Sunday 26 August 2018

gUDha-gulphA గూఢగుల్ఫా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః
 
సర్వచైతన్యరూపాం తాం, ఆద్యాం విద్యాం చ ధీమహీ, బుద్ధిం యా నః ప్రచోదయాత్|

గూఢగుల్ఫా
గూఢ గుహ్యమైన
(గుహ్యతేస్మగూఢమ్గుహ్యముగ/రహస్యముగనుంచబడినది గూఢము)
గుల్ఫ చీలమండలములు

గూఢగుల్ఫాయైనమః
బయటకుతెలియకుండగనున్న (గుహ్యముగనున్న) చీలమండలములుగలిగిన తల్లికి నమస్కారము. తల్లియొక్క కార్పాసము(వస్త్రము)చే చీలమండలములు కప్పబడినవని అర్ధము.

ఇదిబాహ్యార్ధము.

అమ్మవారి రూపవర్ణనజేయు నామములలో, త్రిమర్మసంబంధిత మూడుఅవయములను వర్ణించు నామములు (కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా, అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటికటీ, గూఢగుల్ఫా) కప్పబడియున్నట్లు చెప్పినారు వాగ్దేవతలు. కడిమిపూలగుత్తులతోకప్పబడిన మనోహరమైన చెవులు, కుంకుమపువ్వురంగు వస్త్రముతోచుట్టిన కటిభాగము, గూఢముగానున్న గుల్ఫములు: ఈ మూడుఅవయములు కప్పబడియున్నవని చెప్పుటయందలి రహస్యము ఏమిటో చూద్దాము.

మర్మాణినామ మాంస-సిరా-స్నార్యాస్థి సంధి సన్నిపాతాస్తేషు స్వభావత ఏవ విశేషేణ ప్రాణాస్తిష్ఠంతి
(సుశ్రుతసంహితశరీరస్థానము6-20శ్లో)
మర్మముయనిన, మాంసము(flesh), సిర(veins), సన్ననినరము (స్నాయువు/ligament) మరియు ఎముకల(bones) సంధిభాగము. ఇచ్చట ప్రాణము కేంద్రీకృతమైయుండును. ఈ కారణముచేత మర్మస్థానములు శరీరమునందలి (vital points) విశేషమైన ప్రాణస్థానములు.

సప్తోత్తరం మర్మశతం అస్మిన్ శరీరే స్కన్ధశాఖాసమాశ్రితమగ్నివేశ!
తేషామన్యతమపీడాయామ్ సమధికా పీడా భవతి, చేతనానిబన్ధ వైశేష్యాత్
(చరకసంహితసిద్ధిస్థానము9-3శ్లో)
పాంచభౌతికమైన ఈ శరీరమునందు స్కంధమును(మధ్యభాగము), శాఖలను(హస్త-పాదములు) ఆశ్రయించుకొని 107 మర్మములు మనుష్యులందు గలవు. మధ్యభాగమునందు 63మర్మస్థానములు, హస్త-పాదములందు 44మర్మస్థానములు గలవు. ఈ మర్మస్థానములందు ఏదేనీ దెబ్బతగిలినచో, మిగిలిన స్థానములకన్న అధికమైన బాధకలుగును.

కొన్నిమర్మస్థానములందు అభిఘాతమేర్పడిన, ప్రాణహానికూడా కలుగవచ్చును. ఇవి కీలక మర్మస్థానములు.

తత్ర శాఖాశ్రితేభ్యో మర్మభ్యః స్కంధాశ్రితాని గరీయాంసి 
శాఖానామ్ తదాశ్రితత్వాత్ స్కన్ధాశ్రితేభ్యోఽపి 
హృత్-వస్తి-శిరాంసి తన్మూలత్వాచ్ఛరీరస్య (ibid 4శ్లో)
శాఖలు స్కంధమునాశ్రయించియుండుటచే స్కంధాశ్రిత మర్మములు ప్రధానములు.
మొత్తము 107మర్మములందునూ త్రిమర్మములు, మూడుమర్మములు: (heart) హృదయము, (కటి - sacro-iliac region) వస్తి మరియు (brain) శిరస్సు, అతిప్రధానమైనవి.

హృదయమర్మమునకు reflex point గుల్ఫములు, శిరస్సునకు చెవులుయనియు, అచేతస్కుడైన మనిషియొక్క త్రిమర్మముల సంబంధిత చెవులు, కటి మరియు గుల్ఫ మర్మస్థానములను మర్దనజేసిన చైతన్యవంతుని చేయవచ్చునని వర్మకల సిద్ధాంతము (Philosophy of Thanuology, S. Chidambaramthanu Pillai, Reference Reference - Lethal spots, Vital secrets by Roman Sieler).

ఇదియే (శిరస్సు/చెవులు) వాగ్భవ, (కటి)కామరాజ మరియు (గుల్ఫములు) శక్తికూటమునందలి మూడు చైతన్యస్థానములను వాగ్దేవతలు గుహ్యముగాను మరియు కప్పబడియున్నట్లుగానూ వర్ణించుటయందలి రహస్యము.

అఖండచైతన్యరూపమైన అమ్మ సాక్షాత్కారము కలగవలెనని తల్లి గుల్ఫములను ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

Saturday 25 August 2018

indragOpaparikshipta-smaratUNAbha-jaMghikA ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
ఆధారేతరుణార్క బింబరుచిరం హేమప్రభం వాగ్భవం
బీజం మన్మథమిన్ద్రగోపసదృశమ్ హృత్పంకజే సంస్థితమ్|
విష్ణుబ్రహ్మ పదస్థశక్తి కలితమ్ సోమప్రభాభాసురమ్
యే ధ్యాయంతి పదత్రయమ్ తవశివేతేయాంతి సౌఖ్యం పదం||

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా

ఇంద్రగోప-పరిక్షిప్తఇంద్రగోపములచే చుట్టబడిన (surrounded by)
స్మర మన్మథుని
తూణాభఅంబులపొదవంటి
జంఘికాకాలిపిక్కలుగల తల్లి

ఇంద్రగోపకీటకములు ఎర్రనివర్ణముగలిగియుండు అగ్ని-కీటకములు (fire-flies).
ఇంద్రగోపములవంటి ఎర్రని వర్ణముగలిగి మన్మథుని అంబులపొదవలెనున్న కాలిపిక్కలు గలిగిన తల్లికి నమస్కారము.
జంఘోరూ వరుణస్యాథ తేజసా సంబభూవతుః
 (శ్రీమద్దేవీభాగవతముస్క 5 – 72శ్లో)
అనంగవరతూణీరదర్పోన్మథనజంఘికా
 (బ్రహ్మాండపురాణము-ఉత్తరభాగము-37-70శ్లో)

వరుణతేజస్సుతో ఏర్పడిన ఎర్రని తల్లికాలిపిక్కలు అనంగుని అంబులపొద దర్పమును మథనపెడుతున్నాయని బ్రహ్మాండపురాణమునందు హయగ్రీవస్వామి చెప్పగా, కామదేవుని తూణీరమును తల్లి జంఘములు జయిస్తున్నాయని దుర్వాసముని ఆర్యాద్విశతియందు జంఘాజితకామజైత్రతూణీరామ్ అని వర్ణించారు.

లావణ్యకదలీతుల్యజంఘాయుగలమండితామ్ (వామకేశ్వరతంత్ర – 125)
అంబులు, తూణీరములు కాదు, అతిలావణ్యయైన తల్లిజంఘములు లేతఅరటిఊచలవలె ఉన్నాయని వామకేశ్వరతంత్రమునందు చెప్పబడినది.

శంకరభగవత్పాదులవారు అమ్మా! స్థాణ్వాశ్రమునందు తపస్సుజేయు రుద్రుని తపోభంగపరచి సృష్టోన్ముఖుని గావించుటకు వెళ్ళునప్పుడు మన్మథుడు తనవద్దనున్న ఐదుబాణములకన్న మిన్నయైన, ద్విగుణీకృతమైన బాణములతో వెళ్ళుటకుదలచి, నీజంఘములను తూణీరములుగను, పాదములవేళ్ళను బాణములుగను, నీకుమొక్కుచున్నప్పడు, పాదములవద్దవంగిన దేవతలమకుటములచే సానపెట్టబడినట్లున్న నీకాలిగోళ్ళను ములుకులుగను జేసుకొనెను అని 83వశ్లోకము పరాజేతుం రుద్రమ్ ద్విగుణశరగర్భౌ గిరిసుతే యందు వర్ణించారు.

కామదేవునికి పలనామములుండగా, స్మర యను నామము మాత్రము సహస్రనామస్తోత్రమునందు (వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా, ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా) రెండునామములందు మాత్రమే వాడినారు వాగ్దేవతలు. మనస్సుతో చేయునది స్మరణ. అట్లు స్మరించబడిన విషయములు (కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ) ఇంద్రియములద్వారా క్రియారూపమును పొందుతాయి. మనస్సు, ఇంద్రియములను ఉత్తేజపరచు హృదయ స్థానములను వర్ణించు ఈ రెండునామములందు స్మర వాడబడినది.

వాగ్దేవతలు కామదేవుని స్మరయని జెప్పిన మొదటినామము భ్రూమధ్యమును సూచించు వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా.
కామస్తదగ్రే  సమవర్తతాధి మనసో రేతః ప్రథమమ్ యదాసీత్|
(ఋగ్వేదము 10.129.04)
సృష్టికిముందు, ప్రప్రథమముగా మనస్సు నుంచి పుట్టినది కామము. అందువలన, ఈ నామమునందలి స్మర పరమశివుని సూచిస్తుంది.

ఇక రెండవనామము, రెండవహృదయమని (peripheral heart/secondary heart) చెప్పబడు కాలిపిక్కలను/జంఘములను సూచించు ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా. హృదయమునుండి ధమనులద్వారా శరీరమంతా ప్రవహించు రక్తమును, సిరలద్వారా మరల హృదయమునకు ప్రవహించునట్లు చేయుటకు కాలిపిక్కలు ముఖ్యపాత్ర వహించుటచే వీటికి రెండవహృదయమని పేరు.
కేతుమాలేపి భగవాన్ కామదేవరూపేణ లక్ష్మ్యాః…(5.18.15)
శ్రీమద్భాగవతమునందు స్మరుని విష్ణుసూచితముగ చెప్పబడినది.

శరీరమంతా వ్యాపించి (వ్యాప్నోతీతి విష్ణుః) ఇంద్రియములను ఉత్తేజితపరచి క్రియోన్ముఖముజేయు హృదయసంబంధిత విష్ణుశక్తి ఇచ్చట ప్రచోదితమైయుంటుంది. వరుణతేజస్సుతో ఏర్పడిన జంఘములను సూచించు ఈ నామమునందలి స్మర విష్ణువును సూచిస్తుంది.

శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః| (భగవద్గీత -18.15)
ఏష హి ద్రష్టా స్ప్రష్టా శ్రోతా ఘ్రాతా రసయితా మన్తా బోద్ధా కర్తా విజ్ఞానాత్మా పురుషః
(ప్రశ్నోపనిషత్తు 4.9)
విజ్ఞానఘనమైన ఆత్మపురుషుడు పంచజ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల సహాయముతో త్రివిధములైన (కాయిక, వాచిక, మానసిక) క్రియలను చేయుచున్నాడు.

సంపూర్ణ మనోఇంద్రియనిగ్రహములను సాధించుటకు అనుగ్రహించవలసినదిగా తల్లియొక్క జంఘములను ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః

Friday 24 August 2018

mANikyamakuTAkAra-jAnudvaya-virAjitA మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

సుకుమారే సుఖాకారే సునేత్రే సూక్ష్మమధ్యమే|
సుప్రసన్నా భవ శివే సుమృడీకా సరస్వతీ|| 
(త్రిపురసుందరీవేదపాదస్తవము-75)
మాణిక్య-మకుటాకార-జానుద్వయ-విరాజితా
మాణిక్య-మకుటాకారమాణిక్యములుపొదిగిన మకుటాకారము గలిగిన
జాను-ద్వయమోకాళ్ళ జంట
విరాజితావెలుగుచున్న తల్లి
మాణిక్యములుపొదిగిన మకుటాకారము గలిగిన మోకాళ్ళ జంటతో వెలుగుచున్న తల్లికి నమస్కారము.
మకుటమ్ టోపికా నామకమ్ (కల్యాణశ్రీకలా). మకుటము అంటే టోపీవంటి ఆకారముగలది. మకుటము సాధారణముగా తలకి ధరించునది కదా!! మరి మోకాళ్ళకు మకుటముఅని చెప్పుటయందలి ఆంతర్యము??

తల్లి శరీరము మంత్రమయమని చెప్పుకున్నాముకదా!! పంచదశీమంత్రమునందలి మూడుకూటములు వ్యక్తీకృతమగు అవయములు, వాగ్భవకూటము ముఖము, కామరాజకూటము మధ్యభాగము మరియు శక్తికూటము కటికి అధోభాగము. సహస్రనామములందు రూపవర్ణనలో వాగ్భవకూటమునందు ఒక నామము, మధ్యకూటమునందు ఒక నామము మరియు శక్తికూటమునందు మూడు నామములందు మాత్రమే ద్వయ వాడినారు వాగ్దేవతలు. ద్వయయనునది శివశక్తుల సమైక్యతకు సంకేతము.

వాగ్భవకూటసంబంధిత వాక్కు, నోటిద్వారా వ్యక్తమౌతుంది. దంతములను వర్ణించు శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా యను నామమునందలి ద్వయ, వాగర్ధములకు సూచితముగనున్నది. వాగర్ధములేకదా జగన్మాతాపితరులైన పార్వతీపరమేశ్వరులు!!. 

కామరాజకూట సంబంధిత నామములందు, నాభ్యాలవాలరోమాళీలతాఫలకుచద్వయీ నందు ద్వయ చెప్పబడినది. ఈ నామము తల్లియొక్క కుచద్వయములైన సూర్యచంద్రులను సూచించునది. సంకల్పవికల్పములద్వారా జరుపు విషయ వ్యవహారములకు సంకేతము, కామరాజకుటము. సమస్త విషయ వ్యాపారములకు బుద్ధి, మనస్సు ఆధారమగుటచే, ఈ కూటమునకు బుద్ధి, మనస్సు ముఖ్యమైనవి. కుచద్యయమందలి సూర్యుడు బుద్ధికి/జ్ఞానమునకు, చంద్రుడు మనస్సునకు సంకేతము. సూర్యచంద్రులు శివశక్తులకు సంకేతములు. ఇచ్చట వాడిన ద్వయయను పదము బుద్ధి, మనసు రూపములందలి అమ్మ-అయ్యలను సూచిస్తుంది.

ఊరువులనుండి (తొడలనుండి) పాదములవరకుగల భాగము, శక్తికూటము వ్యక్తీకరింపబడునది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తియని శక్తి మూడువిధములని చెప్పుకున్నాము. తొడలనుండి పాదములవరకుగల నామములలో కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా (ఇచ్ఛాశక్తి), మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా (జ్ఞానశక్తి), పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా (క్రియాశక్తి), మూడు నామములందు ద్వయ వాడినారు వాగ్దేవతలు.
ఇచ్ఛాశక్తి:
కామేశుడుయనినంతనే ఇచ్ఛ/కోరికకు సూచితము. అందువలననే శక్తికూటమునందలి ఇచ్ఛాశక్తి సూచిత  ఈ నామమునందు కామేశశబ్దమును వాడినారు వాగ్దేవతలు. ఇచ్ఛాశక్తి  సంబంధిత శివశక్తులజంటకు (వాణీహిరణ్యగర్భులు) సూచితముగ ద్వయ వాడబడినది.
జ్ఞానశక్తి:
మకుటముయనిన శిరస్సునందు ధరించబడునది. శిరస్సు, జ్ఞానము/బుద్ధికి స్థానము. అందువలన ఈ నామమునందలి ద్వయ, జ్ఞానశక్తి జంటకు (లక్ష్మీనారాయణులు) సూచితము. మానవ శరీరములందు, (Brain) మెదడుకి, (Knee) మోకాటికి సంబంధమున్నదని ఆధునిక వైద్యరంగములో పరిశోధనలుజేసి ఇప్పుడిప్పుడు తీర్మానింపబడిన విషయము. కానీ మన ఋషులు దీనిని ఎప్పుడో దర్శించి ధృవపరిచారు.

ఇప్పుడు తల్లి కవచ స్తోత్రములందు మోకాళ్ళను రక్షించు అమ్మనామములను గమనించి చూడండి.

క్రియాశక్తి:
క్రియాశక్తిసూచిత నామము పదద్వయ... దీనియందలి వివరము, ఆ నామము వచ్చినప్పుడు చూద్దాము.

ఊరువులనుండి పాదములవరకుగల నామములందలి మంత్రరహస్యములు ఉపాసకులకు విదితము.

మరి తల్లిమోకాళ్ళను శంకరభగవత్పాదులు ఎలా దర్శించారో తెలుసుకొనడానికి సౌన్దర్యలహరిని ఆశ్రయిద్దాము.

కరీంద్రాణామ్ శుండాన్ కనక కదలీకాండ పటలీ యను 82వశ్లోకమునందు ఓ!! గిరిరాజపుత్రీ!!నీ పతికి పంచ-అంగ నమస్కారము జేయుటకు మరల మరల వంగినప్పుడు భూమి మీద ఆనించుటచే నీ మోకాటిచిప్పలు కఠినములైనాయని అతిలావణ్యవతియైన తల్లియొక్క మోకాటిచిప్పలు గట్టిగాఉండుటయందలి కారణమును ఈ శ్లోకమునందు వివరించారు

తల్లియొక్క మాణిక్యమకుటములవంటి జానువులు నాకు జ్ఞానమును ప్రసాదించవలెనని ప్రార్ధిస్థూ

శ్రీమాత్రేనమః