Wednesday 6 March 2019

sumEru-madhya-Srungastha సుమేరు-మధ్యశృంగస్థా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
మహీం మూలాధారే-కమపి మణిపూరే-హుతవహం
స్థితం స్వాధిష్ఠానే- హృదిమరుతమ్-ఆకాశమ్ ఉపరి।
మనోపి భ్రూమధ్యే – సకలమపిభిత్వా కులపథమ్
సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే।।
(సౌన్దర్యలహరి-9)
సుమేరుమధ్యశృంగస్థా
శృంగము - శిఖరము
సుమేరు పర్వతశిఖర మధ్యమునందుగల తల్లిని వాగ్దేవతలు ఈ నామమునందు వర్ణిస్తున్నారు.
మినోతి క్షిపతి శిఖరైర్జ్యోతీంషీతి మేరుః సుష్టు మినోతీతి సుమేరుః
శిఖరములచే నక్షత్రాదులను వహించునది సుమేరు.  మేరువును అగ్నిస్తంభము, స్వర్ణపర్వతము, దేవతామూర్తిగనూ వేదములు, పురాణములందు వర్ణింపబడినది. 

యో అక్షేణేవ చక్రియా శచీభిః విష్వక్తస్తంభ పృథివీముతద్యామ్। 
(ఋగ్వేదము 10.89.04)
ఋగ్వేదమునందు మేరువు ఇంద్రుని రధచక్రములనబడు స్వర్లోక, భూలోకములను రెండు చక్రములను కూర్చు ఇరుసు(axle)వంటి దివ్యస్తంభముగ చెప్పబడినది. విశ్వభ్రమణమునకు ఆధారమీ అక్షము.

జ్వలంతమచలమ్ మేరుమ్ తేజోరాశిమనుత్తమమ్।
ఆక్షిపంతం ప్రభాం భానోః స్వశృంగైః కాంచనోజ్జ్వలైః।।
కనకాభరణం చిత్రం దేవగంధర్వసేవితమ్।
అప్రమేయమనాధృష్యమధర్మబహులైర్జనైః।। 
 (మహాభారతము-ఆస్తిక పర్వము – అ17-5,6)
స జయతి సువర్ణశైలః। సకల జగచ్చక్ర సంఘటిత మూర్తిః।
 (ఆర్యాద్విశతి)
సకలజగములనుగలిగిన బంగారుకొండయని మేరుపర్వతమును మహాభారతము ఆస్తికపర్వమునందు వ్యాసులు, ఆర్యాద్విశతి మొదటిశ్లోకమునందు దుర్వాసముని వర్ణించారు.
 
భూమండలము, దివ్యలోకములను సంబంధపరుచు మేరువును శ్రీమద్భాగవతము (5.16), విష్ణు (2.2), శ్రీమద్దేవీభాగవత (8.6), మత్స్య (అ-123), కూర్మ (1.45) పురాణములందు, సప్తద్వీపములకు నడుమగల జంబూద్వీప మధ్యభాగమునందలి అతిపెద్ద (84,000 యోజనముల ఎత్తు) పర్వతముగ చెప్పబడినది. 

భూపద్మస్యాస్య శైలోసౌ కర్ణికాత్వేన సంస్థితః। 
(కూర్మ పురాణము 1.45.9)
జంబూద్వీపాది సప్తద్వీపములతోకూడిన భూమండలమును పురాణములందు తామరతోనూ, మేరువును తామరకర్ణిక(pericarp)తోను పోల్చబడినవి.

గిరయోవింశతిపరాః కర్ణికాయాఇవహేతే।
కేసరీభూయసర్వేపిమేరోమూలవిభాగకే।
(శ్రీమద్దేవీభాగవతము 8.6.29)
తామరకర్ణికచుట్టూ ఉన్న కేసరములవలే, మేరుమూలముచుట్టూ పర్వతశిఖరములుగలవు.  మేరువుతోకలిపి మొత్తము (వింశతి) ఇరువది శిఖరములున్నట్లు దేవీభాగవతమునందు వ్యాసులవారిచే చెప్పబడినది.

అత్యున్నతమైన మేరుపర్వత శిఖరమధ్యభాగము పరంబ్రహ్మ స్వరూపిణియైన తల్లికి ఆవాసముగ చెప్పుచున్నారు వాగ్దేవతలు.

విశ్వ-భూగోళ-భారతదేశ మేరుపర్వత విశ్లేషణ:
దివ్యలోక శివశక్త్యాత్మక పరమాత్మను, భూమండలమును కలుపునది సమిష్టి/విశ్వస్థాయి మేరువు.

నక్షత్ర, గ్రహ స్థితిగతులను గణించు సూర్యసిద్ధాంతము, వరాహమిహిరుల పంచసిద్ధాంతములందు (అ13-2) పురాణములననుసరించి, భూగోళమధ్యభాగమున సుమేరు పర్వతమున్నట్లు చెప్పబడినది.

అనేకరత్ననిచయో జాంబూనదమయో గిరిః।
భూగోళమధ్యగో మేరుః ఉభయత్ర వినిర్గతః।
ఉపరిష్టాత్స్థితయాస్తస్య సేంద్రా దేవా మహర్షయః।
అధస్తాదసురాస్తద్వత్ ద్విషన్తోన్యోన్యమాశ్రితాః।।
 (సూర్యసిద్ధాంతము అ12-34,35)
వరాహమిహిరులు పంచసిద్ధాంతము 13వ అధ్యాయమునందు మృత్తికావాయుజలాకాశాగ్నిమయమైన భూగోళవర్ణనచేస్తూ, తస్య మధ్యే చ దేవానామ్ స్థానరూపః సుమేరునామ్నా పర్వతేంద్రో వర్తతే యస్యాధో దైత్యాః స్థితాః సన్తీతి। భూగోళము మధ్యనున్న సుమేరుపర్వత ఊర్ధ్వభాగమున(ఉత్తరధృవము) దేవతలు, అధోభాగమున (దక్షిణధృవము) దైత్యులు వసిస్తున్నారని, భూగోళసంబంధితముగ మేరుపర్వతమును వర్ణించారు.

వాల్మీకిరామాయణము, యుద్ధకాండము 71వసర్గనందు, భూమండలమునందలి జంబూద్వీపాంతర్గత భరతవర్షముమునందలి భారతదేశమునకు ఉత్తరదిక్కున ఉన్న హిమాలయ పర్వతము, సమిష్టిసృష్టియందలి పరమాత్మస్థానమైన మేరుపర్వత ప్రతీకగ చెప్పబడినది. వాల్మీకిమునులు హిమవత్పర్వతమును నేరుగ మేరుయనివర్ణింపలేదు. మేరుపర్వతమునకు ఉపయోగించు ఉత్తమమైన, అతిపెద్దయని విశేషణములతో (హిమవంతం నగశ్రేష్ఠమ్-29, నగరాజమ్ -51, మహానగేంద్రం – 58) హిమాలయమును సూచకముగ వర్ణించిననూ, 60వశ్లోకమునందలి నాభిం చ వసుంధరాయాః భూమికి నాభిస్థానమునందుగల పర్వతముగ వర్ణించుటచే పర్వతశ్రేష్ఠమైన హిమాలయమును మేరుపర్వతమని సూచించుచున్నట్లున్నది.  60వశ్లోకములో పురాణాంతర్గత మేరుపర్వత సమనార్ధకములు చాలా ప్రయోగించారు మహాముని.

తంత్రశాస్త్ర వివరణ:
అదృశ్యముగనుండు మేరుపర్వతముయొక్క శిఖరము శివశక్తుల ఏకరూప పరమాత్మ స్థానము.

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్।
తస్యావయవభూతేస్తు వ్యాప్తం సర్వమిదమ్ జగత్।। 
(శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4.10)
మాయ ప్రకృతి.  సృష్టికి ప్రకృతి/మాయ ఉపాదాన కారణము. చీకటిలో తాడును చూసి పాము అనుకొనుటకు మాయ కారణము. లేని పామును మన మనసులో సృష్టించేది మాయ.  వెలుతురు ఏర్పడినప్పుడు, మాయతొలగిపోయి, పాము కాదని, తాడును స్పష్టముగ తెలుసుకున్నట్లే అజ్ఞానాంధకారమువలన ఈ అసత్యమైన ప్రపంచమును సత్యమనుకుంటున్నాము.  జ్ఞానమను ప్రకాశముతో వెలుతురు వచ్చినప్పుడు, మాయతొలగిపోయి సత్యమును తెలుసుకొనగలము.  మాయను అధీనములోగలవాడు మహేశ్వరుడు.

శక్తిరూపాంతరముచే ఏర్పడిన శివశక్త్యాత్మక భూమండలసృష్టి మేరుపర్వతమూలభాగము. ఇందువలననే పురాణములందు భూమండలమునందలి స్థావరజంగమసృష్టి, వైకృతసర్గయని చెప్పబడుచున్నది.

పరమాత్మచే సృజించబడిన పంచభూతాత్మక సృష్టితో పరమాత్మను, వ్యక్తావ్యక్తములను, కాలసంబంధిత మాయామయ ప్రపంచముతో కాలాతీత-మాయాతీత దివ్యలోకములను, జోడించునది మేరుపర్వతము.

పిండబ్రహ్మాండయోరైక్యమ్ (యోగకుండలినీ ఉపనిషత్తు – 1.81)
బ్రహ్మాండసంజ్ఞకే దేహే యథాదేశమ్ వ్యవస్థితః|
మేరుశృంగే సుధారశ్మిర్బహిరష్టకలాయుతః||
 (శివ సంహిత -2.5)
అనగా యత్ పిండే తత్ బ్రహ్మాండే  బ్రహ్మాండమునందలి మహామేరు, సమస్తలోకములు, నదులు, పర్వతములు, సూర్యచంద్రాది గ్రహములు, నక్షత్రాదుల సృష్టి పిండాండమునందు గలదు (శాక్తానందతరంగిణి-అ1).

సమస్త పిండాండసృష్టియందలి స్థూలదేహమునందు పరమాత్మ చైతన్యశక్తి సంబంధిత సూక్ష్మదేహమను దివ్యదేహమొకటి గలదు. సూక్ష్మదేహమునందలి ఇడ, పింగళ, సుషుమ్ననాడులు, షట్చక్రముల గురించి మనము మునుపు తెలుసుకున్నాము. పరమాత్మధామమును, భూమండలమును జోడించు మహామేరుపర్వతము పిండాండమునందు మేరుదండముగ భాసిల్లుతున్నది. జీవులయందలి మూలాధారమును, సహస్రారస్థానము/బ్రహ్మరంధ్రమును కలిపెడు వెన్నెముక, మేరుదండమని చెప్పబడుచున్నది. బ్రహ్మరంధ్రస్థానము/ పరమాత్మస్థానము పర్వతాగ్ర సంజ్ఞితము, పృథ్వీతత్త్వ మూలాధారము భూమండల సూచకము.  

పురాణసంకేతము:
మనుష్యాః సాధకా మతాః (వరాహ పురాణము 2.32)
మనుష్యులు సాధకులు. భూమండలమునందలి సమస్త స్థావరజంగమసృష్టిలో, అర్వాక్-శ్రోతలనబడు మానవులకు మాత్రమే బుద్ధిపూర్వక కార్యాచరణతో ముక్తిసాధన జేయుటకు సాధ్యము.

జంతూనాం నరజన్మ దుర్లభమ్ (వివేకచూడామణి)
దుర్లభా మానుషీ జాతిః సర్వజాతిషు దృశ్యతే (దేవీభాగతము 9.29.23)
ఇక్కారణమువలననే మానవజన్మ అతిదుర్లభమైనదని చెప్పబడినది.

దక్షప్రజాపతి యాగముజేసి, యజ్ఞఫలమును పరమేశ్వరార్పణము చేయకుండుటజూచిన సతీదేవి దాక్షాయణిగనుండబోనని తలఁచి, తనువుచాలించినది. తదుపరి దాక్షాయణి శరీరభాగములు భరతదేశమునందు పంచాశత్పీఠములుగ ఏర్పడినట్లు, దాక్షాయణి హిమవత్పర్వతరాజపుత్రిగా అవతరించి, పంచాగ్నులయందు తపమొనరించి శివుని పొందినట్లు పురాణకథనము గలదు. ఇది దివ్యలోకములందు జరిగిన వృత్తాంతము మాత్రమే కాదు, మానవులకు ముక్తిమార్గ సోపాన సూచకము. దీనియందలి అంతరార్ధము జూచిన,

దక్షత అంటే కార్యశీలత. కర్మబద్ధులైన జీవుల కర్మాచరణ యజ్ఞ సంకేతముగజూచిన, కర్మఫలము యజ్ఞఫలమునకు సంకేతము. మాయాబద్ధులైజేయు సమస్త కర్మఫలములను, అహంకారపూరితులై పరమేశ్వరార్పణము జేయనప్పుడు కర్మసంగత్వమేర్పడుతుంది. కర్మసంగత్వముచే ఏర్పడిన ప్రారబ్ధకర్మతో భూమండలమునందు తదుపరి జన్మను పొందుతాము.

శివశక్తుల ఏకరూప పరమాత్మస్థానము మేరుశృంగము. యజ్ఞఫలమును పరమేశ్వరార్పణము చేయకపోవుటచే, కైలాసనాధుని అర్ధభాగమైన సతీదేవి పర్వతరాజపుత్రిగా ఆవిర్భవించినది. అనగా పరమాత్మునియందలి సగభాగమైన శక్తి, పరమాత్మ చైతన్యస్థానమైన శృంగమునుండి, పృథ్వీస్థానమైన భూమండలమును జేరుకున్నది.

శివశక్త్యాత్మక పరమాత్మ చైతన్యస్థానము, శరీరమునందలి బ్రహ్మరంధ్రము.
తాని చేతనీకర్తుమ్ సోకామయత బ్రహ్మాండబ్రహ్మరంధ్రాణి
సమస్తవ్యష్టిమస్తకాన్విదార్య తదేవానుప్రావిశాత్||
 (పైంగలోపనిషత్తు-1)
సప్తమే మాసే జీవేన సంయుక్తో భవతి |
(గర్భోపనిషత్తు – 3) 
గర్భస్తజంతు శరీరమందు ఏడవమాసములో ప్రవేశించిన ఆత్మచైతన్యమే సమిష్టి పరమాత్మ. బ్రహ్మరంధ్రమునందలి శుక్లవర్ణముగల ఒకానొక మృదుపదార్ధము నాశ్రయించి ప్రకాశించు తేజోరూపము ఆత్మచైతన్యము. దీని తేజస్సుచే శరీరమునందు చైతన్యము కలిగినది.

ప్రారబ్ధకర్మానుసారమేర్పడిన స్థూలదేహమునందలి బ్రహ్మరంధ్రముద్వారా ప్రవేశించిన పరమేశ్వర చైతన్యమునుండి ప్రాణశక్తి వేరుబడి, మేరుదండమునందలి సుషుమ్నానాడిద్వారా పృథ్వీతత్త్వాత్మక మూలాధారమునుజేరి మూడున్నరచుట్లు చుట్టుకొన్న సర్పమువలే నిద్రించుచుండును. మూలాధారమునందలి ప్రాణశక్తికి తంత్రశాస్త్రమునందు కుండలినీశక్తియని పేరు. ఇది పర్వతరాజపుత్రి పార్వతికి సంకేతము. పంచాశత్పీఠములు మనదేశమునందలి పుణ్యక్షేత్రములు మాత్రమే కావు. మనదేహమునందలి శక్తి స్థానములు కూడాను.

మూలాధారమునందు వ్యక్తమగు శక్తి, పరమేశ్వరుని అర్ధభాగమైన పార్వతీదేవేనని, పరమేశ్వరుడు స్వయముగ తల్లితో కాలికాపురాణము అర్ధనారీశ్వరచరితమను 45వ అధ్యామునందు (129-135) సూచకముగ చెప్పినాడు. 

పార్వతీదేవి శివుని వక్షస్థలమందొక అతిలోకసుందరి ప్రతిబింబమునుజూచి ఆమె ఎవరని ఈశ్వరుని ప్రశ్నించినది.
మమ వక్షసి విస్తీర్ణే దర్పణస్వచ్ఛభాసిని।
తవైవ వపుషశ్ఛాయాబింబితా లోకితా త్వయా।। (129)
దానికి ఈశ్వరుడు, దేవీ! దర్పణమువంటి నా వక్షస్థలముమీద ప్రతిఫలించినది నీ ప్రతిబింబమేయని సమాధానమివ్వగా, దేవికి మరియొక సందేహము.
మయి స్థితాయాం ఛాయాస్తి మామృతే నాస్తి సా పునః। (ibid 131)
ఈశ్వరా!! ప్రతిబింబమనిన, నేను తమ సన్నిధానములో ఉన్నప్పుడు ప్రతిబింబము ఏర్పడవలెను గానీ, లేనప్పుడు కూడా ప్రతిబింబమెటుల సాధ్యమని అడిగినది.
గవక్షాభ్యన్తరే స్థిత్వా తజ్జలేన మనోహరే। (ibid 132)
యథా ద్రక్ష్యసి దేహే స్వం తత్ కురు త్వం తథా మమ
ఆలోక్య నిజాం ఛాయాం త్వాం వినా నాస్తి తత్ పునః।। (ibid 134)
మనోహరీ!! ఒక వాయురంధ్రముద్వారా నా వక్షస్థలమును జూచిన, నీవు ఎవ్విధముగ అలంకరించుకున్నావో, అదేవిధమైన ప్రతిబింబము నా వక్షస్థలమందు ప్రతిఫలిస్తుంది. ఆ ప్రతిబింబము వేరెవరిదీ కాదు, నీది మాత్రమేయని ఈశ్వరుడు సమాధానమిచ్చినాడు.  ఇచ్చట వాయురంధ్రమనిన మేరుదండ సూచకము.

ఇహలోకవిషయబద్ధులగువారియందు కుండలినీశక్తి నిద్రిస్తూనేఉంటుంది. పంచాగ్నులతపస్సుజేసి కుండలినీప్రాణశక్తిని జాగృతపరచి మేరుదండమునందుగల సుషుమ్నానాడియందలి శక్తిస్థానములైన చక్రములద్వారా ఊర్ధ్వదిశకు ప్రయాణింపజేసి బ్రహ్మరంధ్రమునందలి పరమాత్మను జేర్చుటయే, పర్వతరాజపుత్రి పార్వతీదేవి శివునిజేరుటకు సంకేతము. కామాతురులకిది సాధ్యము కాదు. పరమేశ్వరుని జ్ఞానాగ్నిజ్వాలలో భస్మమగుదురు. పరమాత్మతో తాదాత్మ్యము పొందుటయే ముక్తి. ఈ సాధన మేరుదండమునిలువుగాగల మానవులకు మాత్రమే సాధ్యము. మాయాబద్దులై పరమాత్మను తెలుసుకొనకుండుటయే నిద్రిస్తున్న కుండలినీశక్తికి సంకేతము. కర్మ అసంగత్వము (బ్రహ్మరంధ్రము) పరమాత్మవైపు, కర్మ సంగత్వము (మూలాధారము) జన్మవైపు మనలను నడిపిస్తాయి.

రామాయణ మహాకావ్యమునందలి సీతమ్మతల్లి కూడా స్వర్ణ మాయలేడిమీద మోహమువలన, రామయ్యతండ్రికి దూరమైనది. నిజానికి తల్లికది మోహము కాదు. దీనియందలి సంకేతము చూచిన, పరమాత్మయందు కాకుండా ఇహలోక విషయములందాసక్తులైన మాయాబద్ధులైన జీవులకు పరమాత్మచింతనకు దూరమగుదురు. ఇక్కడ భూమిమీద ఉన్న ఎన్నోజంతువులలో లేడిని చెప్పారు వాల్మీకిమహాముని. దీనికి కారణము, లేడి తనవద్దనుండి వచ్చుకస్తూరిగంధమును ఎక్కడినుండో వస్తున్నదనుకొని చుట్టుపక్కలంతా వెతుకుతూ తిరుగుతున్నట్లు, మాయలోపడిన జీవులు తమ అంతరంగమునందుగల పరమాత్మను తెలుసుకొనజాలక, బాహ్యప్రపంచమునందు వెతుకుతూ ఉంటారు. అంతేకాదు వాల్మీకిమునుల స్వర్ణమృగ అద్భుత వర్ణన (అరణ్యకాండ, 42సర్గ, 15-18) మనలకు స్వర్ణగిరియైన మేరుపర్వతమును జ్ఞప్తికి తెస్తుంది.  సీతమ్మతల్లి స్వర్ణమేరు ద్వారా రామయ్యతండ్రికి దూరమైనట్లు ముని సూచించుచున్నట్లున్నది.

తదుపరి పరమాత్ముని విరోధభక్తుడైన పదితలల రావణాసురునిపాలిటబడి లంకనుజేరిన సీతమ్మతల్లి, వాయుపుత్రుడైన ఆంజనేయస్వామివారి సహాయముతో మరల శ్రీరామచంద్రుని చేరుకొనుట, నిద్రిస్తున్న కుండలిని జాగృతపరచి ఊర్ధ్వదిశగా ప్రయాణింపజేసి బ్రహ్మరంధ్రస్థానమునందలి పరమాత్మతో ఐక్యము చెందుటకు సూచకము. వాయుపుత్రుని లీలలు కుండలినీయోగ సూచకములు.  రావణుని పదితలలు, భూలోకజీవులకుగల అరిషడ్వర్గములతో కూడిన అంతఃకరణమునకు సూచితము. ఈ దృక్పథముతో శ్రీమద్రామాయణము చదివితే సుందరకాండ, యుద్ధకాండమునందలి శ్రీవిద్యారహస్యములు తెలుసుకొనవచ్చును.

ఈ దివ్యావతారముల వృత్తాంతములను జీవులపరముగా అన్వయించినప్పుడు, కోరికలకు బద్ధులై మనసును పరమాత్మమీద పెట్టకుండా, ఐహికవిషయములందు అధికాసక్తిగలిగియున్నప్పుడు (శక్తి మూలాధారముజేరినప్పుడు), మాయావరణవలన పరమాత్మ తత్త్వము తెలియబడజాలదు. ధర్మబద్ధ కామ్యరహిత కర్మసాధనయే పరమాత్మను జేరుటకు ముఖ్యమైన మార్గము. కర్మయోగము క్రమముగా పైకి తీసుకువెళ్తుంది.

దివ్యదృష్టి కలిగిన ఋషులు పరమాత్ముని లీలలను దర్శించి, మానవజాతిని ఉద్ధరించుటకొరకు వాటిని వివిధపురాణగాధలుగా మనకు అందించారు. ఎన్నో అంతరార్ధములతో కూడిన ఈ పురాణగాధలు సాధక మానవులకు లభించిన పెన్నిధి.

వీటి సారమును చూచిన, శివశక్త్యాత్మక పరమాత్మస్థానము జీవులయందలి బ్రహ్మరంధ్రము, పరమాత్ముని శక్తి స్థానము మూలాధారము. ధర్మబద్ధ, అసంగత్వ, నిష్కామ కర్మతో జీవులు ముక్తిసాధనద్వారా మూలాధారశక్తిని పరమాత్మునితో ఐక్యము జేయుటయే, జీవన పరమార్ధము.

శ్రీచక్రము
శ్రీవిద్యాపరముగ, పొడవు, వెడల్పు, ఎత్తుయను మూడు కొలతలుగల (three dimensions) మేరుప్రస్థార శ్రీచక్రయంత్రమునకు సంకేతము.

చతుర్భిః శివచక్రేశ్చ శక్తిచక్రైశ్చ పఙ్చభిః
నవచక్రైశ్చ సంసిద్ధమ్ శ్రీచక్రమ్ శివయోర్వపుః
నాలుగు శివత్రికోణములు, ఐదుశక్తిత్రికోణముల కలయికచే ఏర్పడిన శ్రీచక్రము శివశక్తుల ఏకరూపముగ చెప్పబడుచున్నది. శ్రీచక్రమునందలి, త్రికోణము మధ్యగల బిందువు తల్లిస్థానముగ చెప్పునామమిది. పరమాత్మనుండి వెలువడిన సమస్త నామరూప సృష్టికి నవావరణ యంత్రరూపము శ్రీచక్రము. బిందువు నుండి భూపురావరణ సృష్టిచక్రముగను, భూపురము నుండి బిందువు సంహారచక్రముగ పూజించుట శ్రీవిద్యా సంప్రదాయము.



భారతదేశమునందలి ఉత్తరదక్షిణ సరిహద్దులను ఆధ్యాత్మికదృష్టితో పరిశీలించిన మరియొక సూక్ష్మము తెలుసుకొనగలము. ఉత్తర భారతదేశప్రాంతపు శైవక్షేత్రమందలి అమరనాథ్ మంచులింగము, (అ-మర) అమృతత్త్వరూపము.  అమృతత్త్వము కాలాతీత చైతన్యాత్మక శివశక్తుల ఏకరూప పరమాత్మ (సత్-చిత్-ఆనంద) సూచకము. దక్షిణసరిహద్దునందలి కన్యాకుమారి క్షేత్రమునందలి తల్లి కన్యాకుమారి, కన్యయైన శక్తిరూపము. అమరనాథ్ నాశరహిత పరమాత్మస్థానమైన బ్రహ్మరంధ్ర/మేరుశృంగ సూచకముగనూ, కన్యాకుమారి మూలాధార సూచితముగను ఉన్నట్లున్నవి. కర్మసాధనతో మూలాధారమునందలి శక్తిని ఉత్తేజపరచి ఊర్ధ్వదిశగా ప్రయాణింపజేసి సహస్రారస్థానమును జేర్చుటయే అమృతత్త్వమును పొందుట. మనదేశము కర్మభూమియని జెప్పుటయందలి మరియొక విశేషమిది.

ఐహికవిషయవాంఛలయందాసక్తిని తొలగించుకొని అతిశీఘ్రముగ సహస్రారకమలాంతర్గత అమ్మ-అయ్యల దర్శనభాగ్యము పొందవలెనని తల్లిని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రే నమః