Wednesday 24 May 2023

హ్రీంకారీ-వామకేశీ Hreemkaari-Vamakesi

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

ఏతామాహురవిద్యాం బీజం సంసారవృక్షరాజస్య|

సర్వరసఫలయుతస్య ప్రారబ్ధజలేన దేవి దోహదినః || 

(ఉమాసహస్రము – 4.13)  

 

హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయవర్జితా – బగళాముఖి (4 నామములు)  

 

శక్తిప్రణవమైన హ్రీం బీజము మాయా/లజ్జాబీజము అనగా పరిమితత్వమును ఆపాదించుశక్తి. హ్రీంకారముతో ప్రారంభించిన ఈ నాలుగు నామములు, వాక్కును స్థంభింపజేయు బగళాముఖివిద్య సంబంధము. పరా, పశ్యంతి, మధ్యమ మరియు వైఖరివాక్కులను స్థంభింపజేయుశక్తిని తెలియజేయుటకు వాగ్దేవతలు ఈ నాలుగు నామములు కూర్చినట్లున్నది.

 

రాజరాజార్చితా, రాజ్ఞీ , రమ్యా, రాజీవలోచనా, రంజనీ, రమణీ, రశ్యా, రణత్కింకిణిమేఖలా, రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా, రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా – ఛిన్నమస్త (16 నామములు)

 

మస్తకము సహస్రారాంతర్గత పరమాత్మ సంకేతము. పంచజ్ఞానేంద్రియ, పంచకర్మేంద్రియములద్వారా సహస్రారమునందలి పరమాత్మతో కాకుండా(త్రుంచివేయబడిన మస్తకము), పంచభూతాత్మక ప్రపంచముతో జీవులందు కలుగు విషయాసక్తిని (సంగమించురతీమన్మథులు) అణగద్రొక్కు వజ్రవైరోచనీశక్తి, మస్తకమును చేతిలోపట్టుకున్న రేణుకాదేవి/ఛిన్నమస్త.

సంగమించు రతీమన్మథులు జీవులకు ఇంద్రియవిషయములందేర్పడు తీవ్ర ఆసక్తికి సంకేతము.

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే|

సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే|| (భగవద్గీత 2.62)

వజ్రాయుధము, ఇంద్రుని ఆయుధము మరియు విశేషమైన రోచనము/ప్రకాశము వైరోచనము, పరమాత్మ సంకేతము. వెన్నుదండము, వజ్రాయుధముల సామ్యము తెలిసినవిషయమేకదా. రతీమన్మథులమీద నిలబడి వెన్నుదండమునందలి పింగళ-సుషుమ్న-ఇడ నాడులందలి రక్తధారలను ఆస్వాదించు ఛిన్నమస్తాదేవి, జీవులందలి ఇంద్రియవిషయాసక్తిని సమూలముగా పెకలించివేయుటద్వారా జీవులను పరమాత్మతో అనుసంధానముజేయు విద్యుచ్ఛక్తికి సంకేతము. రక్తబీజుని రక్తము క్రిందపడకుండా కాలీమాత ఆ రక్కసుని రక్తమును ఇంకిపోవువరకు తాగుట ఎట్లు విషయవాంఛలను సమూలముగా నాశనముజేయుటకు సంకేతమో, అటులనే మస్తకమును ఛేదించగా వచ్చిన మూడు రక్తధారలు, ఢాకిని, ఛిన్నమస్త, వర్ణిని త్రాగుట, మనస్సును పంచభూతాత్మక ఇంద్రియార్థములనుండి సంపూర్ణముగా ఉపసంహరించుటకు సంకేతము.

 

ఇంద్రియనిగ్రహమును దైవీక, ఆసురీగుణముల మధ్య జరుగు పోరాటము/యుద్ధమునకు అన్వయించబడుట తెలిసిన విషయమే. ఈ సందర్భమున ఛిన్నమస్తాదేవి సహస్రనామము(శాక్తాప్రమోదము)లందలి రణోత్కంఠా, రణస్థా, వరారంగప్రదాయినీ, రణజైత్రీ, రణోత్సవా నామములను గమనించవలసినది.

 

వాగ్దేవతలు కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, పంచభూతములు మరియు మనస్సు (రతి – ఆసక్తి, మన్మధుడు – కామము/కోరిక)లకు సంకేతముగా వెరసి పదినారు నామములతో ఛిన్నమస్తావిద్య సంబంధముగా కూర్చినట్లున్నది.

 

కామ్యా, కమకలారూపా, కదంబవనవాసిని, కళ్యాణీ, జగతీకందా, కరుణారససాగరా, కలావతీ, కలాలాపా, కాంతా, కాదంబరీప్రియా త్రిపురసుందరి (10 నామములు)

 

కరుణాతరంగితాక్షియైన లలితామహాత్రిపురసుందరీదేవి, శరీరమను నవావరణ శ్రీచక్రాంతర్గతముగనూ, వెలుపలంతటనూ వ్యాపించిన చైతన్యశక్తి స్వరూపము.  కామకలాస్వరూపమైన సుందరీవిద్యను సూచించునవి ఈ పది నామములు.

 

వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా, విశ్వాధికా, వేదవేద్యా, వింధ్యాచలనివాసిని, విధాత్రి, వేదజననీ, విష్ణుమాయావిలాసిని – కాళి  (10 నామములు)

 

క్రమాక్రమాత్మా కాలశ్చ

పరః సంవిది వర్తతే

కాలీ నామ పరాశక్తిః

సైవ దేవస్య గీయతే || (తంత్రలోకః – 6.7)

సైవమ్ సంవిద్వాహిః స్వాత్మ-

గర్భీభూతౌ క్రమాక్రమౌ

స్ఫుటయంతీ ప్రరోహేణ

ప్రాణవృత్తిరితి స్థితా ||  (తంత్రలోకః – 6.8)

 

కాలస్వరూపిణియైన కాలికాశక్తి, విష్ణుసోదరిగా అవతరించిన మాయాశక్తి. ఈ మాయాశక్తి జీవులందు ముఖ్యమైన పది వాయువుల రూపముగా సంచరించుచున్నది. వరదా నుండి విష్ణుమాయావిలాసిని వరకుగల పదినామములు ప్రాణశక్తి స్వరూపిణియైన కాలివిద్య సంబంధితము.

 

క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్రక్షేత్రజ్ఞపాలినీ, క్షయవృద్ధివినిర్ముక్తా, క్షేత్రపాలసమర్చితా – ధూమవతి (5 నామములు)

 

వివర్ణా చంచలా రూష్టా దీర్ఘా చ మలినామ్బరా|

వివర్ణకుంతలా రూక్షా విధవా విరలద్విజా||

కాకధ్వజరథారూఢా విలంబిత పయోధరా|

సూర్యహస్తాతి రూక్షాక్షీ ధృతహస్తా వరాన్వితా||

ప్రవృద్ధఘోణా తు భృశం కుటిలా కుటిలేక్షణా|

క్షుత్పిపాసార్దితా నిత్యమ్ భయదా కలహప్రియా||

కాకధ్వజరథమునధిరోహించిన వివర్ణ, చంచల, మలినవస్త్రధారిణియైన విధవ, ధూమవతి స్వరూపము. ఇటువంటి శక్తిని, సర్వమంగళయైన లలితామహాత్రిపురసుందరీ నామములందు వాగ్దేవతలు ఏవిధముగాకూర్చారో చూద్దాము.

 

పంచప్రేతాసనము మీద ఆసీనురాలైన తల్లిని పంచప్రేతాసనాసీనా నామమునందు వర్ణించారు వాగ్దేవతలు.  

బ్రహ్మవిష్ణు రుద్రశ్చ ఈశ్వరశ్చ సదాశివః

ఏతే పంచఖురాః ప్రోక్తాః ఫలకస్తు సదాశివః

తల్లి త్రిపురసుందరీదేవి ఆసనము, పంచప్రేతములతో జేయబడినది. బ్రహ్మ(సృష్టి), విష్ణు(స్థితి), రుద్ర(సంహారము), ఈశ్వరులను(తిరోధానము) కోళ్ళుగాను, సదాశివుని(అనుగ్రహము) బల్లగానూగల్గిన ఆసనమును అధిరోహించియున్నది అమ్మ లలితామహాత్రిపురసుందరి. (జ్ఞానార్ణవతంత్రము-4వఅధ్యాయము)

 

చిచ్ఛక్తిః చేతనారూపా జడశక్తిర్జడాత్మికా – చేతనత్వముగల్గినవానియందు చిచ్ఛక్తి మరియు జడవస్తువులందు జడశక్తి  

ధూమవతీవిద్యను చైతన్యరహితమైన ఈ ఐదుప్రేతముల అనుబంధితశక్తిగా, ఐదునామములతో వర్ణించారు వాగ్దేవతలు.

 

విజయా, విమలా, వంద్యా, వందారుజనవత్సలా, వాగ్వాదినీ, వామకేశీ – మాతంగి (6 నామములు)  

 

షట్చక్రస్థయైన వాక్సంబంధిత మాతంగీదేవి. మనస్సుతో అనుసంధానింపబడి పరా, పశ్యంతీ, మధ్యమా మరియు వైఖరిగా రూపాంతరముజెంది మూలాధారాది ఆజ్ఞాచక్రపర్యంతముగల షట్చక్రముల  వాక్కు సంబంధిత మాతంగిదేవివిద్యను సూచించునవి ఈ ఆరు నామములు.

 

శరీరమంతటనూ బహిర్గతముగను విశ్వవ్యాపితమైన చైతన్యశక్తి(సుందరి)వలన సృష్టికిమూలమైన అవ్యక్త ఉపాదానశక్తి (కమల) వికసనముజెంది నామ-రూపసంబంధిత ప్రకాశ(భువనేశ్వరి), నాద(తార)శక్తుల అనుసంధానముతో పరాదిచత్వారివాక్కులను అంతర్లీనముగ స్థబ్ధుపరచి (బగళాముఖి) మూలాధారమునందు నిద్రించునది కుండలినీశక్తి (భైరవి). నిద్రించు ఈ కుండలినీశక్తి కారణముగా మనసు, ఇంద్రియములద్వారా ప్రేరేపింపబడి (ఛిన్నమస్త), శరీరమునందు ప్రవహించు ప్రాణశక్తి వాయువు (కాలి) సహాయముతో షట్చక్రములందు రూపాంతరముజెంది (మతంగ) వాక్కురూపముగ బహిర్గతమై సృష్టిస్థిత్యాది పంచకృత్యములు (ధూమవతి) జరుపబడుచున్నవి.

 

ఈ విధముగ దశమహావిద్యాతంత్రములను సంకేతమాత్రము సూచించి, తంత్రము తరువాత వాగ్దేవతలు, తల్లి యంత్రమును వర్ణిస్తున్నారు.

 

ఇకపైనవచ్చు యంత్రసంబంధితనామములను తదుపరి వ్యాసమునందు తెలుసుకుందాము.

 

దశమహావిద్యలకు మూలమైన పరాశక్తిని ప్రార్ధిస్తూ,

 

శ్రీమాత్రేనమః

Tuesday 16 May 2023

భానుమండలమధ్యస్థ – నామరూపవివర్జితా Bhanumandala madhyastha - Nama rupa vivarjitha

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

వికృతిస్సర్వభూతాని ప్రకృతిః పరదేవతా

సతః పాదస్తయోరాద్యా త్రిపదీ గీయతే పరా|| (ఉమా సహస్రము 37.18)

 

భానుమండలమధ్యస్థ – వామకేశి

మంత్రము, తంత్రము, యంత్రము ఈ స్తోత్రమందు ఒక వరుసగా వస్తున్నాయని చెప్పుకున్నాము. భానుమండలస్థుడైన సూర్యభగవానుడు జీవులందు కర్మప్రేరక దేవతామూర్తి. అందుచే భానుమండలమధ్యస్థా నామమునుండి వామకేశి వరకుగల నామములవరకు కర్మానుష్ఠానసంబంధిత తంత్రములను తెలియజేయునవిగా కూర్చారు వాగ్దేవతలు.

 

ఇకపైవచ్చు కొన్ని నామములు కర్మానుష్ఠానసంబంధిత తంత్రసంబంధమని తెలియజేయునది మొదటినామము భానుమండలమధ్యస్థ. సర్వతంత్రస్వరూపిణి అమ్మయని తెలియజేయునామము భానుమండలమధ్యస్థ.

 

భైరవి, భగమాలిని – భైరవీ విద్య (2 నామములు)

 

చైతన్యరహితము (Potential energy), చైతన్యవంతమని (Kinetic energy) శక్తి రెండువిధములు.  మూలాధారమునందు చైతన్యరహితముగా నిద్రించు కుండలినీశక్తియే, జాగృతిచెంది షట్చక్రములద్వారా ప్రయాణించునప్పుడు చైతన్యవంతమైన శక్తియగుచున్నది.

 

అచైతన్యమ్ పరమ్ సూక్ష్మమ్ గుణసామ్యమనుల్బణమ్

యోనిస్వభావసంజ్ఞాతమ్ మత్తో2భూద్భ ఇతి స్వయమ్ ||

 (లక్ష్మీతంత్రము 19.40)

భకారము, చైతన్య రహితమైన పరమసూక్ష్మ అవ్యక్తయోని. 

 

అనంతమైన పరమాత్మశక్తి కేంద్రీకరింపబడి మూలాధారమునందు చైతన్యరహిత కుండలినీశక్తిగా నిద్రించుటచే ఏర్పడు అణవ, మాయీయ, కార్మీక మలావరణముల ప్రభావమువలననే జీవులందు పరిమితత్వము/ద్వంద్వభావన ఏర్పడుచున్నది. ద్వితీయాత్ వై భయం భవతి. భయకారకురాలగుటచే ఈ శక్తి భైరవి. పరావాక్స్థానమగు మూలాధారమునందలి శక్తియగుటచే భైరవీ పరావాక్శక్తికి సంకేతము.

 

సాధకుల తపస్సుద్వారా కుండలినీశక్తిని జాగృతిజెందినప్పుడు వారియందలి భయమును పోగుట్టునది కూడా ఇదే భైరవీశక్తి. అయితే ఈ సందర్భములో షట్చక్రక్రమవాసిని భైరవీశక్తి, సాధకుల సుషుమ్నానాడిద్వారా చక్రములసమాహారమును భేదించుకుంటూ ఊర్ధ్వదిశగా ప్రయాణించు భగమాలినీశక్తి. 

 

పద్మాసనా, భగవతి, పద్మనాభసహోదరి – కమలాత్మిక (3 నామములు)

మూడు నామములు కమలాత్మికావిద్య సంబంధము. కమలము వికసనమునకు సంకేతము.

సహస్రారకమలమునందలి అవ్యక్త మాయాశక్తి కమలాత్మిక. సమతుల్యముగాగల త్రిగుణములతో ఏర్పడిన అవ్యక్తమాయాశక్తి, సృష్టికి మూలపదార్ధము. కుండకు, మట్టి ఉపాదానకారణమెటులనో, అటులనే సృష్టికి కమలాత్మికాశక్తి ఉపాదానకారణమై, క్షేత్ర(space)కారకురాలగుచున్నది. వైదీకపరిభాషననుసరించి పర(తురీయము), పశ్యంతి(సుషుప్తి/ప్రజ్ఞ), మధ్యమ(స్వప్న/తేజస్సు) మరియు వైఖరి(జాగృత్తు/విశ్వము) యని క్షేత్రములు నాలుగువిధములు.

 

వికసనత్వముగల్గిన త్రిగుణములసమతూలిక అవ్యక్త మాయాశక్తి కమలాత్మిక మరియు వ్యక్తీకృత మాయాశక్తి భువనేశ్వరి. 

 

ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః, సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్, ఆబ్రహ్మకీటజననీ, వర్ణాశ్రమవిధాయిని, నిజాజ్ఞారూపనిగమా, పుణ్యాపుణ్యఫలప్రదా, శృతిసీమంతసింధూరీకృతపాదాబ్జధూళికా, సకలాగమసందోహసుక్తిసంపుటితమౌక్తికా, పురుషార్ధప్రదా, పూర్ణా, భోగినీ, భువనేశ్వరీ – చతుర్దశ భువనములను పాలించు భువనేశ్వరిదేవి (14 నామములు)

 

తదేక్షత  బహుస్యాం ప్రజాయేయేతి తత్తేజోసృజత  (చాందోగ్యోపనిషత్తు 6.2.3)

ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీనాన్యత్కించన మిషత్ స ఈక్షత లోకాన్ను సృజా ఇతి (ఐతరేయోపనిషత్తు 1.1)

దృష్టి వలన సృష్టి ఏర్పడినది.

భవత్యస్మిన్నితి భువనమ్ – దీనియందు సర్వము గల్గును. (అమరకోశము)  

పరమాత్మయొక్క ఈక్షణాశక్తియే భువనేశ్వరి.

ఆఙ్ ఈషదర్థేభివ్యాప్తౌ సీమార్థే ధాతు యోగజే (అమరకోశము) ననుసరించి ఆకారము సీమార్ధమనగా పరిమితత్వమును సూచించునది. తద్వారా పరిమితత్వమును పొందిన ప్రకాశమే ఆకాశము .

స్థలము(Space) గ్రాహకశక్తి(perception) యొక్క పరిధి సంబంధితము కావున, భువనేశ్వరీశక్తిని జ్ఞానశక్తియని కూడా చెప్పవచ్చును.

ఆకాశ శరీరం బ్రహ్మ (తైత్తిరీయోపనిషత్తు – 6.1)

ఇచ్చటి పదినాలుగు నామములు, గుణానుబంధ చతుర్దశలోకములకు ఈశ్వరియైన భువనేశ్వరివిద్య సంబంధము.  

 

రూప(ప్రకాశ)సంబంధిత శక్తి భువనేశ్వరి, నాదసంబంధిత శక్తి తారాదేవి.

 

అంబికా, అనాదినిధనా, హరిబ్రహ్మేంద్రసేవితా, నారాయణీ, నాదరూపా, నామరూపవివర్జితా
– తారాదేవి
(6 నామములు)

 

అకారః ప్రథమాక్షరో భవత్యుకారో ద్వితీయాక్షరో భవతి మకారస్తృతీయాక్షరో భవతి అర్ధమాత్రశ్చతుర్థాక్షరో భవతి బిందుః పంచమాక్షరో భవతి నాదః షష్ఠాక్షరో భవతి తారకత్వాత్తారకో భవతి| తదేవ తారకం బ్రహ్మత్వమ్ విద్ధి తదేవ ఉపాస్యమితి జ్ఞేయమ్ | గర్భజన్మజరామరణసంసార మహద్భయాత్సన్తారయతీతి తస్మాదుచ్యతే తారకమితి| (శ్రీరామ ఉత్తర తాపినీ ఉపనిషత్తు 2వఖండము 2)

 

అకార, ఉకార, మకార, అర్ధమాత్ర, బిందువు మరియు నాదముతో కూడిన తారకమంత్రమై తరించునట్టి ప్రణవమును తెలియపరచునట్లు, ఈ ఆరునామములు నాదరూపిణియైన తారాదేవి/తారావిద్య సంబంధితముగనున్నవి.

 

శబ్దముకంటే వెలుతురు వేగముగా ప్రయాణించునను విషయము, ముందు మెరుపుతీగ ప్రకాశించినతరువాత పిడుగుశబ్దము వినబడుటద్వారా అందరికీ తెలిసినదే. వాగ్దేవతలు ఈ సత్యమును నాదసంబంధిత తారాదేవికి ముందుగా  భువనేశ్వరివిద్యను కూర్చుటద్వారా తెలియజేసినట్లున్నది.

 

సర్వశక్తిమయి తల్లిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

Monday 15 May 2023

మనువిద్యా – పంచకృత్యపరాయణా Manuvidya - Pancha Krutya Paraayana

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

పఞ్చాశన్నిజదేహజాక్షర భవైర్నానావిధైర్ధాతుభిః

బహ్వర్ధైః పదవాక్యమానజనకైరర్ధావినాభావితైః

సాభిప్రాయవదర్ధ కర్మఫలదైః ఖ్యాత్యైరనంతైరిదమ్

విశ్వమ్ వ్యాప్య చిదాత్మనాహమహమిత్యుజ్జృంభసే మాతృకే || 

(శక్తి  మహిమ్నస్తోత్రమ్ – 27)

 

 

మనువిద్యా – పంచకృత్యపరాయణా

 

మను అంటే మంత్రము.  మనువిద్యా నుండి పంచకృత్యపరాయణావరకు నామములందు వాగ్దేవతలు అమ్మతల్లి యొక్క పంచదశీమంత్రస్వరూపమును ఆవిష్కరిస్తున్నారు.

 

వాగ్భవ, కామరాజ, శక్తికూటములు/సోమసూర్యాగ్ని మండలములని మూడుమండలములు గల్గినది పంచదశీ మంత్రము.

 

న నుండి త వరకుగల అక్షరములనుండి శ్రోత్రాది జ్ఞానేంద్రియములు, ణ నుండి ట వరకుగల అక్షరములనుండి వాగాది కర్మేంద్రియములు ఞ నుంచి చ వరకుగల అక్షరములనుండి శబ్దాది పంచతన్మాత్రలు, ఙ నుండి క వరకుగల అక్షరములనుండి ఆకాశాది పంచభూతములు ఉత్పనమైనవి. (లక్ష్మీతంత్రము 19.43-44)

 

చంద్రమండలమధ్యగా నుండి వచ్చు ఏడు నామములను వాగ్దేవతలు ఇంద్రియసంబంధిత అక్షరము చ తో ప్రారంభించుటద్వారా చంద్రవిద్యా నుండి చక్రరాజనికేతనా నామములందు సప్తాశ్వములను నిర్దేశించినారు ఈ ఏడు నామములు సప్తాశ్వారూఢుడైన సూర్యసంబంధితమైనవిగ సూచించుచున్నట్లున్నది.  కాగా, ఈ ఏడునామములు భానుమండలసంబంధిత కామరాజకూటమును తెలియజేయునవిగనున్నవి.

 

తదుపరి వచ్చు ఐదునామములు అగ్నిసంబంధమైనవని తెలియజేయుటకు జ్ఞానేంద్రియ సంబంధిత అక్షరమైన ప-కారముతో ప్రారంభించి పంచాగ్నులమధ్య తపస్సుజేసిన పార్వతమ్మని (పార్వతి నుండి పంచబ్రహ్మస్వరూపిణి) మొదటినామముగా పెట్టినారు వాగ్దేవతలు. ఈ నామములు అగ్నిమండల సంబంధిత శక్తికూటమును తెలియజేయునవి.

 

చిన్మయీ, పరమానందా, విజ్ఞానఘనరూపిణి – సచ్చిదానందమయ పరమాత్మ

ధ్యాన, ధ్యాతృ, ధ్యేయము – 3 (త్రిపుటి)

జాగృత్ (విశ్వరూపా), స్వప్న (తేజస్సు), సుషుప్తి (ప్రజ్ఞ), తురీయము – 4 (3 అవస్థలు + 1 అవస్థారహిత స్థితి )

సృష్టి (బ్రహ్మరూపము), స్థితి (గోవిందరూపము), సంహారము (రుద్రరూపము), తిరోధానము (ఈశ్వరరూపము), అనుగ్రహము (సదాశివస్వరూపము) – 5 కృత్యములు

 

ప్రతిపత్తునుండి పూర్ణిమవరకుగల తిథులకు అనుబంధముగా చెప్పబడిన ఈ 15నామములద్వారా చంద్రమండల సంబంధిత వాగ్భవకూటమును తెలియజేస్తున్నారు వాగ్దేవతలు.

 

ఈ విధముగా సప్తాశ్వరథారూఢుడైన సూర్యమండల సంకేతముగా ఏడునామములు, పంచాగ్నుల సంబంధిత అగ్నిమండలసంకేతముగా ఐదునామములు, 15తిథుల సంబంధిత చంద్రమండల సంకేతముగా పదిహేను నామములతో స్తుతించుటద్వారా పంచదశీమంత్రముయొక్క మూడుకూటములను ఆవిష్కరిస్తున్నారు వాగ్దేవతలు.

 

మంత్రము, తంత్రము, యంత్రము ఈ స్తోత్రమందు ఒక వరుసగా వస్తున్నాయని చెప్పుకున్నాము. భానుమండలస్థుడైన సూర్యభగవానుడు జీవులందు కర్మప్రేరక దేవతామూర్తి. అందుచే భానుమండలమధ్యస్థా నామమునుండి వామకేశి వరకుగల నామములవరకు కర్మానుష్ఠానసంబంధిత దశమహావిద్యాతంత్రములను వివరిస్తున్నారు వాగ్దేవతలు.

 

పంచదశాక్షరిరూపిణిని  ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః