Tuesday 2 October 2018

marALI-manda-gamanA మరాళీమందగమనా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
హంసగమనీ-నాదజననీ|
భవభామినీ-బంధమోచనీ||

మరాళీ-మందగమనా
మరాళీ – ఆడుహంస
మందగమనా – మెల్లిగా నడుచుతల్లి
ఆడుహంసవలె మెల్లిగానడుచుతల్లికి నమస్కారము. హంసలకు, తల్లిపాదపద్మములకుగల సామ్యము చూచిన, హంసలు నీటిపక్షులు, పద్మములు నీటిపుష్పములు. అంతేకాదు హంసలు తామరతూడులందు ఆసక్తిగలిగియుండుట మరియొక విశేషము.

సా రాజహంసైరివ సన్నతాఙ్గీగతేషు లీలాఞ్చిత విక్రమేషు|
వ్యనీయత ప్రత్యుపదేశలుబ్ధైః ఆదిత్సుభిర్నూపురశిఞ్జితాని||  
(కుమారసంభవము 1.34)
రాయంచలు తల్లిపాదముల మంజీరముల రవళివంటి కూతలను తామునేర్చుకొనుటకై, స్వవిద్యయైన హంసనడకను తల్లికినేర్పినవాయన్నట్లున్నదని మహాకవి కాళిదాసు తల్లియొక్క వయ్యారపునడకల సోయగములను వర్ణించారు. 

దీనికి కారణము

గురుశుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన వా
అథవా విద్యయా విద్యా చతుర్ధీనోపపద్యతే||
గురుసేవజేయుటద్వారా, పుష్కలముగ ధనమును సమర్పించుటద్వారా, లేదా స్వవిద్యను దానమిచ్చుటద్వారా గురువువద్ద విద్యను పొందవలెనని న్యాయశాస్త్రమునందు చెప్పబడినది.

అయితే శంకరభగవత్పాదులవారు, తల్లివద్దనుంచే హంసలు నడకనేర్చినాయని సౌన్దర్యలహరి 91శ్లోకము పదన్యాసక్రీడా పరిచయమివారబ్ధు మనసః నందు వర్ణించారు. తల్లిభవనమునందలి కలహంసలు తల్లినడకలను అనుకరించుటకు ప్రయత్నించి విఫలమగుచూకూడా విడుచుటలేదు. అప్పుడు తల్లి తనయొక్క పాదమంజీర ధ్వనులను అనుకరించి నడుచునట్లు ఆ రాజహంసలకు శిక్షణనిచ్చినదియని ఆదిశంకరులు, మధురధ్వనులమంజీరాలంకృత పాదపద్మములతో నడుచు తల్లిపదముల సోయగములకు దీటైనది లేదని చెప్పారు.

మనకు అర్ధమగునట్లు చెప్పుటకొరకు వాగ్దేవతలు తల్లినడకలను మనకు తెలిసిన హంసలనడకలతో పోల్చిచెప్పారుగానీ, తల్లినడకలను పోల్చబడినహంసలు మనము భూలోకమునందుజూచు కలహంసలు కాదు. 

బీభత్సూనామ్ సయుజమ్ హంసమాహుః ఆపమ్ దివ్యానామ్ సఖ్యేచరన్తమ్|
అనుస్తుభమను చర్చూర్యమాణమ్ ఇంద్రమ్ ని చిక్యుః కవయః మనీషా|| 
 (ఋగ్వేదము 10.124.09)
అజ్ఞానాంధకారములను ఛేదించుటకు సహకారముగనుండుదానిని హంసయందురు. దివ్యలోక వ్యోమజలములందుకూడా సంచరించు ఈహంస పరంబ్రహ్మ సూచితము.

క్రిందటి రెండు నామములందు పరంబ్రహ్మ తనయొక్క ప్రభలనుండి ఈషణ్మాత్ర తేజస్సుతో అఖిలాండకోటి బ్రహ్మాండములతోకూడిన నామరూప సృష్టిని జరిపినట్లు చెప్పుకున్నాము కదా!! అది ఎలా జరిపబడినదో తెలియజేయునట్లున్నది ఈనామము.

ఈశ్వరప్రత్యభిజ్ఞ విమర్శయందు అభినవగుప్తులవారు శుద్ధోయమ్ స్పందః పరమేశ్వరస్యా చలస్యాప్య ప్రరూఢ రూపాంతరాపత్తి లక్షణః కిఞ్చిచ్చలనాత్మతయా స్ఫుటరూపత్వాత్ అని స్పందనను వివరించారు.

స్పందన శుద్ధమైనది. కించిత్ చలనముచేత నిర్గుణ నిరాకారుడైన పరమేశ్వరుడు సగుణసాకారరూపమును పొందుతున్నాడు.

స్పది కిఞ్చిచ్చలనే (పాణిని ధాతుపాఠము-14) కించిత్ చలనము స్పందనయని చెప్పబడినది.

పరిపూర్ణచైతన్యవంతుడు, చలనరహితుడగు పరమేశ్వరుని(మరాళి)యొక్క అంతర్లీనస్వత్రంత్రశక్తితో ఏర్పడిన లవలేశమాత్రమైన కదలికతో (మందగమనము) పరంబ్రహ్మము సృష్టిరచనచేయుచున్నాడనునది ఈ నామముయొక్క అంతరార్ధము.

హంసయనిన జీవాత్మ, ప్రాణశక్తియని కూడా చెప్పబడుచున్నది.

ద్వే బ్రహ్మణి వేదితవ్యే శబ్దబ్రహ్మ పరమ్ చ యత్|
శబ్దబ్రహ్మణి నిష్ణాతః పరమ్-బ్రహ్మాధిగచ్ఛతి|| 
(విష్ణుపురాణము 6.5.64)
శబ్దబ్రహ్మము, పరంబ్రహ్మమని బ్రహ్మము రెండువిధములుగ చెప్పబడుచున్నది. శబ్దబ్రహ్మమునందు నిష్ణాతులైనవారు పరమ్బ్రహ్మమును పొందెదరు.

సకారేణ బహిర్యాతి హకారేణ విశేత్ పునః|
హంసహంసేత్యముమ్ మంత్రమ్ జీవో జపతి నిత్యశః|| 
 (విజ్ఞానభైరవ తంత్రము – 155)
ఉచ్ఛ్వాసనిశ్వాసల సమాహారము, హంసమహామంత్రము. మందగతితో శ్వాసనియంత్రణ జరిపి శబ్దబ్రహ్మసాధన జేయుటద్వారా పరమ్బ్రహ్మైక్యతను పొందవచ్చని యోగ/తంత్రశాస్త్రములందు చెప్పబడినది.

ఇదే విషయమును నాదోపాసకుడైన త్యాగరాజస్వామి స్వరరాగసుధారసభక్తియను శంకరాభరణరాగ కృతియందు మూలాధారజ నాదమెరుగుటయే ముదమగు మోక్షమురా యని పాడినారు. మూలాధారమునందు జనించు నాదము పరావాక్కు/శబ్దబ్రహ్మము. శబ్దబ్రహ్మమునెరింగిన పరంబ్రహ్మమును పొందవచ్చనునది వీరి అంతరార్ధము.

తల్లియొక్క మందగమనముల రహస్యము నా మందబుద్ధియందు ప్రకాశింపవలెనని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః