Friday 10 August 2018

కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ Kameswara-Prema ratna mani- prati pana - stani

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

ద్విరదవదనేన పీతమ్ షడ్వదనేనాథ సకలభువనేన

అక్షయ్యక్షీరామృతమంబాయాః కుచయుగమ్ జయతి||

(ఉమా సహస్రము 11.8)


కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ

కామేశ్వరుని ప్రేమరత్నమను మణిని పొంది, దానిని రెండింతలుగా జేసి రెండు స్తనరత్నములనిచ్చిన తల్లికి నమస్కారము. స్తనములు పోషకస్థానములు. విరాట్రూపియైన తల్లికి సూర్యచంద్రులు వక్షములుగానున్నయని మనము ఇదివరకే చెప్పుకున్నాము.

బ్రహ్మాండపురాణమునందు (3.13.14) సృష్టిని పోషించు వేదోక్తములైన స్వాహాస్వధాకారములు తల్లియొక్క స్తనములుగా చెప్పబడినవి. స్వాహ, స్వధలు అగ్నియొక్క శక్తులుగా గుర్తించవలసినది.

తల్లి పుత్రులైన గణపతి, షణ్ముఖులకే కాకుండ సకల సృష్టికి మాతృమూర్తి. అక్షయ్యమగు పోషకశక్తితో సూర్యచంద్రులను స్తనముల ద్వారా జగత్తులను పోషిస్తున్నది అమ్మ.

తిరుజ్ఞానసంబంధుల వారికి నేరుగ స్తన్యపానముజేయించి అతి చిన్నవయసులోనే బృహత్-జ్ఞానమును ప్రసాదించిన తల్లి బృహత్-నాయకి. (వీరినే ద్రవిడశిశువని ఆదిశంకరులు సౌన్దర్యలహరిలో చెప్పియున్నారు).

తల్లియొక్క స్తన్యపానముజేసిన వారికి మర్త్యలోకమందు మరుజన్మ గలదె??

శ్రీమాత్రే నమః

*****

కామేశ్వరుని ప్రేమ/కామము యనునది సృష్టిచేయవలెనని సంకల్పించుట. కామేశ్వరీకామేశ్వరులను సకలచరాచర సృష్టికి కార్యకారణమైన పరాబిందువుగా చెప్పుకున్నాము. శక్తియొక్క స్ఫురణయే సృష్టి. సృష్టి సంకల్పమాత్రముచే పరాబిందువుయందలి ప్రకాశాంశతో (శుక్ల) ప్రకాశ బిందువు, విమర్శాంశతో (రక్త) విమర్శ బిందువు, వీని రెండింటియొక్క సంయోగముచే భావిసృష్టి బీజాంకుర మిశ్రబిందువులు ఏర్పడినవి. ఈ మూడుబిందువులు శివ, శక్తి, శివశక్తి ; శుక్ల, రక్త, మిశ్ర; తామసిక, సాత్విక, రాజసిక గుణములు; ఈ మూడు బిందువుల కలయికచే ఏర్పడినది యోనిచక్రమనబడు త్రికోణము. ప్రతీబిందువునందు ప్రకాశ విమర్శశక్తులుండుటచే ఈ బిందువులు వాణీహిరణ్యగర్భ, లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వర ద్వంద్వములైఉన్నవి.  ఈ త్రికోణమునకు మూలత్రికోణమని పేరు.

త్రికోణరూపిణీ శక్తిః బిందురూపః పరశ్శివః

శివశక్తులు సమవాయ-సంబంధముగల వారగుటచే పరాబిందువు, త్రికోణము అవిభాజ్యములు. ఈ బిందుసహిత త్రికోణమునకే బైందవచక్రమని పేరు.

*ఖం బ్రహ్మేతి వ్యజనాత్* యను శృతివాక్యముననుసరించి, ఆకాశము బ్రహ్మస్వరూపము. అందుచే ప్రకాశబిందువు  సర్వకలాపూర్ణమైన చంద్రమండలాకార బ్రహ్మవస్తువు. ఇది మాతృకావర్ణములందలి అకారమునకు సంకేతము. బ్రహ్మాత్మికశక్తియైన విమర్శబిందువు అగ్నికలాత్మకము. ఇది హకారమునకు సంకేతము. ఈ రెండింటి కలయికచే ఏర్పడిన నాల్గవ బిందువు, మిశ్రబిందువు *అహమాత్మికమై* అగ్నిషోమాత్మక సూర్యమండలమును సూచిస్తుంది. తురీయమ్ షోడశీకల యనబడుటచే, మిశ్రబిందువు నాశరహితమై నిత్యమైయుంటుంది. ఇదియే చిత్కల.

 

ఈ బిందుచతుష్టయము కామకలాంగన, పరాశక్తియొక్క అవయములుగా ఏర్పడినది.

బిందుమ్ సంకల్పమ్ వక్త్రమ్ తు తదధస్తాత్కుచద్వయమ్|

తదధః సపరార్ధమ్ చ చిన్తయేత్తదధోముఖమ్|| (వామకేశ్వర తంత్రము 165)

మిహిరబిందు ముఖీమ్  తదధోలసచ్ఛశిహుతాశన బిందుయుగస్తనీమ్

సహపరార్ధకలారశనాస్పదామ్ భజత సత్యమిమామ్ పరదేవతామ్|| (మాతృకావివేకము)

అగ్రబిందుపరిల్పితాననా మన్యబిందురచిత స్తనద్వయీమ్|

నాదబిందురశనాగుణస్పదామ్ నౌమి తే పరశివామ్ పరామ్ కలామ్||

రవిబిందువు ముఖముగాను, చంద్రాగ్నులనే రక్తశుక్లబిందువులు స్తనయుగముగానూ, నాదబిందువు కటి ప్రదేశముగానూ ఉన్నసత్యస్వరూపమైన కామకలయనే పరదేవతను పుణ్యపురుషులు భజింతురుగాక.

కామేశ్వరుని సృష్టిచేయవలెనను సంకల్పముచే ఏర్పడిన ప్రకాశ, విమర్శ బిందువులనే స్తనములుగా గలిగిన కామకలాసుందరి, త్రిపురసుందరికి నమస్కారము.

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment