Tuesday 7 May 2019

Maha-padmatavi-samstha to Kamadayini మహాపద్మాటవీసంస్థా-కామదాయిని


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
బ్రహ్మాండానామనేకానాం బహిరూర్ధ్వే సుధాంబుధౌ।।
మణిద్వీపే నీపవనే చింతామణిసుమందిరే।
పంచబ్రహ్మమయే మంచే రూపం త్రైపురసుందరమ్।।
అనాదిమిథునం యత్తదపరాఖ్యమృషీశ్వరాః।
తథా సదాశివేశానౌ విధివిష్ణుత్రిలోచనాః।। 
(త్రిపురారహస్యము – జ్ఞానఖండము – 20అ -36-38)
సనకసనందాది ఋషులు, త్రిమూర్తులకు తల్లిచే చెప్పబడిన విద్యాగీతనందు (జ్ఞానఖండము-త్రిపురారహస్యము) అనేకబ్రహ్మాండలములకు ఆవల పైనగల సుధాసముద్రమునందలి మణిద్వీపాంతర్గత నీపవనముమధ్యనున్న చింతామణిమందిరమునందు శోభిల్లు పంచబ్రహ్మాసనమునలంకరించియున్న ఆదిదంపతుల ఇంద్రియాతీత సర్వోత్కృష్ట అవిభక్త మహాత్రిపురసుందరీరూపము, నా రూపము యని అమ్మస్వయముగా చెప్పినది.

ఇక్కడ వర్ణనక్రమము చూస్తే సుధాసముద్రమునందలి మహాపద్మాటవి, దివ్యకదంబవృక్షములతోకూడిన మణిద్వీపమునందలి చింతామణిగృహము, ఆసనము. కానీ వాగ్దేవతలు సుమేరు పర్వతము, శ్రీమన్నగరము, చింతామణిగృహము, పంచబ్రహ్మాసనస్థితను వర్ణించి, ఇప్పుడు తదుపరి ఐదునామములందు(మహాపద్మాటవీసంస్థా, కదంబవనవాసినీ, సుధాసాగరమధ్యస్థా, కామాక్షీ, కామదాయినీ) చింతామణిగృహము వెలుపలనున్న మహాపద్మాటవిని, కదంబవనమును, దానికి ఆవలననున్నసుధాసాగరమును వర్ణించుచున్నారు.

పంచబ్రహ్మాసనస్థితయైన ఏకరూపకామేశ్వరీకామేశ్వరుల దివ్యదంపతులను వర్ణించిన వాగ్దేవతలు మహాపద్మాటవిని, కదంబవనమును ఇప్పుడు వర్ణించుటయందలి అంతరార్ధమును జూడగా - ఇచ్చటినుండి ఐదునామములు దివినుండి భువికి దిగివచ్చి, భూమండలమునందు కోరికలను తీర్చు కామాక్షీదేవిగ అవతరించిన తల్లిని వర్ణిస్తున్నట్లున్నది. అందుచే మహాపద్మాటవీసంస్థా-సుధాసాగరమధ్యస్థా నామములవరుస, పంచబ్రహ్మాసనస్థితయైన పరంబ్రహ్మస్వరూపిణి మేరుపర్వత దక్షిణభాగమునగల భూమండలమునందు కామాక్షి పరదేవతగా ఆవిర్భావావరోహణ క్రమపరముగ అన్వయించవలసియున్నది.

మహాపద్మాటవీసంస్థాయైనమః
మహాపద్మాటవిసంస్థయైన తల్లికి నమస్కారము.

సృష్టియందలి అనేకకోటిబ్రహ్మాండలముల మధ్యఆసీనురాలైన తల్లిని ఈనామమునందు వాగ్దేవతలు వర్ణిస్తున్నారు. సుమేరుశృంగమధ్యస్థా నామమునందు దివ్యలోక-భూమండల సంఘటితమును పద్మముగ చెప్పుకున్నాము. అయితే అటువంటి పద్మములు కోటానుకోట్లుండుటచే, అది పద్మముల అడవియని చెప్పబడుచున్నది.


అడవికి గల ఎన్నో పర్యాయపదములలో (అటవ్యరణ్యమ్ విపినం గహనమ్ కాననమ్ వనమ్-అమరకోశము) వాగ్దేవతలు అటవియని ఇచ్చట వాడుటయందలి అంతరార్ధమును తెలుసుకొనడానికి ప్రయత్నిద్దాము.

అటంత్యస్యాం మృగయార్ధమిత్యటవీ 
–మృగములకొరకు (అటన)సంచరించబడునదగుటచే అటవి

అయితే బ్రహ్మాండమునందు వేటాడబడవలసిన మృగములు - ఋగ్వేదమునందు (ఇంద్ర తుభ్యమిదద్రివోనుత్తమ్ వజ్రిన్వీర్యమ్ యద్ధ త్యమ్ మాయినం మృగమ్ తము త్వమ్ మాయయా అవధీః అర్చన్ననుస్వరాజ్యమ్-1.80.7) చెప్పబడిన మాయాసంబంధిత మృగములు.  పరమాత్మసంకల్పమాత్రముచే మాయాశక్తితో ఏర్పడిన సృష్టియందలి జీవులు అరిషట్వర్గములను మాయామృగములను చేధించుటకు ప్రయత్నించుచూ సంచరించుటచే ఇది అటవి అని చెప్పబడినది.

మహాపద్మముల అడవియందు వసించు తల్లికి నమస్కారము.

కదంబవనవాసిన్యై నమః
కదంబవనము మధ్యన విలసిల్లుతున్న తల్లికి నమస్కారము.

వన్యతే సేవ్యత ఇతి వనం – జనులచే ఆశ్రయింపబడునది;

ఆర్యభట్టులు ఆర్యభటీయమను గ్రంథమునందు కదంబకుసుమములు భూసంకేతముగ చెప్పినారు.

యద్వత్ కదంబపుష్పగ్రంథిః ప్రచితః సమన్తతః కుసుమైః।
తద్విద్ధి సర్వసత్వైర్జలజైః స్థలజైశ్చ భూగోళః।।
(గోళఖండము-7)
గోళాకార కదంబకుసుమము అన్నివైపులా పుష్పించువిధముగా, భూగోళము ఉపరితలమంతయునూ భూమ్యాధారిత పార్థివములతోను, జలాధారిత జలచరములతోనిండియున్నది.

ఈ విధముగా ముందునామమునందు చెప్పుకున్న అనేకకోటి బ్రహ్మాండములందలి భూమండలములను కలిపి వాగ్దేవతలు కదంబవనముగ చెప్పినట్లున్నది. భూసంకేత కదంబవన స్థానమును తెలుపునామమిది. కదంబవనమునందు వసించు తల్లికి నమస్కారము.

సుధాసాగరమధ్యస్థాయై నమః
సుధాసముద్రమునందలి తల్లికి నమస్కారము.

మేరుపర్వతశిఖరాగ్రముననున్న సుధాసముద్రము ఏకరూప శివశక్తుల చింతామణిగృహమునుగలిగిన మణిద్వీపమును చుట్టియున్నది.

కానీ వాగ్దేవతలు ఇక్కడ వర్ణించిన సుధాసముద్రము అవరోహణక్రమమునందు చెప్పబడుటచే, ఇది భూసంబంధితముగ తెలియబడుచున్నది.

సాధారణముగ వాడుకలో సముద్రమనిన జలసముద్రము. కానీ భూ, స్వర్లోకములను కలుపు అంతరిక్షమనబడు భువర్లోకమును, సాగరః సముద్రః ఇతి అంతరిక్షనామాసుయను (ఋగ్వేదసంహిత-శాయణాచార్య భాష్యము 1.30.18) యాస్కాచార్య నిరుక్తముననుసరించి, ఋగ్వేదమునందు పలుసందర్భములలో (వాయు)సముద్రమని చెప్పబడినది.

సర్వత్రా ప్రకాశమును కలిగించు సవిత్రుడు మధ్యమస్థానాధిదేవత. పతన ప్రతిబంధక ఆలంబనము స్కంభము అనగా జారిపోకుండగ కట్టివేయు సాధనము స్కంభము. ఏ స్కంభ సహాయములేకుండగనే భూమిని అంతరిక్షమునుండి క్రిందికి జారిపడకుండగ, సూర్యకిరణములను శుల్బములతో (తాళ్ళతో) నియంత్రించుటద్వారా, సవిత్రుడు భూమిని స్వర్లోకముతో బంధించుచున్నాడు. (ఋగ్వేదము 10.149.1)

ఛాందోగ్యోపనిషత్తు మూడవఖండమునందు ఈ సూర్యకిరణముల నిర్వాహకమును మరింత వివరించబడినది.

తేనెటీగలు పుష్పములనుండి గ్రహించిన మకరందమును తేనెగా మార్చి తేనెగూటిలో పెట్టినట్లు, వేదవిహిత యజ్ఞయాగాదులకొరకు సమర్పించిన హవ్యకవ్యములను గ్రహించి సోమరస/అమృతమయ యజ్ఞఫలములుగ మార్చి అంతరిక్షమునందలి సూర్యకిరణములందు జేర్చునవి వేదమంత్రములు. యజ్ఞకర్మల ఫలము అమరత్వమగుటచే ఈ సోమరసము సుధ/అమృతమని చెప్పబడుచున్నది. 

అసౌ వా ఆదిత్యో దేవమధు - తస్య ద్యౌరేవ తిరశ్చీనవంశః - అంతరిక్షమ్ అపూపః - మరీచయః పుత్రాః (ఛాందోగ్యోపనిషత్తు 3.1.1)
ఆ ఆదిత్యుడే దేవతలకు మధువు. స్వర్లోకము అడ్డదూలము, మధ్యలోకము తేనెతుట్టె మరియు కిరణములు మధుమక్షిక అండములు.
వేదములు అంతరిక్షమునందలి సూర్యకిరణముల ద్వారా జనించుచున్న ఇంద్రియాతీత, అశ్రుత సూక్ష్మశబ్దతరంగములు.  వేదములను అనంతములు, అనాది, అపౌరుషేయములని చెప్పుటయందలి రహస్యమిదియే. భారతీయ ఋషులు ఉపాసనాబలముచే అంతరిక్షమునందలి వేదశబ్దతరంగములను గ్రహించి/దర్శించి, అమూల్య వేదమంత్రములను మనకు అందించినారు.

తస్య యే ప్రాంచో రశ్మయస్తా ఏవాస్య ప్రాచ్యో మధునాడ్యః| ఋచ ఏవ మధుకృత ఋగ్వేద ఏవ పుష్పం తా అమృతా ఆపస్తా వా ఏతా ఋచః (ibid 3.1.2)

తేనెతుట్టెవంటి అంతరిక్షమునందు అరలవంటివి సూర్యకిరణములు. ఈ అరలయందలి వేదమంత్రములనబడు తేనెటీగలు, అగ్నియందాహుతిజేయబడిన హవిస్సులనబడు పుష్పములనుండి మకరందమును గ్రహించి, సూర్యకిరణములందు అమృతమనబడు తేనెగా మార్చుచున్నవి.  పంచపూజలందు ఆకాశతత్త్వమునకు పుష్పము పరికల్పయామినమః యనిజెప్పబడు పుష్పమిదియే.
భగవద్గీత 3వ అధ్యాయము 14వశ్లోకము అనాద్భవంతి భూతాని నందు “విహితకర్మాచరణ జేసినప్పుడు మాత్రమే యజ్ఞముజేయుటకు సంభవమగును.  తత్ఫలముగ ప్రీతినొందిన దేవతలు, సూర్యకిరణములను జేరిన హవిస్సుద్వారా వర్షము కురిపించి ధాన్యోత్పత్తిని కలిగిస్తారు.  ధాన్యమును సంగ్రహించుటచే ఏర్పడిన వీర్యము జీవసృష్టి బీజము” యని యజ్ఞాచరణ ముఖ్యత్వమును సృష్టిచక్రవివరణద్వారా శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించినాడు.

వారివారి వంశపరంపర ప్రకారము, యజ్ఞము ఐదు విధములుగ చెప్పబడినవి -  (వేద పఠనము) బ్రహ్మ యజ్ఞము, (హోమము) దేవయజ్ఞము, (అతిథుల సేవ) మనుష్య యజ్ఞము, (పితృతర్పణము) పితృయజ్ఞము, (పశుపక్ష్యాదుల పరిరక్షణ) భూతయజ్ఞము.

మానవజాతికి ముక్తిసాధనము యజ్ఞాచరణ. యజ్ఞాచరణకు నిబంధన సూత్రములవంటివి వేదములు. ఋగ్వేదమునందు చెప్పబడిన వాయుసముద్రమనబడు అంతరిక్షమునందు సర్వత్రావ్యాపించు సూర్యకిరణములు, అశ్రుత వేదశబ్దములకు నిలయములై మానవజాతికి సుధాధారలను వర్షించునవిగనున్నవి. ఈ విధముగ భూ-స్వర్లోకముల నడుమనున్న అంతరిక్ష సుధాసాగరము మధ్యనగల తల్లిని వర్ణించు నామమిది.
***
ఋగ్వేదము 9.33.6, 10.47.2 మంత్రములందు అంతరిక్షమునందలి నాలుగు సముద్రములు చర్చించబడినవి.  ఈ చతుస్సాగరములను తెలుసుకొనుటకు మరల ఛాందోగ్యోపనిషత్తును ఆశ్రయించవలెను.  తూర్పు, దక్షిణ, పశ్చిమ మరియు ఉత్తర దిక్కునగల సూర్యకిరణములను వరుసగా ఋగ్యజుస్సామథర్వణవేద సూచకములుగ చెప్పబడినవి (3.1-4). ఆసమంతాత్ కాశవంతమగు భువర్లోకము సముద్రముగ చెప్పబడుటచే, ఈ నాలుగుదిక్కులందలి సూర్యకిరణములందలి వైదీకశబ్దతరంగములాధారముగ, భూ పరివేష్టిత ఆకాశమును నాలుగు సముద్రములుగజెప్పినారు మన ఋషులు.

గోత్ర, సూత్ర, శాఖ, వేదము, ఋషులను తెలుపు చతుస్సాగరపర్యంతంగోబ్రాహ్మణేభ్యో.. ప్రవరయందు గోయనిన సూర్యకిరణములని అర్ధము. నాలుగు సాగరములు అంతరిక్షమునందలి సూర్యకిరణసూచిత నాలుగువేదములకు సంకేతము.
***

కామాక్ష్యై నమః
దేవి కామాక్షికి నమస్కారము.

భండాసుర వధాయైషా ప్రాధుర్భూతా చిదగ్నితః
మహాత్రిపురసుందర్యా మూర్తిస్తేజోవిజృంభితా
కామాక్షీతి విధాత్రా తు ప్రస్తుతా లలితేశ్వరీ 
 (బ్రహ్మాండపురాణము-ఉత్తరభాగము-38.81,82)
13వ అధ్యాయమునందలి లలితాస్తవరాజమునందు దేవతలు మరియు 38వ అధ్యాయమునందు బ్రహ్మదేవుడు, భండాసురవధనిమిత్యార్ధము చిదగ్నికుండమునుండి ఆవిర్భవించిన లలితామహాత్రిపురసుందరీ తేజోరూపమును కామాక్షియని స్తుతించినట్లు బ్రహ్మాండపురాణమునందు చెప్పబడినది.

తల్లి ఒక లీలావిలాసముగ పరమశివుని వెనుకనుంచి నేత్రములను మూయుటచే కలిగిన అకాలప్రళయ దోషనివృత్త్యాయార్ధము కైలాసమునుండి వచ్చి భూలోకమునందలి కాంచీపురమునందు కామాక్షిగా అవతరించి, పంచాగ్నులనడుమ తపస్సునొనరించి పరమశివుని పొందినట్లు శివపురాణమునందలి మరియొక కథనము.

పురాణ కథనము ఏదైనాగానీ, తల్లి లలితామహాత్రిపురసుందరి భూలోకమునందు కామాక్షీదేవిగా కాంచీపురమునందు అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది.

ప్రాణులశరీరములందలి భూతత్త్వ మూలాధారము చిదగ్నికుండ సూచకముకాగా, చిదగ్నికుండసంభూతయైన కామాక్షీదేవి మూలాధారమునందలి కుండలినీశక్తి సూచితము.
***
దేవాలయములందు, గృహములలోను వెలిగించు సంప్రదాయపు నిలువుపాటి దీపములను గమనించిన, మేరుదండ సూచిత స్థంభభాగమునందు దీపస్థానముతో కలిపి ఆరుచక్రములు, ఊర్ధ్వభాగమునందు, శంఖ-చక్రములు, హంసలు లేదా నిర్గుణ, నిరాకార పరమాత్మ సూచకముగ ప్రభను చూడవచ్చు. ఈ దీపము మనశరీరమునందలి షట్చక్రములకునూ, ఊర్ధ్వభాగము సహస్రారచక్రమునకు చిహ్నములు. జ్ఞాననేత్రస్థానమైన ఆజ్ఞాచక్రస్థానమునందు మనము జ్ఞానసంకేతముగా దీపము వెలిగిస్తాము.

తమిళనాడుప్రాంతములలో మరియొక విధమైన దీపమును వెలిగించుట ఆచారములో గలదు. సాధారణముగా గజలక్ష్మి, అష్టలక్ష్మి లేదా లక్ష్మి-గణపతి-సరస్వతి వంటి దేవతామూర్తులను కలిగిన ఈ దీపమును జూచిన ఆధారస్థానమునందు జ్యోతిని వెలిగించబడును. కానీ ఈ దీపమునకు పేరు కామాక్షీవెళక్కు. తమిళములో వెళక్కనిన దీపము. మూలాధారస్థానమునందు జ్యోతిని వెలిగించబడుటచే, ఆ చక్రస్థానమునందలి కుండలినీ చిదగ్నిసూచకముగ, ఈ దీపమునకు కామాక్షి దీపమని పేరువచ్చియుండవచ్చు.
***
అయితే శివశక్తులు వాగర్ధములవలే అవినాభావములని పలుసార్లు చెప్పుకున్నాముకదా. మరి పంచబ్రహ్మాసనము మీద శివునితో ఐక్యమై విరాజిల్లు శక్తి, భూమికి/మూలాధారమునకు వచ్చినదనిన, వీరిరువురు విడిపోయినట్లు అర్ధమా?? దీనికి వివరణ తదుపరి నామమునందు తెలుసుకుందాము.

కామదాయిన్యై నమః
కామ - కోరిక
దాయిని - ఇచ్చునది
కోరికలను ఇచ్చు/కలిగించు తల్లికి నమస్కారము.
కామదాయిని అంటే కామమును జనింపజేయునది. కోరిక/సంకల్పము కలిగించునది అహంకారము. తల్లి అహంకారరూపిణియని చెప్పునామమిది.

ఆదిశంకరులు సౌన్దర్యలహరి 7వశ్లోకము క్వణత్కాంచీదామా నందు (త్రి)పురమథనుని పురుషాహంకార రూపిణియైన తల్లీ!! శరత్పున్నమి చంద్రుని పోలిన వదనముతోనూ, అతిసన్నని నడుముమీద మోగుతున్నమువ్వలతో కూడిన కటిబంధముతోను, కరికలభములవంటి వక్షస్థలముతోను, పాశాంకుశధనుర్బాణములు ధరించి మాకు దర్శనమివ్వవలసినది అని ప్రార్ధించారు.

అహంను గురించి మరింత తెలుసుకుందాము.

కశ్మీర శైవమత త్రికసిద్ధాంతము ప్రకారము, అహంనందలి సృష్ట్యాద్యక్షరమైన అకారము పరమశివసూచితము, సృష్ట్యాంత హకారము (కుండలినీ)శక్తి సూచితము.  దర్పణమువంటి విమర్శాంశమునందలి పరమశివుని ప్రతిబింబము, అనుస్వరము మ్ చే సూచించబడుచున్నది. సంస్కృతమునందు అక్షరముమీద పెట్టబడు బిందువు(మ్) శివశక్తైక్యతను తెలియజేయునది. శివశక్తులు సదాసర్వదా కలిసియుంటారు. అ నుండి హ వరకుగల అక్షరమాల అహంకారపూరిత నామరూపాత్మక సృష్టి సూచకము. (అహం) హమ్ నుండి అకారాక్షరమాల మహా-ఆత్మ(పరమాత్మ)యందు విలీనమగు లయసూచకము. అహమ్-ను వ్యతిరేకదిశలో చదివితే మహా(అభినవగుప్తుల పరత్రీశికా వివరణము).

త్రికయందలి ముఖ్యమైన మూడుతత్త్వములను వరుసగా శివ-శక్తి-పురుష/నర, శివ/శక్తి(ఏకత్వము)-విద్యా(ఏకత్వ-భిన్నత్వములు)-ఆత్మ(భిన్నత్వము), పర-పరాపర-అపరములుగా చెప్పబడుచున్నవి.  

పరమాత్మ అంతర్లీనశక్తి సృష్టినిమిత్యార్ధము వ్యాకోచముచెందుటచే వ్యక్తీకృతమైన అవ్యక్త అఖండచైతన్యము, కుండలినీశక్తిరూప కామాక్షీదేవి. ఈ తల్లియే జీవులందలి నేను/నాది యని చెప్పబడుచున్న అహంకార స్వరూపిణి.

ఇప్పుడు లలితాసహస్రనామస్తోత్ర ధ్యానశ్లోకమునొకసారి పరిశీలిస్తే ఈ అహంకారరూపిణి నామము తెలియవస్తుంది. ధనుర్బాణపాశాంకుశములను ధరించి కరుణాతరంగితాక్షియై, అణిమాదికిరణములతో ఆవరింపబడిన అరుణకాంతుల తల్లియే అహమితియేవభవానీ అహమని చెప్పబడుచున్న భవాని.

భవస్య పత్నీ భవాని - భవతి భవతేవా సర్వమితి భవః
సర్వత్రా అస్తిత్వము గలవాడు భవుడు, భవుని పత్ని భవాని.

పంచబ్రహ్మాసనస్థితయైన లలితామహాత్రిపురసుందరియే అహంకారమయ నామరూప సృష్టిగ వ్యక్తీకరింపబడిన భవానీ మాత.

ఒక అండమును వర్ణమయ సీతాకోకచిలుకగా మార్చినట్లు, గడ్డగట్టిన అనాత్మాహంకారమును కామేశ్వరీకామేశ్వర దివ్యదంపతుల సన్నిధికిజేర్చి, తల్లి అతిశీఘ్రముగ సర్వవర్ణశోభిత పరంబ్రహ్మస్వరూపిణియందైక్యము జేయవలసినదిగా ప్రార్ధిస్తూ 
శ్రీమాత్రేనమః