Tuesday 12 May 2020

Verses related to Creation in Soundarya lahari సౌన్దర్యలహరి యందలి సృష్టి సూచక శ్లోకములు

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

శ్రీచక్రరాజసింహాసనేశ్వరి శ్రీలలితాంబికయే భువనేశ్వరి

ఆగమవేదకళామయరూపిణి అఖిలచరాచర జనని నారాయణి

నాగకంకణ నటరాజ మనోహరి జ్ఞానవిద్యేశ్వరి రాజరాజేశ్వరి ||


కశ్మీరశైవసిద్ధాంత ప్రతిపాదిత మాయదికంచుకములతో కూడిన 36తత్త్వములను, ఏడు ప్రమాతల విభజనను తెలుసుకున్నాము.  ఇవే ముప్పైఆరు తత్త్వములను, సాంఖ్యాశాస్త్రమునందు 25తత్త్వములుగ గణించబడినవి.  పురుషుడు, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, పంచతన్మాత్రలు, పంచజ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, పంచభూతములు - వెరసి 25తత్త్వములు. ఈ ఇరవైఐదు తత్త్వములను కశ్మీరశైవమతమునందు అశుద్ధ/అపరతత్త్వములని చెప్పబడగా, సాంఖ్యాశాస్త్రమునందు ప్రాకృతికతత్త్వములని చెప్పబడుచున్నవి. ఆత్మ/పురుషుని గణించకుండగ జూచిన 24తత్త్వములు. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము నాలుగింటినీ కలిపి అంతఃకరణమను ఒకే తత్త్వముగ గణించిన,  21 తత్త్వములు (దేవీభాగవతము 7.32.36-39). 36గ గణించిననూ, 25గ గణించిననూ, సకల సృష్టి ఈ తత్త్వముల సమాహారము.


అష్టమూర్తులు/ప్రకృతులు

ప్రాకృతికతత్త్వములకు మూలమైన ముఖ్యమైన ఎనిమిది తత్త్వములందు గోచరించు పరమాత్మను అష్టమూర్తులని చెప్పబడుచున్నది. అవ్యక్త, నిర్గుణ, నిరాకార పరమాత్మ విభూతి విశ్వమునందు భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము, సూర్య, చంద్ర మరియు క్షేత్రజ్ఞుడు మొదలయిన అష్టమూర్తులుగా గోచరిస్తున్నది. వేదములందు, పురాణేతిహాసములందు అష్టమూర్తులు వర్ణింపబడినవి.


భూరంభాంస్యనలో అనిలో అమ్బరమహర్నాథో హిమాంశుః పుమా-

నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్|

నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభో

స్తస్మై శ్రీగురుమూర్తయే నమః ఇదమ్ శ్రీ దక్షిణామూర్తయే|| (దక్షిణామూర్తి స్తోత్రము)

భూమి, అంభःజలము,  అనలఅగ్ని, అనిలవాయువు, అమ్బరముఆకాశము, అహర్నాథసూర్య, హిమాంశుచంద్ర, పుమాన్ - పురుషుడు/క్షేత్రజ్ఞుడు తప్ప వేరేదికాని గురుమూర్తియైన దక్షిణామూర్తికి నమస్కారము.


కలావిద్యా పరాశక్తిః శ్రీచక్రాకారరూపిణీ

తన్మధ్యే బైందవమ్ స్థానమ్ తత్రాస్తే పరమేశ్వరీ

సదాశివేన సంయుక్తా సర్వతత్త్వాతిగామినీ

చక్రమ్ త్రిపురసుందర్యా బ్రహ్మాండాకారమీశ్వరీ

పంచభూతాత్మకమ్ చైవ తన్మాత్రాత్మకమేవచ

ఇంద్రియాత్మకమేవచ మనస్తత్త్వత్మకమ్ తథా

మాయాదితత్త్వరూపమ్ చ తత్త్వాతీతమ్ తు బైందవమ్

బైందవే జగదుత్పత్తి స్థితి సంహారకారిణీ  (భైరవయామళ తంత్రము)

సదాశివునితో కూడిన బిందుచక్రస్థితయైన పరమేశ్వరి, సర్వతత్త్వాత్మికయై వ్యాపించి శ్రీచక్రరూపమును పొందుచున్నది.  


నవచక్రరూపం శ్రీచక్రం నవరంధ్రరూపో దేహః (భావనోపనిషత్తు)

 

సౌన్దర్యలహరి మొదటి ఎనిమిదిశ్లోకములందలి శ్రీచక్ర/సృష్టిరహస్యములు:

 

శివఃశక్త్యాయుక్తో .. – బిందువు/బ్రహ్మరంధ్రస్థానమునందు సృష్ట్యోన్ముఖమైన శివశక్తులఏకస్వరూపము

గర్భోపనిషత్తుననుసరించి శుక్లశోణితముల కలయికచే ఏర్పడిన పిండము మొదటిమాసమునకు గట్టిపడుతుంది.

తనీయాంసంపాంసుం....  త్రిగుణములనుండి ఆవిర్భవించిన త్రిమూర్తుల (త్రయాణామ్ దేవానామ్ త్రిగుణజనితానామ్ తవ శివే) కార్యనిర్వహణ సామర్ధ్యము, అమ్మ పాదధూళి కణమువలన మాత్రమేయని వర్ణించబడినది. అవిద్యానాం... కర్మానుసారముగ త్రిగుణములందు క్షోభగలిగినయెడల సృష్టి ఏర్పడుటచే, జన్మజలధి సూచితమైన సంచితకర్మ త్రికోణసంబంధితముగ తెలియుచున్నది.

గర్భోపనిషత్తుననుసరించి రెండవమాసమునందు పిండమునందేర్పడు శిరోభాగ సంకేతము.

త్వదన్యః పాణిభ్యామ్ … - ఈ శ్లోకమునందు బాలామంత్రము దాగియున్నది.  ఇక్కడ ఉన్నతముగా చెప్పబడిన తల్లిపాదములు, అష్టమూర్తుల (భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు మరియు బుద్ధి) సంబంధిత అష్టకోణ సూచితము. 

భూమిరాపోనలోవాయుః ఖం మనోబుద్ధిరేవ చ|

అహంకార ఇతీయమ్ మే భిన్నా ప్రకృతిరష్టధా|| (భగవద్గీత 7.4)

భగవద్గీత భాష్యమునందు ఆదిశంకరులు ఇచ్చట చెప్పబడిన భూమి, ఆపస్సు, అనల మొదలగునవి స్థూలభూతములుకావు, సూక్ష్మతన్మాత్రలని వ్యాఖ్యానించినారు.

పంచతన్మాత్రలు, మనస్సు, బుద్ధి, అహంకారము మొదలగు అష్టతత్త్వములను భగవత్పాదులు తల్లి పాదములను వర్ణించు 8 శ్లోకములందు (84-91) [భూమి(సన్నికల్లు-88), జలము(పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా నామ వివరణను చూడవసినది-87), అగ్ని(కిలికిలి ధ్వనులు, దహన 86), వాయు(హంస-91), ఆకాశము(శృతీనాంమూర్ధానో, పశుపతిజటాజూటతటిని-84), సూర్య(నయనరమణీయము-85), చంద్ర (నఖ,శశి-89), పురుషుడు (మత్-జీవ -90)] నిగూఢముగా సూచించుట గమనించవలసినది.

గర్భోపనిషత్తుననుసరించి మూడవమాసమునందేర్పడు కాళ్ళుచేతులు (పాణి, పాదములు) సూచించినట్లున్నది.

 

హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్య జననీ...

హరివిష్ణువు

విష్ణువు వ్యాపకత్వ సూచకము. పురహరుని సైతము క్షోభపరచిన మహావిష్ణువుని మోహినీ(నారీభూత్వా) అవతారము, పైనచెప్పబడిన ఎనిమిది ముఖ్య ప్రకృతులనుండి క్షితితత్త్వపర్యంత (జ్ఞానేంద్రియపంచకము, కర్మేంద్రియపంచకము, భూతపంచకము) వ్యాపకత్వమునకు సంకేతము.

 

గర్భోపనిషత్తుననుసరించి నాల్గవమాసమునందేర్పడు కటిప్రదేశము, నడుము, తొడలు, ఐదవమాసమునందేర్పడు వెన్నెముక, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, భూతపంచకముల సూచకము.

ధనుఃపౌష్పమ్ మౌర్వీ..

అనంగుడుకామదేవుడు

అథర్వవేదము(9.2.19), ఋగ్వేదమునందలి నాసదీయసూక్తములననుసరించి, సృష్టియందలి ప్రథమ స్పందన కామము.  ఇప్పుడు పిండాండపరముగ కామ సమన్వయమును తెలుసుకుందాము.  ఆరవమాసమునందు గర్భస్థ పిండమునందు ప్రాణశక్తికదలికలు (ప్రప్రథమ చలనము/స్పందన) కలుగునని చెప్పబడినది (గర్భోపనిషత్తు-17, శ్రీమద్భాగవతము 3.31.4).

 

పొట్టవైపు వంచిన తలతో ధనురాకారములోనున్న గర్భస్థశిశువు(3.31.8) యందు ఆరవమాసమున కలుగు ప్రథమస్పందనను, భగవత్పాదులు సౌన్దర్యలహరి ధనుః పౌష్పమ్ మౌర్వీ..యను ఆరవశ్లోకమునందు వర్ణించినట్లున్నది.  ఈ స్పందనయే కామ ఆవిర్భావ సూచకము.  అపర, పరాతత్త్వములను సంబంధింపజేయు కామదేవుడు (అంగరహితమైన రతిపతి) మునులను సైతము మోహింపజేయును.  స్పందన/చలనము/కామము పర్యాయపదములు.

క్వణత్కాంచీ దామా పురమథితురాహో పురుషికా-

సప్తమేమాసే జీవసంయుక్తోభవతి

ఏడవమాసమున గర్భస్థపిండమునందు చైతన్యము ప్రవేశించుటచే  (గర్భోపనిషత్తు-17, శ్రీమద్భాగవతము-3.31.10) జీవాత్మసంబంధిత అహమ్ ప్రవర్తితమౌతుంది.  పాశము, అంకుశము, చెరుకువిల్లు, పువ్వులబాణములతో విరాజిల్లు చైతన్యశక్తి స్థూలరూపమును ఆదిశంకరులు ఏడవశ్లోకమునందు వివరించుట యాధృచ్ఛికము కాదు కదా!!

సుధాసింధోర్మధ్యే

ఎనిమిదవమాసము పూర్తియైన తదుపరి ప్రసూతి వాయువుల వలన సహస్రారస్థానమైన శిరస్సు అధోముఖముగావింపబడుటచే  (గర్భోపనిషత్తు 55, శ్రీమద్భాగవతము 3.31.23) గర్భస్థ శిశువు తల్లిగర్భమునుండి బయల్వెడలుచున్నది. సహజముగా ప్రసవము ఎనిమిదవ మాసాంతమునుండి పదవమాసములోపు జరుగుటకు అవకాశముగలదు. సుధాసింధువు నందలి మణిద్వీపస్థితయైన తల్లిని ఎనిమిదవశ్లోకమునందు వర్ణించుట ఇందులకేనేమో !!

 

అమ్మ శ్రీచక్రసింహాసనేశ్వరిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ - హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః Bhandasurendra-nirmukta-sastra-pratyastra-varshini-Hara-netragni-samdagdha-kamasamjivanaushadhiH

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

అన్తేవాసిన్నస్తి చేత్తే  ముముక్షా

వక్ష్యే యుక్తిమ్ ముక్తసర్వేషణః సన్ |

సభ్ద్యః సాక్షాత్సుందరీమ్ జ్ఞాప్తిరూపామ్

శ్రద్ధాభక్తి ధ్యానయోగాదవేహి||

(త్రిపురసుందరీవేదపాదస్తవము- 27)

 

జీవులందలి పరమాత్మయొక్క అనంతత్వము, మాయాది షట్కంచుకములతో కప్పబడుట తిరోధానము, పొరలు తొలగించబడుట అనుగ్రహము.  మాయాదిక్షితిపర్యంతము అపరతత్త్వములనియు, సదాశివ, ఈశ్వర, శుద్ధవిద్య తత్త్వములు పరాపరతత్త్వములనియు, శివ, శక్తి తత్త్వములు పరతత్త్వములనియు కశ్మీరశైవసిద్ధాంతమునందు చెప్పబడినవి.

 

భండుని సైన్యము, దండనాథుడు, మంత్రి, పుత్రులు మొదలైన వారందరూ వధించబడినట్లు ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇది అపర, పరాపరతత్త్వములనెరింగిన స్థితి. శివ-శక్తి తత్త్వములనధిగమించి పరమాత్మతత్త్వమునెరుగుటయే మోక్షము. తదుపరినామములు శివ-శక్తి తత్త్వ సంబంధితములు. ఇకపై వచ్చు ఆరునామములు లలితమ్మతల్లి-భండాసుర యుద్ధసంబంధితము. భండాసురుడు ప్రయోగించిన అనేక శస్త్రాస్త్రములను, తల్లి ప్రత్యస్త్రములతో నిర్వీర్యము జేసినది. తల్లి తనచేతివేళ్ళనుండి నారాయణుని దశావతారములను సృష్టించి భండాసురుడు ప్రయోగించిన ఆసురీశక్తులను నాశనముజేసినది.

 

భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ

నిర్ముక్త; వర్షిణీ

భండాసురునిచే ప్రయోగింపబడిన శస్త్రములను వ్యతిరేక స్త్రములను వర్షించి, ఉపశమింపజేసిన తల్లికి నమస్కారము.

కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః

చేతివేళ్ళగోళ్ళనుండి నారాయణ దశావతారరూపములను(దశాకృతులను) ఉత్పన్నముజేసిన తల్లికి నమస్కారము.  ఇక్కడ చేతివేళ్ళగోళ్ళను చెప్పడమందలి విశేషమును తెలుసుకొనుటకు తరువాత ప్రయత్నిద్దాము.

మహాపాశుపతాస్త్రాగ్ని-నిర్దగ్ధాసురసైనికా

మహాపాశుపతాస్త్రము - నిర్దగ్ధ;

మహాపాశుపతాస్త్రాగ్నితో భండాసురుని సైన్యమును సమూలముగా దగ్ధముజేసిన తల్లికి నమస్కారము.

కామేశ్వరాస్త్ర-నిర్దగ్ధ-సభండాసుర-శూన్యకా

కామేశ్వరాస్త్రము, నిర్దగ్ధ

కామేశ్వరాస్త్ర ప్రయోగముతో భండాసురునితో పాటు శూన్యక పట్టణమును సంపూర్ణముగా దగ్ధముజేసిన తల్లికి  నమస్కారము.

బ్రహ్మోపేంద్రమహేంద్రాది-దేవసంస్తుత-వైభవా

బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర మొదలగు దేవతలతో స్తుతింపబడిన వైభవముగల తల్లికి నమస్కారము.

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః

హరుని నేత్రాగ్ధితో సంపూర్ణముగా దగ్ధమైన కామదేవుని, సంజీవనౌషధియై జీవింపజేసిన తల్లికి నమస్కారము. 

 

స్థాణ్వాశ్రమమునందు నిస్సంగుడై తపోనిష్ఠుడైన శివుని/రుద్రుని జ్ఞానాగ్నితో దగ్ధమైన కామదేవుని భస్మమునుండి, అదే రుద్రుని కడకంటిచూపుతో మధ్యాహ్నార్కసమప్రభలతో ప్రాణముపొందిన, మహాబలి, మహాతేజస్వి, భండుడు. అయితే రుద్రుని జ్ఞానాగ్నివలన ఏర్పడిన మన్మథుని భస్మమునుండి ఆవిర్భవించినందున, భండుడు దైత్యుడైనాడు (బ్రహ్మాండపురాణము ఉ-11.30,31, 30.35). ఆసురీగుణ భండుని సంహరించి, దేవతలకోరికమేరకు హరనేత్రాగ్నికి దగ్ధమగుటకు మునుపుగల కామదేవుని సుందరరూపమును ప్రసాదించి తల్లి అనుగ్రహించినది (ibid 30.45,46). మరల స్వస్వరూపమును పొందిన కామదేవుడు దాసోహమనిప్రార్ధించగా (30.56), “నాఅనుగ్రహముతో సర్వజగత్తును మోహింపజేయగలవు. తపోనిష్ఠుడైన శివుని తాపసాగ్ని కూడా ఇక నిన్ను భస్మముచేయజాలదు (30.60)” అని తల్లి కామదేవుని కటాక్షించినది.  ఈ విధముగా తల్లి అనుగ్రహపాత్రుడైన కామదేవుడు, మరల శివుని పుష్పబాణములతో తాకగా, శివుడు నిస్సంగత్వమును వీడి పార్వతీదేవిని పరిణయమాడినట్లు పురాణములందు చెప్పబడినది.

 

పరమశివ, పర్వతరాజపుత్రిక పార్వతుల కలయిక పరమాత్మైక్యతకు సూచితము (సుమేరుమధ్యశృంగస్థా నామవివరణ చూడగలరు). విషయాసక్తులైన వారికి మోక్షము సిద్ధించుట మిక్కిలి కష్టతరము మాత్రమే కాదు సరిగదా వారికి గగనకుసుమమగును.  ఎందువలననంటే,

న జాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతి।

హవిషా కృష్ణవర్త్మా ఇవ భూయ ఏవ అభివర్ధతే।।

(మహాభారతము-ఆదిపర్వము-సంభవపర్వము-85.12, శ్రీమద్భాగవతము-9.19.4, మనుస్మృతి –2.94)

భోగించినచో ఐహికవాంఛలు తీరకపోగా, అగ్నికి ఆజ్యము తోడయినపుడు ఎటుల విజృంభించునో, అటులనే కోరికలు మరింత ఉధృతమగును. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశివు కప్పబడియున్నట్లు, దుష్పూరణము, అగ్నివలె తృప్తిచెందనిదైన కామముచే ఆత్మజ్ఞానము కప్పబడియుండుటచే, కామము ఆత్మజ్ఞానికి నిరంతర శత్రువు (భగవద్గీత-3.38,39).

 

కామదేవుని పుష్పబాణములను శివునిపై సంధించుట జీవుల విషయభోగమునకు సూచితము. రుద్రుని జ్ఞాననేత్రాగ్నిలో దగ్ధమై, ఆ భస్మమునుండి మరల సజీవుడైన విజృంభిత కామపూరిత, ఆసురీగుణ భండుడు, భోగించిన విషయములతో తృప్తినికలిగించకుండా, మరింత పెరిగిన వాంఛ/ఉధృతకామము(రాగము)నకు సూచితము. జీవులందలి భండుడు, జీవులను మోక్షాసక్తులను గానీయడు.

 

అవధ్యః సర్వభూతానామహమేకః సనాతనః అవధ్యుడు, సనాతనుడు, సర్వభూతాంర్గతుడైన కామదేవుడు స్వయముగా కామగీతయందు (మహాభారతము- అశ్వమేధపర్వము-13.12) నాహమ్ శక్యోనుపాయేన హన్తుం భూతేన కేనచిత్ సరియైన ఉపాయములేకుండగా జీవులు నన్ను జయించలేరని చెప్పినట్లు శ్రీకృష్ణపరమాత్మ యుధిష్ఠిరునితో చెప్పినాడు.

 

నిష్ఫలమైన కామదేవుని మొదటి ప్రయత్నము, జీవులు సరియైన ఉపాయములేకుండా మోక్షాసక్తులు కాలేరని తెలియజేయుచున్నది. ఆ ఉపాయము ఏమిటో బ్రహ్మాండపురాణమునందు సూచించబడినది. 

 

భండాసురుడు ప్రతిజీవియందు ఎగసిపడు విషయేచ్ఛలరూపముతో సజీవుడుగనున్నాడు. భండాసురుని వధించిన పిదప, దేవతల కోరికమేరకు తల్లి కామదేవుని స్వస్వరూపమును అనుగ్రహించి, రుద్రుని జ్ఞానాగ్నినుండి కామదేవునికి రక్షణనిచ్చుట, భక్తులందు, ఆజ్యము పోసిన అగ్నివలె విజృంభించు విషయవాంఛలను అధికరింపక, అసురత్వమును పొందకుండ అనుగ్రహించుటకు సూచితము.  తదుపరి, కామదేవుని బాణములచే ఘాతకుడైన శివుడు, పార్వతీదేవిని పరిణయమాడుట, మోక్ష సూచితమగుటచే, సాధకులైన జీవులకు మోక్షదాయిని అమ్మ. 

శివశక్త్యాత్మికయైన తల్లిని ప్రార్ధిస్తూ,

శ్రీమాత్రేనమః