Wednesday 27 June 2018

Lalitha Sahasranamam Introduction లలితాసహస్రనామము-ఉపోద్ఘాతము

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్| 
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
మిత్రులారా!! నా శక్తికి మించిన  లలితాసహస్రనామములకు వివరణయను ఈ బృహత్ కార్యం శక్తిప్రేరేపణతో ప్రారంభిస్తున్నాను. నేను ముందుగానే మనవి చేసుకుంటున్నాను. అతి తక్కువ జ్ఞానము మరియు అనుభవముగల దానిని.  ఏదయిన తప్పుగా రాస్తే దయచేసి పెద్ద మనసుతో క్షమించి సరిదిద్దగలరు. సాక్షాత్ భగవత్ స్వరూపులయిన ఆది శంకరులే శ్రుతీనామగమ్యే సువేదాగమజ్ఞ అని చెప్పినప్పుడు, అతి సామన్యురాలిని నేనెమ్మాత్రం? అయినా ఆవిడని 
సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహీ బుధిం యా నః ప్రచోదయాత్||      
అని నా బుద్ధిని ప్రేరేపించమని వేడుకుంటున్నాను.
మహాకవి కాళిదాసు
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ వనవాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా|
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిప సుతా
ఘోటీఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీరసేన తనుతామ్ || (దేవీ అశ్వధాటి)
అని ప్రార్ధించినట్లు, నేను కూడ నాకు ఉత్తమ వ్యాఖ్యాన ధాటిని ఆ అమ్మవారు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను.   
వందే గజేంద్ర వదనం | వామాంకారూఢ వల్లభాశ్లిష్టం |
కుంకుమపరాగశోణం | కువలయినీజార కోరకాపీడం || (ఆర్యా ద్విశతి)

పీఠిక
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే| 
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ||

ప్రతి జీవుడు ఇహ మరియు పరలోకములలో సుఖముగా ఉండవలెనని కోరుకుంటాడు. ఏ కొంతమందో మోక్షానికి ప్రయత్నిస్తారు. 

కామ్య సిద్ధి కొరకు ఎన్నో పూజలు, జపములు మరియు యజ్ఞ యాగాదులు నిర్వహిస్తారు. వేద వ్యాసుడు వేదములను విభజించి వీటికి అవసరమయిన మంత్ర, తంత్రముల విజ్ఞానము మనకు అందించారు. విష్ణు స్వరూపుడైన ఆ మహనుభావునికి శతకోటి నమస్కారములు. 

తంత్రము అంటే పద్ధతి. భగవంతుని ఆరాధించే విధానము అది జపం కావచ్చు, యజ్ఞ, యాగాదులు కావచ్చు. ఉదాహరణకు, ఎప్పుడు ఏ మంత్రంతో ఆజ్యమును అగ్నిలో ఏ సమయములొ వేయవలెను అని చెప్పునది తంత్రము.  లోకంలో ఎన్నో తంత్ర విద్యలు ఉన్నాయి.  ఇలా ఉన్న తంత్రములు కొన్ని భుక్తిని అంటే ఇహలోకంలో, పరలోకంలో దొరికే సుఖములు మాత్రమే ఇస్తాయి లేదా ముక్తిని (లోకాతీత స్థితిని) మాత్రమే ఇస్తాయి. అందువల్ల అమ్మవారు ఆ పశుపతిని  (చతుఃషష్ట్యా తంత్రైః సకలం...) జీవులకు భుక్తిని, ముక్తిని కలిపి ఇచ్చేటి ఒక తంత్రమును ఇవ్వమని నిర్బంధించింది. అపుడు పరమశివుడు గురుదక్షిణామూర్తి స్వరూపంతో ప్రసాదించిన  భుక్తిముక్తిదాయకమయిన తంత్రమే శ్రీవిద్య. గోచర, అగోచర, సకల చరాచర సృష్టియందంతటనూ ఒకే సత్-చిత్-ఆనంద బ్రహ్మవస్తువుయని తెలియజేయునది బ్రహ్మవిద్య. అట్టి జ్ఞానమునందించు తంత్రం కావడం చేత శ్రీవిద్య బ్రహ్మవిద్యగా పరిగణింపబడుతున్నది.  

వర్ణితమ్ నైవమ్ శక్యేయమ్ శ్రీవిద్యా షోడశాక్షరీ|
బ్రహ్మవిద్యాస్వరూపా హి భక్తిముక్తిఫలప్రదా||(వామకేశ్వర తంత్రము)

బ్రహ్మవిద్యా స్వరూపుడైన దక్షిణామూర్తి బోధించినదే ఈ శ్రీవిద్య.  శ్రీవిద్యకు సూత్రము వంటిది లలితా సహస్రనామ స్తోత్రం.  శ్రీచక్ర విశేషములు, యోగ విద్యా విశేషములు ఇంకా ఎన్నో శ్రీవిద్యా విశేషములు ఇమిడి ఉన్నాయి ఈ లలితా సహస్రనామ స్తోత్రంలో.  హయగ్రీవస్వామి లోపాముద్రాపతియైన అగస్త్యుల వారికి లలితా సహస్రనామ స్తోత్రము బోధించిన ఘట్టము బ్రహ్మాండ పురాణములో ప్రస్తావించడం జరిగింది.         

శాస్త్రములు రెండు విధములు: ప్రకట శాస్త్రములు, గుహ్య శాస్త్రములు.  అతీంద్రియ విజ్ఞానము గురించి చెప్పేశాస్త్రములు గుహ్య లేదా రహస్యశాస్త్రములు అని పేరు. గుహ్య, గుహ్యతర మరియు గుహ్యతమ ఒకదానికంటే మరియొకటి ఎక్కువ రహస్యమైనది. ధర్మ శాస్త్రములు గుహ్య శాస్త్రములు.  మంత్ర శాస్త్రములు గుహ్యతర శాస్త్రములు.  బ్రహ్మవిద్య, తత్త్వవిద్య గుహ్యతమ శాస్త్రములు. లలితా సహస్రనామములందు ఈ మూడు కలబోసినందు వలన ఈ నామములు రహస్య నామములు
శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment