Wednesday 11 July 2018

vaktra-lakshmI-parIvAha-calanamInAbha-lOcanA వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
శివే-శృంగారార్ద్రా తదితరజనే-కుత్సనపరా
సరోషా-గంగాయామ్ గిరిశచరితే-విస్మయవతీ|
హరాహిభ్యో-భీతా సరసిరుహసౌభాగ్యజనీ
సఖీషు-స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా||  
(సౌన్దర్యలహరి – 51)
శివునిపట్ల శృంగారరసమును, ఇతరజనులపట్ల బీభత్సరసమును (కుత్సితభావమును), గంగాదేవిపట్ల రౌద్రరసమును (రోషమును), గిరిశుని చరిత్రను వినునపుడు అద్భుతరసమును (విస్మయమును), పరమశివుని ఆభరణములను జూచినప్పుడు భయరసమును (భీతిని), ఎఱ్ఱని పద్మములకు (సరసీరుహములకు) సౌభాగ్యమును ప్రసాదించునపుడు వీరరసమును, సఖులపట్ల హాస్యరసమును వర్షించు నీనేత్రములతో ఓ! తల్లీ!! నాపట్ల కరుణరసమును జూపమ్మా! 

వక్త్ర-లక్ష్మీపరీవాహ-చలన్మీనాభ-లోచనా
వక్త్రమ్ వదనము
లక్ష్మీపరీవాహ లక్ష్మీ ప్రవాహము
చలత్కదులుతున్న
మీనాభమీనములవంటి
లోచన - నేత్రములు
అమ్మా!! నీ వదనము లక్ష్మీ/శోభ/సౌభాగ్య ప్రవాహమువలెనున్నది. నీ నేత్రములు ఈ ప్రవాహమునందు కదలాడుచున్న మీనములవలెనున్నవి.

వదనమనెడు లక్ష్మీప్రవాహమునందు కదలాడుచున్న మీనములవంటి నేత్రములుగల తల్లికి నమస్కారము.

ప్రకర్షేణావిచ్ఛేదేన వహతీతి ప్రవాహః దివ్యముగా అవిచ్ఛిన్నముగా జరుగునది/సాగునది ప్రవాహము. అమ్మవారి వదనమునందలి అమృతమయమైన దివ్యసౌన్దర్యశోభ అవిచ్ఛిన్నముగా నిరంతరము (పౌనఃపున్యముగా) తరంగములవలే ప్రవహించుచున్నది. అమ్మయొక్క దివ్యశోభల లక్ష్మీప్రవాహమునందలి ఈ సౌన్దర్యతరంగములనే లక్ష్మీబీజమును నిక్షిప్తించి సౌందర్యలహరి అన్నారు శంకరభగవత్పాదులు. అమ్మవారి చంచలమైన, సోగకనుల సోయగమును నిరంతర శోభామయమైన ప్రవాహమునందలి మీనములతో పోల్చినారు వశిన్యాదివాగ్దేవతలు.

మీనములు తన అండములను కనురెప్పవేయకుండగ (మత్స్యః సుప్తో న నిమిషతి) ఈక్షణామాత్రముననే కాపాడుకొనుచుండును. తన సృష్టీభూతములైన బ్రహ్మాండములను ఆ మీనలోచని దృష్టిపాతముచే పాలించుచుండును.

అమ్మవారి కటాక్షవీక్షణములను నూరుస్తోత్రముల కటాక్షశతకమునందు విధవిధములుగా వర్ణించినారు మూకకవులు.

అమ్మవారి నేత్రములను మన్మథుని బాణములతోను, కమలములతోను పోల్చిన మూకకవులు తల్లి నేత్రములను మీనములతో పోల్చారు కానీ, వశిన్యాదివాగ్దేవతలవలె కాదు.

మారద్రుహా మకుటసీమని లాల్యమానే
మన్దాకినీపయసి తే కుటిలమ్ చరిష్ణుః|
కామాక్షి!! కోప రభసాద్వలమాన మీన
సన్దేహమఙ్కురయతి క్షణమక్షిపాతః|| (కటాక్షశతకము-95)
! కామాక్షీ!! మారవైరియైన గంగాధరుడు మకుటసీమయందుగల మందాకినిని ఆదరించుటచే వచ్చిన కోపముతో వంకరగా తిరిగిన నీచూపు, ‍క్షణపాటు చేపయోనని సందేహముగలుగుచున్నదియని వర్ణించారు ఈ శ్లోకమునందు.

వాగ్దేవతలు తల్లిని మీనాక్షిగా వర్ణించిననూ, శ్రుతులయందు తల్లి నయనములు, తాటంకములు, స్తనములు, ఈ మూడునూ సూర్యచంద్రులతో సంకేతింపబడినవి.

సూర్యచంద్రౌస్తనౌ దేవ్యాః తావేవనయనే స్మృతా
ఉభేతాటంకయుగళమ్ ఇత్యేషా వైదికీ శ్రుతిః||
నయనములు అగ్నితేజస్సుతోనూ (82.16), వక్షోజములు చంద్రతేజస్సుతోనూ (82.14) కర్ణములు వాయుతేజస్సుతోనూ (82.17) ఏర్పడినట్లుగా మార్కండేయపురాణాంతర్గతమైన దేవీమాహాత్మ్యమునందు చెప్పబడినది.

సూర్యచంద్రులను నయనస్థానమున అగ్నితేజస్సుతో చెప్పబడినప్పుడు దృష్టిశక్తిని, కర్ణస్థానమున తాటంకములుగా వాయుతేజస్సుతో చెప్పబడినప్పుడు శ్రోత్రశక్తిని మరియు దిక్-జ్ఞానమును (కర్ణౌ నిరభిద్యేతామ్| కర్ణాభ్యామ్ శ్రోత్రమ్| శ్రోత్రాద్ దిశః| ఐత్రేయ ఉపనిషత్తు (1-1-4)), స్తనములుగా వక్షస్థానమున చంద్రతేజస్సుతో చెప్పబడినప్పుడు పోషకశక్తిని సూచించబడుచున్నవి.

అమ్మవారు బ్రహ్మాండపురాణమునందు చంద్రార్కదహన (చంద్ర, అర్క (సూర్య), దహన(అగ్ని)) నేత్రములుగల తల్లిగా వర్ణింపబడినది

దృషశ్చంద్రార్కదహనా దిశస్తే బాహవోమ్బికే|
మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శ్రుతయోఖిలాః|| (బ్రహ్మాండపురాణము-3.13.10)
తల్లి నేత్రస్థానమునందలి సూర్యచంద్రులు భూలోకమునందు అహోరాత్రములు వెలుగును ప్రసాదించుచూ, మనకు దృష్టి జ్ఞానమును కలిగింపజేయుచున్నవి. ఫాలనేత్రమైన అగ్నినేత్రము జ్ఞాననేత్రము.

అమ్మవారి నేత్రములను వర్ణించు నామములు సహస్రనామ స్తోత్రమునందు వరుసగా, మీనాభలోచన (18), కామాక్షి (61), పద్మనయన (246), రాజీవలోచన (307), వామనయన (331), త్రినయన (450), లోలాక్షి (451), త్రిలోచన(475), మృగాక్షి(559), దరాందోళితదీర్ఘాక్షి (599), పుష్కరేక్షణ (803), విశాలాక్షి (936).

అమ్మవారిసౌన్దర్యశోభను ఎడతెగని తరంగములుగా, నూరుశ్లోకముల సౌన్దర్యలహరిగా స్తుతించిన శంకరభగవత్పాదులవారు నేత్రసౌన్దర్యమును పది శ్లోకములందు వర్ణించారు. అహఃసూతే సవ్యమ్ (48) శ్లోకమునుండి దృశాదాఘీయస్యా (57) శ్లోకమువరకు అమ్మవారి నేత్రములను, వాని గుణగణములను వర్ణించారు ఆదిశంకరులు.  అత్యద్భుతమైన వర్ణన.

సహస్రనామ స్తోత్రమందలి 12 నామముల అమ్మవారినేత్ర లక్షణముల/వైభవ/సౌందర్య సారమును ఒకేశ్లోకమునందు కూర్చిరచించారా అన్నట్లుగా ఒక శ్లోకముగలదు. విశాలా కల్యాణి (49) శ్లోకమునందు, స్తోత్రమునందు చెప్పబడిన చూపుల గొప్పతనమును భరతదేశమునందలి కొన్ని పట్టణముల పేర్లమూలముగా సూచించినారు.

విశాలా కల్యాణీ స్ఫుటరుచిః అయోధ్యా కువలైః
కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా|
అవంతీ దృష్టిస్తే  బహునగర విస్తార విజయా
ధృవమ్ తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే||

అక్ష్ణోతి దూర మిత్యక్షి వ్యాపింపజేయునది గనక అక్షి;
లోచ్యతే అనేనేతి లోచనమ్ వీనిచే చూడబడుట వలన లోచనములు;
నీయతే అనేనేతి నయనమ్ నడిపించునవి/త్రోవచూపించునవి గావున నయనములు.

విశాలాక్షి విశాలమైన నేత్రములుగల తల్లిఆ విశ్వనాథుని చూచుటకు ఆమెకు విశాలనేత్రములుకావలెగదా మరి!!
మృగాక్షివిశాలత, జాగురుకత, చంచలత్వము ఈ మూడును లేడియొక్క లక్షణములు. ఈ లక్షణములతోకూడిన నేత్రములుగల తల్లి
దరాందోళితదీర్ఘాక్షికొంచము చంచలమైన దీర్ఘమైన కన్నులుగల తల్లి

తన విశాలనేత్రములద్వారా సమస్త బ్రహ్మాండములను పాలించుతల్లి.

పద్మనయనపద్మములవంటి నయనములుగల తల్లి/మంగళప్రదమైన కళ్యాణవంతమైన నేత్రములు కలతల్లి
పద్యతేఽత్ర  లక్ష్మీరితి పద్మమ్ - వీనియందు లక్ష్మిని పొందును
రాజీవలోచనతామరలవంటి కన్నులుగల తల్లి
అమ్మవారి నేత్రములనబడు తామరలసౌన్దర్యమును, ఏ కువలయములు జయించలేవని చెప్పుటకు ఆదిశంకరులు, స్ఫుటరుచిరయోధ్యాకువలయైః అని అనినట్లనిపిస్తోంది.

మీనాభలోచనమీనములవలే ఈ బ్రహ్మాండములను దృక్-శక్తితో పాలించు తల్లి
ఎడతెగని కారుణ్యతరంగములతో కూడిన లక్ష్మీప్రవాహమువంటి వదనమునందు, మీనములవంటి నేత్రములుగలతల్లి యని సూచించుటకు ఆతల్లి కృపయనెడుధారగల నేత్రములుగలదియని భగవత్పాదులు భావించినట్లున్నది. 

త్రినయన, త్రిలోచన - జ్ఞానముకు సంకేతముజ్ఞాన  ప్రదాయిని

కామాక్షి దృష్టిపాతముచే కామితఫలదములనిచ్చు తల్లిస్వాదు ప్రియౌతు మధురౌ - కామితములు మధురములుగదా!!

వామనయన అందమైన/మనోహరమైన నయనములుగల తల్లి .
వామ-యనగా సర్పముఅని కూడా అర్ధము కలదు. ఆదిశంకరులు ఈ భావము ప్రతిఫలించు విధముగా తల్లిని భోగవతికా అని సంబోధించినారేమోననిపించుచున్నది. అమ్మవారు తనయొక్క నయనములద్వారా సమస్తభోగములను ఐశ్వర్యములను భక్తులకు ప్రసాదించు గుణముగలదియని సూచించునదిగా, భోగవతినామము గలదు.

లోలాక్షిలోలశ్చల సతృష్ణయోః కదులునది, ఆసక్తి/ఆశగలది
నేత్రములను అటునిటుకదుపుచూ, సకల బ్రహ్మాండములను చూచుచూ, వానిని రక్షించుటయందాసక్తి గల తల్లి
పుష్కరేక్షణపుష్కరములవంటి కనులుగల తల్లి
పోషయతీతి పుష్కరమ్పోషించునది/రక్షించునది  పుష్కరము

అవంతి - రక్షించునది

విశాలమైన, మంగళప్రదమైన, కలువల సౌన్దర్యమును వెక్కిరించు సౌన్దర్యశోభగల తామరలవంటి నేత్రములతో, కృపయనేడుధార నిరంతరముగా ప్రసరించుచూ, మధురమైన కామితములనొసగు దృష్టితో, భక్తులకు సమస్తభోగములను ప్రసాదిస్తూ రక్షించు తల్లియొక్క చూపులు విజయములను గలుగజేయునవిగానున్నవి యనుచున్నారు శంకరభగవత్పాదులు.

బదరీనథ్ ప్రాంతమునందుగల విశాల నగరము, ముంబాయి నాసిక్ మధ్యగల కల్యాణి నగరము,  శ్రీరామ జన్మభూమియైన అయోధ్య నగరము, భోజరాజు పరిపాలించిన గుజరాత్ నందలి ధార్ - ధారా నగరము, ఉత్తరభారత దేశమునందలి శ్రీకృష్ణుని మథురా నగరము, భోగవతీ నగరము, ఉజ్జయిని - అవంతీ నగరము మరియు విజయ నగరములను ఈ శ్లోకమునందు అమ్మవారి దృష్టిలక్షణములనుగలిగిన పేర్లుగా గలిగినవని వర్ణించారు.

తే మయి జనని దృష్టిః సకరుణా!!

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment