Sunday 12 August 2018

lakshya-rOmalatAdhAratA-samunnEya-madhyamA లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
క్వణత్కాంచీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా|
ధనుర్బాణాన్ పాశమ్ సృణిమపి దధానా కరతలైః
పురస్తాదాస్తామ్ నః పురమధితురాహోపురుషికా!!

లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా
లక్ష్య తెలియబడుచున్న
రోమలతరోమరాజి
ఆధారతాఆధారముచేసుకొని
సమున్నేయఊహించబడిన
మధ్యమమధ్యభాగము/నడుము భాగము

మన దృష్టికి ఒక తీగ కనపడుతున్నది అంటే కింద పాదు ఉన్నదనేగా అర్ధము. రోమరాజియను తీగవలన తెలియబడుతున్న నడుము గలిగిన తల్లికి నమస్కారము. తల్లియొక్క నడుము అతిసన్నటిదైయుండుటచే అందలి నాభితెలియజాలకున్నది. కానీ నడుము పైభాగమునకు తీగవలేసాగు నూగారువలన తల్లి మధ్యభాగము తెలియబడుచున్నది.

తెలియబడుచున్న నూగారువలన మాత్రమే ఊహింపబడుచున్ననడుముగల తల్లికి నమస్కారము.

కుక్షికి పైభాగమునందు ఊర్ధ్వలోకములు, క్రిందిభాగమునందు అధోలోకములుగల చిదగ్నికుండ సంభుతయైన తల్లియొక్క విరాట్-రూపమును బ్రహ్మాండపురాణమునందు ఈ క్రిందివిధముగా వర్ణింపబడినది

అతలమ్ తు భవేత్పాదౌ వితలమ్ జానునీ తవ|
రసాతలమ్ కటిదేశః కుక్షిస్తే ధరణీ భవేత్|
హృదయమ్ తు భువర్లోకః స్వస్తే ముఖముదాహృతమ్| (3.37.8,9)
అతల, వితల మొదలగు బిలస్వర్గములనబడు ఏడులోకములు కుక్షిస్థానమునకు క్రిందగల లోకములుగా చెప్పబడుచున్నవి. సూర్యకాంతి జేరజాలకపోవుటచే ఈలోకములు తెలియబడజాలవు (శ్రీమద్భాగవతము 5.24). ఇదియే తల్లియొక్క నడుము/మధ్య/కటి స్థానము (రసాతలము) తెలియబడుటలేదుయని చెప్పుటయందలి రహస్యము.

రసాతలము దైత్యులకు, నాగజాతివారికి నివాసస్థానము (వాల్మీకిరామాయణము ఉత్తరకాండము 23.4). యత్ర హి మహా-అహి-ప్రవర-శిరో-మణయః సర్వతమః ప్రభాధన్తే అట్టి రసాతలమునందలి వివిధ విశేషజాతుల సర్పముల పడగలయందలి మణులకాంతులతో ఈ ప్రదేశము దేదీప్యమానముగా ఉంటుంది (శ్రీమద్భాగవతము 5.24.12). ఈ కాంతులే రోమరాజములు. చీకటివలన తెలియబడని రసాతలము, అచ్చటినుండి వెలువడు మణులకాంతులవలన తెలియబడుటచే, రోమరాజములవలన తెలియబడుచున్న రసాతలమనబడు మధ్యస్థానమను సంకేతార్ధము ఈ నామమునందు గలదు.

వామకేశ్వరతంత్రమునందు, లలితోపాఖ్యానమునందలి గృహరాజాంతరకథనమ్ యను అ33-79వశ్లోకమునందు చక్రరాజగృహమందలి లలితాదేవి వర్ణనయందు తల్లియొక్కనాభిని ఈ క్రిందివిధముగా వర్ణింబపబడినది. నతనాభిమహావర్తత్రివల్యూర్మిప్రభాఝరీ మూడు ముడతలుగలిగిన కాంతుల ప్రవాహము(river) నందు సుడి(whirlpool) వంటి నాభిని గలిగిన తల్లి. మనము పైన చెప్పుకున్న అసంఖ్యాక మణులకాంతులే ఇచ్చట కాంతులప్రవాహముగా సూచింపబడినది.

మధ్యభాగము రసాతలము, హృదయభాగము భువర్లోకము. హృదయభాగమునందలి స్తనద్వయము భువర్లోకపు సూర్యచంద్రులు. నాభినుండి వెలువడు రోమరాజియను తీగకు కాచిన ఫలములవంటి స్తనద్వయము గలిగిన తల్లియని క్రిందినామమునందు చెప్పుకున్నాము కదా. విరాట్రూప వర్ణనయందు, రసాతలమునుండి వెలువడు రశ్ములనబడు తీగకు కాచిన సూర్యచంద్రులనబడు ఫలములద్వారా విశ్వమును పోషించుచున్న తల్లియని నాభ్యాలవాలరోమాళీలతాఫలకుచద్వయీ నామమునకు సంకేతార్ధము.

స్త్రీలకు సన్నని నడుము ఉత్తమ సాముద్రికా లక్షణము. గణపతిముని తల్లి మధ్యభాగమును సింహమధ్యముతోపోల్చి, మృగాధిరాజమధ్యమా అని వర్ణించారు (36.16).

తల్లి నడుము అతిసూక్ష్మమైనదిగానూ (పరిక్షీణామధ్యే), వదనము పరిపూర్ణముగా వికసించిన శరత్కాలపు చంద్రునితోనూ పోల్చుచూ (పరిణత శరచ్చంద్రవదనా) రెండువిలోమ శబ్దములతో ఆదిశంకరులు చేసిన అత్యద్భుతమైన రచన సౌన్దర్యలహరియందలి 7వశ్లోకము క్వణత్కాంచీదామా. ఈ రెండింటిని విరాట్రూప వివరణలో చూచిన, అగోచరమైన రసాతలము మధ్యభాగము, వికసిత స్వర్లోకము ముఖము

ఈ భవసాగరసుడులనుండి కాపాడమని త్రివలీయుతమైన కటికాంతులసుడి గలిగిన తల్లిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment