములు. దశముద్రల ప్రయోగమువలన ఉత్తేజితమగు శక్తుల తత్త్వప్రాశస్త్యమును మాత్రమే యోగినీహృదయమునందు వివరించబడగా, ఈ ముద్రలను ప్రదర్శించు విధమును నిత్యాషోడశికార్ణవ/వామకేశ్వరీ తంత్రమునందు విపులముగా జెప్పబడినది.  అతిరహస్యమైన దశముద్రలను గురుముఖత తెలుసుకొని, అమ్మవారిముందు మాత్రమే ప్రయోగించవలెనని నిర్దేశింపబడినది.  పుస్తకములలో చూసి లేదా అంతర్జాలకమునుండి నేర్చుకొని సాధనజేయరాదు.

 

ఇకపోతే, ఈ పదిముద్రలను ఏదో ఒక వరుసలో ప్రదర్శించ/ప్రయోగించరాదు.

పూజాకాలే ప్రయోక్తవ్యా యథానుక్రమ యోగతః (జ్ఞానార్ణవతంత్రము – 3.28)

పూజాసమయమునందు ఈ ముద్రలు పైనజెప్పబడిన క్రమమునందు మాత్రమే ప్రయోగించవలెను.

 

మొదటి తొమ్మిది ముద్రలు, వరుసగా శ్రీచక్రమునందలి త్రైలోక్యమోహనాదిబైందవాంత నవావరణల సంబంధింతము.  ఇందువలన, ముద్రలను ఆరోహణ/సంహారక్రమముగ ప్రదర్శించబడునని గ్రహించవలసినది.  ముప్పురములసంబంధింత పదవ ముద్రయైన త్రిఖండ ముద్ర, శ్రీచక్రమంతటా వ్యాపించియున్న చైతన్యశక్తి, అమ్మ శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి సంకేతము.

 

చక్రార్చనభాగముగ చేతివేళ్ళతోచూపించు దశముద్రలకు, నారాయణుని దశావతారములకుగల సంబంధమును తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము. ఇచ్చట యోగినీహృదయమునందలి దశముద్రల తత్త్వాంశములను, యోగశాస్త్రము మరియు పురాణముల  సహాయముతో దశావతారములపరముగ అన్వయించటమైనది.  ఒక్కొక్క ముద్రద్వారా మూలాధారమునందు నిద్రిస్తున్న కుండలినీశక్తి ఉత్తేజితమొంది ఊర్ధ్వదిశగా ఒక్కొక్క చక్రమును దాటుకుంటూ సహస్రారమునందలి బిందువునుజేరుట యోగుల/సాధకుల అనుభవైకవేద్యము.

 

యోనిప్రాచుర్యతః సైషా సర్వసంక్షోభిణీ పునః

వామశక్తి ప్రధానేయమ్ ద్వారచక్రే స్థితా భవేత్ || 59||

 (యోగినీహృదయము)

సర్వసంక్షోభిణీముద్రద్వారా యోనిచక్రమునందు కేంద్రీకరింపబడిన వామశక్తి (ఇచ్ఛాశక్తి) వమన/సృష్టికారకము. యోగపరముగ, సుషుమ్నానాడికి ద్వారమువంటి మూలాధారమునందు (ద్వారచక్రస్థానమునందు) ఉత్తేజితమగు వామశక్తి, మొలకెత్తిన/రగులుకున్న శుద్ధజ్ఞానాగ్ని సూచకము (ప్రత్యభిజ్ఞహృదయము-18).

 

ఇచ్చట ఉద్దేశింపబడిన సృష్టి, కుండలినీశక్తి జాగృతికి సంకేతము.  ఇడ, పింగళనాడులద్వారా ప్రాణాపాన నియంత్రణతో కుండలినీశక్తిని జాగృతిజేయు పద్ధతిని ధ్యానబిందూపనిషత్తు (65-69)వంటి యోగ ఉపనిషత్తులందు వివరింపబడినది.

 

గంగాయమునయోర్మధ్యే మత్స్యౌ ద్వౌ చరతః సదా|

తౌ మత్స్యౌ భక్షయేద్ యస్తు స భవేన్మత్స్యసాధకః||

(ఆగమసారము)

గంగాయమునలమధ్య రెండు మత్స్యములు సదా చరిస్తూఉంటాయి. మత్స్య(ప్రాణాయామ) సాధకులు మత్స్యభక్షణ (ప్రాణనియంత్రణ) జేయుచుందురు.

 

యోగశాస్త్రములందు ఇడ, పింగళనాడులను గంగాయమునలతోనూ, వీనియందు జరుగు ఉచ్ఛ్వాసనిశ్వాసలను మత్స్యములతో సూచించుట ప్రసిద్ధము.  అందువలన యోగపరిభాషననుసరించి మత్స్యభక్షకులనిన ప్రాణశక్తి నియంత్రించినవారని అర్ధము. 

 

ఈ ముద్రద్వారా బ్రహ్మద్వారమైన మూలాధారమునందు ఉత్తేజితమగు శక్తి, మత్స్యసంబంధిత ప్రాణాయామసాధనతో పొందు కుండలినీశక్తి జాగృతికి సంకేతముగావున, దశావతరములందు మొదటిదైన మత్స్యావతారముతో సహసంబంధము గలిగినదీ ముద్ర.  మత్స్యము సృష్టి సూచకము. సృష్టికారకుడైన కామదేవుని/మన్మథుని మీనధ్వజుడని చెప్పుదురుగదా!

 

ద్రావిణీ ముద్ర (కూర్మావతారము)

క్షుబ్ధవిశ్వస్థితికరీ జ్యేష్ఠాప్రాచుర్యమాశ్రితా

స్థూలనాదకలారూపా సర్వానుగ్రహకారిణీ ||60|| (ibid)

సర్వాశాపరిపూరణాఖ్యే తు సైషా స్ఫురతవిగ్రహా

 

జ్యేష్ఠాశక్తి ఆవిర్భావముతో సర్వాశాపరిపూరకచక్రమును ఉత్తేజితముజేయునది, ద్రావిణీ ముద్ర. చిలకబడిన/కలతచెందిన/మథించబడిన విశ్వమును(సాధకుల) స్థితిపరచునది స్థితికారిణి/ జ్ఞానరూపిణియైన జ్యేష్ఠాశక్తి.  జ్యేష్ఠాశక్తి స్థూలనాదకలారూపిణి, సర్వానుగ్రహకారిణి. స్థూలనాదతత్త్వ విశేషమును తరువాత చూద్దాము.

 

కూర్మానాడ్యాం స్థైర్యమ్ కూర్మనాడి ద్వారా స్థిరత్వము కలుగును (పతంజలియోగసూత్రములు - 3.32, శాండిల్యోపనిషత్తు-1.69).  కూర్మనాడి మీద చిత్తసంయమనము జేయుటద్వారా సాధకులు మానసిక సమత్వస్థితిని తద్వారా శారీరక స్థిరత్వమును పొందగలుగుతారు.

 

అమృతము పొందుటకై దేవాసురులు విశ్వమను మంథర/మేరుపర్వతమును కవ్వముగజేసుకొని క్షీరసాగరమథనము జరిపినప్పుడు, పర్వతమును నిలబెట్టుటకు నారాయణుడు ఎత్తిన కూర్మావతార సంబంధితమైనది సర్వవిద్రావిణీ ముద్ర.

 

***

క్షీరసాగరమథన సమయమునందు ఆవిర్భవించిన కామధేనువు/సురభినుండి స్రవించిన క్షీరధారలతో రసాతలమునందేర్పడిన మడుగు క్షీరసముద్రము (మహాభారతము-ఉద్యోగపర్వము-102అ).  కామధేనువు క్షీరముతో ఏర్పడిన సముద్రము ఉంటేనేగదా మథనము!! కానీ మథనము చేస్తేనేగదా కామధేనువు లభిస్తుంది?? దీనియందలి అంతరార్ధమేమిటి?

 

సంకల్పము-కల్పవృక్షమునకు, కామధేనువు/సురభి-కుండలినీశక్తికి, సహస్రారకమలమునుండి స్రవించు అమృతము-క్షీరమునకు సంకేతములు.  మూలాధారము/కులకుండమునందలి కుండలినిశక్తి సంబంధిత అగ్నియే వత్సము.  కుండాగ్నియగు వత్సముయొక్క ప్రథమ నిపానముచేత ఏర్పడినది పాలమడుగు/క్షీరసాగరము. సహజసిద్ధమైన ఆసురీగుణములనధిగమించి, సత్సంకల్పయుక్త యజ్ఞకర్మాచరణజేయుట, ఈ విధముగ ఏర్పడిన పాలసముద్రమును మథించుటకు సంకేతము (ఉమాసహస్రము 18వ స్తబకము). భగవద్గీతననుసరించి యజ్ఞములద్వారాపొందు అభీష్టసిద్ధి కామధేనువు సంకేతముగావున(భగవద్గీత 3.10), క్షీరసాగరము సురభి చక్రము, భగవద్గీతయందు చెప్పబడిన ప్రకృతిచక్రము యజ్ఞము కర్మ (ibid 3.14)నకు అనుకృతి (replica).

***

 

మోక్షామృతమును పొందుటకు సాధకులు యుక్తాయుక్తవివేచనముతో జేయు యజ్ఞ, దాన, కర్మానుష్ఠాన సత్కర్మాచరణ, సముద్రమథనమునకు సంకేతము.  మంచి, చెడుమధ్య నిత్యము జరుగు మథనమునందు వివేకము/జ్ఞానసంకేతమైన జ్యేష్ఠాశక్తి వలన సమత్వస్థితి కలుగును.  సాధనాక్రమమున సహజముగ ఉదయించు మదము/అహంకార/ఆణవములను నియంత్రించనివారిని దండించు శక్తి, జ్యేష్ఠాశక్తి.


జ్యేష్ఠాదేవి

సముద్రమథన సమయమున మొట్టమొదట బహిర్గతమైనశక్తి, జ్యేష్ఠాశక్తి. ఈశక్తి ఆవిర్భవించిన తరువాతనే ఐశ్వర్య(మోక్ష)ప్రదాయినియైన శ్రీలక్ష్మీదేవి ఆవిర్భవించినది. స్పర్ధలు, అశౌచము, అమంగళ స్థలములందు నెలకొనియుండు అలక్ష్మియనబడు ఈ దేవతాశక్తి, వేదవిహితకర్మలు జరుగు స్థలములకు బహుదూరముగనుండును.  కానీ జ్యేష్ఠాదేవిని పూజించినవారి దరిదాపులకుకూడా ఆ తల్లి రాదు. శివ, శక్తులను పూజించనివారు, మూఢులు, మదాంధులైనవారు, నా భక్తులైననూ, వారి సత్కర్మలు, సంపదలు అలక్ష్మీదేవికి సమర్పించబడునని విష్ణువు ఉవాచ. (లింగపురాణము ఉత్తరభాగము 6వ అధ్యాయము).

 

క్షుద్పిపాసామలామ్ జ్యేష్ఠామ్ అలక్ష్మీమ్ నాశయామ్యహమ్ (శ్రీసూక్తము)

 

సిద్ధాంతసారావలియందు జ్యేష్ఠాశక్తిని జలరూపిణిగ (ద్రావిణి) చెప్పబడినది. భవజలధియందు మునిగితేలు వివేకహీనులు సాధనా సమయములో జాగురూకత వహించకున్నచో, సాధన మందగించును.  ఇది జలరూపిణియైన జ్యేష్ఠాశక్తి వలన యోగాగ్ని మాంద్యమగుటకు సూచకము.  వేదవిహితకర్మలనుండి అలక్ష్మి/జ్యేష్ఠాదేవి దూరముగనుండునని చెప్పుటయందలి అంతరార్థమిదియే.

 

నిద్రా విస్మృతి మోహాలస్య

ప్రవిభేదైస్సా భవమగ్నేషు

ఏషైవస్యా ద్యుఞ్జానేషు

ధ్వస్త వికల్పః కోపి సమాధిః ||

(ఉమాసహస్రము 38.14)

అయితే ప్రార్ధించిన భక్తులందలి ప్రతికూలభావములను నశింపజేయు తల్లి, ఈ జ్యేష్ఠాదేవి. తద్వారా మోక్షపథమున ఉన్నతస్థాయిని చేరుకొనుటకు కావలసిన సర్వమును అనుగ్రహించు శక్తియగుటచే, ఈ తల్లిని ఆరోహణశక్తి, అనుగ్రహశక్తిగను చెప్పబడుచున్నది.  పూర్వకాలములో జ్యేష్ఠాదేవి ఆరాధన ప్రసిద్ధముగనుండెడిది. దక్షిణమున కాంచీపురమునందలి బ్రహ్మపురీశ్వరునిదేవాలయమునందు, ఉత్తరమున శ్రీనగరమునందలి జ్యేష్ఠాదేవి ఆలయమునందు ఇప్పటికినీ ఈ అమ్మవారి ఆరాధన జరుగుతున్నది. 


హాలాహలము

సముద్రమథనము జరిగినప్పుడు వాసుకిసర్పము కక్కిన హాలాహలమును గురించిన ఒక సంకేతార్ధము. యక్ష, రాక్షసగణములను సృష్టించిన పిదప బ్రహ్మదేవునియందు ఏర్పడిన క్రోధమను విషముతో సృజించబడినవి సర్పములు/నాగములు. అందువలన సర్పములు/నాగములు విషపూరితమైనవి (లింగపురాణము ప్రథమభాగము 70.230-33). ఇక్కారణముచే వాసుకిసర్పమునుండి వెలువడిన హాలాహలము, సాధకులందు ఏర్పడు  క్రోధసూచకము. శక్తిరూపిణియైనతల్లి, ఈ హాలాహలమును శంకరుని విశుద్ధిచక్రస్థానమైన కంఠమునందు నిలుపుట, సాధకులు నిగ్రహశక్తితో, ఆగ్రహమును వైఖరీస్థానమైన కంఠమునందు నిలిపి, వాగ్రూపముగ బయటకు రాకుండా నియంత్రించుటకు సంకేతము.


జ్ఞానశక్తిరూపిణియైన మీనాక్షీదేవి అనుగ్రహమును ప్రార్ధిస్తూ,

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment