Thursday 13 December 2018

sarvAruNa సర్వారుణా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
కదంబారుణమమ్బాయా రూపం చింతయ చిత్త మే।
ముఞ్చ పాపీయసీం నిష్ఠాం మా గృధః కస్య స్విద్ధనమ్॥
 (త్రిపురసుందరి వేదపాదస్తవము – 51)
ఓ చిత్తమా!! పాపపాలోచనలు, అర్ధానుచింతనలయందలి నిష్ఠను వదలి, కదంబకుసుమారుణ కాంతుల అమ్మరూపమును ధ్యానించుము. 

సర్వారుణా
సంపూర్ణముగా, ఆపాదమస్తకము అరుణ వర్ణముతో శోభిల్లుతున్న తల్లికి నమస్కారము. అరుణమనిన ఎర్రటి ఎరుపు కాదు. తెలుపు, ఎరుపు కలిసిన ఉదయభానుని వర్ణము.

చిదగ్నికుండమునుండి ఆవిర్భవించిన తల్లి స్థూలరూపవర్ణన క్రిందటి నామముతో ముగిసినది. ఈ నామమునుండి పంచబ్రహ్మాసనస్థితా నామమువరకు వాగ్దేవతలు సుమేరుశృంగమధ్యమున విరాజిల్లు కామేశ్వరాంకస్థితయైన తల్లిని వర్ణిస్తున్నారు.

ఆదిశంకరులు లలితాత్రిశతి, 138వ నామము సర్వారుణా వివరించుచూ రుద్రమునందలి అసౌ యస్తామ్రో అరుణః, రాగి(తామ్ర)వర్ణము అరుణమని నిర్వచించినారు. (తెలుపు, ఎరుపుల) శుక్లశోణితముల కలయిక అరుణము.

అవ్యక్తరాగస్త్వరుణః (అమరకోశము) వ్యక్తముకాని ఎరుపును అరుణమని చెప్పబడుచున్నది.  
వ్యక్తమంబామయమ్ సర్వమ్ అవ్యక్తమ్ తు మహేశ్వరమ్
సమస్త సృష్టియందలి వ్యక్తాంశములు శక్తి స్వరూపములు మరియు అవ్యక్తాంశములు శివస్వరూపములు. ఉదాహరణకు, బీజము శక్తిస్వరూపము, బీజమునందు గుప్తముగనున్న వృక్షము, అవ్యక్తముగనున్న శివస్వరూపము. 

ఈ విధముగ, అమరకోశ నిర్వచనము అవ్యక్తమైన-ఎరుపునందలి అవ్యక్తము శివుని, ఎరుపు శక్తిని సూచిస్తుంది.

కామకలావిలాస వివరణను, అమరకోశమునందలి నిర్వచనమును కలిపిజూచిన, అరుణవర్ణము ఆదిదంపతీద్వయ సూచకముగనున్నది.

అంతరార్ధము

చరాచరవస్తులన్నిటియందూ విస్తరించి, వస్తు/పదార్ధ స్పష్టత కలుగజేయునది ప్రకాశాంశము మరియు స్పష్టమైన వస్తుతత్త్వమును తెలుపుచూ, రూపనిర్ధారణ జేయుటకు దోహదపడునది విమర్శాంశము. ఉదాహరణకు, కాంతివలన తెలియబడు జ్యోతియందలి ప్రకాశాంశము జ్యోతి, దానినుండి వెలువడు కాంతి విమర్శాంశము.
 
చిత్తమయో
హంకారః సువ్యక్త అహార్ణ సమరస సాకారః|
శివశక్తిమిథునపిండః కబళీకృత భువనమండలో జయతి||
  (కామకలావిలాసము-5)
జ్ఞానరూప చిదాత్మ స్వాంతర్గత విమర్శయుక్తమైనపుడు, శివశక్తులదివ్యదంపతీ సంపుటముచే అకార, హకార వర్ణద్వయ సమాహార శబ్దమయ, చంద్రాగ్నులమేళన సామరస్యాత్మక రూపమయ, చతుర్దశభువనభాండములు ఏర్పడుచున్నవి.

సితశోణబిందు యుగళమ్ వివిక్తశివశక్తి సంకుచప్రసరమ్|
వాగర్ధసృష్టి హేతుః పరస్పరానుప్రవిష్టవిస్పష్టః || 
(కామకలావిలాసము-6)
సన్యాససూక్తమునందలి క్రిందిమంత్రమునందు నిరూపింపబడిన
యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః | తస్యప్రకృతి-లీనస్య యః| పరః స మహేశ్వరః| (అథర్వవేదాంతర్గత మహానారాయణ ఉపనిషత్తు -12.17)
వేదాదిశబ్దజాలమునకాధారమైన సర్వవర్ణాగ్ర అకార స్వరూపుడైన ప్రకాశమాత్రతనువు గలిగిన శుక్లబిందురూప మహేశ్వరుడు, అంతర్లీన శోణబిందురూప హకార విమర్శశక్తియందు శుక్లబిందురూపము పొందుటచే ఏర్పడిన అహంకారరూప మిశ్రబిందువు సమస్త సృష్టి, లయలకు (సంకుచప్రసరమ్) కారణబిందువగుచున్నది.


వాగ్దేవతలు తల్లి అరుణవర్ణమును సర్వారుణా, పద్మరాగసమప్రభా,తరుణాదిత్యపాటలా మొదలగు నామములందు వర్ణించిననూ, సహస్రనామములందలి మూడునామములయందు మాత్రమే అరుణ వాడినారు. (నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా, అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ మరియు సర్వారుణా)

శ్రీమాతా నామమునుండి తాటంకయుగళీభూతతపనోడుపమండలా నామమువరకు అష్టవిధప్రకృతితోకూడిన అనేకకోటి బ్రహ్మాండముల సృష్టి వివరణను చూచాము. అనంత ఉదయసూర్యుల ప్రకాశముగలిగిన తల్లియొక్క అరుణకాంతులలో బ్రహ్మాండమండలములుకూడా అరుణవర్ణముతో శోభిల్లుతున్నాయని చెప్పు మొదటి నామమునందలి అరుణవర్ణము, శివశక్తియుత బ్రహ్మాండసృష్టికి సంకేతముగను, శరీరమును ఆచ్ఛాదనజేయు వస్త్రమును వర్ణించు రెండవ నామమునందలి అరుణవర్ణము, శివశక్తియుత పిండాండ సృష్టి సూచితముగనున్నది. అనగా, పరమేశ్వరుని సంకల్పముచే తృణమాత్ర స్వకీయశక్తితో మరల మరల రచించబడుచున్న విశ్వమునందలి ప్రతివస్తువు, ప్రాణి కూడాను శివశక్తియుతమైనదని వాగ్దేవతలు వచించుచున్నట్లున్నది.
తల్లియొక్క కేశాదిపాదాంతవర్ణన పూర్తి అయిన తరువాత వచ్చు అరుణ కలిగిన, ఆఖరిది మరియు మూడవదైన ఈ నామము సృష్టి సంకల్పిత, రక్తశుక్లవర్ణమిశ్రిత ఏకరూప కామేశ్వరీకామేశ్వరులను సూచించున్నట్లున్నది.

అమ్మ-అయ్యల బాలారుణకాంతుల ప్రభలతో నాయందలి అవిద్యాంధకార నిర్మూలనము జేయవలసినదిగ తల్లిని ప్రార్ధిస్తూ,
శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment