Thursday 13 December 2018

sarvAruNa సర్వారుణా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
కదంబారుణమమ్బాయా రూపం చింతయ చిత్త మే।
ముఞ్చ పాపీయసీం నిష్ఠాం మా గృధః కస్య స్విద్ధనమ్॥
 (త్రిపురసుందరి వేదపాదస్తవము – 51)
ఓ చిత్తమా!! పాపపాలోచనలు, అర్ధానుచింతనలయందలి నిష్ఠను వదలి, కదంబకుసుమారుణ కాంతుల అమ్మరూపమును ధ్యానించుము. 

సర్వారుణా
సంపూర్ణముగా, ఆపాదమస్తకము అరుణ వర్ణముతో శోభిల్లుతున్న తల్లికి నమస్కారము. అరుణమనిన ఎర్రటి ఎరుపు కాదు. తెలుపు, ఎరుపు కలిసిన ఉదయభానుని వర్ణము.

చిదగ్నికుండమునుండి ఆవిర్భవించిన తల్లి స్థూలరూపవర్ణన క్రిందటి నామముతో ముగిసినది. ఈ నామమునుండి పంచబ్రహ్మాసనస్థితా నామమువరకు వాగ్దేవతలు సుమేరుశృంగమధ్యమున విరాజిల్లు కామేశ్వరాంకస్థితయైన తల్లిని వర్ణిస్తున్నారు.

ఆదిశంకరులు లలితాత్రిశతి, 138వ నామము సర్వారుణా వివరించుచూ రుద్రమునందలి అసౌ యస్తామ్రో అరుణః, రాగి(తామ్ర)వర్ణము అరుణమని నిర్వచించినారు. (తెలుపు, ఎరుపుల) శుక్లశోణితముల కలయిక అరుణము.

అవ్యక్తరాగస్త్వరుణః (అమరకోశము) వ్యక్తముకాని ఎరుపును అరుణమని చెప్పబడుచున్నది.  
వ్యక్తమంబామయమ్ సర్వమ్ అవ్యక్తమ్ తు మహేశ్వరమ్
సమస్త సృష్టియందలి వ్యక్తాంశములు శక్తి స్వరూపములు మరియు అవ్యక్తాంశములు శివస్వరూపములు. ఉదాహరణకు, బీజము శక్తిస్వరూపము, బీజమునందు గుప్తముగనున్న వృక్షము, అవ్యక్తముగనున్న శివస్వరూపము. 

ఈ విధముగ, అమరకోశ నిర్వచనము అవ్యక్తమైన-ఎరుపునందలి అవ్యక్తము శివుని, ఎరుపు శక్తిని సూచిస్తుంది.

కామకలావిలాస వివరణను, అమరకోశమునందలి నిర్వచనమును కలిపిజూచిన, అరుణవర్ణము ఆదిదంపతీద్వయ సూచకముగనున్నది.

అంతరార్ధము

చరాచరవస్తులన్నిటియందూ విస్తరించి, వస్తు/పదార్ధ స్పష్టత కలుగజేయునది ప్రకాశాంశము మరియు స్పష్టమైన వస్తుతత్త్వమును తెలుపుచూ, రూపనిర్ధారణ జేయుటకు దోహదపడునది విమర్శాంశము. ఉదాహరణకు, కాంతివలన తెలియబడు జ్యోతియందలి ప్రకాశాంశము జ్యోతి, దానినుండి వెలువడు కాంతి విమర్శాంశము.
 
చిత్తమయో
హంకారః సువ్యక్త అహార్ణ సమరస సాకారః|
శివశక్తిమిథునపిండః కబళీకృత భువనమండలో జయతి||
  (కామకలావిలాసము-5)
జ్ఞానరూప చిదాత్మ స్వాంతర్గత విమర్శయుక్తమైనపుడు, శివశక్తులదివ్యదంపతీ సంపుటముచే అకార, హకార వర్ణద్వయ సమాహార శబ్దమయ, చంద్రాగ్నులమేళన సామరస్యాత్మక రూపమయ, చతుర్దశభువనభాండములు ఏర్పడుచున్నవి.

సితశోణబిందు యుగళమ్ వివిక్తశివశక్తి సంకుచప్రసరమ్|
వాగర్ధసృష్టి హేతుః పరస్పరానుప్రవిష్టవిస్పష్టః || 
(కామకలావిలాసము-6)
సన్యాససూక్తమునందలి క్రిందిమంత్రమునందు నిరూపింపబడిన
యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః | తస్యప్రకృతి-లీనస్య యః| పరః స మహేశ్వరః| (అథర్వవేదాంతర్గత మహానారాయణ ఉపనిషత్తు -12.17)
వేదాదిశబ్దజాలమునకాధారమైన సర్వవర్ణాగ్ర అకార స్వరూపుడైన ప్రకాశమాత్రతనువు గలిగిన శుక్లబిందురూప మహేశ్వరుడు, అంతర్లీన శోణబిందురూప హకార విమర్శశక్తియందు శుక్లబిందురూపము పొందుటచే ఏర్పడిన అహంకారరూప మిశ్రబిందువు సమస్త సృష్టి, లయలకు (సంకుచప్రసరమ్) కారణబిందువగుచున్నది.


వాగ్దేవతలు తల్లి అరుణవర్ణమును సర్వారుణా, పద్మరాగసమప్రభా,తరుణాదిత్యపాటలా మొదలగు నామములందు వర్ణించిననూ, సహస్రనామములందలి మూడునామములయందు మాత్రమే అరుణ వాడినారు. (నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా, అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ మరియు సర్వారుణా)

శ్రీమాతా నామమునుండి తాటంకయుగళీభూతతపనోడుపమండలా నామమువరకు అష్టవిధప్రకృతితోకూడిన అనేకకోటి బ్రహ్మాండముల సృష్టి వివరణను చూచాము. అనంత ఉదయసూర్యుల ప్రకాశముగలిగిన తల్లియొక్క అరుణకాంతులలో బ్రహ్మాండమండలములుకూడా అరుణవర్ణముతో శోభిల్లుతున్నాయని చెప్పు మొదటి నామమునందలి అరుణవర్ణము, శివశక్తియుత బ్రహ్మాండసృష్టికి సంకేతముగను, శరీరమును ఆచ్ఛాదనజేయు వస్త్రమును వర్ణించు రెండవ నామమునందలి అరుణవర్ణము, శివశక్తియుత పిండాండ సృష్టి సూచితముగనున్నది. అనగా, పరమేశ్వరుని సంకల్పముచే తృణమాత్ర స్వకీయశక్తితో మరల మరల రచించబడుచున్న విశ్వమునందలి ప్రతివస్తువు, ప్రాణి కూడాను శివశక్తియుతమైనదని వాగ్దేవతలు వచించుచున్నట్లున్నది.
తల్లియొక్క కేశాదిపాదాంతవర్ణన పూర్తి అయిన తరువాత వచ్చు అరుణ కలిగిన, ఆఖరిది మరియు మూడవదైన ఈ నామము సృష్టి సంకల్పిత, రక్తశుక్లవర్ణమిశ్రిత ఏకరూప కామేశ్వరీకామేశ్వరులను సూచించున్నట్లున్నది.

అమ్మ-అయ్యల బాలారుణకాంతుల ప్రభలతో నాయందలి అవిద్యాంధకార నిర్మూలనము జేయవలసినదిగ తల్లిని ప్రార్ధిస్తూ,
శ్రీమాత్రేనమః

Saturday 1 December 2018

Gross picture of Creation - Aruna


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

అవిద్యావరణమపనయమే సువిద్యాభరణముపనయమే|
అపారే ఘోరసంసారే కృపాళో విఘటయ దురాసమ్||

తదుపరి నామ వివరణకుముందు, ఇంతవరకు చూచిన నామములందలి మరియొక ముఖ్య కోణమును పరిశీలిద్దాము.

శ్రీమాతా - నిజారుణప్రభాపూరమజ్జత్బ్రహ్మాండమండలా
సృష్టి, స్థితి, లయకారకమైన బ్రహ్మవస్తువు ఒక్కటిగా ఉన్న నేను ఎన్నోఅవుతాను అని సంకల్పించినప్పుడు సహస్ర ఉదయసూర్యుల ప్రకాశముతో చతుర్యూహములతో కూడిన అఖిలాండకోటిబ్రహ్మాండముల సృష్టి జరుపబడినది.

ఒక్కొక్క బ్రహ్మాండ మండలమునందుగల సృష్టివివరములను  తదుపరి నాలుగునామములందు వివరింపబడినవి.

చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా – కేశములు - వ్యోమము/అంతరిక్షము

కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా 
– పద్మరాగములు/ఆదిత్యులు -  సూర్యమండలము

అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా – చంద్రమండలము

***
పశ్యన్నపి యథా లక్ష్మ జగత్ సోమే న విందతి|
ఏవమస్తి న చోత్పన్నమ్ న చ తన్న పరాయణమ్|| 
(శాంతిపర్వము 203-8శ్లో)
చంద్రునియందలి మచ్చ అచటి పృథ్వికి గుర్తు. కానీ భూమిమీదనుండి ఆ మచ్చను చూచు మానవులకు అది పృథ్వియని తెలియబడజాలదు.
***
దీని ఆధారముగా, క్రింది నామమునందలి చంద్రకళంకము భూమండల సంకేతము.

ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా – భూమండలము

ఒక్కొక్క బ్రహ్మాండము, భూర్భువస్స్వర్లోకములు గలిగియున్నది.

ఇక్కడినుంచి వచ్చు ఐదునామములందు, బ్రహ్మాండమునందలి పిపీలికాదిబ్రహ్మపర్యంత సృష్టియందలి  అష్టమూర్తితత్త్వమును నిక్షిప్తముగనుంచి తల్లిని వర్ణించినారు.

పరమాత్మాభిన్న అంతర్లీన సూక్ష్మశక్తి, పంచభూతములు (భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము), కాలము (సూర్య, చంద్రులు)/బుద్ధి, మనసు మరియు అహంకారము/ఆత్మ/పురుషుడు/క్షేత్రజ్ఞుడను స్థూలరూపముగల అష్టమూర్తులుగా బ్రహ్మాండమండలమునందు గోచరిస్తున్నది.

వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా
భ్రువౌ చ సంధ్యయోస్తేజః (మార్కండేయపురాణము-82.27) రెండు సంధ్యాకాలముల తేజస్సుతో ఏర్పడిన తల్లికనుబొమలను వర్ణించునామము ఇది. రెండు సంధ్యాకాలములకు మధ్య కట్టబడిన తోరణముతో శోభిల్లు మంగళగృహము భూమికి సంకేతముగనున్నది.

వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా 
– (ప్రవాహము) జలము, అగ్ని తేజస్సుతో ఏర్పడిన నేత్రములు

నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా -  శ్వాసేంద్రియమైన నాసిక వాయు సూచితము

తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా – నక్షత్రములతో కూడిన ఆకాశము

కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా 
 –మనస్సు/యజమాని/క్షేత్రజ్ఞుడు/ఆత్మ/అహంకారము

తాటంకయుగళీభూతతపనోడుపమండలా – సూర్యచంద్రులు (కాలము)

ఇకపైన వచ్చునామములందు పైంగలోపనిషత్తు, కామకలావిలాసములందు వర్ణింపబడిన పిండాండ సృష్టిక్రమము చెప్పబడుచున్నది.

సృష్టిచేయసంకల్పించిన పరమాత్మయొక్క త్రిగుణాత్మక విమర్శశక్తి అద్దమువలే పురోభాగమందు ఆవిర్భవించినది.

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః  
– (ఆదర్శ) అద్దము – త్రిగుణాత్మక విమర్శబిందువు/జ్ఞానశక్తి

ఈ అద్దమునందలి ప్రజ్ఞానఘనీభూత విశ్వచైతన్య పరమాత్మయొక్క ప్రతిబింబము సాక్షి/ చిత్కల/ కూటస్థుడు/  అంతర్యామియని చెప్పబడుచున్నది.

అంతర్యామి చైతన్యముతో కూడిన మూలప్రకృతి సత్వోద్రిక్తమై మాయయను బీజరూప అవ్యక్తావరణ ఏర్పడినది.  బీజమునందలి వృక్షమువలే సమస్త నామరూప సృష్టిని అవ్యక్తరూపమున గలిగియుండుటచే ఈ ఆవరణ అవ్యక్తావరణ.

నవవిద్రుమబింబఃశ్రీన్యక్కారిరదనచ్ఛదా – (ఛద) తెర – అవ్యక్తావరణ

అవ్యక్తావరణ /తెర మీద అంతర్యామిప్రతిబింబము ఈశ్వరచైతన్యమని చెప్పబడుచున్నది.

అవ్యక్తావరణ రజోద్రిక్తమై వమనముజేయగల (విక్షేపశక్తి) అంకురరూప మహత్తత్వము ఏర్పడినది. దీనియందలి ప్రతిబింబము స్పష్టాస్పష్టరూపము గలిగిన హిరణ్యగర్భుడు.  

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా – మహత్తత్త్వము

హిరణ్యగర్భునితోకూడిన విక్షేపశక్తి తమోద్రిక్తమై చిత్తము/అహంకారమను స్థూలశక్తి ఏర్పడినది. దీనియందలి ప్రతిబింబము సర్వస్థూలపాలకుడైన విష్ణువను ప్రధానపురుషుడు.

కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా 
-  ఆమోద, దిగంతరా - వ్యాపకశక్తిగల విష్ణుసూచితము.

శంకరభగవత్పాదవిరచిత దక్షిణామూర్తిస్తోత్రమునందలి మొదటి రెండుశ్లోకములందు కూడా ఈ సృష్టిక్రమమును (దర్పణ, మాయ, అంకురము, చిత్రవిచిత్ర దృశ్యప్రపంచము) గుప్తముగా వివరించబడినది.

సాక్షి/చిత్కల/అంతర్యామి, ఈశ్వరచైతన్యము, హిరణ్యగర్భుడు, విష్ణువని చెప్పబడుచున్న నాలుగునూ సృష్టి ఆదియందు ఒక్కటిగాఉన్న పరమేశ్వరుడు/పరమాత్మ/అఖండవిశ్వచైతన్యమని చెప్పబడుచున్న బ్రహ్మవస్తువుయొక్క ప్రతిబింబములు. అందుచే పరమేశ్వరునియందుగల ప్రకాశవిమర్శాంశలు వీనియందుగూడా గలవు.

(అంతర్యామి) ప్రకాశ -(ప్రధాన/మూలప్రకృతి) విమర్శాత్మక అఖండ విశ్వచైతన్యముయొక్క పరిణామముచే ఏర్పడిన ఈశ్వరచైతన్య-మాయ, హిరణ్యగర్భ-మహత్తు, విష్ణు-(అహంకార)వ్యాపకశక్తులు వరుసగా, గుణసామ్యస్థితిగలిగిన కామేశ్వరీకామేశ్వర దివ్యదంపతులకు, ఉమామహేశ్వర ద్వంద్వమునకు, వాణీహిరణ్యగర్భద్వంద్వమునకు, లక్ష్మీనారాయణ ద్వంద్వములకునూ సూచితము.

కామకలావిలాసమునందు ఈ నాలుగు దివ్యదంపతీ ద్వయమును నాలుగుబిందువులుగ నిర్వచించబడినవి. 

ప్రపంచావిర్భావ, పరిపాలన, లయకారకమైన ప్రకాశవిమర్శాత్మక కామేశ్వరీకామేశ్వరులు మధ్యబిందువు/సంవిద్ బిందువుగానూ, సంవిద్బిందువు కారణముగ ఏర్పడిన ఈశ్వరచైతన్య-అవ్యక్తావరణను ప్రకాశ/శుక్ల(తెలుపు)/సత్వబిందువుగనూ, హిరణ్యగర్భ-మహత్తత్త్వమును విమర్శ/రక్త(ఎరుపు)/ తమోబిందువుగనూ,  స్థూలశక్తి-అహంకారమును మిశ్ర/శుక్లశోణిత/రజోబిందువుగనూ చెప్పబడినవి.

ఈ మూడుబిందువులు చంద్రాగ్నిసూర్యమండల తత్త్వములతోను, సత్వరజస్తమస్సులను గుణత్రయముతోనూ నిర్దేశింపబడినవి. ఉమామహేశ్వరద్వంద్వ సూచిత శుక్లబిందువు చంద్రమండలము/అకారముతోనూ, వాణీహిరణ్యగర్భ ద్వంద్వ సూచిత రక్తబిందువు అగ్నిమండలము/హకారముతోనూ నిర్దేశింపబడుటచే, లక్ష్మీనారాయణద్వంద్వసూచిత (అ+హం) అహంకారాత్మక శుక్లశోణిత మిశ్రబిందువు సూర్యమండలముగ  తెలియబడుచున్నది. సంవిద్బిందువునుండి ఏర్పడిన త్రికోణము యోనిచక్రము.  సంవిద్బిందు, యోనిచక్రముల నుండియే సమస్త నామరూపాత్మక జగత్తు ఆవిర్భవించినది.

నామమనిన శబ్దసంబంధము, రూపమనిన పంచభూతాత్మకము. మిశ్రబిందువునందలి ప్రకాశాంశ పంచభూత తత్త్వాత్మక సృష్టిగనూ, విమర్శాంశ అకారాదిహకారాంత వర్ణసృష్టిగనూ విరివిచెందుతున్నాయి. ఈ విధముగా స్థూలసృష్టికి మిశ్రబిందువు వికసనము అతిముఖ్యముగనున్నది. శుక్ల, శోణిత బిందువుల కలయికచే ఏర్పడు మిశ్రబిందువు వర్ణము అరుణము. అందుచే అరుణవర్ణము సృష్టికి సంకేతముగనున్నది.

సగుణవర్ణనయందలి తదుపరి వచ్చు నామములందు ఈ నామరూపాత్మక సృష్టిని చూడవచ్చు.
శబ్దబ్రహ్మోత్పత్తి
నిజసల్లాపమాధుర్యవినిర్బర్త్సితకచ్ఛపీ – నిజసల్లాప - శబ్దబ్రహ్మము

మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా 
 -  ప్రభాపూరమజ్జత్కామేశ - ప్రకాశము / అకారము 

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితా – సాదృశ్య - విమర్శ / హకారము

కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా 
– సూత్రము – అ నుండి హ వరకుగల అక్షరములమాల

పంచభూతోత్పత్తి
సకల కలాతత్త్వభువనాత్మకములు అహమను వర్ణద్వయమందు ఇమిడియున్నందున, రూపమునకు చంద్రసూర్యాగ్ని తత్త్వములు కారణములు.

తస్మాద్వాఏతస్మాదాత్మనఆకాశఃసమ్భూతః| ఆకాశాద్వాయుః| వాయోరగ్నిః | అగ్నోరాపః| అద్భ్యఃపృథ్వీ | (తైత్తిరీయఉపనిషత్తు 2.1.1)

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా 
– విష్ణువు తేజస్సుతో ఏర్పడిన భుజములు అనంతాకాశ సూచితము

రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా 
 – (లోల) ఊగుచున్న చింతాకుపతకము వాయుసూచితము

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ 
 – అగ్నితేజస్సుతో ఏర్పడిన స్తనములు అగ్ని సూచితము

నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ
  – జలావర్తమువంటి (whirlpool)  నాభి, జల సూచితము (ఈ నామ వివరణ చూడవలసినది)

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా – మధ్యభాగము పృథ్వీ సూచితము 

అంతఃకరణేంద్రియములతోకూడిన స్థూల,సూక్ష్మ మరియు కారణశరీరములు
పంచమహాభూతముల పంచీకరణతో ఏర్పడిన జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములతో కూడిన శరీరత్రయమును ఈ క్రింది మూడు నామములందు చూడవచ్చును. స్తనములభారముచే నడుముమీద ఏర్పడిన మూడు ముడతలను కప్పుతూ కట్టినవస్త్రము మీద అలంకరించబడిన కటిబంధములను వర్ణించు నామములను పరిశీలించిన, త్రిగుణాత్మకమైన కారణశరీరము, సూక్ష్మశరీరము మరియు ఈ రెండింటికీ అలంకారప్రాయముగనున్న స్థూలశరీరములకు సూచితమువలెనున్నవి. ఈ మూడు నామములు స్థూలమహాభూతమైన పృథ్వీతత్త్వముతో కూడిన మధ్యభాగమును వర్ణించునవగుట మరియొక విశేషము.

స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా 
– (వళిత్రయము) త్రిగుణములతో కూడిన కారణశరీరము

అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ 
 – (భాస్వత్-జ్ఞానసూచితము) సూక్ష్మశరీరము

రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా – స్థూలశరీరము

కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా 
 -  ఇచ్ఛాశక్తి సంకేత ఊరువులు మనస్సు, అహంకారముల సూచితము

మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా 
 -  జ్ఞానశక్తి సంకేత జానువులు బుద్ధి, చిత్తముల సూచితము

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా – ఇంద్రియములు

గూఢగుల్ఫా – ప్రాణశక్తి (ఈ నామ వివరణ చూడవలసినది)

ఈ నామముతో పిండాండ (వ్యష్టి) సృష్టి క్రమవివరణ పూర్తి అయినది.

పరమేశ్వరుడు లవలేశ స్వాంతర్గతప్రభలతో ఈ నామరూపములతో కూడిన సమస్తసృష్టిని మరల మరల సృజించుచున్నాడని కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా నుండి మహాలావణ్యశేవధిః వరకుగల నామములందు తెలుసుకున్నాము.

ఈ విధముగ శ్రీమాతా నామమునుండి తాటంకయుగళీభూతతపనోడుపమండలా నామము వరకు బ్రహ్మాండముల సృష్టివివరములు, పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః నామమునుండి గూఢగుల్ఫా నామము వరకు పిండాండసృష్టి, కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా నామమునుండి మహాలావణ్యశేవధిః నామము వరకు పరమేశ్వరుని లవలేశ ప్రభలతో పిండాండ, బ్రహ్మాండ సృష్టి సదా సర్వదా జరుగుచున్నదనియు వాగ్దేవతలు తల్లియొక్క సగుణరూపవర్ణనజేయు నామములందు సూచితముగనుంచినారు.  

తల్లియొక్క సద్రూపదర్శనభాగ్యము శీఘ్రముగ కలుగవలెనని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః