Wednesday 7 November 2018

mahA-lAvaNya-SEvadhiH మహాలావణ్యశేవధిః

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
నిధిం లావణ్యానాం నిఖిలజగదాశ్చర్య నిలయమ్
నిజావాసం భాసాం నిరవధిక నిశ్శ్రేయ సరసమ్|
సుధాధారాసారం సుకృతపరిపాకం మృగదృశాం
ప్రపద్యే మాఙ్గల్యం ప్రథమ మధిదైవం కృతధియామ్|| 
(కృష్ణకర్ణామృతము – 2.45)
కాంతివిశేషములకు నిధియై కాంతిపుంజమై, సమస్త జగమునందలి అద్భుతములగు సౌన్దర్యములకు నిలయమై, అమితమైన ఆనందమునకు రూపమై, అమృతపుజడివలే భోగ్యమై, లేడివంటిచూపులుగలిగినవారు అంటే యువతులకు పుణ్యఫలమై, విద్వాంసులకు మోహనాకార శుభప్రదమై, జగత్తునకు ఆదికారణమైన శ్రీకృష్ణుని కొలుచుచున్నాను.

మహాలావణ్యశేవధిః
మహా-గొప్పదైన
లావణ్య – సౌకుమార్యము, చక్కదనము,సొంపు
శేవధి – నిధి

మహాలావణ్యశేవధయే నమః
గొప్పదైన లావణ్యములకు నిధి తల్లి. లావణ్యముల ప్రోవు (రాశి) తల్లి. అయితే ఈ నామమునందు పుంలింగము చెప్పబడినది. అందువలన నామము చెప్పునప్పుడు మహాలావణ్యశేవధ్యైనమః అని చెప్పకూడదు, మహాలావణ్యశేవధయే నమః అని చెప్పాలి.

ముక్తాఫలేషు ఛాయాయాస్తరలత్వమివాన్తరా|
ప్రతిభాతి యదఙ్గేషు లావణ్యమ్ తదిహోచ్యతే|| 
 (రూపగోస్వామి విరచిత ఉజ్జ్వలమణి-10/28)
ముత్యములనుండి పౌనఃపున్యముగ స్వాభావికముగ వెలువడు నిర్మలకాంతులవలె, అంగ-ప్రత్యంగములనుండి నిరంతరముగ వెలువడు అతిస్వచ్ఛమైన కాంతిప్రవాహమును లావణ్యమని చెప్పబడుచున్నది.

ఏకమ్ సద్ విప్రా బహుధా వదంతి (ఋగ్వేదము 1.164.46) యని చెప్పబడుచున్న కారణకార్యవస్తువైన ప్రజ్ఞానఘనీభూత విశ్వచైతన్యముయొక్క అనిర్వచనీయ పరిణామముచే ఏర్పడినది ఈ అనంత గోచరాగోచర చరాచర సృష్టి. సృష్టి అంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగాజేయబడినదని కాదు. సమస్త సృష్టిస్థితిలయకారకమైన బ్రహ్మవస్తువు(పరంబ్రహ్మ) యొక్క కించిత్ స్పందనతో, పరంబ్రహ్మనుండి వెలువడిన కాంతిప్రభల లవలేశభాగముతో అఖిలాండకోటిబ్రహ్మాండములు (నామరూపాత్మక జగత్తు) సృజించబడినవని పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా నామమునుండి మరాళీ మందగమనా నామమువరకు చెప్పుకున్నాము.

ప్రకాశమునే తనువుగాగలిగిన శివశక్తిరూప తేజోమయ పరమేశ్వరునినుండి పౌనఃపున్యముగా వెలువడు కాంతియుతమైన అంతర్లీనవిమర్శశక్తినే ఇచ్చట లావణ్యమని చెప్పబడుచున్నది. ఈ లావణ్యమునకు నిధి అనగా ఆలవాలము, తేజోమయమైన పరమేశ్వరుడు/బ్రహ్మవస్తువు. అందువలన, మహాలావణ్యశేవధియనగా కామేశ్వరీకామేశ్వరుల ఏకరూపమైన పరంబ్రహ్మ సూచితము. ఈ నామమును పుంలింగముగ చెప్పుటయందలి రహస్యమిదియే. సౌభాగ్యరత్నాకరమునందు భాస్కరరాయలవారు ఈ నామ వివరణయందు, ద్వన్ద్వతత్పురుషయోరితి పాణినిసూత్రాత్ పుల్లింగమిదం నామ ద్వంద్వతత్పురుష సమాసములందు పుంలింగరూపమగునను పాణిని సూత్రమాధారముగా ఈ నామము పుంలింగముగ జెప్పబడినదని వివరించినారు.

పరంబ్రహ్మనుండి కాంతిప్రభలు మరల మరల అవిరామముగా వెలువడుతున్నాయని ఈ నామమునందలి లావణ్య శబ్దము సూచించుచున్నది. అందువలన సృష్టి ఏదో ఒకసారి సృజించబడి లయింపబడుటలేదు, మరల మరల సృష్టి జరుపబడుచూనే ఉన్నదని అర్ధమగుచున్నది.

దీనినే భగవద్గీత యందు కృష్ణపరమాత్మ
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్|
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్||(9.7)
ప్రకృతిం స్వామ్ అవష్టభ్య విసృజామి పునః పునః|
భూతగ్రామం ఇమం కృత్స్నమ్ అవశమ్ ప్రకృతేః వశాత్|| (9.8) 
శ్లోకములందు కల్పాంతమునందు నా స్వాధీనములోనున్న ప్రకృతియందు (మాయ) లీనమగు సమస్తసృష్టినీ, తదుపరి కల్పాదియందు స్వకీయప్రకృతితో మరల మరల సృజించెదను యని చెప్పినాడు.

మరల మరల ఎలా సృజించబడుతున్నది అన్నదానికి,
సూర్యాచంద్రమసౌ ధాతా యథాపూర్వమకల్పయత్| దివం చ పృథ్వీం చాన్తరిక్షమథో స్వః| 
(ఋగ్వేదము 10.190.3)
కాలనిర్ణేతలైన సూర్యచంద్రులను, భూర్భువస్స్వర్లోకములను, పాలపుంతలతో ప్రకాశవంతమైన అంతరిక్షమును (యథాపూర్వమ్) పూర్వమువలెనె ధాతచే సృజించబడినవి.

తల్లియొక్క సగుణవర్ణన ప్రారంభమునందు, లలితామహాత్రిపురసుందరి అనంత ఉదయసూర్యుల తేజస్సుతో చిదగ్నికుండమునుండి ఆవిర్భవించినదని ఉద్యద్భానుసాహస్రాభా నామమునందు చెప్పుకున్నాము.  సగుణరూప వర్ణనాంతమునందు వాగ్దేవతలు మరియొకసారి తల్లి లోకాతీతమైన కాంతులతేజస్సు కలిగియున్నదని ఈ నామమునందు వర్ణిస్తున్నారు.

తల్లియొక్క సౌన్దర్యలావణ్యాతిశయములను గురించి ఆదిశంకరులు సౌన్దర్యలహరి 12వ శోకమునందు ఈ క్రిందివిధముగ వర్ణించినారు.
త్వదీయం సౌన్దర్యం తుహినగిరికన్యే తులయితుం
కవీన్ద్రాః కల్పన్తే కథమపి విరిఞ్చి ప్రభృతయః|
యదాలోకౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా
తపోభిః దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్యపదవీమ్||
సమస్తవిశ్వ సృష్టిస్థితిలయకారకమైన అనంతకోటిశక్తిలావణ్యసుధాప్రవాహములకు మూలభూతమైన తల్లి సౌన్దర్యము  వర్ణింపశక్యముగానిది. వేదవిద్యాప్రణీతులైన బ్రహ్మాది కవిశ్రేష్ఠులు, తల్లియొక్క లోకాతిశయ సౌన్దర్యమును ఏదో (కథమపి) తుల్యముగ కల్పనజేసామనుకుంటారు. అనుకుంటారుగానీ చేయలేకపోతున్నారని అర్ధము. అమ్మా!! నీ సౌన్దర్యమాలోకించవలెనను ఉత్సుకతకలిగిన అమరలలనలు కఠోరతపస్సుజేసికూడా విఫలులౌతున్నారు. అప్పుడు వారు, అర్ధనారీశ్వరుడైన గిరీశునికిమాత్రమే తెలియదగు నీయొక్క సౌన్దర్యమును వీక్షించుటకు గిరిశుని సాయుజ్యముపొందిన మాత్రమే సాధ్యమని మనసునందు తలంచినారు.

హిమవంతుని కొమరితయైన గౌరిదేవి అత్యుత్తమలావణ్యవతిగా చెప్పబడుచున్నదనియు, గిరీశునిసన్నిధానములో రమించు లావణ్యరూపమునే లలితయనియు గణపతిముని ఉమాసహస్రము (1.18,27.4)నందు తల్లిని స్తుతించినారు.

గిరిశుని సాయుజ్యము పొందుటద్వారా లావణ్యమూర్తి తల్లి దర్శనము కలగవలెనని ప్రార్ధిస్తూ,
శ్రీమాత్రేనమః