Wednesday 2 November 2022

సర్వజ్ఞా - మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా Sarvajna - Maha chatushashti koti yogini gana sevita


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

సారసనయని సరస వినోదిని

సామగానలోలిని సదాశివ2హ్లాదిని లలితే||

దురిత విమోచని దుర్గతి నాశిని

దుఃఖనివారిణి దేవదేవమనోల్లాసిని లలితే||

 

స్కందమాత రుద్రాయదేవాయనమః

జ్ఞానస్వరూపుడైన స్కందునిమాత, విశుద్ధిచక్రస్థిత పంచమదుర్గా రూపము సర్వజ్ఞాదేవి.

తత ఆగచ్ఛతి మధ్యమస్థానా దేవతా | రుద్రం చ మరుతశ్చ|  (యాస్కాచార్య నిరుక్తము 7.23)

రుద్రుడు భువర్లోక దేవత.

కతమే రుద్రా ఇతి| దశమే పురుషే ప్రాణా ఆత్మైకాదశస్తే యదాస్మాచ్ఛరీరాన్మర్త్యాదుత్క్రామన్త్యథ రోదయన్తి తద్య ద్రోదయన్తి తస్మాద్రుద్రా ఇతి (బృహదారణ్యక ఉపనిషత్తు 3.9.4)

తదుపరి అష్టమూర్తి దేవతయైన ఆకాశసంబంధిత రుద్రదేవుని స్థానమునకు సూచకముగా ఏకాదశ నామములను చూడవచ్చును.

1.సర్వజ్ఞా 2.సాంద్రకరుణా 3.సమానాధికవర్జితా 4.సర్వశక్తిమయీ 5.సర్వమంగళా 6.సద్గతిప్రదా 7.సర్వేశ్వరీ 8.సర్వమయీ 9.సర్వమంత్రస్వరూపిణీ 10.సర్వయంత్రాత్మికా 11.సర్వతంత్రరూపా

 

కాత్యాయని అశనాయ/భీమాయ దేవాయనమః

స్వర్ణవర్ణమయమైన ఆజ్ఞాచక్రస్థాన దేవత కాత్యాయని. మనోన్మనీయని వాగ్దేవతలచేస్తుతింపబడిన  షష్టమదుర్గాదేవి. మనస్సు సంబంధిత అష్టమూర్తి దేవతారూపము అశని.  ఋగ్వేద కౌశీతకి బ్రాహ్మణమునందు అశనిని ఇంద్రునిగ చెప్పబడగా శతపథబ్రాహ్మణమునందు ఇంద్రుని ఆయుధమైన పిడుగు/విద్యుల్లేఖ/వజ్రాయుధముగా జెప్పబడినది. ఇంద్రియములకు అధిపతి మనస్సు కావున అశని మనస్సునకు సంకేతము.

 

కాలరాత్రి ఉగ్రాయదేవాయనమః 

ఏడవచక్రమైన లలాటచక్ర (వశిన్యాదివాగ్దేవతల ఆవాసమైన అష్టకోణచక్రము) దేవత, సప్తమదుర్గారూపమైన కాలరాత్రి. వశిన్యాదివాగ్దేవతల ఆవాసమైన విద్యావిద్య/శుద్ధాశుద్ధ/అష్టకోణచక్రము, బుద్ధి సంబంధితమైనది మరియు బుద్ధి సంబంధిత  అష్టమూర్తి ఉగ్రదేవ.  ఉగ్రప్రదయైన శుక్లపక్షచతుర్దశి అధిదేవతాశక్తి కాలికాదేవియని బృహత్సంహిత(page766)యందు చెప్పబడుట గమనించదగినది. 

 

కులామృతైకరసికా-సమయాచారతత్పరా నామములవివరణయందుఅకుల”, అష్టకోణచక్రస్థ దేవతామూర్తిగా చెప్పుకున్నాము. కులమనిన సమూహము.  ఈ సందర్భములో కులమనిన తత్త్వసమూహము.  అకులము అశుద్ధ/అపరతత్త్వాతీతము మరియు శుద్ధ/పరతత్త్వములకుదిగువయైన స్థితి. లలాటచక్రము పర-అపర/అకులా స్థానము, అస్థిరమైన శివశక్త్యైక్యస్థితి. అకారము శివ వాచకము, హకారము శక్తి వాచకమగుటచే, ఈ నామములందలి మహా (అహం-మహా) శివశక్త్యైక్యతను సూచించునది.

అష్టమూర్తి ఉగ్రదేవ, వనములు మరియు ఔషధముల సంబంధిత దేవత.

ధర్మార్ధ కామమోక్షాణాం ఆరోగ్యమ్ మూలముత్తమమ్ | (చరకసంహిత 1.15)

శరీరేన్ద్రియ సత్వాత్మసంయోగో ధారి జీవితమ్

నిత్యగశ్చానుబన్ధశ్చ పర్యాయైరాయురుచ్యతే|| (ibid 1.42)

చతుర్విధపురుషార్ధములను సాధించుటకు ఆరోగ్యవంతమైన ఆయువు అవసరము. ఆయువనిన మనసు, జ్ఞానమునకు సంధానకర్తయగు ఆత్మ మరియు పృథివ్యాది పంచభూతాత్మకమైన శరీరము, కర్మ,జ్ఞానేంద్రియములు మరియు ఇన్ద్రియార్థముల సంయోగము.

 

ఉగ్రదేవ అట్టి పంచవింశతి తత్త్వముల సంబంధితమగుటచే వాగ్దేవతలు ఈ సమూహములో 25నామములను కూర్చారు.

 

1.మాహేశ్వరీ, 2.మహాదేవీ, 3.మహాలక్ష్మీ, 4.మృడప్రియా 5.మహారూపా 6.మహాపూజ్యా 7.మహాపాతకనాశినీ 8.మహామాయా 9.మహాసత్వా 10.మహాశక్తిః 11.మహారతిః 12.మహాభోగా 13.మహైశ్వర్యా 14.మహావీర్యా 15.మహాబలా 16.మహాబుద్ధిః 17.మహాసిద్ధిః 18.మహాయోగేశ్వరేశ్వరీ 19.మహాతంత్రా 20.మహామంత్రా 21.మహాయంత్రా 22.మహాసనా 23.మహాయాగక్రమారాధ్యా 24.మహాభైరవపూజితా 25.మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ

 

మహాగౌరి మహాదేవాయనమః

మహాదేవుడు

కామేశ్వరాంకస్థయైన కామేశ్వరీదేవి అష్టమచక్రమైన సోమచక్రదేవత 1.మహాకామేశమహిషీ, 2.మహాత్రిపురసుందరీ యని వాగ్దేవతలతో స్తుతించబడిన మహాగౌరి. అకులాస్థాయిని దాటిన పిదప వచ్చు సోమచక్రమునందు సమయాంతస్థయైన మహాగౌరి శుద్ధతత్త్వమైన శివశక్తుల ఏకరూపముగా భాసిల్లుతున్నది. అందువలన ఇక్కడ రెండునామములు గమనించవచ్చును.

 

సిద్ధిదాత్రి పరమేశ్వరాయనమః

బ్రహ్మరంధ్రస్థానమునందలి సత్-చిత్-ఆనందమయ తత్త్వమును సూచించు విధముగా సిద్ధిదాత్రి నవదుర్గారూపమును మూడు నామములతో కీర్తించినారు వాగ్దేవతలు.  ఈ నామములందలి చతుష్షష్టి యొక్క విశేషమును చూద్దాము.

 

ఐత్రేయబ్రాహ్మణమునందు చతుష్షష్టి (అరవైనాలుగు) సంఖ్యను స్వర్గలోకసంబంధితముగ చెప్పబడినది. ఒక్కొక్కలోకమునకు 21చొప్పున మూడులోకములకు అరవైమూడు అడుగులుకాగా, అరవైనాల్గవ అడుగు స్వర్లోక ప్రవేశమును సూచించునది. (ఐత్రేయబ్రాహ్మణము మొదటిఅధ్యాయము ఐదవఖండము).

 

సచ్చిదానందమయ పరమాత్మస్థానమైన బిందువు సంబంధిత మూడునామములకు వాగ్దేవతలు చతుష్షష్టిని వాడుటయందలి అంతరార్ధము ఇదియే.

 

ఇక నవదుర్గాస్వరూపమైన సిద్ధిదాత్రి సంబంధిత మూడునామములు :

1. చతుష్షష్టి ఉపచారాఢ్యా , 2. చతుష్షష్టి కలామయీ, 3.మహా చతుష్షష్టి కోటియోగినీగణసేవితా

 

నిర్వాణచక్రమైన బ్రహ్మరంధ్రస్థాన నవమదుర్గాస్వరూపము ద్వారచక్రమునందలి అణిమాద్యష్టసిద్ధులను ప్రసాదించునది మాత్రమేకాదు పరమపదమును సిద్ధింపజేయునది.

అనన్యసులభయైన తల్లిని ప్రార్ధిస్తూ 

 

శ్రీమాత్రేనమః