Wednesday 22 August 2018

ratnakinkiNikA-ramya-raSanA-dAma-bhUShitA రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణా మధ్యే పరిణత శరచ్చంద్ర వదనా|
ధనుర్బాణాన్ పాశమ్ సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తామ్ నః పురమథితురాహోపురుషికా|| 
(సౌన్దర్య లహరి-7)
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా
కించిత్క్వణతి కింకిణీకొంచముగా శబ్దముచేయునవి (చిన్న గంటలు) కింకిణి
రత్నకింకిణి- రత్నఖచిత చిరుమువ్వలు
రమ్య-రమ్యమైన
రశన-త్రాడు
దామ- కట్టబడి
భూషిత - అలంకరించబడినది
రత్నఖచితచిరుమువ్వలతో కూడిన రమ్యమైన కటిసూత్రము/వడ్డాణముతో అలంకరించబడిన తల్లికి నమస్కారము.
ప్రతిక్షణమ్ సా కృతరోమవిక్రియామ్
వ్రతాయ మౌఞ్జీం త్రిగుణామ్ బభారయామ్|
అకారి తత్పూర్వ నిబద్ధయా తయా
సరాగ మస్యా రశనాగుణాస్పదమ్|| 
(పఞ్చమ సర్గము 10శ్లో)
పార్వతీదేవి శివుని భర్తగా పొందుటకు కోసము తపస్సు చేయడానికి నారచీర కట్టుకొని సన్నద్ధురాలైనది. అపుడు,  తపశ్చరణకోసము కట్టిన ముప్పేటల ముంజత్రాడు నడుమునకు గుచ్చుకొని మొలచుట్టు ఎర్రగ కందెనట. అది చూచుటకు పద్మరాగాదిమణి మేఖలవలెనొప్పినదియని మహాకవికాళిదాసు కుమారసంభవమునందు వర్ణించారు.

తల్లియొక్క కటిసూత్రము గాయత్రీమంత్ర సూచితము (కళ్యాణశ్రీకలా). ఈ నామమునందలి రత్నము మంత్రసూచితము, కింకిణి ధ్వనులు మంత్రశబ్దసూచితముగ గ్రహించవలెను.

మానవజాతికి విధించిన ధర్మసూత్రములను బట్టి చూడగా, సమ్వర్త ధర్మసూత్రములందు పురుషులకు కటిసూత్రము తప్పనిసరిగయుండవలెనని చెప్పినారు. సన్యాసులకు కటిసూత్రము ఉండరాదు. ఉపనయన సమయమునందు వటువునకు, వివాహసమయమున వధువునకు కటిసూత్రబంధన చేయుట మీకందరికీ తెలిసినదే

న హ్యస్మిన్ యుజ్యతే కర్మ కించిద్ ఆ మౌఞ్జీబంధనాత్ 
 (మనుస్మృతి – 2.171)
మౌఞ్జీమేఖల లేకుండా, ఎటువంటి పవిత్రకర్మనూ చేయరాదు. కటిసూత్రమ్ వినా శ్రౌతమ్ స్మార్తమ్ కర్మా కరోతి యః సర్వమ్ నిష్ఫలమ్ దేవ, పితృకార్యములు కటిసూత్రరహితముగ జేసిన, సకలము నిష్ఫలము.

మౌఞ్జీ మేఖలా త్రివృత్-బ్రాహ్మణస్య శక్తివిషయే దక్షిణావృత్తానామ్
(ఉజ్జ్వల - ఆపస్తంబ ధర్మసూత్ర వ్యాఖ్యానము–1ప్ర- 1-2-33శ్లో)
త్రివృత్ త్రిగుణా మౌంజీబంధనమునందలి మూడుచుట్లు, మూడుగుణములకు సంకేతము.

కర్మాచరణకు కటిసూత్రము అతి ముఖ్యమైనది. ఆబ్రహ్మస్థంభ శిల్పకల్పనజేయుతల్లి, కటిసూత్రము/మేఖల ధరించుటయందలి అంతర్యమిదియే.

మరియొక ముఖ్యమైన విశేషము. తల్లి సహస్రనామములలో కంఠమును,  హృదయమును మరియు కటిసీమను వర్ణించునాములందు మాత్రమే రత్నయను పదము వాడినారు వాగ్దేవతలు. ఈ మూడునూ వైఖరి (కంఠము), మధ్యమ (హృదయము) మరియు పశ్యంతి, పరావాక్స్థానములు (కటిసీమ). త్యాగరాజస్వామివారు కూడా ఈమూడుస్థానములనే చెప్పుచూ నాభీహృత్కంఠములందు శోభిల్లు సప్తస్వరసుందరుల భజించవే మనసా అని పాడినారు.

చత్వారి వాక్ పరిమితా పదాని తాని విదుర్ బ్రాహ్మణా యే మనీషినః
గుహా త్రీని నిహితా నేన్గయన్తి తురీయమ్ వాచో మనుష్యా వదంతి|| 
( ఋగ్వేద సంహిత1.164.45)
వాక్కు నాలుగు విధములు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వీనియందు మొదటి మూడు పరా, పశ్యంతి, మధ్యమ గుహ్యములు, మానవుల శబ్ద వ్యక్తీకరణ తురీయమైన వైఖరియనబడును.

పరావాక్ మూలచక్రస్థా పశ్యంతీ నాభిసంస్థితా|
హృదయస్థా మధ్యమా జ్ఞేయ వైఖరీ కంఠదేశా|| 
(పరమలఘుమంజూష)
మూలాధారము పరావాక్స్థానము. నాభి పశ్యంతికి స్థానము. మధ్యమవాక్కునకు హృదయము మరియు వైఖరికి కంఠము స్థానములుగ చెప్పబడినవి.

తతర్ధేందుస్తతో  బిందుస్తస్మాదాసీత్ పరాతతః|
పశ్యంతీ మధ్యమా వాచి వైఖరీ శబ్దజన్మభూః|
ఇచ్ఛాజ్ఞానక్రియాత్మాసౌ తేజోరూపా గుణాత్మికా|
 (శారదా తిలక తంత్రము)
పరావాక్కు పరాశక్తి, పశ్యంతి ఇచ్ఛాశక్తి, మధ్యమ జ్ఞానశక్తి, వైఖరి క్రియాశక్తి. ఇవి వరుసగా పరా, బుద్ధి, మనస్సు మరియు భౌతికచైతన్యములకు సంకేతములు.

జగత్కమలాకారమ్ నాభిస్థానమ్ భువః పరమ్| 
(కామాక్షీ విలాసము 13.73)  
భూమండలమునకు కాంచీపురము నాభిస్థానముగ చెప్పబడుచున్నది. ఇచ్చటితల్లి కామాక్షీదేవి ధరించిన మోగుచున్నవడ్డాణమును వర్ణిస్తూ ఆదిశంకరులు క్వణత్కాంచీదామా శ్లోకమునందు, పాశాంకుశములు, చెఱకువిల్లు, పువ్వులబాణములతో, మ్రోగుచున్నమువ్వలతో కూడిన వడ్డాణమునుధరించి, కరికలభకుంభములవంటి స్తనములతో, క్షీణించిన మధ్యభాగముతో, శరత్చంద్రునివలె వికసించిన వదనముతో, త్రిపురాసురుని మధించిన పరమశివుని పురుషాహంకరమైన తల్లి మాకుదర్శనమిచ్చుగాక యని ప్రార్ధించారు.

ప్రాపంచిక వైఖరీవాక్ప్రవాహములో మునిగితేలుతున్న నన్ను, తల్లియొక్క కాంచీకింకిణులధ్వనులు తరింపజేయవలెనని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment