Sunday 1 July 2018

cidagnikuNDasambhUtA dEvakAryasamudyatA చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః

స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై|
స్వాగతం మయిభ్రుశమ్ సదయాయై స్వాగతమ్ దశశతారమితాయై|| 
(ఉమాసహస్రము15.24)
సకలలోకములునుతించు తల్లికి స్వాగతము

భువనరాజపట్టమహిషియైన తల్లికి స్వాగతము

నాయందు సదయయగు తల్లికి స్వాగతము

సహస్రారకమలము(దశశతార)నందు భాసిల్లుతున్న తల్లికి స్వాగతము

చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా



అఖండచిత్స్వరూపిణియైన అమ్మ దేవకార్యమును నెరవేర్చుటకై, చిదగ్నికుండమునుండి, సంపూర్ణ లీలారూపముతో ద్యోతకమైనది.



భండాసురుని దైత్యకృత్యములు తాళజాలని దేవతలు ప్రార్థించగా, చిదగ్నికుండమును రగిల్చి పరశంభుడు తలపెట్టిన మహాయాగమునందు సమస్త దేవతాసమూహము ఆత్మార్పణయను పూర్ణాహుతి జరిపిన పిదప, నిర్గుణ నిరాకార సచ్చిదానంద తత్త్వము ఆ యజ్ఞకుండమునుండి, సగుణసాకారరూపమును ధరించి దేవకార్యమును సిద్ధించుటకొరకు ఆవిర్భవించినది. ఇక్కడ వశిన్యాదివాగ్దేవతలు ప్రస్తావించిన దేవకార్యము భండాసుర భంజన. ఇది ఈ రెండు నామములయొక్క బాహ్యార్ధము.


ఈ నామముల అంతరార్ధమును చూద్దాము.

దమ్భో దర్పో౭భిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|
అజ్ఞానమ్ చాభిజాతస్య పార్థ సంపదమాసురీమ్|| (భగవద్గీత 16 1-3 శ్లో)
మనలోగల దైవీగుణములు, ఆసురీగుణములు సురాసురులకు ప్రతీకలు. దైనందిన జీవితములో వీటిమధ్య నిరంతరపోరు సాగుతూనే ఉంటుంది.  ఆసురీగుణములు విజృంభించినప్పుడు దైవీగుణములు నిరర్ధకములై, మనము విషయవాంఛలకు లొంగిపోయి సదసత్తులను గ్రహించకుండా ఫలాపేక్షాయుత కర్మాచరణలయందు నిమగ్నులై, భవసాగరమునందు కొట్టుమిట్టాడుతాము.



అలాంటప్పుడు, అన్యథా శరణమ్ నాస్తి త్వమేవ శరణమ్ మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్ష మహేశ్వరీ అని అమ్మ పాదపద్మములను శరణువేడగలిగితే చాలు. ఎలా శరణువేడాలంటే, యథావ్రజ గోపికానామ్ అని అంటారు నారదులవారు, నారద భక్తిసూత్రములందు. శరణాగతియంటే కృష్ణునిపట్ల గోపికలకుగల భావననే చెప్పుకోవాలి. అటువంటి శరణాగతిని సాధించినవారు శ్రీత్యాగరాజస్వామివారు. ఆయనకు రామునిపట్లగల అనన్యభక్తికి/శరణాగతికి ఒక మచ్చుతునక శ్రీరంజని రాగమునందలి పాలముంచిన నీటముంచిన పదములేగతి త్యాగరాజనుత యనుచుపాడిన భువిని దాసుడనే కీర్తన.



తల్లియొక్క చరణములను శరణువేడు భక్తులకు, వాంఛించిన దానికన్న ఎక్కువగా అనుగ్రహిస్తుంది అని ఆదిశంకరులు సౌన్దర్యలహరిలోని త్వదన్యః పాణిభ్యామ్ శ్లోకమునందు, కరుణాతరంగితాక్షియైన తల్లియొక్క పాదసేవనఫలమును వర్ణిస్తారు. అదికూడా ఎలాగంటే, అమ్మా!! భవానీ!! నీ దాసుడనేను!! నన్ను కరుణాదృష్టితో చూడమ్మా!! అని పూర్తిగా చెప్పకుండగ, భవాని త్వమ్ అని ప్రారంభించిన మాత్రముననే నీ పదసాయుజ్యమును ప్రసాదిస్తావు తల్లీ, అని అంటారు శంకరభగవత్పాదులు భవానిత్వం దాసే శ్లోకమునందు.  తదేక చింతనతోకూడిన శరణాగతియే సాధన.


మూలేత్వమ్ జ్వలదలన ప్రకాశరూపా

వీణాయామ్ ప్రబలమహామదోస్మరూపా|
శీర్షాబ్జే సతతగలద్ రసస్వరూపా

భ్రూమధ్యే భవసిలసత్ తటిత్ స్వరూపా|| (ఉమాసహస్రము 18.20)
యోగుల/సాధకుల కులకుండమునందు చిత్స్వరూపిణియైన తల్లి అతిసూక్ష్మమైన అగ్నిశిఖ రూపముగా, మేరుదండము నందు మహామద-ఊష్మ రూపముగానూ, సహస్రారమునందు సంతతము జారుతున్న సోమరసముగానూ, భ్రూమధ్యమున తటిల్లేఖాస్వరూపముతోను విరాజిల్లుతున్నదియని విశ్వరహస్యమును వర్ణించుచున్నారు కావ్యకంఠ గణపతిముని.



జ్ఞానార్ధులై కఠోరసాధన చేసినప్పుడు, కులకుండము అనబడు మూలాధారమునందుగల కుండలినీరూప ప్రాణస్వరూపము జాగృతిచెంది ఊర్ధ్వదిశగా ప్రయాణము చేసి అమ్మను సాక్షాత్కరింపచేస్తుంది. సాధనతో రగులుకున్న సంవిదనలముగా ఆ చిత్స్వరూపిణి ఆవిర్భవించి అవిద్యను తొలగిస్తుంది. అవిద్య తొలగిన అమృతత్వము లభించునను ఈశావాశ్య ఉపనిషత్తు విద్యయామృతమశ్నుతే మంత్రమును నాల్గవ నామమునందు ప్రతిపాదించబడినది.


సనత్సుజాతీయమునందు ధృతరాష్ట్రునికి సనత్సుజాతీయులు మృత్యువు అంటే స్వాభావిక బ్రహ్మనుండి వేరుచేయు అజ్ఞానమే మృత్యువు, జ్ఞానము అమృతత్వము అని చెప్తారు. ఈ విధమైన అమృతత్వమునుపొందు సాధనా ప్రక్రియను శ్రీమద్భాగవతమునందు వర్ణింపబడిన క్షీరసాగరమథనము యొక్క సంకేతార్ధముగా క్రింది శ్లోకమునందు గణపతిముని ప్రస్తావించారు.


ప్రాణిశరీరమ్ మన్దరశైలో మూలసరోజమ్ కచ్ఛపరాజః|
పూర్ణమనన్తమ్ క్షీరసముద్రః పృష్ఠగవీణా వాసుకిరజ్జుః|| 
(ఉమాసహస్రము 17.14)
ప్రాణిశరీరము మందర పర్వతము
మూలాధారము కచ్ఛపరాజు
దహరాకాశము క్షీరసముద్రము
మేరుదండము (వెన్నెముక) - వాసుకి
క్షీరసాగరమథనమునందు, సాధకుని సాధనయే మథనముగాను, కుండలినీ జాగృతిమూలముగానగు పరమేశ్వరి సాక్ష్కాత్కారమే అమృతమును పొందుటగాను వర్ణించారు గణపతిముని.


దేవకార్యమును నెరవేర్చుటకు చిదగ్నికుండమునందు ఉద్భవించిన తల్లిని అవిద్యానాశనమను అమృతత్వమును ప్రసాదించమని శరణువేడుతూ


శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment