Friday 13 July 2018

nADImanDalam నాడీమండలము


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
షడాధారపంకేరుహాంతర్విరాజత్-
సుషుమ్నాంతరాలేsతి తేజోలసంతీమ్
సుధామండలమ్ ద్రావయంతీమ్ పిబంతీమ్
సుధామూర్తిమీఢే చిదానందరూపామ్|| (భవానిభుజంగస్తోత్రము)

ఉపాధిత్రయము చూసాము కదా!! సంచితకర్మ మూలాధారమువద్ద అవ్యక్తముగా ఉంటుంది. ఈ జన్మలో మనము అనుభవించు ద్వంద్వములన్నియు ఈ సంచితకర్మ నుంచి పండిన ప్రారబ్ధకర్మ వలననే. ప్రారబ్ధకర్మననుసరించి ఉపాధిత్రయములు ఏర్పడతాయి. అంతరేంద్రియము సహాయముతో మాయావరణను తొలగించుకొని ఈ మూడింటికీ అతీతమైన ఆత్మస్వరూపమును తెలుసుకొనుటకు శ్రుతులయందు సద్గురువులద్వారా పలవిధమైన (భక్తి/జ్ఞాన/యోగ,..) మార్గములు చెప్పబడినవి. సాధకులు ఏ మార్గమునందు ప్రయాణించిననూ, సూక్ష్మశరీర సంబంధమైన సంకల్పవికల్పాత్మకమైన మనస్సు/బుద్ధి నియంత్రణ అతిముఖ్యము.

సూక్ష్మశరీరమునాడీసమూహము – షట్చక్రములు

తాని చేతనీకర్తుమ్ సోకామయత బ్రహ్మాండబ్రహ్మరంధ్రాణి |
సమస్తవ్యష్టిమస్తకాన్విదార్య తదేవానుప్రావిశాత్|| (పైంగలోపనిషత్తు-1)

సప్తమే మాసే జీవేన సంయుక్తో భవతి| (గర్భోపనిషత్తు – 3) 
గర్భస్తజంతు శరీరమందు ఏడవమాసములో ప్రవేశించిన ఆత్మచైతన్యమే సమిష్టిపరమాత్మ. బ్రహ్మరంధ్రమునందలి శుక్లవర్ణముగల ఒకానొక మృదు పదార్ధము నాశ్రయించి ప్రకాశించు తేజోరూపము ఆత్మచైతన్యము. దీని తేజస్సుచే శరీరమునందు చైతన్యము కలిగినది.

ఊర్ధ్వమ్ మేఢ్రాదదధోనాభేః కందో యోsస్తి ఖగాణ్డవత్|
తత్ర నాడ్యస్సముత్పన్నా స్సహస్రాణిద్విసప్తతిః||
 (ధ్యానబిందూపనిషత్తు-50)
మన స్థూలశరీరమునందు సూక్ష్మశరీర సంబంధమైన ప్రాణశక్తి ప్రవహించు 72,000 అతిసూక్ష్మమైననాడులు పాయూపస్థల సమీపమునగల కందయనబడు చోటునుండి బయలుదేరి శరీరమంతటా శాఖోపశాఖలుగా విస్తరించియుంటాయి. ఇవన్నియు సంధించు ఇంకొక ముఖ్యమైన స్థానము హృదయము. నళతీతి నాడి; దీనిద్వారా ప్రవహించుటచే ఇది నాడి. నళ అంటే గమనము.

ఇడా పింగళా సుషుమ్నాః తిస్రోనాడ్యః ప్రకీర్తితాః|
ఇడావామేస్థితా భాగే పింగళా దక్షిణే స్థితా|| (ధ్యానబిందూపనిషత్తు – 55)
శరీరమంతా ఇన్నినాడులు విస్తరించియున్ననూ, తామరతూడువంటి ఇడ(సోమ), పింగళ(సూర్య), సుషుమ్న(అగ్ని) మూడు నాడులు ముఖ్యమైనవి.

నాడ్యస్తు తా అధోవదనాః పద్మతంతునిభాః స్థితాః|
పృష్ఠవంశం సమాశ్రిత్య సోమసూర్యాగ్నిరూపిణీ|| (శివ సంహిత -2.17)

ఇడా దేవీచ చంద్రాఖ్యా సూర్యాఖ్యా పింగలా తథా|
సుషుమ్నా జననీ ముఖ్యా సూక్ష్మా పంకజతన్తువత్|| 
(రుద్రాయామల ఉత్తర తన్త్రము 25.50,51)
శరీరమునకు వెనుకభాగమున వెన్నెముక(పృష్ఠవంశము)నకు ఎడమవైపున ఇడ(చంద్ర), కుడివైపున పింగళ(సూర్య), వీటి రెండింటిమధ్య వెన్నెముకద్వారా సాగునది సుషుమ్న(అగ్ని)నాడి. ఈ మూడుసూక్ష్మనాడులు స్థూలశరీరసంబంధితమైన వెన్నెముక/వెన్నుపాము/మేరుదండముతో కూడి ఉంటాయి. ఈ విధముగా స్థూల, సూక్ష్మ శరీరములు జోడింపబడుతున్నాయి.

ఇడానామ్నీ తు యా నాడీ వామమార్గే వ్యవస్థితా|
సుషుమ్నాయామ్ సమాశ్లిష్య దక్షనాసాపుటే గతా||  
(శివ సంహిత -2.25)
ఇడ వామనాడి. ఇది మూలాధారమునందు ప్రారంభించి, ఆజ్ఞాచక్రము నందలి భ్రూమధ్య స్థానమువద్ద సుషుమ్నను చుట్టి కుడినాసికద్వారమువద్ద అంతమౌతుంది.

పింగలా నామ యా నాడీ దక్షమార్గేవ్యవస్థితా|
సుషుమ్నా సా సమాశ్లిష్య వామనాసాపుటే గతా||  
(శివ సంహిత -2.25)
పింగళ దక్షిణనాడి. ఇది మూలాధారముయందు ప్రారంభించి, ఆజ్ఞాచక్రము నందలి భ్రూమధ్య స్థానమువద్ద సుషుమ్నను చుట్టిఎడమ నాసిక ద్వారము నందు అంతమౌతుంది.

ఇక సుషుమ్న...
సహస్రారకమలమునందలి బ్రహ్మరంధ్రమునుండి మూలాధారమునకుజేరి నిద్రించుచున్న చిచ్ఛక్తి ఊర్ధ్వదిశగా ప్రయాణించు నాడి సుషుమ్న. 

శక్తిః కుణ్డలినీ నామ బిసతంతు నిభాశుభా|
మూలకందమ్ ఫణాగ్రేణ దృష్ట్వా కమల కందవత్|
ముఖేన పుచ్ఛమ్ సంగృహ్య బ్రహ్మరంధ్రసమన్వితా|| 
(యోగకుండలినీ ఉపనిషత్తు 1.72,73)
చిచ్ఛక్తి బ్రహ్మరంధ్రమునుంచి విద్యుల్లతవలే బయలుదేరి అధోముఖముగా సుషుమ్నానాడిద్వారా మూలాధారమునుజేరి సర్పమువలె మూడున్నరచుట్లు చుట్టుకొని సుషుమ్నానాడి ద్వారమును శిరస్సుతోమూసి చలనరహితముగ ఉంటుంది. చైతన్యశక్తియొక్క చలనరహితమైన ఈ స్థితిని యోగపరిభాషలో నిద్రయని చెప్పబడును. ప్రాపంచికదృష్టిగలవారియందు ఈ కుండలినిశక్తి అలా నిద్రిస్తూనే ఉంటుంది.

యోగులందు కుండలినీశక్తి జాగృతిచెంది ఊర్ధ్వదిశగా ప్రవహించి సహస్రారకమల సుధామండలాంతర్గతయై అమృతధారలను స్రవించి శరీరమునందలి సమస్తనాడీ మండలమును తడుపుతుంది. అప్పుడు వారు జీవన్ముక్తులవుతారు.

శతమ్ చైకా హృదయస్యనాడ్యస్తానామ్ మూర్ధానమభినిస్సృతైకా |
తయోర్ధ్వమాయాన్నమృతత్వమేతి విష్వగన్యా ఉత్కృమణేభవంతి||
శరీరమునందు ఇన్ని నాడులున్ననూ కుండలినీశక్తి సహస్రారకమలమును చేరుటకు ఒక్క సుషుమ్ననాడిద్వారా మాత్రమే ఊర్ధ్వదిశగా ప్రయాణముచేస్తుందియని శ్రుతులయందు చెప్పబడినది.

మూలాధారాదారమ్భ్య బ్రహ్మరంధ్రపర్యంతమ్ సుషుమ్నా సూర్యాభా|
తన్మధ్యే తటిత్కోటిసమా మృణాలతన్తు సూక్ష్మా కుణ్డలిని|| 
 (మండలబ్రాహ్మణోపనిషత్తు – 2.4)
మూలాధారము నుండి సహస్రారకమలము (బ్రహ్మరంధ్రస్థానము) వరకుసాగు సుషుమ్ననాడికి మధ్యభాగములో విద్యుత్కోటి ప్రభలతోసమానమైన తామరతూడులోని ఒక దారమువలే అతిసూక్ష్మరూపముతో ప్రకాశించు (తేజస్సు) చిచ్ఛక్తియే కుణ్డలినీశక్తి

షట్చక్రములు
ఇడా చ పింగలా చైవ తస్యవామే చ దక్షిణే|
ఋజ్వీభూతే శిరే తే చ వామదక్షిణభేదనః|
సర్వపద్మాని సర్వసంవేష్టన్చ్య నాసారంధ్రగతే శుభే||  
(షట్చక్రనిరూపణము - యామల)
ఇడ, పింగళ నాడులు మూలాధారచక్రమునందలి కందనుండి బయలుదేరి సుషుమ్నమీదుగా కుడిఎడమలుగా (వామదక్షిణభేదనః) మెలికలు తిరుగుతూ ఆఖరికి భ్రూమధ్య స్థానముద్వారా నాసికారంధ్రములవద్ద ముగుస్తాయి. మూలాధారమునుండి భ్రూమధ్యస్థానము వరకు ఆరుసార్లు ఇడ, పింగళ, సుషుమ్న నాడులు కలుస్తాయి. ఈ స్థానములకు చక్రములని అనిపేరు. ఇవి వరుసగా (పాయు) మూలాధారము, (ఉపస్థ) మణిపూరకము, (నాభి) స్వాధిష్ఠాన, (హృదయ) అనాహత, (కంఠ) విశుద్ధ మరియు భ్రూమధ్యస్థానమైన ఆజ్ఞాచక్రస్థానము.

శాస్త్రములందు ఇడ, పింగళ, సుషుమ్నా నాడులను గంగా, యమున, సరస్వతీ ప్రవాహములతో సంకేతింపబడుచుండును. మూలాధార సంగమ స్థానము కందకు యుక్తత్రివేణి యనిపేరు. ఆజ్ఞాచక్రమునందలి భ్రూమధ్యస్థానమునందు ఈ మూడునాడులు కలిసేచోటుకు ముక్తత్రివేణియని పేరు.

ఇంకా అమ్మవారి నాసికలను వర్ణించునామము వద్దనే ఉన్నాము.

మనము శ్వాసించు గాలియందు స్థూలదేహమునకు అవసరమైన ప్రాణవాయువు (Oxygen) మాత్రమే కాకుండా సూక్ష్మనాడులగుండా ప్రవహించు చిచ్ఛక్తి/సూక్ష్మ ప్రాణశక్తి కూడా ఉంటుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులకు చేరుటద్వారా స్థూలశరీరముయొక్క భౌతికకార్యనిర్వహణకు (various biological and physical functions), సూక్ష్మనాడులద్వారా ప్రవహించు ప్రాణశక్తి సూక్ష్మశరీర కార్యనిర్వహణకు దోహదపడుతాయి. ఈ విధముగా, ఉచ్ఛ్వాసనిశ్వాస సమయములో మనము పీల్చు గాలినందలి ప్రాణశక్తి నాసికారంధ్రముల వద్దగల ఇడ, పింగళ నాడులద్వారా శరీరమునందలి నాడిసమూహమునకు జేరుతుంది. ఇడ, పింగళనాడులద్వారా గ్రహింపబడిన ప్రాణశక్తి ఐదువిధములుగా (ప్రాణ, అపాన,..) రూపాంతరము చెందుతుంది.

జననమరణచక్రములందు మనలను బద్ధులనుచేయునది సూక్ష్మశరీరము. సూక్ష్మశరీర సంబంధితమైన అంతరేంద్రియమైన మనస్సు/చిత్తమును నియంత్రించుటకు వాయు నియంత్రణ అతి ముఖ్యమైనది.  యోగులు, భక్తి/జ్ఞాన/యోగ సాధకులైనవారు, ఇడ, పింగళ నాడుల సమత్వమును సాధించుటద్వారా నిద్రిస్తున్న కుండలినిని జాగృతి చేసి సుషుమ్నానాడియందలి షట్చక్రముల ద్వారా ఊర్ధ్వదిశగా ప్రయాణింపజేసి సహస్రారచక్రము వరకు ప్రవహింపజేయుటద్వారా సమాధిస్థితిని పొందెదరు.

గౌతమమునికి గురువు ఉపదేశవాక్యము యోగకుండలినీ ఉపనిషత్తు యందలి మొదటి శ్లోకము హేతుద్వయమ్ హి చిత్తస్య వాసనా చ సమీరణః| తయోర్వినిష్ట ఏకస్మిన్ తత్ ద్వావపి వినశ్యతః| తయోః అదౌ సమీరస్య జయమ్ కుర్యాత్ నరః సదా|  వాయునియంత్రణ ద్వారా చిత్తముయందలి వాసనలను నియంత్రించుట నరులకు సదా జయము చేకూర్చును.

సూక్ష్మశరీర కార్యనిర్వహణము మనము సంగ్రహించు గాలి/వాయువు నందలి ప్రాణశక్తి ద్వారా జరుగుతున్నాయి. జీవుల కర్మానుసారము, ప్రాణశక్తి పదివిధములైన వాయువులుగా మారి వివిధకార్యములు చేయుటకు సహకారి అగుచున్నది.

ప్రాణోSపానః  సమానశ్చోదానోవ్యానశ్ఛ పంచమః |
నాగః కూర్మశ్చకృకరో దేవదత్తో ధనంజయః ||
దశనామాని ముఖ్యాని మయోక్తానీహ శాస్త్రకే|
కుర్వంతితేSత్ర కార్యాణి ప్రేరితాని *స్వకర్మభిః*|| 
(శివ సంహిత – 3.4,5)
ఉచ్ఛ్వాసనిశ్వాసలద్వారా సంగ్రహింపబడిన ప్రాణశక్తి సూక్ష్మశరీర ఇంద్రియముల కార్యనిర్వాహణ కొరకు ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయయను పదివిధములైన వాయువులుగా మారుతుంది. ఈ పదివాయువులు శరీరమునందలి సూక్ష్మనాడీమండలముద్వారా జీవికర్మననుసరించి కార్యములు నిర్వహించుతాయి.

అత్రాపి వాయవః పంచ ముఖ్యాః స్యుర్దశతః పునః|
తత్రాపి శ్రేష్ఠకర్తారౌ ప్రాణాపానౌ మయోదితౌ|| (శివ సంహిత 3.6)
ఈ పదివాయులలోను మొదటి అయిదు ముఖ్యమైనవి.

హృదయమునకు ఊర్ధ్వదిశగా ప్రవహించు ప్రాణవాయువు హృదయస్పందనకు, ఉచ్ఛ్వాసనిశ్వాసయందు ఊపిరితిత్తులకు దోహదము చేస్తుంది.

హృదయమునకు అధోదిశగా ప్రవహించు అపానవాయువు అధోభాగ శారీర కార్యములకు దోహదకారిగా ఉంటుంది. ఈ రెండు ప్రాణములు అధికప్రాధ్యాన్యతగలిగినవి.

సమానవాయువు మధ్యభాగమునందు వైశ్వానరాగ్నిని వీచుటద్వారా జీర్ణప్రక్రియకు దోహదము చేస్తుంది.

వ్యానము సమస్త నాడులందు విస్తరించి రక్తప్రసరణకు జరుపుటకు దోహదము చేస్తుంది.

ఉదానవాయువు భూమ్యాకర్షణశక్తికి వ్యతిరేకముగా వమనము చేయుటకు దోహదము చేస్తుంది. ఉదానవాయువు మనము నిలువుగా కూర్చొనుటకు, నిలుచుటకు, ఆహారము మింగుటకు, వాక్-శక్తిగా వెలికిరావడానికి దోహదము చేస్తుంది.  మరణసమయములో సూక్ష్మశరీరమును స్థూలశరీరమునుండి వేరుచేయునది ఉదానవాయువే.

మేరుమూలే స్థితః సూర్యః కలాద్వాదశసంయుతః|
దక్షిణే పథి రశ్మిభిర్వహత్యూర్ధ్వమ్ ప్రజాపతిః|| (శివసంహిత 2.10)
ప్రాణశక్తి సూర్యనాడియైన పింగళానాడి ద్వారా ఊర్ధ్వదిశగాను. చంద్రనాడియైన ఇడానాడి ద్వారా అధోదిశగాను ప్రవహిస్తుంది. ఉచ్చ్వాసకు పింగళానాడి (కుడినాసికా రంధ్రము), నిశ్వాసకు ఇడానాడి (ఎడమనాసికా రంధ్రము) సహజసిద్ధమైన స్త్రోతలు (Channels).

(పూరక-inhale, కుంభక-hold, రేచక-exhale) ప్రాణాయమముయనునది ఉచ్చ్వాస నిశ్వాసముల నియంత్రణ. ప్రాణాయమము సహజసిద్ధమైన గతిని అనుసరించి చేసినప్పుడు (పింగళ - కుడి - ఉచ్ఛ్వాస, ఇడ-ఎడమనిశ్వాస) అనులోమ ప్రాణాయమము, వ్యతిరేకముగా చేసినప్పుడు (ఇడ-ఎడమ - ఉచ్ఛ్వాస, పింగళ - కుడినిశ్వాస) విలోమ ప్రాణాయమముయని చెప్పబడును. ఈ రెండింటినీ కలిపిచేయుట అనులోమ-విలోమ ప్రాణాయమము (alternate nostril breathing).

హకారేణ బహిర్యాతి సకారేణ విశేత్పునః|
హంస హంసేత్యముమ్ మంత్రమ్ జీవో జపతి సర్వదా|| 
 (యోగ చూడామణి ఉపనిషత్తు – 31)
ఊర్ధ్వదిశగాప్రాణవాయువును సంగ్రహించునపుడు సకారమును (శివ వాచకము), అధోదిశగా విడుచునపుడు హకారమును (శక్తి వాచకము) కలిపి సోహమ్ అను హంసమంత్రమును జీవులు సర్వదా జపించుచున్నారు. ఉచ్ఛ్వాసనిశ్వాసలను గమనించుకుంటే, శ్వాసపీల్చునప్పుడుసోయను శబ్దమును, విడుచునప్పుడుహమ్యను శబ్దమును గమనించవచ్చును. ఇది సహజముగా జరుగు ప్రక్రియ యగుటచే దీనికి అజప అని పేరు. ప్రాణాపానములను కుడిఎడమలుగా మార్చి మార్చి ఉచ్ఛ్వాసనిశ్వాసలను జరుపునప్పుడు మన ప్రమేయములేకుండా జరుపునది అజపామంత్ర జపము. ఇది సహజసిద్ధమైననూ, మోక్షమంత్రమగుటచే గురూపదేశము ద్వారా మాత్రమే గ్రహించి ఉపాసించవలెను. 

సాధారణముగా మనము ఉచ్ఛ్వాసనిశ్వాసలు సుమారు రెండు లేదా రెండున్నర గంటలసేపు ఒకే నాసికారంధ్రముద్వారా జరుపుతాము. ఈ సమయములో రెండవరంధ్రముద్వారా శ్వాస బహుతక్కువగా ప్రవహిస్తుంది. రెండున్నరగంటల తరువాత, రెండవరంధ్రముద్వారా జరుగుతుంది. అపుడు మొదటిరంధ్రముద్వారా బహుతక్కువ ప్రవాహము ఉంటుంది. ఇలా శ్వాసప్రక్రియ రెండురంధ్రములద్వారా విడిచివిడిచి (alternative గా) జరుగుతుంది. కుడిఎడమలు మారునప్పుడు, మధ్యలో ఒక రెండు నిముషములపాటు రెండు రంధ్రములద్వారా సమముగా జరుగుతుంది. This is called alternate nostril breathing.

కుడినాసిక ద్వారా శ్వాస పీల్చివదులునప్పుడు, పింగళనాడి (బుద్ధిశక్తి) జాగృతి చెందుతుంది, ఎడమనాసిక ద్వారా జరుపుతున్నప్పుడు ఇడానాడి (క్రియాశక్తి) జాగృతి చెందుతుంది.

ప్రాపంచికోన్ముఖులైనవారియందు కుడిఎడమల శ్వాసచలన సమయము వారివారి ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. ఈ అసమత్వమును తొలగించుకొనుటయే సాధన. ఇడ పింగళ నాడుల సమత్వమును సాధించినప్పుడు, మూలాధారమువద్ద నిద్రిస్తున్న కుండలినీశక్తి జాగృతి చెంది, సుషుమ్నానాడి యందు ప్రవేశించి ఊర్ధ్వదిశగా ప్రయాణమును ప్రారంభిస్తుంది.

మూలాధారాదూర్ధ్వమన్తశ్చరన్తీమ్
భిత్వా గ్రంథీన్మూర్ధ్ని నిర్యత్సుధార్ద్రామ్|
పశ్యన్తస్త్వామ్ యే చ  తృప్తిమ్ లభన్తే
తేషామ్ శాంతిః శాశ్వతీ నేతరేషామ్||
మనస్సు/చిత్తమును నియంత్రించుటకు అచంచల గురుభక్తితోజేయు సాధన, అనుష్ఠానము, ధర్మజీవనములు అతిముఖ్యమైనవి. సాధనతో నిద్రించు కుండలిని జాగృతపరచి కుండలినీశక్తిని ఊర్ధ్వదిశగా ప్రయాణింపజేసి గ్రంథిభేదనముజరిపుటద్వారా కలుగు సుధాస్రావముల రసానుభవమును మించినది వేరె గలదే?

గురువనుగ్రహముతో ప్రారబ్ధకర్మ క్షయముగలిగి అతిశీఘ్రముగ తల్లిఅనుగ్రహమును పొందవలెనని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః

5 comments:

యం.వి.అప్పారావు said...

అమ్మా, మీరు ఇక్కడ వ్రాసిన ప్రతి సంచిక చాలా ఆసక్తికరంగా చదువుతున్నాను. ఎన్నో సందేహాలు నివృత్తి అవుతున్నాయి. శీర్షికలు ఆంగ్ల అక్షరములలో వ్రాస్తున్నారు. ఒక్కొక్కసారి కూర్చుకుని చదవటం కష్టంగా ఉంటుంది. ఈ సంచిక శీర్షిక nADlmanDalam ఎలా చదవాలి?

Durga Sivakumar said...

నమస్కారమండి. తల్లి ఆశీర్వాదముతో నేను చేస్తున్న ఈ చిన్నిప్రయత్నము మీకు ఆసక్తికరముగ ఉండుట నాకు చాలా సంతోషముగనున్నది.

శీర్షిక విషయములో మీకు కలిగిన అసౌకర్యమునకు మన్నించగలరు. సంచిక శీర్షికను ఆంగ్లము పక్కనే తెలుగులో కూడా రాసాను. ఇప్పుడు మీకు ఇబ్బంది ఉండదని ఆశిస్తున్నాను.

యం.వి.అప్పారావు said...

చాలా సంతోషం అమ్మా.

Reddy Kirankumar MB said...

చాలా అద్భుతంగా వివరించారు...ధన్యవాదాలు

Durga Sivakumar said...

🙏

Post a Comment