Thursday 19 July 2018

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా - Suddha-vidyankuraakara-dvijapankti-dvayOjjvala

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

కంబు-గళే వరకుంద-రదే రసరంజిత-పాదసరోరుహే|

కామమహేశ్వర-కామిని కోమలకోకిల-భాషిణి భైరవి||

చింతితసర్వమనోరధపూరణకల్పలతే కరుణార్ణవే|

పాలయ హే లలితాపరమేశ్వరి మామపరాధినమంబికే||

 

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా

శుద్ధవిద్య-అంకురాకారశుద్ధవిద్య మొలకలవంటి

ద్విజ -  దంతములు

ద్విజయనిన రెండవసారి జన్మనుపొందినవి. ఉపనయనసంస్కారము గలవారికి కూడా ద్విజులని పేరు. అయితే పుట్టిన ప్రతిజీవికి, మొదటి దంతములు పోయి మరల వచ్చుటచే వీటికి ద్విజ, దంతములను కూడా సూచిస్తుంది.

పంక్తి- వరుస

ద్వయజంట

ఉజ్జ్వలాప్రకాశిస్తున్న తల్లి

 

శుద్ధవిద్య మొలకలవంటి దంతముల వరుస/ పలువరుస జంటతో ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము. శుద్ధవిద్య అంకురములు తెలుపు రంగుకు సంకేతము. తెల్లటి పలువరుసతో ప్రకాశిస్తున్న తల్లి అని బాహ్యార్ధము.

 

తస్యాస్తు దంతాః సంభూతాః ప్రజాపత్యేన తేజసా (మార్కండేయపురాణము82-శ్లో16)

తల్లి దంతములు ప్రజాపతి(బ్రహ్మ) తేజస్సుతో ఏర్పడినవి.

మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శ్రుతయోsఖిలాః బ్రహ్మాండపురాణము (3.13.10)

శ్రుతులు తల్లి వాక్కులు.

శుచిభిః పంక్తిబద్ధైశ్చ విద్యారుపైర్విభాస్వరైః

కుందకుడ్మల సచ్ఛాయైర్దంతైర్దర్శిత చంద్రికా||

 (లలితోపాఖ్యానము అ33-శ్లో72,73)

మల్లె మొగ్గల వంటి తెల్లనైన, శుచియైన విద్యవంటి దంతముల వరుసతో భాసిల్లుతున్న తల్లి.

 

స్పష్టమైన వాక్కులకు దంతములు అత్యవసరము. వేదములు అమ్మవారి వాక్కులని బ్రహ్మాండపురాణమునందు చెప్పబడినది. వేదముల ఉచ్చారణకు స్పష్టత చాలా ముఖ్యము. ఏ ఒక్క అక్షరము సరిగా ఉచ్చరించకపోయిననూ, ఆ మంత్రార్ధము మారిపోతుంది.

 

సహజముగానే వార్తల ఉచ్ఛారణకు చాలా జాగ్రత్త అవసరము. లేకపోతే అర్ధము, విపరీతార్ధము అయిపోతుంది. ప్రస్తుతకాలములో దంతములు సరిగ్గా ఉండి కూడా, తప్పుగా ఉచ్ఛరించడము నాగరీకమనుకొని చాలామంది వత్తులు లేనిచోట పెట్టడము, ఉన్నచోట తీసెయ్యడము చేస్తూ మనభాషను ఖూనీచేస్తున్నారు. ఉదాహరణకు, ఒకసందర్భములో, సంగీత విద్వాంసులొకరు గానమూర్తేత్యాగరాజ కృతిలోని “నవమేఘ-తేజ నగజ-సహజ”
అనేవరుసను నవమేక-తేజ నగజ-సహజఅని పాడటముజరిగింది. తెలిసిపాడినా, తెలియకపాడినా అర్ధము ఎంతగా మారిపోయిందో చూసారు కదా.

 

ఇక, ఉదాత్త, అనుదాత్త స్వరములతో కూడి ఉచ్ఛారణ ప్రధానమైన వేదపఠనమునకు దంతములు అతిముఖ్య అంగములని వేరే చెప్పనక్కర్లేదు కదా.

 

వేదములు ప్రతిపాదిస్తున్నది బ్రహ్మవిద్య. మహర్షి అశ్వలాయనుడు శుద్ధవిద్యా కలాపఅనుగ్రంథమునందు బ్రహ్మవస్తువు సృష్టికి ముందు స్థితి, తరువాత సృష్టికి కారణము, ఎలా/ఎన్ని విధములుగా సృష్టి జరుగుతుంది అనేటువంటి అనేక రహస్యములను వివరించారు. గోచరాగోచర, చరాచర సృష్టి అంతయూ బ్రహ్మవస్తువే అని చెప్పునది బ్రహ్మవిద్య. ఆ బ్రహ్మవిద్యయే శుద్ధవిద్య అని చెప్పుటకు ఈ గ్రంథమునకు శుద్ధవిద్యా కలాపఅని పేరు పెట్టినట్లనిపిస్తున్నది. ఇదియే శబ్దప్రధానములైన వేదములు వాక్కులుగా గలిగిన తల్లి దంతముల వరుసను శుద్ధవిద్య అంకురములు (మొలకలు/sprouts) అని చెప్పుటయందలి రహస్యము.

 

ద్విజులంటే ఉపనయనసంస్కారము గలవారని కూడా చెప్పుకున్నాము కదా. విద్యా హ వై బ్రాహ్మణమాజగామేతి వేదాదివిద్యలు, ద్విజులగు బ్రాహ్మణులను ఆశ్రయించియున్నవి. అందువలన వేదపండితులైన బ్రాహ్మణులు విద్యాంకుర రూపులు. వేదపఠన సమయములో వీరు రెండు పంక్తులలో కూర్చొని పారాయణ చేస్తారు. రెండు పంక్తులలో కూర్చొని విద్యాంకురములైన వేదపండితబ్రాహ్మణులచే చెప్పబడిన వేదములరూపములో ప్రకాశించుతల్లియని ఈ నామమునకు మరియొక అర్ధము.

 

మంత్రశాస్త్రమునందలి బాలా, మాతంగీ వంటి 32దీక్షావిధానములు కూడా శుద్ధవిద్యయని చెప్పబడుచున్నవి. అట్టి విద్యాంకురములను దంతములుగాగలిగిన తల్లియనికూడా విజ్ఞులు చెప్పుచున్నారు.

 

మరియొక విషయము.

వర్ణితమ్ నైవమ్ శక్యేయమ్ శ్రీవిద్యా షోడశాక్షరీ|

బ్రహ్మవిద్యాస్వరూపా హి భక్తిముక్తిఫలప్రదా||

(వామకేశ్వర తంత్రము)

చక్రమ్ విద్యాక్షరైరేవ జననాత్ తత్-అభేదవత్

దేవ్యా రూపాన్తరత్వాచ్చ తేన యుక్తోక్తరూపతా||

సుందరివిద్య/శ్రీవిద్య, బ్రహ్మవిద్య/శుద్ధవిద్య. దేవత, విద్య మరియు చక్రము, ఈ మూడింటికీ భేదములేదని (అభేదము) శ్రీభాస్కరరాయలవారు వారివస్యరహస్యమునందు (2-96) చెప్పియున్నారు.

 

శ్రీవిద్యామంత్రాక్షరములు శుద్ధవిద్యాంకురములు. తల్లిమంత్రము 16 అక్షరములుగల షోడశీమంత్రము అని చెప్పుకున్నాము.

 

బీజాంకుర స్థితులవలే వాక్కుకు కూడా పరా, పశ్యంతీ, మధ్యమ మరియు వైఖరియని నాలుగువిధములు. సామాన్యులకు తెలిసినది ఒకటే, బయటకు పలికే వాక్కు, వైఖరీవాక్కు. మొదటి రెండు వాక్స్థితులు, యోగులు, జ్ఞానులు మాత్రమే తెలుసుకొనగలరు. నాదరూప శబ్దబ్రహ్మమే షట్చక్రములయందలి పద్మముల దళములయందు మాతృకావర్ణములుగా విస్తరిల్లి మనలను అనుగ్రహిస్తున్నది. అక్షరములు శివశక్త్యాత్మకములు. దీనిగురించి మరింత వివరములు మున్ముందు వచ్చేనామములలో చూద్దాము.

 

మాట్లాడాలనే సంకల్పము వలన కలిగిన స్పందనచే ఉత్తేజితమైన మనలోని చైతన్యము వాయురూప శబ్దబ్రహ్మమైన పరావాక్కని చెప్పబడుతున్నది. కౌళా/వామాచారులు ఈ పరావాక్స్థానము మూలాధారమనియు, సమయాచారులు బ్రహ్మరంధ్రస్థానమనియు భావించెదరు. పరావాక్కు బీజస్థితి.

 

(కౌళ/వామ) బ్రహ్మరంధ్రస్థానమునందు ఉత్పన్నమయిన వాయురూప శబ్దబ్రహ్మము సుషుమ్ననాడిద్వారా మూలాధారమునకు (పాయుస్థానము) జేరినపిదప పశ్యంతీ వాక్కనబడును. (సమయ) మూలాధారమునుండి, ఈ వాయువు ఊర్ధ్వదిశగా ప్రయాణించి స్వాధిష్ఠానము (నాభి) వద్ద పశ్యంతీవాక్కుగా రూపాంతరము చెందుతుంది. నీటితో తడిసి, అంకురములు/మొలకెత్తుటకు సిద్ధమగుతున్న ఉబ్బిన బీజస్థితి వంటిది పశ్యంతివాక్కు.      

 

ఇక్కడినుండి అనాహతముజేరి (హృదయస్థానము) బుద్ధితో వాక్సంకల్పానుసారముగా వరుసపరుచబడిన ఈ శబ్దబ్రహ్మమునకు మధ్యమవాక్కని పేరు. ఉబ్బిన బీజములో రెండు ఆకులు ఉత్పన్నమై వెలువడకుండగ ఉన్న స్థితి మధ్యమవాక్కు. ఈ రెండు పత్రములు శివ-శక్తులకు/వాక్కు-అర్ధములకు సంకేతము.

 

మధ్యమవాక్కు తదుపరి చక్రమైన విశుద్ధమునుజేరి (కంఠస్థానము) మాటలుగా వ్యక్తపరచబడుచున్నది. బీజపుచర్మములోపల మొలిచిన ఆకులు బయటకు వ్యక్తీకృతమగుస్థితి వైఖరి. ఆకులు బయటకు వ్యక్తమైన బీజమునకు అంకురము/మొలకయని పేరు. ఇది వృద్ధిచెంది వృక్షముగా రూపాంతరము చెందుతుంది.

 

గురువుద్వారా బీజరూపములోనున్న శబ్దబ్రహ్మ/పరావాక్కు, అంకురరూపమైన వైఖరీవాక్కుగా శిష్యునకు షోడశి (శ్రీవిద్య) మంత్రోపదేశము ఇవ్వబడును. అంకురస్థితిలో ప్రతి వర్ణము శివ,శక్తులను రెండు పత్రములతో భాసిల్లుతుంది. 16 అక్షరములకు రెండు పత్రములచొప్పున 32 పత్రములే తల్లియొక్క దంతములుగా చెప్పబడుచున్నవి.

 

తల్లికి అనంతనామములు.

 

దేవీనామసహస్రాణి కోటిశస్సంతి కుంభజ (బ్రహ్మాండపురాణము)

అస్యా నామాన్యనంతాని తాని వర్ణయితుమ్ మయా | న శక్యాని మునిశ్రేష్ఠ కల్పకోటిశతైరపి || - (సౌర సంహిత)

అసంఖ్యాతాని నామాని తస్యా బ్రహ్మాదిభిః సురైః|

గుణకర్మవిధానాద్యైః కల్పితాని చ కిమ్ బ్రువే|| (దేవీభాగవతము)

 

ఇన్ని నామములున్ననూ, వశిన్యాదివాగ్దేవతలు స్తుతించి చేసిన లలితాసహస్రనామస్తోత్రము నందలి 32 అక్షరములతో ప్రారంభమగు దివ్యమైన వేయినామములు తనకు అత్యంత ప్రీతిపాత్రమైనవిగా తల్లి చెప్పినది.

అంకితమ్ నామభిర్దివ్యైః మమ ప్రీతివిధాయకైః|

తత్పఠధ్వమ్ సదా యూయమ్ స్తోత్రమ్ మత్ప్రీతి వృద్ధయే||

 

లలితాసహస్రనామమునందలి వేయినామములు కేవలము 32 సంస్కృతాక్షరములతో ప్రారంభమగు నామములు. సంస్కృతమునందలి 51 అక్షరములలోని 32 అక్షరములు, , , , , , , , అం (8), , , (3), , , (3), (1), , , , (4), , , , (4), , , , , , , , , క్ష (9) మాత్రమే ప్రారంభాక్షరములుగా తీసుకొని వశిన్యాదివాగ్దేవతలు తల్లిని వేయినామములతో స్తుతించారు.

 

ద్వాత్రింశద్భేదభిన్నా యా తామ్ వందే అహమ్ పరాత్పరామ్ - సూతసంహితోక్తి

ముప్పదిరెండు అక్షరభేదములచే భిన్నురాలైన పరదేవతకు నమస్కరిస్తున్నాను.

 

వృక్షములకు బీజాంకురములెటులనో వాక్కులకు శబ్దబ్రహ్మ,అక్షరములు అటులనే. బ్రహ్మవిద్యాధిదేవతయైన అమ్మకు ప్రీతిపాత్రమైన వేయినామములకు అంకురములవంటివీ 32 అక్షరములు.

 

శుద్ధవిద్య మొలకలవంటి తెల్లని పలువరుసతో,  32 అక్షరములనెడు అంకురముల ద్వారా వశిన్యాదివాగ్దేవతలచే ప్రతిపాదించబడిన బ్రహ్మవిద్యయైన శ్రీవిద్యారూపిణియై, 32 శుద్ధవిద్య దీక్షావిధానములను దంతములద్వారా జ్ఞానమును ప్రసాదించుచూ, పంక్తిద్వయములో ఆసీనులైన, వేదపండిత ద్విజోత్తముల ద్వారా సాక్షాత్ వేదస్వరూపిణిగా ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము.

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment