Friday 29 June 2018

sThUla, sUkshma, sUkshmatara, sUkshmatama స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
అర్చనకాలే రూపగతా, సంస్తుతి కాలే శబ్దగతా|
చింతనకాలే ప్రాణగతా, తత్త్వవిచారే సర్వగతా||
ప్రతి దేవతా మూర్తికీ స్థూల(విగ్రహ), సూక్ష్మ (మంత్ర/యంత్ర), సూక్ష్మతర (కుండలిని), సూక్ష్మతమ (సర్వవ్యాపకత్వ) రూపములు గలవు. ఇవి ఒకదానికంటే మరియొకటి సూక్ష్మము.

స్థూలరూపము అంటే విగ్రహ రూపము. లలితాసహస్రనామములందలి ఉద్యద్భాను సహస్రాభా నుండి సర్వాభరణభూషితా నామముల వరకు అమ్మవారి దివ్యమంగళ సగుణసాకార స్థూలరూప వర్ణన చేయబడినది.

సూక్ష్మ రూపము అంటే మంత్ర/యంత్ర రూపము. అమ్మవారి 15 అక్షరముల మంత్రము, 3 కూటములుగా వాగ్భవ, కామరాజ మరియు శక్తి కూటములుగా విభజించబడినది. దేవతా శరీరములు మంత్రమయములు అని చెప్పుకున్నాము. అమ్మవారి శరీరము నందు శిరస్సు నుంచి కంఠము  వరకు (ఆజ్ఞా, విశుద్ధి చక్రములు - చంద్ర మండలము)  వాగ్భవ కూటము గాను, కంఠము నుంచి కటి వరకు (అనాహత, మణిపూరక చక్రములు - సూర్య మండలము)  కామరాజ కూటము గాను, కటి నుంచి క్రింది భాగము వరకు (స్వాధిష్ఠాన, మూలాధార చక్రములు - అగ్ని మండలము) శక్తి కూటము గాను తెలియబడుచున్నది. వాగ్భవ కూట ఉపాసన వలన ధర్మము, కామరాజ కూటము వలన అర్ధ కామములు మరియు శక్తి కూటము వలన మోక్షము కలుగుతాయి.శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖపంకజా నుండి కూటత్రయకళేబరా నామముల వరకు తల్లి పంచదశిమంత్ర విశేషముల వివరణ ఇవ్వబడినది.

శ్రీచక్రము అమ్మయొక్క యంత్రము, మంత్రము యొక్క రేఖావర్ణనము తెలియజేయునది.  అందువలన శ్రీచక్రమునందు  కూడా ఈ మూడు మండలములు దర్శించవచ్చు. శంకర భగవత్పాదుల వారు మాతృకాపుష్పమాలా స్తోత్రమునందు ఏణాంక(చంద్ర) అనల (అగ్ని) భాను (సూర్య) మండల లసత్ శ్రీచక్ర మధ్యే స్థితామ్ అని అమ్మవారిని స్తుతించారు.

స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వ విగ్రహా - విశ్వమంతా వ్యాపించిన, మనలోనూ ఉన్న ఆత్మచైతన్యమే ఆ లలితాంబిక. ఆ విశ్వచైతన్యమును, సర్వ విశ్వాత్మక రూపాన్ని పిండాండంలో అంటే ఉపాసకుని దేహంలో భావించి, మన శరీరమే అమ్మవారి యంత్రము శ్రీచక్రముగా ఆరాధించడమును అంతర్యాగము అంటారు. పిండాండ బ్రహ్మాండ సమన్వయమే అంతర్యాగము. అంటే ఈ మూడు కూటములు మన శరీరమునందు కూడా భావించ వచ్చును. మన శరీరములో ఉన్న శ్రీచక్ర వివరణ ఈ కింది శ్లోకములో చెప్పబడినది.

బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకంచ త్రికోణకమ్
లలాటే అష్టార పత్రంచ భ్రూవోర్మధ్యే దశారకం
బహిర్దశారం కంఠేతు మన్వస్త్రం హృదిసంస్థితం
నాభౌతు వసుపత్రంచ కఠ్యాం షోడశపత్రకం
వృత్తత్రయంచ ఊరుభ్యాం పాదయోః చతురస్రకం

అర్చనకాలే రూపగతా, అర్చన సమయములో మనము పూజించే స్థూల రూపములో మరియు సంస్తుతి కాలే శబ్దగతా అంటే పూజ లేదా ఉపాసన సమయములో స్తోత్ర/మంత్ర శబ్ద రూపములో ఉన్న అమ్మవారి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు చింతనకాలే ప్రాణగతా, తత్త్వవిచారే సర్వగతా వివరణ చూద్దాము.

కుండల త్రివిధ కోణ మండల విహార షడ్దలసముల్లసత్
పుండరీక ముఖ భేదినీం చ ప్రచండ భానుభా సముజ్జ్వలామ్|
మండలేందు పరివాహితామృతతరంగిణీం అరుణ రూపిణీమ్
మండలాంత మణి దీపికాం మనసి భావయామి పరదేవతామ్|| (నవరత్నమాలికా స్తోత్రము)

సూక్ష్మతర రూపము అంటే కుండలిని రూపము. బ్రహ్మ రంధ్రము నుంచి మూలాధారము (కులకుండము) వరకు సుషుమ్ననాడి ద్వారా ప్రసరించే చైతన్య ధారయే కుండలిని. ఇదియే ప్రాణశక్తి. కులాంగనా నుండి బిసతంతు-తనీయసీ వరకు ఉన్న లలితా నామములు ఈ రూపమును వర్ణించునవి. ఇది అమ్మవారి సూక్ష్మతర రూపము. దీనిని ఆది శంకరులు సౌన్దర్య లహరి యందు సుధాధారా సారైః .. శ్లోకమునందు వర్ణించియున్నారు.

సూక్ష్మతమ రూపము అంటే కుండలినీ రూపముకన్న సూక్ష్మమైనది.  ఇది ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నతాత్త్వీక రూపము. నిరాధారా నుండి నిరీశ్వరా వరకు ఉన్న నామముల యందు ఈ రూపము వివరింపబడినది. సర్వాంతర్యామి/సర్వవ్యాపకత్వ తత్త్వమే సూక్ష్మ తమ రూపము.

ఉదాహరణకు అందరికీ చాలా పరిచయమున్న విష్ణు సహస్రనామ స్తోత్రములో ధ్యాన శ్లోకమునందు క్షీరోదన్వత్ప్రదేశే….శంఖపాణిర్ముకుందః ఆ దేవత స్థూలరూపమును, భూః పాదౌత్రిభువన వపుషమ్ విష్ణుమీశమ్ నమామి సూక్ష్మతమ రూపమును తెలియజేస్తున్నాయి.

ఏ దేవతా విశేషము తీసుకున్ననూ, సూక్ష్మతర (ప్రాణశక్తి) మరియు ఉపనిషద్-ప్రతిపాదితమైన సూక్ష్మతమ (తాత్త్వీక) రూపములు ఒక్కటే.  స్థూల మరియు సూక్ష్మ రూపములు అంటే విగ్రహము, మంత్రము మాత్రమే మారుతూ ఉంటాయి.  ఇంతవరకు మనము లలితా సహస్రనామ స్తోత్రము గురించి మాట్లడుతున్నందు వలన లలితా విగ్రహము, పంచదశి/షోడశి మంత్రము గురించి మాట్లాడాము. ఏ దేవతా మూర్తిని ధ్యానించిననూ, సగుణసాకార రూపము నుండి నిర్గుణనిరాకార తత్త్వమును చేరుకొనుటయే పరమార్ధము. అందువలన ఎవరి ఇష్టదైవమును వారు ఉపాసించవచ్చు. 

ఇష్టదైవము గురించి మాట్లాడినప్పుడు లీలాశుకుల వారి గురించి ఒక మాట చెప్పాలి.
విహాయ కోదండశరౌ ముహూర్తమ్
గృహాణ పాణౌ మణిచారువేణుమ్
మాయూరబర్హంచ నిజోత్తమాంగే
సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్|| (కృష్ణ కర్ణామృతము)
ఓ రామా| నీ విల్లును బాణములును విడిచి ముహూర్త కాలము కరమున మణిమయంబైన చెలువంపు పిల్లనగ్రోవిని దాల్చి శిరంబున కిరీటంబు విడిచి నెమలి పురిని జెరువుకొనుము.  పిదప నీకు నమస్కరిస్తానుఅని ప్రత్యక్షమైన ఆ రామునితో చెప్పారు లీలాశుకులు. ఇష్టదైవ భక్తి అంటే నాకు ఆయనే గుర్తుకు వస్తారు.

ఉపాసకానామ్ కార్యార్ధమ్ బ్రహ్మణో రూపకల్పన అని ఉపనిషద్వాక్యము. ఉపాసకులను అనుగ్రహించడము కోసమే పరమాత్ముని లీలా రూపములు. ఎవరి ఇష్టదైవాన్ని వారి వారికి నచ్చిన విధముగా నామ జపమో, స్తోత్ర పారాయణమో లేదా గురుముఖత స్వీకరించిన మంత్రోపాసనయో, ఏదో విధముగా భగవంతుని మనసు పెట్టి ధ్యానిస్తే తప్పక ఆ దేవతా అనుగ్రహము కలుగుతుంది.  దీనికి ముఖ్యముగా ఉండవలసినది భగవంతుని గురించిన తపన. నీటిలోపూర్తిగా మునిగిన వాడు బయటకు రావడానికి తపించినట్లుగా, భగవంతుడి కోసము తపిస్తే, భగవంతుడు తప్పక అనుభవానికి వస్తాడు అని రామకృష్ణ పరమహంస చెప్పినారు. సాధన చేద్దాము సాధించుదాము.

జంతూనాం నర జన్మ దుర్లభమ్ (వివేకచూడామణి)

క్రిందికి ప్రవహించే కుండలినిని పైకి ప్రవహింపజేసే శక్తి మానవులకు మాత్రమే ఉన్నది. అనుష్ఠానము చేయగా చేయగా, కుండలినిశక్తి జాగృతి చెంది, శరీరమునందలి షట్చక్రములద్వారా పైకి ప్రసరించడము ముదలు పెడుతుంది. మొదటి రెండు చక్రములు (మూలాధార, స్వాధిష్ఠాన చక్రములు - అగ్ని మండలము) దాటినప్పుడు అక్కడ గ్రంధి, బ్రహ్మ గ్రంధి విభేదనము జరిగి స్థూల శరీరము (అన్నమయ కోశము)  నేను కాదు అనే జ్ఞానము కలుగుతుంది.  ఆ తర్వాత రెండు చక్రములు (మణిపూరక, అనాహత చక్రములు - సూర్య మండలము) దాటినప్పుడు, విష్ణు గ్రంధి విభేదనము జరిగి  (ఇన్ద్రియ శక్తులు, మనసు) లింగ/సూక్ష్మ శరీరము (ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు) నేను కాదు అనే జ్ఞానము కలుగుతుంది. చిట్టచివరి రెండు చక్రములు (విశుద్ధి, ఆజ్ఞా చక్రములు - చంద్ర మండలము) దాటిన తరువాత రుద్ర గ్రంధి విభేదనము జరిగి కారణ లేదా వాసనా శరీరము (ఆనందమయ కోశము) నేను కాదు అని తెలుసుకొని జీవునికి పురత్రయము నేను అనే అజ్ఞానము తొలగిపోవును. ఇదియే త్రిపుటీ ఏకత్వము. త్రిపుటి అంటే ధ్యానము/జ్ఞానము, ధ్యాత/జ్ఞాత (ధ్యానించేవాడు), ధ్యేయము/జ్ఞేయము (ధ్యానించబడేది). త్రిపుటి ఏకత్వమే సచ్చిదానందముతో తాదాత్మ్యము చెందుట. ఇదియే త్రిపురాసుర సంహారము. ఇదియే మోక్షము పొందుట. అలా పైకి ప్రవహించిన కుండలినీశక్తి బ్రహ్మరంధ్రమునందలి సహస్రారకమలమును జేరి కామేశ్వరునితో ఐక్యమవుతుంది.

మూలాధారైకనిలయా-బ్రహ్మగ్రంధివిభేదినీ నుండి ఆజ్ఞాచక్రాంతరాళస్థా-రుద్రగ్రంథివిభేదినీ వరకు ఉన్న నామములు తామరతూడు వంటి అతి సూక్ష్మమైన, లావణ్యమైన నాడిద్వారా ఊర్ధ్వదిశగా ప్రాణశక్తి ప్రవాహము జరుగుతున్నప్పుడు జరిగే గ్రంధి విభేదనమును తెలియజేసే నామములు.

ఎవరి ఇష్టదేవతనుగురించి వారు తపిస్తూ ఏ విధముగా సాధనచేసిననూ (మంత్రోపాసన ఒక్కటే మార్గము కాదు) కుండలిని జాగృతి చెందుతుంది.  మనము కుండలిని గురించి తెలుసుకొని చేసిననూ తెలియక చేసిననూ, జాగృతి చెందిన కుండలినీ ప్రవాహ క్రమ పద్ధతి ఇక్కడ వివరించిన విధముగా అంతర్గతముగా అందరు ఉపాసకులలోనూ జరుగుతుంది.

లలితాసహస్రనామములను అర్ధముచేసుకొని  భావనాత్మకముగా సాధనజేయుటకు చేయుప్రయత్నమిది. తలపులన్నినిలిపి నిమిషమైన తారకరూపుని నిజ తత్త్వములను తెలిసి రామచింతన సేయవే ఓ మనసా అని త్యాగరాజస్వామివారు పాడినట్లు, ఈ వేయినామములు చదివేటప్పుడు ఏ ఒక్క నామమునందు ఒక్క క్షణమైననూ మనసునులయింపగలిగినా ఈ ప్రయత్నము సఫలమైనట్లే.
 

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment