Thursday 12 July 2018

nava-caMpaka-puSHpAbha-nAsAdaMDa-virAjitA నవచంపకపుష్పాభనాసదండవిరాజితా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
నవచంపకపుష్పాభనాసదండవిరాజితా
నవచంపకపుష్పాభనూతన చంపక పుష్పము వంటి
నాసాదండముముక్కుదూలము
విరాజిత విశేషముగాప్రకాశించునది

నూతన చంపక పుష్పము వంటి ముక్కుదూలముతో విశేషముగాప్రకాశించు తల్లికి నమస్కారము.

తల్లి నాసికాదండము పొడవుగా, సూటిగా నూతనచంపకపుష్పమువలే ఉన్నదని వశిన్యాది వాగ్దేవతలు సందర్శించి చెప్పుచున్నారు.

పొడవుగా సూటిగా ఉన్న తల్లినాసికలను వామకేశ్వర తంత్రము (118శ్లో) నందు విశ్వకర్మాది నిర్మాణసూత్ర సుస్పష్ట నాసికామ్ అని వర్ణించబడినది.

ఋజుబ్రహ్మసూత్రశాస్త్రముననుసరించి గృహాదినిర్మాణములు జరుపబడుచుండును. అదేవిధముగా అనంతవిశ్వరచనకు అవసరమైన వేదములను ఋజుసూత్రములు శ్వాసరూపమున తల్లి నాసికద్వారా తెలియబడుతున్నాయి. సృష్టిస్థిత్యాదులగురించి వివరించి వర్ణించి చెప్పేవే వేదములు. తల్లి శ్వాసను శృతులని చెప్పబడినవి.  
ఋజువంకరలు లేకుండా ఉండుట (straight).

ఉచ్ఛ్వాసనిశ్వాసములకు సంబందించిన ఇంద్రియము నాసికము. ఈ రంధ్రములద్వారా గ్రహించబడిన ప్రాణరూప చిచ్ఛక్తి శరీరమునందలి సర్వనాడులకు ప్రసరించి చైతన్యవంతము చేస్తుంది. హంతి గచ్ఛతి సర్వశరీరేషు ఇతి హంసః. ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపమున శరీరమునందు గమనముచేయు ప్రాణశక్తికి హంసయని పేరు. అహమ్ సః, సోహమ్ యను పిండాండబ్రహ్మాండసమన్వయ తాదాత్మ్యభావనయే అజపా సాధన.

అమ్మవారి నాసికాదండమును వర్ణించు ఈ నామమునందు అజపామంత్రము నిగూఢముగానున్నది.

చంపకపుష్పమునకు 12 పొడవాటి రేకులుగలవు (Spiritual significance of flowers, The Mother). మొగ్గయందు రేకులు తెలియబడవు, బాగా వికసించిన పుష్పపురేకులు సూటిగా ఉండక వంకరలు తిరిగియుండును. నూతనచంపకపుష్పము పొడవుగా, సూటిగా ఉన్న రేకులుగలిగియుండును. పొడవైన సూటిముక్కుదూలము ఉత్తమస్త్రీ సాముద్రికాలక్షణము. అందుచేత అమ్మవారి పొడవైన సూటి ముక్కుదూలమును నవచంపక పుష్పముతో పోల్చినారు వశిన్యాది వాగ్దేవతలు.

ఇక రేకులసంఖ్య 12కువస్తే ప్రాణయామము లఘు, మధ్యమ మరియు ఉత్తమమని మూడువిధములుగ చెప్పబడుచున్నది. లఘుప్రాణాయామమునందు ఉచ్ఛ్వాస, నిశ్వాసల ఒక్కొక్కటికి 12 మాత్రల కాలవ్యవధానము. మధ్యమ మరియు ఉత్తమ ప్రాణాయామమునకు 24 మరియు 36 మాత్రల కాలవ్యవధానము.  కనురెప్ప మూసితెరచుటకగు కాలము ఒక మాత్ర. ఏ సాధకుడైననూ/సాధకురాలైననూ లఘుప్రాణాయామముతోనే ఆరంభించవలెను – (కూర్మపురాణము, ఉత్తరార్ధము 11,  మార్కండేయ పురాణము 39).

యోగవాశిష్ఠము నిర్వాణప్రకరణము (25వ సర్గ)నందు మహాయోగి భుశుండుడు వసిష్ఠులవారితో ప్రాణాయామ వివరణయందు, ద్వాదశమాత్ర కాలవ్యవధికి బదులు నాసికాగ్ర స్థానమునుండి ద్వాదశ అంగుళముల స్థానప్రమాణమును ప్రస్తావించారు.

ముక్కుదూలము ఉచ్ఛ్వాసనిశ్వాసలతోకూడిన ప్రాణాయామ ప్రక్రియను సలుపు రెండునాసికలకును సంబంధించినది. చంపకపుష్పపు 12 రేకులు, లఘుప్రాణాయామ 12మాత్రల కాలవ్యవధిని/స్థానప్రమాణమును సూచించునట్లున్నది.

దూలముసరే!! మరి అమ్మవారి నాసికలు??

నాసత్యదస్రౌ-నాసేస్తో గంధః-ప్రాణమ్ స్మృతో-బుధైః (శ్రీమద్దేవీభాగవతము 33.27)
నాసత్యదస్రలు నాసికలు, గంధము ప్రాణము, వేదములు బుద్ధిగాను ఏర్పడినవి. అమ్మవారి నాసికములు నాసత్యదస్రలనబడు ఈ అశ్వినీదేవతలజంటచే ఏర్పడినవియని దేవీభాగవతమునందు చెప్పబడినవి.

ఇక జీవసృష్టియందలి నాసత్యదస్రలను గురించి తెలుసుకుందాము.

స ఏష పురుషః పంచవిధస్తస్య యదుష్ణాంతజ్జ్యోతిర్యాని ఖాని స ఆకాశోsథ యల్లోహితమ్ శ్లేష్మా రేతస్తా ఆపీ యచ్ఛరీరమ్ సా పృథ్వీ యః ప్రాణః స వాయః |
(అథర్వ అరణ్యక ఉపనిషత్తు – 2వ అరణ్యకము – 3వ అధ్యాయము – 2వ శ్లో)

పురుష శరీరమునందలి ఉష్ణము జఠరాగ్నిరూపము, ఇంద్రియములు (నవరంధ్రములు) ఆకాశాంశ చేతనూ, రక్త,శుక్ల,రేతస్సులు జలాంశ చేతనూ, శరీరమునందలి కాఠిన్యత్వ అంశము భూమి అంశచేతనూ, ప్రాణము వాయువు అంశచేతను ఏర్పడినవి.

శబ్దస్పర్శరూపరసగంధములను తెలియజేయు ఇంద్రియములు జ్ఞానేంద్రియములు. ఇవి చెవులు (కర్ణ), శరీరము (త్వక్), నేత్రములు (చక్షు), నాలిక (జిహ్వ), నాసికములు(ఘ్రాణ). వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ యని ఐదు కర్మేంద్రియములు.

స ఏష వాయుః పంచవిధః ప్రాణోsపానో వ్యాన ఉదానః సమానస్తా ఏతా దేవతాః ప్రాణాపానయోరేవ నివిష్టాశ్చక్షుః శ్రోత్రమ్ మనోవాగితి ప్రాణస్య హ్యన్వపాయమేతా అపియంతి |
 (అథర్వ అరణ్యక ఉపనిషత్తు – 2వ అరణ్యకము – 3వ అధ్యాయము – 3వ శ్లో)

శరీరమునందలి ఈ వాయువు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన మరియు సమానమని ఐదు విధములుగా చెప్పబడుచున్నది. జ్ఞాన, కర్మ ఇంద్రియములు మరియు మనస్సు ప్రాణాపాన వాయువుల అధీనమునందుగలవు. శరీరమునుండి ప్రాణము బహిర్గతమైన తత్-క్షణమే ఇంద్రియాధిదేవతలు కూడా నిష్క్రమించెదరు (depart).

జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు అధిదేవతలు అశ్వినీదేవతల జంట. అశ్వినీదేవతలు నాసత్యులు, దస్రలుయని కూడా పిలవబడుదురు. (ఋగ్వేదము 1.3.3).  నాసత్య పురుషసంబంధమైన బుద్ధిశక్తికి అధిదేవత మరియు దస్ర ప్రకృతి సంబంధితమైన క్రియాశక్తికి అధిదేవత.  జంటదేవతలైన నాసత్య, దస్రలు ఉచ్ఛ్వాసనిశ్వాసల ద్వారా జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు అధిదేవతలు.

యోగశ్చిత్తవృత్తినిరోధః – (పతంజలియోగసూత్రములు I.2)

ప్రాణాపానములను నియంత్రించుటద్వారా పంచజ్ఞానేంద్రియములను, పంచకర్మేంద్రియములను, మనస్సును నియంత్రింపజేయుటయే యోగసాధన

విశ్వరచనజేయు తల్లి నాసికాదండము నవచంపకపుష్పమువలె పొడవుగా, సూటిగానున్నదని వశిన్యాదివాగ్దేవతలు వర్ణించు ఈ నామమును ప్రస్తావించుకొనునప్పుడు, శంకరాచార్యులవారి సౌన్దర్యలహరియందలి నాసికసంబంధిత శ్లోకమును ప్రస్తావించుకొనవలెను కదా!!
అంతకుముందు ఉపాధిత్రయము, నాడీమండలమును గురించి తెలుసుకుందాము.
అనుగ్రహ సుధారసములను వర్షింపజేయవలెనని తల్లిని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment