Friday 1 November 2019

సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా Sampatkari smaruda sindhuravraja sevita... జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా Jwalamalinikakshipta vahniprakara madhyaga

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
శ్రీచక్రస్థాం శాశ్వతైశ్వర్యదాత్రీం
పౌండ్రాం చాపామ్ పుష్పబాణాన్దధానామ్।
బంధూకాభామ్ భావయామి త్రినేత్రామ్
తామగ్నివర్ణామ్ తపసా జ్వలంతీం ।।
 (త్రిపురసుందరీ వేదపాదస్తవము-39)

బ్రహ్మాండపురాణమునందు వర్ణింపబడిన భండాసురసంహార ఘట్టమును వాగ్దేవతలు ఇక్కడినుండివచ్చు కొన్నినామములయందు వర్ణించారు. చిదగ్నికుండమునుండి ఆవిర్భవించిన లలితామహాత్రిపురసుందరిదేవి దేవతలను బాధిస్తున్న భండాసురుని వధనిమిత్యార్ధము శక్తులను సిద్ధముజేసినట్లు క్రిందటినామమునందు చెప్పుకున్నాము.

ఏతే దశస్తవా గంగాశ్యాలకాబాలరాసభా; రహస్యనామసాహస్రం ఇదం శస్తమ్ దశస్వపి; తస్మాత్సంకీర్తయేన్నిత్యమ్ కలిదోషనివృత్తయే;

తల్లి ఆనమేరకు వాగ్దేవతలు చెప్పిన విశేష సహస్రనామస్తోత్రము లలితాసహస్రనామస్తోత్రము.  ఈ నామముల వరుసయందు ఒక విశేషమును గమనించవలసినది. తల్లిస్థూలరూపమును వశిన్యాది వాగ్దేవతలు శ్రీమాతా నామము నుండి సుధాసాగరమధ్యస్థా, కామాక్షీ, కామదాయినీ నామము వరకు బింద్వాదిభూపురాంత సృష్టి (సహస్రారము నుండి మూలాధారమువరకు) సూచితముగనూ, తదుపరి భండాసురసంహారమను లీలావైభవమును తెలుపు నామములు భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమన్వితా; సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా నామమునుండి కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా నామమువరకు భూపురాదిబింద్వాంత సంహారక్రమముగానూ (మూలాధారమునుండి సహస్రారమువరకు) వర్ణించారు.  ఇటువంటి సృష్టి, సంహారక్రమములు స్తోత్రమునందు ఇంకనూ చాలాగలవు.

ఇక తదుపరివచ్చు ఆరునామములను చూద్దాము.  వీటిలో మొదటి ఐదు నామములందలి వాహనములు (గజము, అశ్వము మరియు చక్రరాజ, గేయచక్ర, కిరిచక్ర రథములు) పంచమహాభూతతత్త్వ సూచితములు.

చతుష్పాదమ్ ధనుర్వేదమ్ వదే పఞ్చవిధమ్ ద్విజః।
రథనాగాశ్వపత్తినామ్ యోధాంశ్చాశ్రిత్య కీర్తితమ్।।(అగ్నిపురాణము249.1)
యుద్ధమునకు అవసరమైన సేనను రథములు, ఏనుగులు, గుర్రములు మరియు సైనికులని నాలుగు విధములుగ విభజించబడినవి.  ఈ నాలుగింటినీ ధనుర్వేదశాస్త్రమునకు నాలుగు పాదములుగ చెప్పబడుచున్నవి.

గజారూఢ, అశ్వారూఢ దేవతలను, వారిబలగములను వర్ణించు నామములు సంపత్కరీసమారూఢ-సింధుర-వ్రజ-సేవితా, అశ్వారూఢాధిష్టితాశ్వకోటికోటిభిరావృతా. తదుపరి మూడునామములు చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా, గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా, కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా, రథబలమును వర్ణించునవి.  ఈ నామములను పురాణకథనము ప్రకారముగాను, ఆత్మతత్త్వపరముగాను అన్వయించుకొనుటకు ప్రయత్నిద్దాము.  వీనిలోని మంత్రవిశేషములను గురుముఖత తెలుసుకొనవలసినది.

చకతి హంతి పరబలమితి చక్రమ్; చక తృప్తౌ, ప్రతిఘాతే; కరోతి జయమితి వా చక్రమ్
పరబలమును హింసించునది. జయమును కలిగించునది చక్రము.
పంచమహాభూతములైన భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశ తత్త్వముల పంచీకరణచే ఏర్పడిన జ్ఞాన, కర్మేంద్రియములు, పంచతన్మాత్రలను జయించుటకు తల్లి సృష్టించిన శక్తిసేనలు పైన చెప్పబడిన ఐదుదేవతలు.

ఇంద్రియాణ్యశ్వరూపాణి; ఇంద్రియాన్యార్థాన్ గజాన్।
(తంత్రరాజతంత్ర-8వభాగము-5.24,25)
శ్రోత్రత్వక్చక్షుజిహ్వాఘ్రాణములను జ్ఞానేంద్రియములు, వాక్పాణిపాదపాయుపస్థయలను కర్మేంద్రియములు అశ్వరూపములు. శబ్దస్పర్శరూపరసగంధ, వచన, దాన, గతి, విసర్గ, ఆనందములను పది ఇంద్రియార్థములు, గజరూపములు. ఇంద్రియార్థ నిగ్రహ సూచిత ఆయుధము అంకుశము.
సంపత్కరీసమారూఢసింధురవ్రజసేవితా
సంపత్కరీసమారూఢ – సంపత్కరీదేవిచేత చక్కగా అధిరోహింపబడిన
సింధుర వ్రజ – ఏనుగుల సమూహము
గజముల సమూహముతో, గజారూఢయైన సంపత్కరీదేవిచేత సేవింపబడు తల్లికి నమస్కారము.
లలితాపరమేశాన్యా అంకుశాస్త్రాన్సముద్గతా
సంపత్కరీ నామ దేవీ చచాల సహ శక్తిభిః।।
(బ్రహ్మాండపురాణము-ఉ-15.7)
లలితాపరమేశ్వరీదేవి అంకుశమునుండి సంపత్కరీదేవి వివిధ శక్తులతో ఆవిర్భవించినది. సంపత్కరీదేవి అధిరోహించిన గజమునకు రణకోలాహలమని పేరు.
గజసంబంధిత ఈ నామము భూతత్త్వ మూలాధారసూచితము.

అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా
అశ్వారూఢాధిష్ఠిత – అశ్వారుఢా దేవి చేత ఎక్కబడిన
అశ్వ కోటికోటి భిః -కోటానుకోట్లచే
ఆవృతా – ఆవరింపబడినది
అపరాజితయను అశ్వమునధిరోహించిన అశ్వారూఢదేవితోపాటు కోటానుకోట్ల అశ్వములచే ఆవరింపబడిన తల్లికి నమస్కారము.
అథ శ్రీలలితాదేవ్యా శ్రీపాశాయుధసంభవా
అతిత్వరితవిక్రాంతిరశ్వారూఢాచలత్పురః।।
(బ్రహ్మాండపురాణము ఉ – 15.14)
తల్లి పాశాయుధమునుండి అశ్వారూఢాదేవి ఆవిర్భవించినది. అపరాజితయను అశ్వమునధిరోహించి అశ్వారూఢాదేవి లలితమ్మతల్లి రథమునకుముందు నడుచుచున్నది.

అశ్వము జలమునుండి సంభవించుటచే (తైత్తిరీయసంహిత 2.3.12.2), ఈ నామము జలసంబంధిత స్వాధిష్ఠానచక్ర సూచితము.

చక్రరాజరథారూఢసర్వాయుధపరిష్కృతా
చక్రరాజరథారూఢ – చక్రరాజమను రథమును ఎక్కి
సర్వాయుధ పరిష్కృతా – సకల ఆయుధములతో అలంకరింపబడినది
సకల ఆయుధములతో అలంకరింపబడిన చక్రరాజమను రథమునధిరోహించిన తల్లికి నమస్కారము.
శత్రువులను జయించుటలో మిన్నయైన చక్రరాజము తల్లియొక్క రథము. చక్రరాజము శ్రీచక్ర సూచితము.

ఇక తత్త్వపరముగా జూచిన,
2.1.3-7,11, 3.5.4,5.3.1, 7.12.3, 10.8.5, 5.3.1 ఋగ్వేదసూక్తములనునసరించి సమస్తదేవతలను అగ్నియందు భావింప/గ్రహించవచ్చును.

అగ్నే॑ నే॒మిర॒రాఁ ఇ॑వ దే॒వాఁస్త్వం ప॑రి॒భూర॑సి । ఆ రాధ॑శ్చి॒త్రమృ॑ఞ్జసే (ibid 5.13.6)
ఒక చక్రమునందలి ఆకులను (spokes) చట్రము చుట్టియున్నట్లు, తనయందు తెలియబడిన సమస్త దేవతలను అగ్నిదేవుడు చట్రమువలే చుట్టియుంటాడు.
అదేవిధముగా ఈనామమునందలి సమస్తదేవతాశక్తులను గలిగిన శ్రీచక్రము/చక్రరాజము, అగ్నితత్త్వ సూచకము.

గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా     
గేయో గాతవ్యే గాయనే ఽపిచ - పాట, గానముచేయువాడు (విశ్వకోశము)
గేయచక్రమునధిరోహించిన మంత్రిణీదేవియనబడు అష్టాదశవిద్యాధిదేవత శ్యామలాదేవిచే సేవింపబడు తల్లికి నమస్కారము.

తల్లి చెరకువిల్లునుండి ఆవిర్భవించిన విశేషమైన శక్తి శ్యామలాదేవి.  పంచాశత్పీఠములలో ఒకటైన మథురై మీనాక్షి పీఠము రాజమాతంగి శ్యామల పీఠము.  మీనాక్షీదేవి, జ్ఞానశక్తిరూపిణియైన శ్యామలాదేవియే. శబ్దము వాయుసంబంధితమగుటచే ఈ నామమునందలి గేయచక్రము అనాహతచక్ర సూచితము.

కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా
కిరిచక్ర రథమునధిరోహించిన దండనాథాదేవియనబడు వారాహీదేవిచే అనుసరింపబడిన తల్లికి నమస్కారము. చక్రరాజరథమునకు ముందు సాగుతున్నది (పురః + కృతా= ముందు ఉన్నది) కిరిచక్రము. వారాహీ దేవి తల్లియొక్క పువ్వులబాణములనుండి ఆవిర్భవించినట్లు చెప్పబడినది. దండమును ధరించినదగుటచే తల్లికి దండనాథురాలని పేరు. శిక్షించుటకు ఉపయోగించునది దండము. బ్రహ్మాండపురాణమునందు (ఉ-17.18-20) దండనాథాదేవికి పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయసంకేత, వారాహి, పోత్రిణి, వార్తాలి, మహాసేన, ఆజ్ఞ, చక్రేశ్వరి మరియు అరిఘ్నియని ద్వాదశనామములు చెప్పబడినవి. బ్రహ్మాదిషు పంచసు పంచమస్య సదాశివస్య స్త్రీ పంచమీ (భాస్కరరాయల సహస్రనామ భాష్యము) - పంచబ్రహ్మలలో ఒకరైన సదాశివుని పత్ని పంచమి. 

పంచాశత్పీఠములలో ఒకటైన జంబుకేశ్వర అఖిలాండేశ్వరీదేవి పీఠము వరాహపీఠమని చెప్పబడుచున్నది. అందువలన అఖిలాండేశ్వరీ దేవి, క్రియాశక్తి రూపిణియైన వారాహీదేవి.

ఋగ్వేదమునందు పలుసందర్భములలో ఆకాశమును కిరి/వరాహమని చెప్పబడినది.  ఈ నామమునందలి  కిరి శబ్దము, పంచమహాభూతములందు భూమినుండి ఐదవదైన ఆకాశసంబంధిత విశుద్ధిచక్ర సూచితము.

ఈ ఐదునామములందు చెప్పబడిన సంపత్కరి, అశ్వారూఢ, మహారాణి లలితాంబిక, మంత్రిణీ శ్యామల, దండనాథ వారాహియను ఐదుశక్తులు, కలాకాలాది ఐదు కంచుకములను భేదించు శక్తులు.

జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా
జ్వాలామాలినిచే నిర్మించబడిన అగ్నివలయము మధ్యనున్న తల్లికి నమస్కారము.

యుద్ధమునందు శక్తిసేనలకు ఎటువంటి ప్రతిబంధకములు ఏర్పడకుండా రక్షించుటకు నూరుయోజనముల దూరమువరకు జ్వాలామయ ప్రాకారమును ఏర్పరచుటకు జ్వాలామాలినియను శక్తిని తల్లి సృష్టించినది.

తత్త్వపరముగ జూచిన, కాలతత్త్వమునధిగమించుటకు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండాది పదిహేను నాశరహిత నిత్యాయోగినీదేవతలను తల్లి సృష్టించినది.  వీరియందలి పదినాల్గతిథినిత్యాదేవత జ్వాలామాలిని. 

దారుకావనమునందు విముక్తిపొందిన మునులకు, తల్లి జ్వాలామాలినిగా దర్శనమిచ్చినట్లు దారుకావనవృత్తాంతమునందు చెప్పుకున్నాము. జ్వాలను మాల/హారముగా ధరించినతల్లి జ్వాలామాలినియగుటచే ఈ తల్లి జ్ఞానాగ్నిమూర్తి.  అందువలన జ్వాలామాలిని, జ్ఞానసంబంధిత ఆజ్ఞాచక్ర సూచితము.  పదిహేనుతిథి నిత్యాదేవతలలో, ఈనామమునందు జ్వాలామాలినిని ముఖ్యముగా చెప్పుటయందలి రహస్యమిదియే.

భండాసురవధానార్ధమ్ ఏకైవా అనేకా
మాయశక్తి జనిత కల, కాల, నియతి, సద్విద్య, రాగమనబడు ఐదుపొరలచే కప్పబడిన పశువులను బంధించు పాశమును(అణవమల, మాయీయమల మరియు కార్మికమలమనబడు మలత్రయము) ఖండించుటకు తల్లి తననుండి సృష్టించిన శక్తులను వర్ణించునవి సంపత్కరీసమారూఢ.. నామమునుండి జ్వాలామాలినికాక్షిప్త.. వరకుగల నామములు.
పరతత్త్వరూపిణిని ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః