Wednesday 18 July 2018

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః Padmaragasila-adarsa-paribhavi-kapolabhuh

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

 

శ్రీగురుభ్యోనమః

 

విశుద్ధగణ్డబిమ్బిత స్వరూపరత్నకుణ్డలా

మహామహస్తరఙ్గిత ప్రభావశాలిలోచనా|| 

(ఉమా సహస్రముస్త19.16శ్లో)

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః

ఆదర్శఅద్దము

పరిభావిపరిహసించు/వెక్కిరించు

కపోల-భూఃచెక్కిళ్ల-ప్రదేశము గలతల్లి

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభువే నమః

 

పద్మరాగశిల అద్దములను పరిహసించు చెక్కిళ్ళు గల తల్లికి నమస్కారము. పద్మరాగశిలలు ఎర్రగాఉంటాయి. నునుపుతనమును చెప్పుటకు అద్దముతో పోల్చి చెప్పారు వశిన్యాదివాగ్దేవతలు. పద్మరాగశిల అద్దముల రంగు,నునుపు కంటే ఎర్రదనము, నునుపుదనముగల చెక్కిళ్ళ ప్రదేశము గల తల్లి లలితమ్మ.

 

సదా పదహారేళ్ళ యవ్వనప్రాయములోనున్న తల్లి (లలితోపాఖ్యానము అ33-74శ్లో) దేవి లలితాంబిక. ఈ వయసుకు మానవస్త్రీలకే బుగ్గల్లో కెంపులు, నున్నదనము సహజము. ఇక లలితమ్మతల్లి చెక్కిళ్ళగురించి వేరే చెప్పాలా!! పైగా తల్లి సర్వారుణ కూడానూ!!

 

ఇక నునుపుదనానికి వస్తే, అద్దముల వంటి చెక్కిళ్ళల్లో తల్లి (సూర్యచంద్రులు) రెండు కుండలములు ప్రతిఫలించి నాలుగుచక్రములున్న మన్మథునిరథమువలేనున్నదమ్మా నీ వదనముయని స్ఫురద్గండాభోగప్రతిఫలిత తాటంకయుగళమ్ (సౌన్దర్యలహరి-59) నందు ఆదిశంకరులు వర్ణించారు.

 

తపోభంగము కలిగించుటకు వేసిన బాణములు విఫలమై, శివుని జ్ఞాననేత్రాగ్నితో మన్మథుడు దగ్ధమై ఓడిపోయినాడు. శంభుడు ఆతల్లి వదనసౌన్దర్యమును వీక్షించినప్పుడేగదా, సృష్ట్యోన్ముఖుడైనాడు!! ఈ విధముగా, ఓడిపోయినాకూడా అమ్మసహాయముతో మన్మథుడు జయించగలిగాడు!! అందువల్ల తల్లివదనమును మన్మథరథముతో పోల్చారు శంకరభగవత్పాదులు.

 

తల్లి కపోలములను సుగండమండలాభోగ జితేన్ద్వమృతమండలామ్ అని వామకేశ్వరతంత్రమునందు (118శ్లో) వర్ణించబడినవి. అమృతమండలమనిన చంద్రమండలము, చంద్రుడు. చంద్రుని వంపును (curvature) జయించు వంపుగల గండమండలము (చెక్కిళ్ళప్రదేశము) గల తల్లియని అర్ధము.

 

ఎర్రటి, నున్నని, గుండ్రపు చెక్కిళ్ళు గల తల్లికి నమస్కారము.

శ్రీమాత్రేనమః          

No comments:

Post a Comment