Monday 2 July 2018

udyadbhAnusahasrAbhA ఉద్యద్భానుసహస్రాభా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

ఉద్యద్భాను-సహస్రాభా

ఉద్యద్భాను సహస్రాభాయై నమః

ఉద్యత్-భాను (ఉదయించు సూర్యులు) సహస్రాభా (వేయివలె)

సహస్రము అనంతవాచి. ఉదయించు సూర్యుని వర్ణము సింధూరము/అరుణము. సృష్టి, స్థితి, లయకారకమైన నిర్గుణ నిరాకార పరబ్రహ్మ తత్త్వము దేవకార్యము సిద్ధింపజేయుటకు చిదగ్నికుండమునుండి అనంతఉదయ సూర్యుల అరుణకాంతి పుంజముగా వ్యక్తమైనది. అసంఖ్యాకమైన ఉదయించు సూర్యుల కాంతివంటి తేజస్సుగల తల్లికి నమస్కారము.

ఇప్పుడు అంతరార్ధము తెలుసుకుందాము.

మాయాం తు ప్రకృతిమ్ విద్యాన్మాయినమ్ చ మహేశ్వరమ్

తస్యావయవభూతేస్తు వ్యాప్తమ్ సర్వమిదమ్ జగత్ (శ్వేతాశ్వతర ఉపనిషత్తు)

పురుష ఏవేదమ్ సర్వమ్ (శ్వేతాశ్వతర ఉపనిషత్తు)

సర్వమ్ ఖల్విదమ్ బ్రహ్మ (చాందోగ్య ఉపనిషత్తు)

బ్రహ్మైవేదమ్ విశ్వమ్ (ముండక ఉపనిషత్తు)

ఈ ఉపనిషత్తు వాక్యములు సృష్టికి చైతన్యాత్మక, స్వయంప్రకాశక, స్వయంభువ బ్రహ్మవస్తువే కారణమని ప్రమాణము. ప్రకాశవిమర్శల మేళనమే, సృష్టిస్థిత్యాదులకు కారణమైన బ్రహ్మవస్తువు.

సకలభువనోదయ స్థితిలయమయలీలావినోదనోద్యుక్తః

అంతర్లీనవిమర్శః పాతు మహేశః ప్రకాశమాత్ర తనుః (కామకలా విలాసము-1)

సా జయతి శక్తిరాద్యా నిజసుఖమయనిత్యనిరుపమాకారా

భావిచరాచరబీజమ్ శివరూపవిమర్శనిర్మలాదర్శః (కామకలా విలాసము-2)

ప్రకాశము మాత్రమే తనువుగా గలిగినవాడు మహేశ్వరుడు. ప్రకృష్టేన కాశ్యతే ద్యోతత ఇతి ప్రకాశః  బ్రహ్మవస్తువు అంతర్లీనముగానున్న విమర్శశక్తి వలన తెలియబడుతున్నది లేదా అనుభవములోనికి వస్తున్నది. విమృశ్యత ఇతి విమర్శః  బ్రహ్మాత్మకమైన శక్తిస్వరూపము  విమర్శ. విమర్శరూపము అంతర్లీనశక్తి. ప్రకాశ-విమర్శలు (వాగర్థములవలే) అవినాభావములు.

సచ్చిన్మయః శివః సాక్షాత్తస్యానందమయీ శివా|

శివుడు సాక్షాత్తు సత్య, జ్ఞాన స్వరూపుడు, పరమేశ్వరి తదానంద స్వరూపిణియనియు చెప్పబడినది. ఇందు జ్ఞానము ప్రకాశరూపము, తదానందము విమర్శ రూపము. మనయందుగల ఆత్మచైతన్యము ప్రకాశరూపము, శరీరమంతా వ్యాపించియున్న శక్తియే విమర్శరూపము.

సృష్టిసంకల్పమాత్రముచే సత్-చిత్-ఆనందఘనమైన బ్రహ్మవస్తువుయందలి ప్రకాశ, అంతర్లీనవిమర్శశక్తి  శుక్ల, శోణబిందువులుగా విభజనపొందినవి.

సితశోణబిందుయుగళమ్ వివిక్తశివశక్తిసంకుచప్రసరమ్

వాగర్ధసృష్టి హేతుః పరస్పరానుప్రవిష్టవిస్పష్టః (కామకలావిలాసము – 3)

(నిర్మలాదర్శ) అద్దమువంటి విమర్శశక్తియందలి మహేశ్వరుని ప్రతిబింబముతో కూడినపుడు ఏర్పడిన మిశ్ర-శుక్లశోణబిందు యుగళము సకల నామరూపాత్మకమైన సృష్టికి/వాగర్ధసృష్టికి కారణము. ఈ మిశ్రబిందువు భావి సకల చరాచరసృష్టికి బీజమువంటిది.

శ్రీమతా, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరియైన తల్లి, దేవకార్యమును సిద్ధింపజేయుటకు సంకల్పించి, చిదగ్నికుండమునుండి సహస్ర ఉదయభానులతేజపుంజముగా వ్యక్తమైనది. వ్యక్తమంబామయమ్ సర్వమ్ అవ్యక్తమ్ తు మహేశ్వరమ్. ఉదయభానుని అరుణకాంతి అమ్మవారి విమర్శాంశము.

అరుణాం కరుణాతరంగితాక్షీంయని ధ్యానశ్లోకమునందు ప్రార్ధించాము కదా. సర్వము అరుణయైనతల్లి ముందు అరుణ కాంతిపుంజముగా తెలియబడినది. భువనభయభంగవ్యసనియైన తల్లి శంభునికరుణయే. అట్టి జగములను రక్షించు ఒకానొక అనిర్వచనీయమైన అరుణయైన కరుణకు జయముయని సౌన్దర్యలహరి 93వశ్లోకమునందు శంకరభగవత్పాదులవారు చెప్పి, ఆనందలహరిలో సకలసృష్టిని కాపాడుటకు, కృపతో పశుపతి గరళమును కంఠమునందు గ్రహించాడంటే, అది నీ సాంగత్యఫలము తల్లీ!! అని చమత్కారముగా అంటారు, అశేష బ్రహ్మాండ ప్రళయ విధి నైసర్గిక మతిః శ్లోకమునందు.

తల్లియొక్క ఉదయకాంతుల తేజస్సుతో నాయందలి అవిద్యాతిమిరాంధకారములను తొలగించి అమృతత్వమును ప్రసాదించవలెనని ప్రార్థిస్తూ

శ్రీమాత్రేనమః

2 comments:

Anonymous said...

నమస్కారం దుర్గా శివకుమార్ గారు,

మీ వ్యాఖ్యానం చాలా అద్భుతంగా వుంది.

ఒక చిన్న విషయం గురించి సమాచారం కావాలి. బ్లాగ్ లో మీ contact వివరాలు కనిపించలేదు. మిమ్మల్ని సంప్రదించడానికి e-mail id. తెలుపగలరు.

శ్రీ రామ్

Durga Sivakumar said...

Namaskaram. Blog content credit goes to HER. My mailid is available on the blog.

Post a Comment