Tuesday 12 May 2020

భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ - హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః Bhandasurendra-nirmukta-sastra-pratyastra-varshini-Hara-netragni-samdagdha-kamasamjivanaushadhiH

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

అన్తేవాసిన్నస్తి చేత్తే  ముముక్షా

వక్ష్యే యుక్తిమ్ ముక్తసర్వేషణః సన్ |

సభ్ద్యః సాక్షాత్సుందరీమ్ జ్ఞాప్తిరూపామ్

శ్రద్ధాభక్తి ధ్యానయోగాదవేహి||

(త్రిపురసుందరీవేదపాదస్తవము- 27)

 

జీవులందలి పరమాత్మయొక్క అనంతత్వము, మాయాది షట్కంచుకములతో కప్పబడుట తిరోధానము, పొరలు తొలగించబడుట అనుగ్రహము.  మాయాదిక్షితిపర్యంతము అపరతత్త్వములనియు, సదాశివ, ఈశ్వర, శుద్ధవిద్య తత్త్వములు పరాపరతత్త్వములనియు, శివ, శక్తి తత్త్వములు పరతత్త్వములనియు కశ్మీరశైవసిద్ధాంతమునందు చెప్పబడినవి.

 

భండుని సైన్యము, దండనాథుడు, మంత్రి, పుత్రులు మొదలైన వారందరూ వధించబడినట్లు ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇది అపర, పరాపరతత్త్వములనెరింగిన స్థితి. శివ-శక్తి తత్త్వములనధిగమించి పరమాత్మతత్త్వమునెరుగుటయే మోక్షము. తదుపరినామములు శివ-శక్తి తత్త్వ సంబంధితములు. ఇకపై వచ్చు ఆరునామములు లలితమ్మతల్లి-భండాసుర యుద్ధసంబంధితము. భండాసురుడు ప్రయోగించిన అనేక శస్త్రాస్త్రములను, తల్లి ప్రత్యస్త్రములతో నిర్వీర్యము జేసినది. తల్లి తనచేతివేళ్ళనుండి నారాయణుని దశావతారములను సృష్టించి భండాసురుడు ప్రయోగించిన ఆసురీశక్తులను నాశనముజేసినది.

 

భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ

నిర్ముక్త; వర్షిణీ

భండాసురునిచే ప్రయోగింపబడిన శస్త్రములను వ్యతిరేక స్త్రములను వర్షించి, ఉపశమింపజేసిన తల్లికి నమస్కారము.

కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః

చేతివేళ్ళగోళ్ళనుండి నారాయణ దశావతారరూపములను(దశాకృతులను) ఉత్పన్నముజేసిన తల్లికి నమస్కారము.  ఇక్కడ చేతివేళ్ళగోళ్ళను చెప్పడమందలి విశేషమును తెలుసుకొనుటకు తరువాత ప్రయత్నిద్దాము.

మహాపాశుపతాస్త్రాగ్ని-నిర్దగ్ధాసురసైనికా

మహాపాశుపతాస్త్రము - నిర్దగ్ధ;

మహాపాశుపతాస్త్రాగ్నితో భండాసురుని సైన్యమును సమూలముగా దగ్ధముజేసిన తల్లికి నమస్కారము.

కామేశ్వరాస్త్ర-నిర్దగ్ధ-సభండాసుర-శూన్యకా

కామేశ్వరాస్త్రము, నిర్దగ్ధ

కామేశ్వరాస్త్ర ప్రయోగముతో భండాసురునితో పాటు శూన్యక పట్టణమును సంపూర్ణముగా దగ్ధముజేసిన తల్లికి  నమస్కారము.

బ్రహ్మోపేంద్రమహేంద్రాది-దేవసంస్తుత-వైభవా

బ్రహ్మ, ఉపేంద్ర, మహేంద్ర మొదలగు దేవతలతో స్తుతింపబడిన వైభవముగల తల్లికి నమస్కారము.

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః

హరుని నేత్రాగ్ధితో సంపూర్ణముగా దగ్ధమైన కామదేవుని, సంజీవనౌషధియై జీవింపజేసిన తల్లికి నమస్కారము. 

 

స్థాణ్వాశ్రమమునందు నిస్సంగుడై తపోనిష్ఠుడైన శివుని/రుద్రుని జ్ఞానాగ్నితో దగ్ధమైన కామదేవుని భస్మమునుండి, అదే రుద్రుని కడకంటిచూపుతో మధ్యాహ్నార్కసమప్రభలతో ప్రాణముపొందిన, మహాబలి, మహాతేజస్వి, భండుడు. అయితే రుద్రుని జ్ఞానాగ్నివలన ఏర్పడిన మన్మథుని భస్మమునుండి ఆవిర్భవించినందున, భండుడు దైత్యుడైనాడు (బ్రహ్మాండపురాణము ఉ-11.30,31, 30.35). ఆసురీగుణ భండుని సంహరించి, దేవతలకోరికమేరకు హరనేత్రాగ్నికి దగ్ధమగుటకు మునుపుగల కామదేవుని సుందరరూపమును ప్రసాదించి తల్లి అనుగ్రహించినది (ibid 30.45,46). మరల స్వస్వరూపమును పొందిన కామదేవుడు దాసోహమనిప్రార్ధించగా (30.56), “నాఅనుగ్రహముతో సర్వజగత్తును మోహింపజేయగలవు. తపోనిష్ఠుడైన శివుని తాపసాగ్ని కూడా ఇక నిన్ను భస్మముచేయజాలదు (30.60)” అని తల్లి కామదేవుని కటాక్షించినది.  ఈ విధముగా తల్లి అనుగ్రహపాత్రుడైన కామదేవుడు, మరల శివుని పుష్పబాణములతో తాకగా, శివుడు నిస్సంగత్వమును వీడి పార్వతీదేవిని పరిణయమాడినట్లు పురాణములందు చెప్పబడినది.

 

పరమశివ, పర్వతరాజపుత్రిక పార్వతుల కలయిక పరమాత్మైక్యతకు సూచితము (సుమేరుమధ్యశృంగస్థా నామవివరణ చూడగలరు). విషయాసక్తులైన వారికి మోక్షము సిద్ధించుట మిక్కిలి కష్టతరము మాత్రమే కాదు సరిగదా వారికి గగనకుసుమమగును.  ఎందువలననంటే,

న జాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతి।

హవిషా కృష్ణవర్త్మా ఇవ భూయ ఏవ అభివర్ధతే।।

(మహాభారతము-ఆదిపర్వము-సంభవపర్వము-85.12, శ్రీమద్భాగవతము-9.19.4, మనుస్మృతి –2.94)

భోగించినచో ఐహికవాంఛలు తీరకపోగా, అగ్నికి ఆజ్యము తోడయినపుడు ఎటుల విజృంభించునో, అటులనే కోరికలు మరింత ఉధృతమగును. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశివు కప్పబడియున్నట్లు, దుష్పూరణము, అగ్నివలె తృప్తిచెందనిదైన కామముచే ఆత్మజ్ఞానము కప్పబడియుండుటచే, కామము ఆత్మజ్ఞానికి నిరంతర శత్రువు (భగవద్గీత-3.38,39).

 

కామదేవుని పుష్పబాణములను శివునిపై సంధించుట జీవుల విషయభోగమునకు సూచితము. రుద్రుని జ్ఞాననేత్రాగ్నిలో దగ్ధమై, ఆ భస్మమునుండి మరల సజీవుడైన విజృంభిత కామపూరిత, ఆసురీగుణ భండుడు, భోగించిన విషయములతో తృప్తినికలిగించకుండా, మరింత పెరిగిన వాంఛ/ఉధృతకామము(రాగము)నకు సూచితము. జీవులందలి భండుడు, జీవులను మోక్షాసక్తులను గానీయడు.

 

అవధ్యః సర్వభూతానామహమేకః సనాతనః అవధ్యుడు, సనాతనుడు, సర్వభూతాంర్గతుడైన కామదేవుడు స్వయముగా కామగీతయందు (మహాభారతము- అశ్వమేధపర్వము-13.12) నాహమ్ శక్యోనుపాయేన హన్తుం భూతేన కేనచిత్ సరియైన ఉపాయములేకుండగా జీవులు నన్ను జయించలేరని చెప్పినట్లు శ్రీకృష్ణపరమాత్మ యుధిష్ఠిరునితో చెప్పినాడు.

 

నిష్ఫలమైన కామదేవుని మొదటి ప్రయత్నము, జీవులు సరియైన ఉపాయములేకుండా మోక్షాసక్తులు కాలేరని తెలియజేయుచున్నది. ఆ ఉపాయము ఏమిటో బ్రహ్మాండపురాణమునందు సూచించబడినది. 

 

భండాసురుడు ప్రతిజీవియందు ఎగసిపడు విషయేచ్ఛలరూపముతో సజీవుడుగనున్నాడు. భండాసురుని వధించిన పిదప, దేవతల కోరికమేరకు తల్లి కామదేవుని స్వస్వరూపమును అనుగ్రహించి, రుద్రుని జ్ఞానాగ్నినుండి కామదేవునికి రక్షణనిచ్చుట, భక్తులందు, ఆజ్యము పోసిన అగ్నివలె విజృంభించు విషయవాంఛలను అధికరింపక, అసురత్వమును పొందకుండ అనుగ్రహించుటకు సూచితము.  తదుపరి, కామదేవుని బాణములచే ఘాతకుడైన శివుడు, పార్వతీదేవిని పరిణయమాడుట, మోక్ష సూచితమగుటచే, సాధకులైన జీవులకు మోక్షదాయిని అమ్మ. 

శివశక్త్యాత్మికయైన తల్లిని ప్రార్ధిస్తూ,

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment