Wednesday 8 August 2018

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా Kanakangada keyura kamaniya bhujanvita

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

సహస్రం భానూనాం భవతి దివసానామధిపతేః

సహస్రం శీర్షాణాం భవతి భుజగానమధిపతేః

సహస్రం నేత్రాణాం భవతి విభుధానమధిపతేః

సహస్రం బాహూనాం భవతి సమమే హైమవతి!! తే!!

  (ఉమాసహస్రము 27.5)

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా

కనక - బంగారపు

అంగద - భుజ-కంకణములు

కేయుర - వంకీలు

కమనీయకమనీయమైన

భుజాన్వితాభుజములు గలిగిన తల్లి

 

కనకాంగదకేయూరకమనీయభుజాన్వితాయై నమః

బంగారు భుజ-కంకణములు, వంకీలు ధరించిన కమనీయమైన భుజములుగలిగిన తల్లికి నమస్కారము.

 

తల్లియొక్క బాహువులు విష్ణుతేజస్సుతో ఏర్పడినట్లుగా మార్కండేయపురాణమునందు చెప్పబడినది (82-శ్లో13). లలితోపాఖ్యానమునందలి (8-శ్లో10) విరాట్ రూపవర్ణనయందు, దిక్కులను తల్లి భుజములుగా చెప్పబడినవి

 

గజముత్యములు, వజ్రములు మొదలగు రత్నములచే పొదగబడి, చిత్రవిచిత్ర కాంతులతోనొప్పుచున్న లలిత మనోహరమైన కేయురాంగదములు తల్లి చతుర్బాహువులందు అలంకరింపబడినట్లు దుర్వాసముని త్రిపురా మహిమ్న స్తోత్రమునందు (34శ్లో) వర్ణించారు.

 

ఈ నామమునందు బాహువుల అలంకారములు మాత్రమే వర్ణింపబడినవి. తల్లికి నాలుగుభుజములన్న వివరము ముందు నామములందు చెప్పబడినది. చతుర్బాహువులతో వర్ణింపబడిననూ, దుష్టశిక్షణ, శిష్టరక్షణ సమయములో కరుణాతరంగితాక్షియైన తల్లి సహస్రబాహువులతో ఆర్తులను రక్షిస్తుందియని ఉమాసహస్రమునందు గణపతిముని, ఆర్తత్రాణపరాయణ తల్లిని అనంతభుజిగా జెప్పినారు. అట్టి అనంతభుజిని గాక అన్యదైవమును వందింపదె?

***

రేఖాగణితమునందు భుజముయనగా side. చతురస్రము ఒక చతుర్భుజి (square has four sides). (చతుర్భుజి) చతురస్రము వ్యాపక లక్షణముగల ఆకాశమునకు రేఖా(యంత్ర) సంకేతము. అందుచే అన్ని యంత్రములందలి చతురస్ర భూపురము ఆకాశ సూచకము. నాలుగుభుజములు నాలుగుదిక్కులకు సంకేతము. విశ్వమ్ వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణుః యనబడుటచే చతురస్రము వ్యాపకలక్షితుడైన విష్ణువునకు దేవతాసంకేతము. ఇదియే భుజములు విష్ణు తేజస్సుతో ఏర్పడినవని చెప్పుటయందలి సంకేతార్ధము.

 

వృత్తము అనంతభుజి (infinite sided polygon). వృత్తము, చతురస్రము గుణసామ్యముగల రెండు వివిధరూపములు. వృత్తమీశ్వరః యను పూర్వమీమాంస సూత్రముచే, వృత్తము ఈశ్వర సంకేతము. అనంతభుజుడే ఈశ్వరుడు. ఈ విధముగా హరిహరులకభేదము తెలియుచున్నది. ఒక్కటైన ఈ ఇరువురే పురుష సూక్తమునందు చెప్పబడిన సహస్రశీర్షా పురుషః. రేఖాగణితమునందు శీర్షమనిన అగ్రబిందువు/కొన/శిఖరము (vertex).   త్రికోణమునకు మూడు కొనలు/శీర్షములు, చతుర్భుజమునకు నాలుగు శీర్షములు. అటువంటి అనంతబిందువుల సముదాయమే వృత్తము. వృత్తముమీది ప్రతి బిందువూ శీర్షమే.

 

ఇందులో ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు. సహస్రాక్షః సహస్రపాత్ అక్షమనిన సౌష్ఠవరేఖ (axis of symmetry). వృత్తమునకు వ్యాసము (diameter) అక్షము, మరియు వృత్తమునకు ఎన్ని అక్షములనిన, అనంతము/సహస్రము (infinitely many). సహస్రము అనంతవాచి. పాత్ అనగా పాదము లేదా భుజము (side). వృత్తము అనంతభుజి అని చెప్పుకున్నాము కదా. అందువలన సహస్రశీర్షా పురుషః| సహస్రాక్షః సహస్రపాత్| యనునది విరాట్-విశ్వరూప వృత్తరూప రేఖావివరణము (geometrical representation, యంత్రము).

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment