Sunday 12 August 2018

aruNAruNakausumbhavastrabhAsvatkaTItaTI అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
హృత్పుండరీక మధ్యస్థామ్ ప్రాతఃసూర్యసమప్రభామ్
పాశాఙ్కుశధరామ్ సౌమ్యామ్ వరదాభయహస్తకామ్
త్రినేత్రామ్ రక్తవసనామ్ భక్తకామధుగామ్ భజే|| (దేవీఅథర్వశీర్షమ్-21)

అరుణారుణ-కౌసుంభ-వస్త్ర-భాస్వత్-కటీతటీ
కౌసుంభ-వస్త్రము -  కుంకుమపూవురంగు వస్త్రము
భాస్వత్భాసిస్తున్న
కటి-తటి కటి సీమ
సూర్యునికాంతివంటి కుంకుమపూవురంగు వస్త్రముతో భాసిల్లుతున్న కటిసీమను గలిగిన తల్లికి నమస్కారము.

తల్లి సర్వము అరుణమే. ఎర్రనివస్త్రమును ధరించి అనగా ఎర్రని చీరను కట్టుకున్నట్లు వశిన్యాదివాగ్దేవతలు తల్లిని వర్ణించారు ఈ నామమునందు. అది ఎటువంటి వస్త్రమంటే

ఆరక్తచ్చవినాఽతిమార్దవయుజా నిశ్వాసహార్యేణ సత్-
కౌశేయేన విచిత్రరత్నఖచితైః-ముక్తాఫలైః-ఉజ్జ్వలైః
కూజత్కాఞ్చన కింకిణీభిః అభితః సంనద్ధకాంచీగుణై
రాదీప్తమ్ సునితమ్బబిమ్బమరుణమ్ తే పూజయామ్యంబికే||
(త్రిపురామహిమ్నస్తవము – 32)
(నిశ్వాసహార్యేణ) నిశ్వాసవాయువుచే కంపింపదగనగు, (అతిమార్దవయుజ) తేలికైన, మిక్కిలి మృదువైన (సత్కౌశేయమ్), ఉత్తమమైన (ఆరక్తచ్చవినా) ఎర్రని పట్టువస్త్రముతోనూ, విచిత్రరత్నములతోనూ, ముత్యములతోనూ ప్రకాశించు బంగారుచిరుమువ్వల మొలనూలు (వడ్డాణము) గల తల్లిని హృదయమునందు పూజిస్తున్నానుదుర్వాసమహాముని

క్షీరోదశ్చామలమ్ హారమజరే చ తథాంబరే
చూడామణిం తథా దివ్యమ్ కుండలే కటకాని చ||
 (మార్కండేయపురాణము-82-24శ్లో)
అటువంటి మృదువైన వస్త్రమును క్షీరసముద్రుడు అమ్మకు సమర్పించినట్లుగా దేవీమహాత్మ్యమునందు చెప్పబడినది. అయితే అది క్షీరోదశ్చాంబరే దివ్యే రక్తే సూక్ష్మే తథా అజరే (స్క5-9-శ్లో2) మృదువైన, నిత్యనూతనమైన(అజరమైన), దివ్యమైన, ఎర్రనివస్త్రమని దేవభాగవతమునందు చెప్పబడినది.

ఇక బ్రహ్మాండపురాణమునందు దేవతలు, చిదగ్నికుండ సంభూతయైన తల్లి విరాట్రూపమును వర్ణించుచూ, ప్రభాతమ్ వసనమ్ తవ అమ్మా!! ప్రభాతమే నీ వస్రము!! అని స్తుతించారు. ప్రభాతముయొక్క వర్ణము అరుణమే కదా!! సకలజగత్తునూ నింపి, చీకటిని పారద్రోలు నిత్యనూతన ఉషోదయ ప్రభాతకాంతులు తల్లి వస్త్రము!!

రాగరంజిత రక్తవస్త్రధారిణియైన తల్లి నాలోని రాగాది శత్రువులను సమూలముగా నాశనముజేసి, విరాగిగా చేయవలెనని ప్రార్థిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment