Saturday 21 July 2018

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితా - Anakalita sadrusya chubuka sri virajita

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

అగాధేఽత్ర సంసారపఙ్కే నిమగ్నమ్

కలత్రాదిభారేణ ఖిన్నమ్ నితాంతమ్|

మహామోహపాశౌఘబద్ధమ్ చిరన్మామ్

సముద్ధర్తుమమ్బ త్వమేకైవ శక్తా||

(దేవి భుజంగ స్తోత్రమ్)

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితా

 

కలిత లభ్యమైన; అనాకలితఅలభ్యమైన

సాదృశ్యసమమైన

చిబుకముగడ్డము

శ్రీశోభ

విరాజితావిరాజిల్లుతల్లి

 

అనాకలితసాదృశ్యచిబుకశ్రీవిరాజితాయై నమః

 సమమైన ఉపమానము లేని గడ్డపుశోభతో విరాజిల్లు తల్లికి నమస్కారము.

 

వశిన్యాదివాగ్దేవతలు తల్లీ!! నీ ముక్కు సంపంగిపూవు వంటిది, కన్నులు చేపలవంటివి, కనుబొమలు మన్మధునివిల్లువంటివి, పెదవులు బింబఫలము వంటివి, చెక్కిళ్ళు పద్మరాగశిలల అద్దములవంటివి, మొత్తముగా వదనము చంద్రబింబము వంటిది అని వర్ణించి, గడ్డము దగ్గరకు వచ్చేసరికే, అమ్మా!! నీగడ్డమును పోల్చుటకు మాకు నీసృష్టిలోనుంచి ఏమీ దొరకుటలేదు. అందుచే ఉపమానరహితమైన గడ్డమునుగల తల్లికి నమస్కారము అని గడ్డపుశోభకు దీటైన వస్తువేదీ లేదని తేల్చి చెప్పారు.

 

కానీ అదే బ్రహ్మాండపురాణమునందలి లలితోపాఖ్యానమునందు వ్యాసులవారు తల్లి గడ్డమును 

ముఖదర్పణవృన్తాభ చిబుకా (లలితోపాఖ్యానము అ33 – శ్లో82)

తల్లీ!! నీ చిబుకము (గడ్డము), నీ ముఖమనెడు గుండ్రటి అద్దమునకు పిడివలే ఉన్నది, అని వర్ణించారు.

 

మరి ఈ అద్దపుపిడిని పట్టుకున్న వారెవరో తెలుసుకొనుటకు సాక్షాత్ శివస్వరూపులైన శంకరభగవత్పాదుల సౌన్దర్యలహరిని ఆశ్రయించాలి. సౌన్దర్యలహరి 67వ శ్లోకము కరాగ్రేణ స్పృష్టమ్ తుహినగిరిణా వత్సలతయా నందు, వాత్సల్యముతో తండ్రియైన హిమవత్పర్వతరాజు, అధరపానాకులతతో పతిదేవుడైన గిరీశుడు ముఖమనెడి అద్దమునకు పిడివలెనున్న ఉపమానరహితమైన నీ గడ్డమును స్పృశించారు తల్లీ!! అని వర్ణించారు.


ఇచ్చట ముఖమును అద్దముతో పోల్చుటకు కారణము పరిశీలిద్దాము.

మనోజాతమాణిక్యసద్దర్పణాకార వక్త్రాంబుజ ప్రోజ్వలన్మంజరీ వృన్త రేఖాకనచ్చౌబుక శ్రీయుతే!! (రాజరాజేశ్వరీ దండకము)

మనస్సునుండి జనించిన సంకల్పమాత్రమున ఏర్పడిన మాణిక్యపుటద్దమువలేఉన్న ముఖారవిందమునందు ప్రజ్వలిస్తున్న అద్దపుపిడివలె ప్రకాశిస్తున్న చిబుకముతో శోభిల్లుతల్లీ!!

 

ఎవరి మనస్సు? పరమాత్మ (సృష్టిచేయ) సంకల్పమాత్రముననే, ఏకవస్తువుగా ఉన్న ప్రకాశవిమర్శశక్తులు సృష్టి కార్యార్ధము రెండుగా విభజించబడి, బ్రహ్మాత్మకశక్తి అద్దమువలే ప్రకాశించినది (కామకలావిలాసము). ప్రకాశబిందువు చైతన్యవంతమైన బ్రహ్మస్వరూపము. విమర్శబిందువు తదంతర్గత శక్తి.

 

విమర్శబిందువును రెండవసూత్రమునందు మలినములేని (నిర్మల) అద్దము(ఆదర్శము)గా చెప్పబడినది.

సా జయతి శక్తిరాద్యా నిజసుఖమయ నిత్యనిరుపమాకారా

భావిచరాచరబీజమ్ శివరూపవిమర్శనిర్మలాదర్శః

(కామకలావిలాసము సూ 2)

నిర్మలమైన అద్దమువంటి విమర్శబిందువు బ్రహ్మాత్మకమైన శక్తిస్వరూపము. ఆమెయే కామేశ్వరీదేవి అని చెప్పుకున్నాము కదా!! ఆమె కుంకుమచ్ఛాయగలదిగనుక మాణిక్యపుటద్దము (కెంపుటద్దము) అని చెప్పబడినది.

 

అమ్మయొక్క అద్దమువంటి ముఖమునందలి పిడివంటి గడ్డముపట్టుకొని మహామోహపాశములతో కూడిన జన్మజలధినుండి దాటించుతల్లీ అని బతిమలాడుతూ

 

శ్రీమాత్రే నమః

Friday 20 July 2018

మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా - Mandasmita prabhapura majjat kamesa manasa

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

కల్యాణి త్వమ్ కుందహాసప్రకాశౌ

రన్తర్ధ్వాన్తమ్ నాశయన్తీ క్షణేన

హన్తాస్మాకమ్ ధ్యాయతామ్ త్వత్పదాబ్జ

ముచ్చతిష్ఠ మహతే సౌభాగ్యాయ|| 

(త్రిపురసుందరీవేదపాదస్తవము-36)

 

ఞ ఇవజ్ఞదృశ్య ఉత్తమఇలాధరాధీశనన్దినీహాసః

పూర్ణమ్ కరోతుమానస మభిలాషమ్ సర్వమస్మాకమ్||

 (ఉమాసహస్రము 9.11)

వైదీక వ్యాకరణ సంబంధిత గ్రంథము ప్రాతిశాఖ్య (ఋగ్వేద ప్రాతిశాఖ్య,..) . అట్టి తైత్తిరీయ సంబంధిత ప్రాతిశాఖ్యయందు ఉత్తమమైన అనుసంజ్ఞ యని చెప్పబడినది. జ్ఞ యందలి ఉత్తమమైన ఞ కారము ప్రాతిశాఖ్యజ్ఞులచే సరిగా/స్పష్టముగా గుర్తింపదగినది. అట్లే పర్వతరాజపుత్రి మందహాసము అత్యంత సూక్ష్మదృష్టిగల పండితులచే తెలియదగినది.



మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా

మందస్మిత - మందహాస

ప్రభాపూరకాంతుల వరద/ప్రవాహము

మజ్జత్నిండిపోయిన/మునిగిపోయిన/స్నానముచేయు

 

ఈ నామమునందు ఒక విశేషము గలదు. ఈ స్తోత్రమునందలి నామములలో, మాతాపితరులను (మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః) కలిపి స్మరింపజేసే మొదటి నామము. అయ్యవారి మూలముగా అమ్మవారిని వర్ణించు మొదటి నామము.

 

సాక్షాత్తు పరశంభుడే శివ/మహా కామేశ్వరుడు.

శివాశివస్యపత్నీయమ్ శైల జన్మనిజన్మని|

  (శివపురాణము-రుద్రసంహిత- పార్వతీఖండము-3346శ్లో)

ఓ హిమవంతా!! జన్మజన్మలకు, పార్వతి శివుని పత్ని అని వశిష్ఠులవారు పర్వతరాజును శివపార్వతుల కళ్యాణమునకు సమ్మతింపజేయు సందర్భమున పలికినారు. ఇక్కడ జన్మయనిన మనవంటి మానవమాత్రమైన జన్మయనుకొనరాదు. శివపార్వతులవి దుష్టశిక్షణ శిష్ట రక్షణకొరకు దిగివచ్చు దివ్యావతారములు.

 

భండాసుర సంహారముకొరకు అగ్నికుండమునుండి వెలువడిన లోకాతీత లావణ్యరాశి లలితాపరాభట్టారిక.  జడలుకట్టిన కేశములు, కపాలమాల, భిక్షపాత్ర గలిగిన త్రినేత్రుడు, స్మశానవాసి, భస్మధరుడు, అయిన శివుని వరునిగా లలితమ్మతల్లి అంగీకరిస్తుందాయని ప్రక్కనే ఉన్న బ్రహ్మదేవుడు ఆలోచిస్తూఉండగా, శివుడు కోటికందర్పలావణ్యముతో, దివ్యాంబరములతో, దివ్యగంధానులేపనములతో, కిరీట, హార, కేయూర, కుండలాది దివ్యాభరణములతో జగన్మోహనరూపుడైన కామేశ్వరుడుగా ప్రాదుర్భవించాడు (బ్రహ్మాండపురాణము ఉత్తరభాగము 14 – 19,20). కామేశుని పట్టమహిషియైన తల్లి కామేశ్వరి. ఆ కామేశుని మనస్సును తన మందహాసకాంతులతో నింపివేసిన తల్లికి నమస్కారము.

 

తెలుపు రంగు స్వచ్ఛతకు సంకేతము. తల్లిచిరునవ్వు స్వచ్ఛతను చెప్పుటకు అమ్మ ఉపాసకులు, కవులు, చంద్రకాంతి, కర్పూరపు తెల్లదనము, పాలకడలి కెరటముల తుంపరలు, మల్లె, పారిజాత పువ్వులు, సరస్వతీవాహనమైన హంస మొదలగువాటితో పోల్చిచెప్పినారు. సింధూరారుణ విగ్రహమైన అమ్మ మందహాసము తెల్లని తెలుపురంగు. ఈ మందహాస ప్రభలలో మునకలాడుతున్నది కామేశుని మనస్సు.

 

అమ్మ మందహాసమును వర్ణిస్తూ, మూకకవి 100 శ్లోకములతో కూడిన మందస్మిత శతకమును రచించగా, గణపతిముని ఉమాసహస్రమునందలి 40 స్తబకములందలి ప్రథమశ్లోకములందునూ, ఒక స్తబకము నందలి 25 శ్లోకములందునూ పూర్తిగా తల్లి మందస్మితమును వర్ణించారు.

 

లలితమ్మయొక్క సహస్రనామములందు వశిన్యాదివాగ్దేవతలు శివుని కామేశ్వరుడు, శివ, హరుడు, మహేశ్వరుడు, శ్రీకంఠుడు, సదాశివుడు, దక్షిణామూర్తియను వేర్వేరు పేర్లతో చెప్పిననూ, కామేశ్వరనామ సంబోధన ఎక్కువగా (30,33,39,52,76,81,232,372,403) కనబడుతుంది.

వాడుకలో కామముయనిన కోరిక, కామదేవుడుయనిన మన్మథుడు.

 

వేదములు, ఉపనిషత్తులయందు కామమనిన ఈ క్రింది విధముగా చెప్పబడినది.

 

కామస్తదగ్రే సమవర్తతాధి మనసో రేతః ప్రథమమ్ యదాసీత్| 

(ఋగ్వేదము 10.129.4)

సోఽకామయత బహుస్యామ్ ప్రజాయేయేతి

(తైత్తిరీయ ఉపనిషత్తు)

సృష్టి చేయుటకు ప్రప్రథమముగా విమర్శాత్మకమైన బ్రహ్మవస్తువునకు ఒక్కటిగా ఉన్ననేను ఎన్నో అవుతాను అనే కోరిక/కామము కలిగి, సకల బ్రహ్మాండములను సృజించి పాలించుటచే (కామ+ఈశ్వరుడు) కామేశ్వరుడుగా చెప్పబడుచున్నాడు

 

సకలభువనోదయస్థితిలయమయ లీలావినోదనోద్యుక్తః|

అంతర్లీన విమర్శః పాతు మహేశః ప్రకాశమాత్ర తనుః ||

(కామకలావిలాసము – 1సూత్రము)

నిరుపాధిక సంవిదేవ కామేశ్వరః

సదానంద పూర్ణాస్వాత్మైవ పరదేవతా లలితా

  (భావనోపనిషత్తు 23వ మంత్రము)

 

చతుర్దశభువనాత్మకమైన బ్రహ్మాండ మందలి సారభూతమైన బ్రహ్మవస్తువు యొక్క ప్రకాశరూపము కామేశ్వరుడు, తదంతర్లీన శక్తియే విమర్శాంశమైన కామేశ్వరి.  

 

రసోవై సః రసగ్గ్-మ్ హ్యేవాయమ్ లబ్ధ్వాఽఽనందీ భవతి

సారమనగా రసము. జగత్తునందలి సారభూతమైన బ్రహ్మవస్తువును తెలుసుకొన్నవారు బ్రహ్మానందమును పొందుచున్నారు

 

కామేశ్వరీకామేశ్వరుల ద్వంద్వమే సకల సృష్టికి కారణమైన నామరూపరహిత ఆత్మవస్తువు/కామకల/ నిత్యము, సత్యముయైన చిత్కల/ వృద్ధిక్షయ రహిత ధృవకల. శివశక్తైక్యరూపమైన దీనిని తెలుసుకొనుటయే బ్రహ్మానందకారకము.

కలాతుషోడశోభాగః షోడశకలమ్ వై బ్రహ్మ  (జైమిని ఉపనిషత్తు 3.38.8)

16వ భాగమును కలయందురు. అదియే బ్రహ్మవస్తువు. బ్రహ్మవస్తువుయొక్క కలావిశేషములను బృహదారణ్యక ఉపనిషత్తుయందు వివరముగా చెప్పబడిది.

 

కామకల గురించిన మరిన్ని వివరములు మున్ముందు చూద్దాము.

 

కారణవస్తువైన  కామకలవలన జరుపబడు బ్రహ్మాండపిండాండ సృష్టికార్య విలాసములను వర్ణించుచు శ్రీపుణ్యానందమునీంద్రులు రచించిన గ్రంధమే కామకలావిలాసము.

నైవ స్త్రీ న పుమా నేష నైవ చాయమ్ నపుంసకః

యద్యచ్చరీర మాదత్తే తేన తేన స యుజ్యత

సృష్ట్యాదియందలి స్త్రీ, పురుష, నపుంసకముగాని బ్రహ్మవస్తువును శ్రీవిద్యోపాసనయందు బిందువుగా చెప్పబడును. భావిసృష్టికి ఇదియే సంవిద్/కారణ బిందువు. అందుచే సమస్త సృష్టికి కారణమైన ఈ బిందువు (సర్వానందమయచక్రము) కామేశ్వరీకామేశ్వరుల ఏకత్వమును సూచిస్తుంది.

ఇదియే దేవతామూర్తుల ద్రష్టలైన ఋషులు సగుణవర్ణనలో, అమ్మవారిని అయ్యవారి అంకస్థితగా (తొడమీదకూర్చున్నట్లుగా) వర్ణించుటయందలి రహస్యము. వామాంకారూఢ వల్లభ (వల్లభగణేశుడు), కామేశ్వరాంకస్థితా (కామేశ్వరీకామేశ్వరులు), వామాంకస్థితజానకి (సీతారాములు) వంటి ధ్యానశ్లోకములందలి అంకస్థిత ప్రయోగము, ఆయా దేవతలిరువురి ఏకత్వమును సూచిస్తుంది.

 

కామేశ్వరీదేవి మందహాసప్రభల వెలుగులో నాలోని గడ్డకట్టిన అజ్ఞానాంధకారములు తొలగిపోవలెనని ప్రార్ధిస్తూ

 

శ్రీమాత్రే నమః

Thursday 19 July 2018

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సిత కచ్ఛపీ - Nijasallapamadhurya-vinirbhatsita-kacchapi

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

కంబుసదృగమమ్బ!! జగతామ్ మణివేషోడు స్రజాకృతాకల్పః|

కణ్ఠోఽనఘస్వరస్తే ధూర్జటిదోర్నయన కర్ణహితః||

(ఉమా సహస్రము 11.11)

అమ్మా! జగములను మణుల హారముతో ఒప్పారుచున్న, శంఖమువంటి నీ కంఠము ధూర్జటి నయనములకును, ఆ కంఠమునుండి వచ్చు అనఘస్వరము కర్ణములకు హితముగనున్నది.

 

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సిత కచ్ఛపీ

 

నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సిత కచ్ఛప్యై నమః

నిజ నిత్యమైనది నిజముఎప్పుడూ మారనిది

సల్లాప (సంలాప)మాటలు/వాక్కులు

మాధుర్యమాధుర్యముగలిగిన

వినిర్భర్త్సిత -ఓడించు

చ్ఛపీచ్ఛపి వీణావాదనమును

 

తల్లి వాక్కులు వేదములని చెప్పుకున్నాము కదా. వేదములు ఎల్లవేళలా సత్యములైన వాక్కులు. చ్ఛపి వీణానాదమును ఓడించు మధురమైన వాక్కులుగల తల్లికి నమస్కారము.

 

మన హైందవ దేవతా మూర్తుల చేతులలో వీణ (దక్షిణామూర్తి, సరస్వతి, శ్యామల, నారదుడు, లవకుశలు,..), వేణువు (కృష్ణయ్య), డమరు (శివయ్య), మద్దళము (నంది) మొదలగు సంగీతవాయిద్యములు ఉండుట మనకు తెలిసినదే. వీణానాదము మానవుల గాత్రమునకు అతిదగ్గరగా ఉండుటచే, అన్ని సంగీతవాయిద్యములలో వీణకి అగ్రస్థానము గలదు. అందుచే తల్లివాక్కులను వశిన్యాదివాగ్దేవతలు వీణానాదముతో పోల్చారు.

 

అదికూడా ఎలాంటి వీణ? ఇది మనకి పరిచయమైన మానుషీ వీణ కాదు, దివ్య వీణ. సరస్వతీ దేవి వీణ. దీని పేరు కచ్ఛపి. కచ్ఛపముయనగా తాబేలు. ఈ తల్లి వీణయొక్క కుడము లేదా కుండ, తాబేలు ఆకారములోయుండుటచే దీనికి కచ్ఛపియని పేరు. అంతేకాదు, సరస్వతీదేవి వీణ యందలి నాలుగు తంత్రులు (తీగలు) నాలుగువేదములు. 24 మెట్లు గాయత్రీమంత్ర సంకేతములు. ఈ వీణతంత్రులతో పలికించు సప్త స్వరములు సప్తమాతృకలకు సంకేతములు. శ్రుతులను వాక్కులుగా గలిగిన మాతృకావర్ణరూపిణియైన లలితమ్మతల్లి వాక్కులను పోల్చుటకు కచ్ఛపి కంటే వేరె గలదె?

 

సంగీతమకరందయను గ్రంధమునందు నారదులవారు పలురకములైన వీణలను వర్ణిస్తారు. వీణయందు యోగరహస్యముకూడా గలదని తెలుసుకొనగలరు. దర్శన, శాండిల్యోపనిషత్తులందు మన పృష్ఠదండమును (వెన్నెముకను) వీణతో పోల్చిచెప్పబడినది.

 

మరి సౌన్దర్యలహరిలో ఆదిశంకరులేమన్నారో చెప్పుకోకుండా వదిలేస్తే ఈ నామవివరణ అసంపూర్ణమౌతుంది. తల్లికి అత్యంతప్రీతిపాత్రమైన విషయము శివ నామము/లీలలు. అట్టి శివలీలలను వర్ణిస్తూ సరస్వతీదేవి తల్లిముందు వీణవాయిస్తుండగా ఓహో! చాలా బాగున్నదియని తలయూచుచూ,  ప్రశంసించుటకు తల్లి ఉద్యుక్తురాలగుచుండగానే (ఇంకా పలకకుండగనే), తన వీణావాదనముకన్నా తల్లివాక్కులు అత్యంత మాధుర్యముగా ఉంటాయని సిగ్గుతో పలుకులతల్లి వాణి, తనవీణను చీరకొంగులో దాచుకున్నదియని ఆదిశంకరులు విపంచ్యా గాయంతీ” యను 66వశ్లోకమునందు వర్ణించారు.

 

మధురాతిమధురమైన వాక్కులుగల తల్లికి నమస్కారము.