Wednesday 13 February 2019

Siva & Svaadhina-vallabha శివా & స్వాధీనవల్లభా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
ఆగమప్రణవపీఠికామమలవర్ణమంగలశరీరిణీమ్
ఆగమావయవశోభినీమఖిలవేదసారకృతశేఖరీమ్।
మూలమంత్రముఖమండలామ్ ముదితనాదబిందు నవయవ్వనామ్
మాతృకామ్ త్రిపురసుందరీమ్ మనసి భావయామి పరదేవతామ్।।
(నవరత్నమాలికాస్తోత్రము-8)

తదుపరి శివా, స్వాధీన-వల్లభా యను రెండునామములను అర్ధము చేసుకొనుటకు ప్రయత్నిద్దాము.
శివా
శివస్యపత్నీతివా శివా - శివుని పట్టపురాణి
దోషశమనచ్ఛివా – దోషశమనమువలన శుభస్వరూపమైనది.
మోక్షే భద్రే సుఖే శివం
– శివాయై నమః
శుభస్వరూపమై, మంగళదాయకియై, మోక్షకారియైన శివపత్ని, శివాకు నమస్కారము.

స్వాధీనవల్లభా
వల్లతీతి వల్లభః (అమరకోశము) విభుని తన అధీనములో కలిగినది
– స్వాధీనవల్లభాయై నమః
వల్లభుడైన శంభుని తన అధీనమునందు గలిగిన తల్లికి నమస్కారము.

అంతరార్ధము
వాగ్దేవతలు శివకామేశ్వరాంకస్థా నామమునందు చెప్పబడిన అక్షరబ్రహ్మనుండి వెలువడిన మాతృకావర్ణములను ఈ రెండు నామములందు గుప్తముగ సూచించుచున్నట్లున్నది. మాతృకావర్ణములు, స్వరవర్ణములు, వ్యంజనవర్ణములని రెండువిధములు. అ, ఆ మొదలగువాటికి స్వరవర్ణములని పేరు. క్, ఖ్ మొదలగునవి వ్యంజనవర్ణములు.

పతంజలి అష్టాధ్యాయి గ్రంధమునకు పాణిని రచించిన మహాభాష్యమునందు స్వరితములు, వ్యంజన తత్త్వములను ఈక్రింది విధముగ సూచించినారు.
స్వయమ్ రాజన్తే స్వరాః। అన్వగ్ భవతి వ్యంజనమితి। 
(మహాభాష్యము-I.2.29)
స్వరవర్ణములు స్వయంప్రకాశకములు. అనగా అ నుంచి అః వరకుగల స్వరితములు స్వతంత్రములు.  కానీ, క్, ఖ్ మొదలగువాని ఉచ్ఛారణ స్వరితములననుసరించి చేయబడును. ఉదాహరణకు క్+అ = క, క్+ఇ = కి మొదలుగునవి.  

స్కందపురాణాంతర్గత సూతసంహితయందు, స్వరితములు శక్తిస్వరూపములుగను, వ్యంజనములు శివస్వరూపములుగను చెప్పబడినవి.
­యథా పరతరః శంభుర్ద్విధా శక్తిశివాత్మనా।
తథైవ మాతృకా దేవీ ద్విధా భూతా భవేత్స్వయమ్॥
ఏకాకారేణ శక్తేస్తు వాచకశ్చేతరేణ తు।
శివస్యవాచకః సాక్షాద్విద్యేయం పదగామినీ॥
 (సూతసంహిత-యజ్ఞఖండము-4.21,22)
స్వతంత్రములై, స్వయంప్రకాశకములైన స్వరాక్షర రూపిణియైన తల్లిని శివా నామమునందునూ, శివస్వరూపములైన వ్యంజనములచే అనుసరింపబడు స్వరితరూపిణిని స్వాధీనవల్లభానామమునందును వాగ్దేవతలు సూచించినట్లున్నది.

స్వరితముల ఉచ్ఛారణ వ్యంజనముల సహాయములేకుండగనే చేసిననూ, అఆఈఎ వంటి పదములు అర్ధరహితములు. స్వరితములు మరియు వ్యంజనములు కలిసినప్పుడే అర్ధముతోకూడిన పదములు ఏర్పడుతాయి.ఈ విధముగ ఆధార-ఆధేయములైన శివశక్తుల అవినాభావమును తెలియజేయు మరియొక జంటనామములివి.

లలితాత్రిశతియందు తల్లిని కకారిణి, లకారిణి, హకారిణి, సకారిణిగా వర్ణించు నామములుగలవు. మరి ఇవన్నీ వ్యంజనములుకదా. వ్యంజనములన్నియు శివాత్మకములు, స్వరితాధారములని చెప్పుకున్నాముకదా. మరి త్రిశతి నామములందు వ్యంజనములు శక్తిరూపములుగ వర్ణించుటయందలి అంతరార్ధమును తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.

మరియొక సందర్భమునందు స్వరితములు శివాత్మకములుగనూ, వ్యంజనములు శక్త్యాత్మకములుగను చెప్పబడినవి.
ఏవమ్ షోడశకమ్ పరమర్శానామ్ బీజస్వరూపముచ్యతే 
తదుత్థమ్ వ్యంజనాత్మకమ్ యోనిస్వరూపమ్। (అ3-7,8)
తంత్రసారగ్రంథమునందలి శాంభవోపాయమునందు అభినవగుప్తులు, స్వరవ్యంజనముల ఉత్పత్తిని వివరిస్తూ, అకారాదివిసర్గాంత షోడశస్వరితములు బీజస్వరూపములుగనూ, వీనినుంచి బహిర్గతమైన వ్యంజనములు యోనిస్వరూపములుగను వర్ణించినారు. ఇచ్చట యోనియనిన కారణము. బీజరూప స్వరితములనుండి బహిర్గతమైన యోనిరూప వ్యంజనములు, విశ్వసృష్టికి కారణము.

బీజము శివతత్త్వము, యోని శక్తితత్త్వము. ఈ కారణముచే స్వరితములను ప్రాణాక్షరములుగను, వ్యంజనములను ప్రాణి అక్షరములుగను చెప్పబడుచున్నవి. శివశక్తి స్వరూపములైన స్వరితములు, వ్యంజనములు కూడా ప్రాణము, ప్రాణులవలే అవినాభావ సంబంధముగలవి. దేశమునందు వాడుకలోనున్న చాలాభాషలందు స్వరవ్యంజనములని చెప్పబడుచున్న మాతృకావర్ణములు, తెలుగుభాషయందు పాణిని అచ్, హల్ ప్రత్యాహారములననుసరించి అచ్చులు, హల్లులని జెప్పబడుచున్నవి. కానీ తమిళభాషయందు మాత్రము వీటిని ఉయిరెళుత్తు, మెయ్యెళుత్తు/ఉడలెళుత్తు-యని చెప్పుచుందురు. ఉయిర్ యనిన ప్రాణము, ఉడల్ యనిన శరీరము, ఎళుత్తనిన అక్షరము.

సూతసంహిత, తంత్రసార గ్రంథముల సంస్కృతాక్షరముల సృష్టివివరణజూచిన సందర్భానుసారముగ అమ్మ-అయ్యల శేష-శేషీత్యము, ఆధార-ఆధేయత్వము మారుతుంది.

ఈ సూక్ష్మమునే శంకరభగవత్పాదులు సౌన్దర్యలహరి శరీరం త్వం శంభోః శశిమిహిర వక్షోరుహయుగమ్ శ్లోకమునందు వివరించుచూ, ‘అమ్మా!! నవాత్మికయైన నీవు శంభునికి శరీరము. ఆధార-ఆధేయత్వమును మీరిరువురూ అతిసాధారణముగా పొందుతూ సమరసముగా ఉంటారు’ అని స్వరవ్యంజనాక్షరరూప శివశక్తుల సమరసతను నిగూఢముగా సూచించినట్లున్నది.

పరమాత్మ సంకల్పముచే అక్షరబ్రహ్మనుంచి వెలువడిన జగన్మాతాపితరులగు శివశక్తుల సంయోగముచే ఏర్పడిన, స్వరవ్యంజనారూప విశ్వరచనను తెలియజేయునమములివి. స్వరవ్యంజనములు భాషకుసంబంధించినవి మాత్రమే కాదు, పంచమహాభూతములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు మొదలగు తత్త్వముల సంబంధితములు. నామ-రూపసృష్టికాధారమై, శివశక్త్యాత్మకమైనవి అక్షరములు.

అమ్మ కృపాధారల అనుగ్రహముతో తృటిపాటైనను అమ్మ దివ్యమంగళవిగ్రహ దర్శనభాగ్యము కలుగవలెనని ప్రార్ధిస్తూ,
శ్రీమాత్రేనమః