Friday 19 July 2019

Bhandasura భండాసురుడు


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

పంచశరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన।
కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారమ్।। 
(ఆర్యాశతకము -5)

దేవకార్యమును సిద్ధింపజేయుటకొరకు తల్లి చిదగ్నికుండమునుండి ఆవిర్భవించినదని చెప్పుకున్నాము.  వాగ్దేవతలు ఇకపై వచ్చునామములందు ఆ దేవకార్యమేమిటో ప్రస్తావిస్తున్నారు.

సహస్రనామస్తోత్రమునందలి తదుపరి నామమునందు మొదటిసారిగా చెప్పబడిన భండాసురునిగురించి తెలుసుకుందాము.

స్థాణ్వాశ్రమమునందు నిస్సంగుడై తపోనిష్ఠుడైన శివుని/రుద్రుని జ్ఞానాగ్నితో దగ్ధమైన కామదేవుని భస్మమునుండి, అదే రుద్రుని కడకంటిచూపుతో మధ్యాహ్నార్కసమప్రభలతో ప్రాణముపొందిన, మహాబలి, మహాతేజస్వి, భండుడు. అయితే రుద్రుని జ్ఞానాగ్నివలన ఏర్పడిన మన్మథుని భస్మమునుండి ఆవిర్భవించినందున, భండుడు దైత్యుడైనాడు (బ్రహ్మాండపురాణము ఉ-11.30,31, 30.35). ఆసురీగుణ భండుని సంహరించి, దేవతలకోరికమేరకు హరనేత్రాగ్నికి దగ్ధమగుటకు మునుపుగల కామదేవుని సుందరరూపమును ప్రసాదించి తల్లి అనుగ్రహించినది (ibid 30.45,46). మరల స్వస్వరూపమును పొందిన కామదేవుడు దాసోహమనిప్రార్ధించగా (30.56), “నాఅనుగ్రహముతో సర్వజగత్తును మోహింపజేయగలవు. తపోనిష్ఠుడైన శివుని తాపసాగ్ని కూడా ఇక నిన్ను భస్మముచేయజాలదు (30.60)” అని తల్లి కామదేవుని కటాక్షించినది.  ఈ విధముగా తల్లి అనుగ్రహపాత్రుడైన కామదేవుడు, మరల శివుని పుష్పబాణములతో తాకగా, శివుడు నిస్సంగత్వమును వీడి పార్వతీదేవిని పరిణయమాడినట్లు పురాణములందు చెప్పబడినది.

పరమశివ, పర్వతరాజపుత్రిక పార్వతుల కలయిక పరమాత్మైక్యతకు సూచితము (సుమేరుమధ్యశృంగస్థా నామవివరణ చూడగలరు). విషయాసక్తులైన వారికి మోక్షము సిద్ధించుట మిక్కిలి కష్టతరము మాత్రమే కాదు సరిగదా వారికి గగనకుసుమమగును.  ఎందువలననంటే,
న జాతు కామః కామానామ్ ఉపభోగేన శామ్యతి।
హవిషా కృష్ణవర్త్మా ఇవ భూయ ఏవ అభివర్ధతే।।
(మహాభారతము-ఆదిపర్వము-సంభవపర్వము-85.12, శ్రీమద్భాగవతము-9.19.4, మనుస్మృతి –2.94)

భోగించినచో ఐహికవాంఛలు తీరకపోగా, అగ్నికి ఆజ్యము తోడయినపుడు ఎటుల విజృంభించునో, అటులనే కోరికలు మరింత ఉధృతమగును. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశివు కప్పబడియున్నట్లు, దుష్పూరణము, అగ్నివలె తృప్తిచెందనిదైన కామముచే ఆత్మజ్ఞానము కప్పబడియుండుటచే, కామము ఆత్మజ్ఞానికి నిరంతర శత్రువు (భగవద్గీత-3.38,39).

కామదేవుని పుష్పబాణములను శివునిపై సంధించుట జీవుల విషయభోగమునకు సూచితము. రుద్రుని జ్ఞాననేత్రాగ్నిలో దగ్ధమై, ఆ భస్మమునుండి మరల సజీవుడైన విజృంభిత కామపూరిత, ఆసురీగుణ భండుడు, భోగించిన విషయములతో తృప్తినికలిగించకుండా, మరింత పెరిగిన వాంఛ/ఉధృతకామము(రాగము)నకు సూచితము. జీవులందలి భండుడు, జీవులను మోక్షాసక్తులను గానీయడు.

అవధ్యః సర్వభూతానామహమేకః సనాతనః అవధ్యుడు, సనాతనుడు, సర్వభూతాంర్గతుడైన కామదేవుడు స్వయముగా కామగీతయందు (మహాభారతము- అశ్వమేధపర్వము-13.12) నాహమ్ శక్యోనుపాయేన హన్తుం భూతేన కేనచిత్ సరియైన ఉపాయములేకుండగా జీవులు నన్ను జయించలేరని చెప్పినట్లు శ్రీకృష్ణపరమాత్మ యుధిష్ఠిరునితో చెప్పినాడు.

నిష్ఫలమైన కామదేవుని మొదటి ప్రయత్నము, జీవులు సరియైన ఉపాయములేకుండా మోక్షాసక్తులు కాలేరని తెలియజేయుచున్నది. ఆ ఉపాయము ఏమిటో బ్రహ్మాండపురాణమునందు సూచించబడినది. 

భండాసురుడు ప్రతిజీవియందు ఎగసిపడు విషయేచ్ఛలరూపముతో సజీవుడుగనున్నాడు. భండాసురుని వధించిన పిదప, దేవతల కోరికమేరకు తల్లి కామదేవుని స్వస్వరూపమును అనుగ్రహించి, రుద్రుని జ్ఞానాగ్నినుండి కామదేవునికి రక్షణనిచ్చుట, భక్తులందు, ఆజ్యము పోసిన అగ్నివలె విజృంభించు విషయవాంఛలను అధికరింపక, అసురత్వమును పొందకుండ అనుగ్రహించుటకు సూచితము.  తదుపరి, కామదేవుని బాణములచే ఘాతకుడైన శివుడు, పార్వతీదేవిని పరిణయమాడుట, మోక్ష సూచితమగుటచే, సాధకులైన జీవులకు మోక్షదాయిని అమ్మ.  ఈ విధముగ, సాధన ద్వారా తల్లిఅనుగ్రహమును పొందినచో, భోగము, మోక్షము రెండింటినీ తల్లి ప్రసాదిస్తుంది.

రాగద్వేషరహితులైన సాధకులు, శరీరపోషణార్ధము విషయములను భోగించుచున్ననూ, స్వాధీనమైన అంతఃకరణముతో, నిర్మలత్వమునుపొందుటద్వారా బుద్ధిని అతిశీఘ్రముగ పరమాత్మయందు నిలుపగలరు (భగవద్గీత 2.64,65).

యత్రాస్తి భోగో న తత్ర మోక్షః యత్రాస్తి మోక్షః న తు తత్ర భోగః।
శ్రీసుందరీ సాధకపుంగవానాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ।।
సాధారణముగ భోగమున్న మోక్షము లేదు, మోక్షమున్న భోగములేదు.  కానీ, శ్రీవిద్య/సుందరీవిద్య సాధకులకు భోగము, మోక్షము రెండింటినీ తల్లి ప్రసాదిస్తుంది.

ఊత్తుక్కాడు వేంకటకవి, 18వ శతాబ్దమునకు చెందిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయనకు అమిత కృష్ణభక్తి.  సంస్కృతము, తమిళములో గొప్ప సాహిత్యవిలువగలిగిన భక్తిభావకృతులను రచించినారు.  వారు అమ్మవారిమీద శ్రీవిద్యారహస్యములతో కూడిన నవావరణకృతులను కూడా రచించారు. ఆయన రచించిన నవావరణకృతులలో నాల్గవ ఆవరణకృతి యోగయోగేశ్వరియందు, భోగమోక్షవరదాయిని యని తల్లిని స్తుతిస్తారు. ఆనందభైరవి రాగములో అద్భుతమైన కృతి.  మా అత్తగారు శ్రీమతి సరోజా చెంగల్రాయన్ పాడిన యోగయోగేశ్వరి పాటను  ఆసక్తిగలవారికోసము ఇక్కడ పెడుతున్నాను.

భోగమోక్షవరదాయినియైన తల్లిని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః