Saturday 30 June 2018

SrI mAtA SrI mahArAjnI SrImatsimhAsanESvarI శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
కరోతియా బిభర్తియా నిహంతియా జగత్త్రయమ్
సమన్తతో విభాతియా న దృశ్యతే క్వచిత్ చ యా|
అతీవ గుప్త రూపిణీ, గురూపదేశమన్తరా
న శక్యతే బుధైశ్చ బోద్ధుమంధకారి సుందరీ|| (ఉమాసహస్రము 2.3)
అంధకుడను రాక్షసునకు శత్రువగు శివుని సుందరి ఈ ముల్లోకములను సృష్టించి, భరించి లయించుచుండును. ఆమె ప్రకాశింపని స్థలము లేదు. అయిననూ, అగోచరముగ, గుప్తముగా నున్నది.  అతి సూక్ష్మమగు ఆమె రూపమును గురూపదేశము లేకుండా ఎంతటి పండితులు కూడా తెలుసుకొనజాలరు.
ధ్యాన శ్లోకము
అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపామ్
అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్.

శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ
పిపీలిక నుండి బ్రహ్మపర్యంతము మాతగా సృష్టించి, మహారాణిలాగ పాలించి, సింహాసనేశ్వరిగా లయింపజేయు పరాశక్తి లలితమ్మ.
యతో వా ఇమాని భూతాని జాయన్తే| యేన జాతాని జీవన్తి|
యత్ప్రయన్త్యభిసమ్విశంతి| తద్విజిజ్ఞాసస్వ | తద్బ్రహ్మేతి| 
(తైత్తిరీయ ఉపనిషత్తు 3.1)
యతః దేనినుంచి ఇమానిభూతాని చరాచరజగత్తు జాయన్తే సృజిమ్పబడినదో జాతాని సృజింపబడి యేన దేనివలన జీవన్తి పోషింపబడుతున్నదో యత్ప్రయన్తి దేనియందు ఉపసంహరింపబడి అభిసమ్విశంతి పరిపూర్ణముగా లయించునో తత్విజిజ్ఞాసస్వ దానిని విశిష్టమైన జిజ్ఞాసతో తెలుసుకొనుము తత్ అది బ్రహ్మేతి బ్రహ్మయే.

మొదటి మూడు నామములలోనే బ్రహ్మవిద్యను ప్రతిపాదిస్తున్నారు వశిన్యాదివాగ్దేవతలు.

శ్రీమాతా (సృష్టికారిణి), శ్రీమహారాజ్ఞీ(స్థితికారిణి), శ్రీమత్సింహాసనేశ్వరీ(లయ కారిణి) ఈ మూడు నామములందునూ ఉన్న శ్రీ ని మొదట అర్ధము చేసుకుందాము.

శ్రీ  అంటే మనకు వాడుకలో ఉన్న అర్ధముశోభాయమానమైన/పూజనీయమైన’. దీనినే ధనశ్రీ అని చెప్పబడునుఎవరైనా ఎప్పుడు పూజనీయులవుతారు? వారి వద్ద ఏదో ఒక విభూతి పుష్కలముగా ఉండుట చేత పూజనీయులువిభూతి అంటే ఐశ్వర్యము. ఆ ఐశ్వర్యము శక్తి కావచ్చు, విద్య/జ్ఞానము కావచ్చు, సంపద కావచ్చు. ధనము, అభిజనము (మన చుట్టూ ఉండే జన సమూహము - పరిజనము, సుహృద్వర్గము), ఐశ్వర్యము అను రూపములతో ఉన్న త్రివర్గ (ధర్మ అర్ధ కామ) సంపద్విభూతి ఈ శ్రీ.

ఈ ధనశ్రీ కావాలనే ఇంద్రుడు లక్ష్మీ స్తోత్రమునందు
మా న: కోశం తథా గోష్ఠం మా గృహం మా పరిచ్ఛదం
మా శరీరం కళత్రం చ త్యజేథా: సర్వ పావని
మా పుత్రాన్మా సుహృద్వర్గ మా పశూన్మా విభూషణం
త్యజేథా మమ దేవస్య విష్ణోర్వక్ష: స్థలాలయే
! సర్వ పావని, విష్ణువక్షస్థలాలయే!! (నః) మా కోశమును అంటే ధాన్యాగారమును, గోష్ఠమును అంటే పశుశాలను, గృహమును, పరిజనులను (సేవక జనులనుమరి మనకి పనిచేసే వాళ్ళు బాగుంటేనే కదా మనము బాగుండేది. పనిఅమ్మాయి వస్తేనే కదా మనము ప్రశాంతముగా ఉండి చికాకు లేకుండా ఆహ్లాదకరముగా, శోభాయమానముగా ఉండగలము!!), శరీరమును, కళత్రమును, పుత్రులను, సుహృద్వర్గములను, పశువులను, విభూషణములను మా త్యజేధాః విడువకుము, అని లక్ష్మీదేవిని ప్రార్ధించినాడు.

కావున శ్రీమాతా అంటే, పూజ్యనీయురాలగు/శోభాయమానమైన ఓ తల్లీ అని లౌకికార్ధము.

తాత్త్వీకార్ధము చూస్తే, వేదమునందు ప్రతిపాదింపబడిన సృష్టి, స్థితి, లయ కారకమైన పరతత్త్వమే శ్రీ. బ్రహ్మానంద లక్షణ రూపమైన ఈ పరతత్త్వమును బ్రాహ్మీశ్రీ అని చెప్పబడును.
యా నిత్యా చిద్ఘనానందా గుణరూప వివర్జితా|
ఆనందాఖ్యా పరా శుద్ధా బ్రాహ్మీశ్రీ రితి కథ్యతే||
బ్రాహ్మీశ్రీ నిత్య, చిదానందస్వరూప. త్రిగుణ రహితమగునది (గుణరూప వివర్జిత) అగుటచే ఆనందా అను నామముతోను పరా, శుద్ధా అను నామములతోను వ్యవహరింపబడును.

ఋచ స్సామాని యజూగ్Oషి (ఋక్ యజుర్ సామ వేదాత్మకమైనటువంటి వేద స్వరూపము) సా హి (ఆమె) శ్రీః (శ్రీ) అమృతా (అమృతమైనది) సతామ్ (శాశ్వతమైనది).

క్లుప్తముగా శ్రీ అంటే
-       శక్తి (చైతన్యము)/చిచ్ఛక్తి
-       వేదము
-       జ్ఞానానంద స్వరూపము
-       (లక్ష్మీ సరస్వతీ ధీ) ఐశ్వర్య వాచకము
-       శోభ
-       త్రివర్గ (ధర్మ అర్ధ కామ) సంపద్విభూతి
-       పూజనీయమైన
(ధనము, అభిజనము, ఐశ్వర్యము) ధనశ్రీ మరియు (ఋగ్యజుస్సామ వేదాత్మ) బ్రాహ్మీశ్రీ అని రెండు విధములుగా తెలియబడుచున్న శ్రీ తో అనుబంధము గల ఏ తత్త్వమైనను శ్రీ అని చెప్పవచ్చును. ఉదాహరణకు జ్ఞానము వలన వచ్చు తేజస్సు కూడా శ్రీ యే.

యథా (ఎలా) ఉర్ణనాభిః (సాలె పురుగు) సృజతే (వలను సృష్టిస్తుందో) గృహ్ణతే (ఉపసంహరించుకుంటుందో)
యథా (ఎలా) పృథివ్యామ్ (భూమినందు) ఓషధయః (ఔషధములు) సంభవన్తి (పెరుగుతున్నాయో)|
యథా (ఎలా) సతః పురుషాత్ (సజీవ పురుషుని దేహము నుంచి) కేశలొమాని (కేశములు పెరుగునో)
తథా (అలా) అక్షరాత్ (బ్రహ్మమునుంచి) సంభవతీహ విశ్వమ్|| (ముండక ఉపనిషత్తు)

శక్తి తత్త్వాత్వకమైన పరంబ్రహ్మము నుండియే ఈ విశ్వము సృష్టింపబడినది. ఈ విశ్వమంతా నిర్గుణ నిరాకార పరతత్త్వము నుండి సృజించబడుట వలన ఆమె శ్రీమాత.

శ్రీమహారాజ్ఞీ
మహారాజ్ఞీ అంటే  సర్వపాలకురాలుఆమె ఈ జగత్తుకంతటికీ శ్రీమహారాజ్ఞి/మహారాణి.

మహాయాగ సమాప్తి పర్యంతము పరశంభుడు చిదగ్నిస్థ యగు ఈ బ్రహ్మ తత్త్వము సగుణ సాకారముగా చిదగ్నికుండమునుంచి ఆవిర్భవించమని అష్ట కారికలతో స్తుతించాడు. అందు
లోకసన్త్రాణ రసికే మఙ్గళే సర్వ మఙ్గళే|
లలితాపరమేశాని సంవిద్వహ్నేస్సముద్భవ|| (అష్టకారికలు- లలితోపాఖ్యానము)
లోకములను రక్షించటమునందు ఆసక్తి గల ఓ! మంగళా! సర్వ మంగళా! లలితా పరమేశ్వరీ! దేవకార్యార్ధము ఉద్భవించమ్మా!! అని ఒక కారికశ్రీమాతయైన లలితా పరమేశ్వరికి సకల లోకములను సంరక్షించుట అమిత ఆనందదాయకమని పరమశివుడే అమ్మను స్తుతించాడు.   

లలితా పరమేశ్వరి ఆవిర్భవించిన వెంటనే, దేవతలందరు లలితమ్మని స్తుతిస్తూ చేసిన లలితాస్తవరాజము నందు
జాతస్య జాతమానస్య చేష్టాపూర్తస్య హేతవే|
నమస్తస్యై త్రిజగతామ్ పాలయిత్ర్యై పరాత్పరే|| (లలితోపాఖ్యానము అ8-శ్లో5)
అని నమోవాకములు పాడినారు.

ఏ తల్లి వలన ఈ చరాచర జగత్తు సృజింపబడినదో ఆమె వలననే పాలింపబడుతున్నది. తనచే సృజించబడిన లోకములను రక్షించి, పాలించుకొను అమ్మయందు శ్రీ మహారాజ్ఞీ అను నామము సిద్దముగా ఉన్నది.

శ్రీమత్సింహాసనేశ్వరీ
సింహ హింసార్థకఃహింస (హింస అనే ధాతువు నుంచి వచ్చినది)
ఆసనవమనము చేయుట
ఈశ్వరిశక్తిమంతమైన
మహాశక్తిమంతమైన సృష్టి వినాశకారిణి/లయకారిణియగు తల్లికి నమస్కారము.

శ్రీమంతమైన (చైతన్యవంతమైన) సింహాసనము (సింహ-శ్రేష్ఠమైన, ఆసనము-కూర్చుండేచోటు/వ్యాపించిన చోటు) మీద ఆసీనురాలై ఉన్నదిఆమె ఎక్కడో ఉన్న సింహాసనము మీద కాదు మనకు అతి సమీపముగా ఉన్న మన హృదయ సింహాసనము మీద అధిష్ఠురాలై యున్నది.

మొదటి మూడు నామములు అమ్మవారి సృష్టి, స్థితి, లయాది విన్యాసములను చెప్పునవి. విన్యాసము ఎందువలనంటే ఆవిడకు అది లీల/కేళి కావున. దీనినే కావ్యకంఠ గణపతి ముని ఉమా సహస్రమునందు అమ్మా, నీవు సదా బాలవే ఎందువలననంటే, శైశవదశయందు బాలులు క్రీడావస్తువులను చేసి చేసి భంజించుదురు కదా నీవు అటులనే బ్రహ్మాండములను సృజించి సృజించి భంజించుచుందువు అని ఈ క్రింది శ్లోకమునందు చెప్పినారు.
కారఙ్కారముమే! యద్ బ్రహ్మాణ్డాని నిహంసి|
తన్మన్యే సురమాన్యే బాలైవామ్బ! సదాత్వమ్||
దేవీ సప్తశతియందు కూడా అమ్మయొక్క ఈ లీలావిలాసములు ప్రస్తావింపబడినవి

సృష్టి స్థితి లయాదులు జరపమని కనుబొమల కదలికలతోనే విధాతాహరిరుద్రాదులను మహారాణి అయిన అమ్మ ఆజ్ఞాపిస్తున్నది అని ఆదిశంకరులు సౌన్దర్యలహరిలో ఈ క్రింది శ్లోకము నందు చెప్పారు.
జగత్సూతేధాతా హరిరవతి రుద్రః క్షపయతే
తిరస్కున్నేతత్ స్వమపివపురీశ స్తిరయతి
సదాపూర్వఃసర్వమ్ తదిదమనుగృహ్ణాతి చ శివ-
స్తవాజ్ఞా మలమ్బ్య క్షణచలతియో ర్భ్రూలతికయోః
సృష్టి (ధాత), స్థితి (హరి), లయము (రుద్ర) తిరోధాన-కనుమరుగు అగుట (ఈశ) అనుగ్రహము (పూర్వ స్థితిని అనుసరించి గ్రహించుట)(శివ) యనబడు పంచకృత్యములు, తల్లి కనుబొమల క్షణ కదలికతో (క్షణచలతియో ర్భ్రూలతికయోః) బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ, శివుల వలన జరిపిస్తున్నది. ఈ కార్యక్రమములను వీరు ఎలా నిర్వహిస్తున్నారు అంటే దీనికి అతి సూక్ష్మమైన అమ్మవారి పాదపద్మముల ధూళి కణములే ఆధారం అని తనీయాంసం పాంసుం తవ చరణపంకేరుహం అనే శ్లోకమునందు వర్ణించారు.

ఒక చిన్న వృత్తాంతము:
ఒకసారి తిరుక్కడయూర్ అమృతఘటేశ్వర-అభిరామి దేవాలయమునకు వచ్చిన అక్కడి రాజుగారు, అమ్మమీద అఖండ భక్తి గలిగిన అభిరామి భట్టులను చూచి ఈ రోజు తిధి ఏమిటి అని అడిగినప్పుడు, అమ్మవారి పూర్ణచంద్రవదనమును ఊహించుకుంటూ మైమరచియున్న భట్టులు పౌర్ణమి అని చెప్తారుకానీ ఆ రోజు అమావాస్య. ప్రక్కనేయున్నవారు ఈ రోజు పౌర్ణమి కాదు అమావాస్య అని చెప్పగా, భట్టులు తనను అవమర్యాద చేసినట్లు భావించి ఆగ్రహించిన ఆ రాజు, భట్టులవారితో మీరు పౌర్ణమి అని చెప్పారు కదా, నాకు తెల్లవారేలోగా నిండుచంద్రుడిని చూపించండి లేదా మీకు శిరచ్ఛేదనము తధ్యము అనిచెప్పి వెళ్తారు. అప్పుడు ప్రజ్ఞలోకి వచ్చిన భట్టులు అమ్మవారి మీద అందాది పాడగా (పాడుతూనే ఉండంగానే) అమ్మవారు తన ముక్కెరను విసిరి ఆకాశమునందు ఎగురవేసినదిప్రకాశవంతమైన ఆ ముక్కెర నిండుచంద్రునివలే భాసిల్లుతుండగా చూచిన ఆ రాజు భట్టులవారి అమేయ భక్తికి పాదాభివందనము చేస్తాడు.

ఆయన పాడిన అభిరామి అందాది తమిళ భాషలో100 పద్యములు గల ఒక స్తోత్రము. ఈ స్తోత్రమునకు ఒక ప్రత్యేకత గలదుప్రతి పద్యము చివరి (అంతము) వార్తతో తదుపరి పద్యము ఆరంభము (ఆది) అవుతుంది. అందువలన దీనికి అందాది అని పేరు.

ఇక మనము ప్రస్తావిస్తున్న విషయమునకు వస్తే, ఆ అందాది నుంచి ఒక పద్యము చూద్దాము.
పూత్తవళే ! భువనమ్ పదినాన్గియుమ్ పూత్తవణ్ణమ్ కాత్తవళే !
పిన్ కరన్దవళే ! కరైకణ్ఠనుక్కు మూత్తవళే!
ఎనృమ్ మూవా ముకున్దనుక్కు ఇళయవళే!
మాత్తవళే! ఉన్నై అన్రి మట్ట్రోర్ దైవమ్ వన్దిప్పదే?
పూత్తవళేసృష్టి చేయుతల్లీ
కాత్తవళేస్థితి చేయుతల్లీ
పిన్ - తదుపరి
కరన్దవళే - లయించుతల్లీ
కరైకణ్ఠనుక్కు - నీలకణ్ఠునుకి
మూత్తవళే - పూర్వము ఉద్భవించిన తల్లీ
ఎనృమ్ మూవా అనంతమైన
ముకుందనొక్కు ముకుందునికి
ఇళయవళ్ - సహోదరి/భగిని
మాత్తవళే - మహత్త్వము గలదానా!!
ఆఖరి వరుస, నిన్ను తప్ప వేరే దైవమును పూజించడమే? అంటే నిన్ను తప్ప వేరొరు దైవమును పూజింపను అనుట.

అద్భుతమైన ఈ పరబ్రహ్మతత్త్వమును భాషాభేదములేకుండా, అమ్మ మీద నిజమైన భక్తియున్న వారందరికీ అవగతమౌతుంది అని ముచ్చటించటము కోసము ఈ అభిరామ భట్టుల గురించి చెప్పాను.

నిజానికి వేదప్రతిపాదితమైన ఏ భగవంతుని తత్త్వమునందునైననూ ఈ సృష్టి స్థితి సంహారక కర్తృత్వము శాస్త్రములందు మనము చూడవచ్చును. ఈ అనంత నిర్గుణ నిరాకార తత్త్వమునకు పురుష రూపమును అపాదించి విష్ణుపురాణమునందు స్తుతింపబడినది.

సృజత్యేష జగత్సృష్టౌ స్థితౌ పాతి సనాతనః|
హన్తి చైవాన్తకత్వేన రజఃసత్త్వాదిసంశ్రయః|| (విష్ణుపురాణము 1.22.22)
రజస్సత్త్వాది గుణములతో సనాతనుడైన ప్రభువు ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి లయాదులను జరుపుతున్నాడు. ఈ విశేషమును విష్ణు సహస్రనామ స్తోత్రమునందు కూడా భీష్మపితామహుడు స్తుతించినాడు.
సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్|
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్|| (భగవద్గీత 9-7శ్లో)
గతిర్భర్తా ప్రభుః సాక్షీ నివాసః శరణమ్ సుహృత్
ప్రభవః ప్రళయః స్థానం నిధానమ్ బీజమవ్యయమ్|| (భగవద్గీత 9-18శ్లో)
స్వయమ్ భగవాన్ శ్రీ కృష్ణుడు భగవదీత యందు కల్పక్షయమునందు ప్రకృతిని పొందిన సమస్త సృష్టినీ, కల్పాదియందు అహమ్-నేను (వివిశేషముగా/విశిష్టముగా) సృజిస్తున్నాను. ఈ సృష్టియంతటికీ గతి, భర్త, ప్రభువు, సాక్షీ, నివాసము, శరణమొందదగినవాడూ, హితుడు, సృష్టి స్థితి లయ కారకుడునాశరహిత బీజము అన్నీ నేనే అని చెప్పియున్నాడు.

లలితా సహస్ర నామ స్తోత్రము మంత్ర గర్భితమైనది అని చెప్పుకున్నాము కదా. ఈ మూడు నామములందు గల మంత్ర విశేషములను (మితముగా) తదుపరి తెలుసుకుందాము.

మననాత్ త్రాయతే ఇతి మంత్రమ్ మననము చేయుటవలన రక్షించునది మంత్రము. మంత్రములు గురుముఖత ఉపదేశము పొందిన తరువాతనే ఉపాసించవలెను. పుస్తకములందు చూసి పఠించరాదు/జపించరాదు. మంత్రజపమునకు దేశ మరియు కాల నియమములు కూడా కలవు. నామ జపమునకు ఆ నియమములు లేవు.

శబ్దబ్రహ్మమైన ఓంకారము ప్రకట ప్రణవము/దీర్ఘ ప్రణవము. ఈంకారము గుప్త మహాసారస్వత ప్రణవ బీజము అని మంత్రశాస్త్ర ప్రసిద్ధము. ఇదే లక్ష్మీ బీజముతురీయమైన (అక్షరములలో అ ఆ ఇ ఈనాలుగవది) ఈ కారము శక్తి వాచకము. శక్తి వాచకమైన ఈ కారమును బీజము చేయుటకు నాదము కలపవలెను. (+మ్=ఈం).

తామీకారాక్షరోద్ధారామ్ సారాత్సారామ్ పరాత్పరామ్ ప్రణమామి మహాదేవీమ్ పరమానందరూపిణీమ్ మాతృకా స్తుతినందలి వాక్యము ఈంకార మహిమను చెప్పుచున్నది.

మంత్రద్రష్టలైన మన ఋషులు, ఆదిశంకరులు మొదలయిన గురువులు, బీజాక్షరములు నిబిడితముచేసి పల పల స్తోత్రరచనలు చేసారు. ఉపదేశము లేకుండగనే, ఈ స్తోత్రముల పారాయణము వలన తత్ఫలితమును పొందవచ్చుఉదాహరణకు మూకశంకరుల మూకపంచశతి నందలి ఆర్యాశతకమునందు, వేదమయీమ్ నాదమయీమ్.., ధరణిమయీమ్ తరణిమయీమ్... శ్లోకములందు ఈం బీజమును గుప్తముగా ఉండుట చూడవచ్చును. అదేవిధముగా, ఆదిశంకరులు విరచిత మీనాక్షీ పంచరత్నమునందు కూడా ఈ బీజమును విరివిగా చూడవచ్చును.

దుర్గాసప్తశతినందలి రాత్రి సూక్తమునందు, అమ్మ ఈంకారము మాత్రమే కాదు శ్రీం, హ్రీం మొదలగు ప్రణవములు కూడా అని చెప్పబడినది త్వమ్ శ్రీస్వమీశ్వరీ త్వమ్ హ్రీత్వమ్ బుద్ధిర్బోధలక్షణా.

ప్రణవము చిదగ్నికి (బ్రహ్మకు) సంకేతము కాగా చిదగ్నియందలి మహాగ్నికి రకారము సూచితము. మహాగ్నియొక్క వేడి, వెలుతురుయను రెండులక్షణములకు శ్రీ, హ్రీలు వరుసగా సంకేతములు. హ్రీ వెలుతురు, శ్రీ, వేడిని తెలియజేయునవి.
హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ పురుష సూక్తము
బ్రహ్మవాచకమైన ప్రణవమునకు హ్రీ, శ్రీ లు రెండునూ పత్నీస్థానీయములు.

శ్రీం (శకార, రకార, ఈం బీజముల కలయిక) అమ్మవారి ప్రణవము. శ కారము - ఆనంద వాచి, ర కారము జ్ఞాన/తేజస్సు వాచి, ఈం కారము శక్తిబీజము. అందువలన శ్రీం బీజము, జ్ఞానానంద శక్తిని సూచిస్తుంది.

శ్రీ-సూక్తము నందు ఉన్న శ్రీం బీజము ఉపాసకులందరికీ విదితమే. ఆదిశంకరులు సౌన్దర్యలహరిలోని శరజ్జ్యోత్స్నాశుద్ధా శశియుత జటాజూట మకుటాః శ్లోకమునందు శ్రీంకారము నిక్షిప్తము చేశారుపరోక్షప్రియా దేవాః అనుసూక్తిని అనుసరించి మొదటి రెండు అక్షరములైన శ కార ర కారములకు శశియుత (మ్ కారమును సూచించే పూర్ణచంద్రునివలేయున్న 0) జటాజూట మకుటము (ఈకారపు కొమ్ము) కలిపితే వచ్చేది శ్రీం. ఈ బీజమును గుప్తముగా ఉంచి రచించినారు.

నిత్యోత్సవ తంత్రమునందు ఈ బీజమును వాంతమ్ వహ్నిసమారూఢమ్ వామనేత్రేందు సంయుతమ్ అని వర్ణించారు. వాంతమ్వ తరువాత వచ్చే అక్షరము శ; వహ్ని సమారూఢమ్ ర తో కలిపి; నేత్రము అంటే మంత్రశాస్త్రమునందు ఇ అని అర్ధము, వామనేత్రమ్ అంటే ఈ కారము ఇందు సంయుతమ్ అంటే 0 పూర్ణబిందువు అని అర్ధము.

వియదీకారసంయుక్తమ్ వీతిహోత్ర సమన్వితమ్|
అర్ధేన్దులసతిమ్ దేవ్యా బీజం సర్వార్ధసాధకమ్|| (అథర్వవేదమునందలి దేవీ అథర్వశీర్ష సూక్తము)
(వియత్-ఆకాశము) హకారము + ఈ కారము + (అగ్ని) ర కారము + అర్ధేన్దు (మ్) = హ్రీం
హ్రీ వెలుతురుకు సంకేతముగాన, వ్యక్తీకృతమైన శక్తిని సూచిస్తుంది.
హ్రీంవ్యక్తమైన శక్తి/మహాలక్ష్మి/మాయ/త్రిపురసుందరి/శివశక్త్యాత్మకము

ఐం, హ్రీం, శ్రీం, క్లీం, సౌః బీజములు అమ్మవారి పంచ ప్రణవములు.
ఐంవాగ్బీజము /సరస్వతి/ గురు
క్లీం కామకళా బీజము/మహాకాళి
సౌః మోక్ష ప్రదము (సకారము - సరస్వతీ వాచకము + ఔకారము - బ్రహ్మవిద్యా వాచకము/మోక్షప్రద శక్తి)

లఘుస్తవము ప్రథమ శ్లోకము నందు సర్వమంత్రశాస్త్రసౌధమునకు పునాదిరాళ్ళయిన బాలామంత్ర బీజములను గుప్తముగానుంచి రచించినారు, మహాకవి కాళిదాసు. ఈ బీజములను క్రమముగా గానీ, క్రమము తప్పించి గానీ, బీజములందు గల హల్లుల తొలగించి గానీ (క్లీం నుంచి హల్లు క ను తొలగించిన ఈం, సౌః నుంచి హల్లు స ను తొలగించిన వచ్చు ఔః) అంటే ఐం, ఈం, ఔః లను గానీ, ఒక్కొక్కటి గానీ, కలిపి గానీ ఎటుల జపించిననూ సర్వసిద్ధులు లభిస్తాయి అని మహాకవి కాళిదాసు లఘుస్తవమునందలి ఆరవ శ్లోకమునందు చెప్పారు.

ఇలా ఇంకా ఎన్నెన్నో మంత్రవిశేషములు చెప్పుకోవచ్చును. నేను మచ్చుకు రెండు సందర్భములు చెప్పాను కానీ, మీరు గమనిస్తే చాలా మంత్రగర్భిత స్తోత్రసాహిత్యము ఉన్నది.

ఇక లలితా సహస్రనామ స్తోత్రమునకు వస్తే, మొదటి మూడు నామములందు గల గుప్తబీజము ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది.

అంతేకాకుండా, ఈ మూడు నామములందును శివశక్తైక్యతను ప్రతిపాదించారు వశిన్యాదివాగ్దేవతలు. మాతా శబ్దమునకు స్త్రీలింగరూపమునందు తల్లి అనియు పుంలింగ రూపమునందు కొలుచువాడు (కొలతమానము) లేదా సర్వజ్ఞుడు అనియు అర్ధములు కలవు. అందువలన మాతా నామమునందు ఉత్కృష్ట సత్యమైన అహం యొక్క ప్రకాశ విమర్శాత్మకమైన శివశక్తుల సామరస్యమును తెలియజేస్తుందిశ్రీమహారాజ్ఞీ యందుగల అకార (ప్రకాశ) హకారములు (విమర్శ) కూడా వాగర్ధముల వల్లే సహచరించు శివశక్తులను ప్రతిఫలిస్తున్నాయి. ఇక మూడవ నామమునకు వస్తే, శ్రీచక్రమే ఆవిడ సింహాసనము.  
చతుర్భిః శివచక్రేశ్చ శక్తిచక్రైశ్చ పఙ్చభిః
నవచక్రైశ్చ సంసిద్ధమ్ శ్రీచక్రమ్ శివయోర్వపుః||  
ఈ విధముగా మూడవనామమునందునూ శివశక్తుల సామరస్యము తెలియజేయబడుతున్నది.

శ్రీమాత్రేనమః