Sunday 20 January 2019

Siva-kAmESvaraAnkasthitA శివకామేశ్వరాంకస్థితా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
వామాంకస్థామీశతుర్దీప్యమానామ్
భూషాబృందైరిన్దురేఖావతంసామ్।
యస్త్వామ్ పశ్యన్ సతతమ్ నైవ తృప్తః
తస్మై చ దేవి వషడస్తు తుభ్యమ్॥ 
(త్రిపురసుందరీవేదపాదస్తవము-100)
తల్లీ!! సర్వాలంకారభూషితవై, నెలవంక తలలో తురుముకొని, శివునివామాంకస్థితయైన నిన్ను సదా సర్వదా ధ్యానించి తనివితీరనివారు, యాగాది క్రతువులందలి వషట్కారములను నీతోపాటు వారుకూడా పొందెదరుగాక.

శివకామేశ్వరాంకస్థితా
శివకామేశ్వరుని అంకముపై (తొడపై) కూర్చొని ఉన్న తల్లికి నమస్కారము.
సుమేరుపర్వత శిఖరముమీద విరాజితమైన కామేశ్వరీకామేశ్వరులను వర్ణించునామమిది. వాగ్దేవతలు కామేశ్వరుని అంకముమీద కూర్చున్న తల్లి అనకుండా శివకామేశ్వరుని అంకముమీద కూర్చున్న తల్లియని చెప్పుటయందలి రహస్యమును తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.
అంతరార్ధము

సర్వము బ్రహ్మము. ఆత్మ బ్రహ్మము. వైశ్వానర (జాగృదవస్థ/అకార), తేజస్సు (స్వప్నావస్థ/ఉకార), ప్రజ్ఞ (సుషుప్తి/మకార) మరియు తురీయముయని (నిశ్శబ్దము) ఆత్మకు(ॐ) నాలుగుపాదములు. (మాండూక్యోపనిషత్తు-2,3,4,5,6)

స ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణోగ్నిరుదయతే। తదేతదృచాభ్యుక్తమ్॥ 
(ప్రశ్నోపనిషత్తు 1.7)
ప్రాణాగ్నయ ఏవైతస్మిన్పురే జాగృతి। (ibid 4.3)
ప్రాణాగ్నిరూప వైశ్వానరుడు(శివ-శతపథబ్రాహ్మణమ్-X.6.1) జాగ్రదస్థయందు పురమునందు (స్థూలశరీరము) జాగురుకతోయుంటాడు. 

అత్రైష దేవః స్వప్నే మహిమానమనుభవతి (ప్రశ్నోపనిషత్తు 4.5)
మనస్సు(కామ) రూప తైజసుడు స్వప్నావస్థయందు (సూక్ష్మశరీరము) మహిమానుభవమును పొందును.

అత్రైష దేవః స్వప్నాన్న పశ్యత్యథైతదస్మిఞ్శరీరే ఏతత్సుఖమ్ భవతి। (ibid 4.6)
స్వప్నస్థితిని దాటి, సుషుప్తి స్థితినిపొందినప్పుడు, చైతన్యవ్యాప్తిత కారణశరీరము సుఖమునుపొందును. ఈ సుషుప్తి స్థితియందలి ప్రాజ్ఞుడు, సమస్త సృష్టియందలి ఈశ్వరచైతన్యము.

జాగరితిస్థానో వైశ్వానరోకారః ప్రథమా మాత్రా
స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రా
సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్త్రితీయా మాత్రా
మాత్రమనిన వర్ణోచ్ఛారణకాలము. అమాత్రమనిన శబ్దరహితము.
అమాత్రశ్చతుర్థోవ్యవహార్యః ప్రపఞ్చోపశమః
 (మాండూక్యోపనిషత్తు ఆగమప్రకరణము-9,10,11,12)
ప్రణవము/అక్షరబ్రహ్మనందలి పరమాత్మ సూచక తురీయము అమాత్రము/నిశ్శబ్దము.  ఈ తురీయమును పురాణ, ఉపనిషత్తు, తంత్ర గ్రంథములందు అర్ధమాత్రయని కూడా చెప్పబడుచున్నది.

ద్వేవావ ఏవ బ్రహ్మణి అభిధ్యేయే కే తే శబ్దశ్చైకమ్ బ్రహ్మ అశబ్దశ్చ ద్వితీయమ్।
 (మైత్ర్యుపనిషత్తు 6.22)
శివ-కామ-ఈశ్వర-అంకస్థితా:- జాగృత్స్వప్నసుషుప్తులందుండి, మార్పుచెందకుండగ నుండు అనిర్వచనీయమైన తురీయము, పరచైతన్యము.

మాండూక్యోపనిషత్తునందలి పైమంత్రములననుసరించి, ఈ నామమునందు అకార, ఉకార, మకార మరియు నిశ్శబ్దముతో కూడిన అక్షరబ్రహ్మము/ప్రణవమును నిగూఢముగనుంచినారు వాగ్దేవతలు.


చిదగ్నికుండమునుండి సర్వాలంకృతయై ఆవిర్భవించిన లలితామహాత్రిపురసుందరిని వివాహమాడుటకు సర్పాభరణములతో, కపాలమాలాలంకృతుడై, భస్మధారుడైన విరూపాక్షుడు ధరించిన కోటికందర్పలావణ్య దివ్యరూపము కామేశ్వరుడు (బ్రహ్మాండపురాణము ఉత్తరభాగము 14.10,11,12 & 15.12). వీరిరువురి అవినాభావత్వమును తెలియజేయునామమిది.


జన్మజలధిలో మునిగితేలుతున్న నాకు, శివవామాంకస్థిత తల్లి దర్శనభాగ్యము అతిశీఘ్రముగ కలగాలని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

Thursday 10 January 2019

anavadyAngi, sarvAbharaNa-bhUShitA అనవద్యాంగీ, సర్వాభరణభూషితా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
 శ్రీగురుభ్యోనమః
దివ్యమ్ తవ కాయమ్ దివ్యమ్ తవ వస్త్రే।
దివ్యాని తవామ్బ స్వర్ణాభరణాని॥ (ఉమా సహస్రము-3.23)

అనవద్యాంగీ, సర్వాభరణభూషితా

సౌన్దర్యలహరి 34వశ్లోకము శరీరమ్ త్వమ్ శంభోః నందు శంకరభగవత్పాదులు అమ్మను శంభుని శరీరముగ వర్ణించి, వీరిరువురు అతిసాధారణముగా వారి శేషశేషీత్యయమును మార్చుకుంటూ ఉంటారని చెప్పుటచే సందర్భానుసారముగా తల్లి శరీరము శంభునిగగూడా తెలియబడునని అర్ధము. వాగ్దేవతలు అనవద్యాంగీయను నామమునందు దోషరహిత శంభుని సూచించినారు. ఆభరణములు చైతన్యశక్తి సూచితమగుటచే, సర్వాభరణభూషితా నామమునందు పరమాత్మ చైతన్యశక్తిని సూచించినట్లున్నది.  ఈ విధముగా ఈ రెండునామములు సర్వారుణయని చెప్పబడిన శివశక్తుల తత్త్వమును తెలియజేయునవిగనున్నవి.  

అనవద్యాంగ్యై నమః
కళంక/దోషరహిత అంగములను కలిగిన తల్లికి నమస్కారము. ఉత్తమ సాముద్రికా సల్లక్షణములతో కూడిన అంగసౌష్ఠవము గలిగిన తల్లియని అర్ధము.

అంగములను వర్ణించు నామము స్థూలరూపమునకు సంబంధించినది.
అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతీతి షడ్వికార వదేత్ స్థూలశరీరమ్। (ఆదిశంకరుల తత్త్వబోధ – 3.1)
మోక్షసాధనకు, సుఖదుఃఖాదులను భోగించుటకు, సత్కర్మఫలముగ ప్రాప్తించిన సాధనము స్థూలశరీరము. ఉనికి(అస్తి), పుట్టుట (జాయతి), పెరుగుట (వర్ధతి), మార్పుచెందుట(విపరిణత), తరుగుట (అపక్షీయత) మరియు నశించుట (వినశ్యతి)యను ఆరు విధములైన (అవద్య) వికారములను/దోషములను కలిగియుండునది.

భక్తులను అనుగ్రహించుటకొరకు ఏర్పడిన తల్లి స్థూలరూపము, అవద్య/వికార రహితము.

అంతరార్ధము
ఇంతవరకు చూచిన నామములందు బ్రహ్మవస్తువు సంకల్పముచే వ్యక్తీకరింపబడిన శివశక్తియుతమైన సమస్త వ్యష్టి, సమిష్టి సృష్టిప్రకరణను తెలుసుకున్నాము.

పరమాత్మ సమస్త సృష్టిని సృజించిన పిదప జడముగనుండుటజూచి, తానుప్రవేశించి దానిని చైతన్యవంతముజేసినట్లుగా క్రిందిశ్లోకమునందు చెప్పబడినది.
అణుస్థాని తాని తేన వినా స్పన్దితుమ్ చేష్టితుమ్ వా న శేకుః।
తాని చేతనీ కర్తుం సో అకామయత।
బ్రహ్మాండాని, బ్రహ్మరంధ్రాణి సమస్త వ్యష్టి మస్తకాని విదార్య తదేవ అనుప్రావిశత్।
తదా జడాన్యపి తానిచేతనవత్ స్వస్వకర్మాణి చక్రి రే।
(పైంగలోపనిషత్తు 1.6)
మట్టితో చేయబడిన బొమ్మయందంతటా మట్టియున్నట్లు, ప్రజ్ఞానాత్మక చైతన్యశక్తినుండి ఏర్పడిన విశ్వమంతయూ చైతన్యముతో నిండియున్నది.

ఈ నామమునందలి అనవద్యము/కళంకరహితమనిన శుద్ధము. శుద్ధత్వము పరమాత్మను సూచించునని, క్రింది యజుర్వేదసూక్తము (40.8) నందు చెప్పబడినది.
సః పరి అగాత్ – ఆ పరమాత్మ సర్వత్ర వ్యాపించి
శుక్రమ్ - కాంతిమయమై
అకాయమ్ – కాయరహితుడై
అవ్రణమ్ – కళంకరహితుడై
అస్నావిరమ్ – బంధరహితుడై
శుద్ధమ్ – శుద్ధుడై
అపాపవేద్ధమ్ – పాపరహితుడై
కవిః – జ్ఞానపూర్ణుడై (రూపజ్ఞానము-చరాచరసృష్టి, శబ్దజ్ఞానము-వేదములు)
మనీషీ – సకల జీవులయందలి మనస్సును ప్రేరేపించువాడై
పరిభూః – సర్వవ్యాపకత్వముగలవాడై
స్వయంభూః – స్వాంతర్గతశక్తితో ప్రకాశించువాడై ప్రకటింపబడుచున్నాడు
యథాతథ్యతః – అదే పరమేశ్వరుడు యథాతథముగ    
శాశ్వతీభ్యః - శాశ్వతుడై (నాశరహితుడై)
సమాభ్యః – ప్రాణులకొరకు
అర్థాత్ – సకల పదార్ధములను
వి అదధాత్ - రచించుచున్నాడు

విరాట్విశ్వరూపిణియైన తల్లి అంగములు పిపీలికాదిబ్రహ్మపర్యంత సృష్టి సూచితము. అనవద్యమైన అంగములనిన, జడమైన సృష్టిని చైతన్యవంతముచేయుటకు ప్రవేశించిన సృష్టియందలి కళంకరహిత పరమాత్మ. ఈ విధముగ అనంతవిశ్వమంతయు వ్యాపించియున్న పరిశుద్ధమైన పరమాత్మను సూచించు నామము అనవద్యాంగీ.

సర్వాభరణభూషితాయై నమః
సకల ఆభరణములతో అలంకృతయైన తల్లికి నమస్కారము.

కాళికాపురాణము, పరశురామ కల్పసూత్రము మొదలగు గ్రంథములందు తల్లిని నలభైకన్న ఎక్కువ ఆభరణములను ధరించినట్లు వర్ణించబడినది.  కానీ వాగ్దేవతలు సహస్రనామస్తోత్రమునందు కేవలము తొమ్మిది ఆభరణములను మాత్రమే సూచించినారు. దీనియందలి అంతరార్ధమేమిటో తెలుసుకుందాము.

యావద్బ్రహ్మ విశిష్టమ్ తావతి వాక్ (ఋగ్వేవేదము – 10.114.8)
సృష్టియందు పరమాత్మ తాను ప్రవేశించి చైతన్యవంతముగ చేసినట్లు చెప్పుకున్నాము. సమస్తసృష్టియందలి కళంకరహిత పరమాత్మను అనవద్యాంగి నామమునందు చెప్పుచూ, సర్వాభరణభూషితా నామమునందు అంతటా వ్యాపించియున్న వాగ్రూప చైతన్యశక్తిని తెలియజేయుచున్నారు వాగ్దేవతలు.

ఋచః-అక్షరే-పరమే-వ్యోమన్-యస్మిన్-దేవాః-అధి-విశ్వే-నిషేదుః-యః-తత్-న-వేద-కిమ్-ఋచా-కరిష్యతి-యే-ఇత్-తత్-విదుః-తే-ఇమే-సమ్-ఆసతే| 
 (ఋగ్వేదము 1.164.38)
వ్యోమముచేత భరించబడిన (వ్యోమమంతటనూ వ్యాపించిన) అక్షరములైన(నాశరహితములైన) వేదములు, సకల దేవతలకు ఆశ్రయములని ఈ ఋగ్వేదమంత్రమునందు చెప్పబడినది.

ఆ సమంతాత్ భ్రియతే ఆభరణమ్ (అమరకోశము) అంతటా భరించబడునది ఆభరణము.

ఈ విధముగ వేదములు సృష్టికి చైతన్యాత్మక ఆభరణములుగ తెలియుచున్నది. ఈ నామమునందు వాగ్దేవతలు వేదాంగములను తల్లి ఆభరణములుగ వర్ణించుచున్నట్లున్నది. మొదట వేదాంగముల విశేషములను తెలుసుకొని తద్వారా తల్లిఆభరణములను పరిశీలిద్దాము. 

శిక్షేత్యాది శ్రుతేరఙ్గమ్
శిక్ష ఇతి ఆది శిక్ష మొదగులవి వేదములకు అంగములనబడును.
శిక్షా వ్యాకరణమ్ ఛందో నిరుక్తమ్ జ్యోతిషమ్ తథా, కల్పశ్చేతి షడఙ్గాని వేదస్యాహుర్మనీషిణః

శిక్ష - అకారాదీనామ్ వర్ణానామ్ స్థానప్రయత్న బోధికయా అనయా శిక్ష్యతే వర్ణాదిరితి శిక్షా
అకారాది వర్ణములు, వాని ఉచ్ఛారణ, స్వరశుద్ధి (అనుదాత్త, ఉదాత్త, స్వరిత) స్థానములను మరియు కాలపరిమాణమును తెలుపు వేదాంగము శిక్ష.

వ్యాకరణమ్ – విశేషేణ ఆక్రియంతే ఉత్పాద్యంతే శబ్దా అనేనేతి వ్యాకరణం
మూలము, పర్యాయ (synonyms), విరుద్ధార్ధ (antonyms) పదములు, సంధి, సమాసము, క్రియాపద కాలములు (Present tense, past tense etc.,) మొదలగునవి తెలియజేయునది వ్యాకరణము.   వేదముయొక్క షడంగములందు వ్యాకరణము అతిముఖ్యమైనది. వైదీకవ్యాకరణమునకు సూత్రగ్రంథము, శివసూత్రము.

ఛందస్సు - ఛందసామ్ పద్యానామ్ శాస్త్రం ఛందః
సాధారణముగ వేదమంత్రములు పంక్తికి నాలుగుపాదములు కలిగియుంటాయి. పంక్తికి 2,3,5 పాదములు కూడా కొన్నిసందర్భములలో చూడవచ్చు. ప్రతి పాదమునందలి అక్షరసంఖ్యను నిర్దేశించునది ఛందస్సు.
యాస్కాచార్యుని నిరుక్తమునందు ఛద్ యను ధాతువునుండి వచ్చిన ఛందస్సనిన ఆవరణ, వేదములంతటా విస్తరించి, ఆవరించియుండునది ఛందస్సని చెప్పబడినది. ఋషి, దేవత, ఛందస్సుల జ్ఞానములేకుండా వేదమంత్రముల పారాయణ నిష్ప్రయోజనము.

నిరుక్తము - వర్ణాగమో విర్ణవపర్యయశ్చేత్యాదినీశ్చయేనోక్తమ్ నిరుక్తమ్
(మహాభారత శాంతిపర్వము 342.86,87) కశ్యపప్రజాపతి రచించిన వేదనిఘంటువునకు యాస్కాచార్య విరచిత వ్యాఖ్యానము నిరుక్తము. వైదీక పదముల ధాతుమూలములతో కూడిన విశ్లేషణా గ్రంథము నిరుక్తము మిక్కిలి ప్రసిద్ధము.

జ్యోతిషము – గ్రహనక్షత్రాణాముదయాస్తమాది ప్రతిపాదకమ్ జ్యోతిషమ్
ద్యోతతే ప్రకాశతే తత్ జ్యోతిః ద్యుతి-ధాతువునుండి వచ్చిన జ్యోతిష్యము, ప్రకాశవంతమైన గ్రహ, నక్షత్రముల స్థితిగతులను గణించు శాస్త్రము. జ్యోతిష్యపరిజ్ఞానముచే వేదక్రతువులను నిర్వహించుటకు అనుకూల, ప్రతికూల సమయ గణనజేయబడుటచే దీనికి కాలవిధానశాస్త్రమనికూడా పేరుగలదు. 

కల్పముకల్పతే ప్రభవతి యాగాదిక్రియాయామితి కల్పః - యాగాది క్రియలందు సమర్ధమైనది
కల్పే విధి క్రమౌ (అమరకోశము) కల్పము విధినియమములను తెలియజేయునది. వేదాంగమైన కల్పము యాగాది క్రియల విధివిధానములను తెలియజేయు భాగము. మానవమనుగడకు ఇహపరసౌఖ్యములను పొందుటకు అవసరమైన, నాలుగువిధములైన కల్పసూత్రములను మన ఋషులు వేదములందు అందించినారు.
యజ్ఞసంబంధిత సూత్రములు శ్రౌతసూత్రములు.
లౌకికసంస్కార విధానములను తెలియజేయునవి గృహ్యసూత్రములు.
భోక్తా చ ధర్మవిరుద్ధాన్ భోగాన్ | ఏవముభౌ లోకావభిజయతి| (ఆపస్థంభ ధర్మసూత్రము – 2.8.20) నియమబద్ధజీవితమునకు అవసరమైన ధర్మసూక్ష్మములను బోధించునవి ధర్మసూత్రములు.
దేశ, కాల కొలత పద్ధతులను కలిగిన గణితసంబంధ శుల్బసూత్రములు.

మానవులకు అవసరమైన ధర్మములు, యజ్ఞయాగాది క్రతువులను తెలియజేయు శాస్త్రములైన శ్రౌత, గృహ్యసూత్రములను సూచించు షడంగయుక్త వేదరూపిణిగా ఈ నామమునందు తల్లిఆభరణములద్వారా తెలియజేయుచున్నారు వాగ్దేవతలు.
ఛందః పాదౌ తు వేదస్య హస్తౌ కల్పోథ పఠ్యతే।
జ్యోతిషామయనం చక్షునిరుక్తమ్ శ్రోత్రముచ్యతే॥
శిక్షా ఘ్రాణం తు వేదస్య ముఖమ్ వ్యాకరణమ్ స్మృతమ్।
తస్మాత్ సాఙ్గమధీత్యైవ బ్రహ్మలోకే మహీయతే॥ 
 (పాణినీ శిక్షా 41,42)

వేదములకు కిరీటమువంటివి ఉపనిషత్తులు.
కిరీటము(కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా) – ఉపనిషత్తులు

శిక్షా ఘ్రాణం తు వేదస్య – వేదమాతకు ఘ్రాణేంద్రియము శిక్షయగుటచే, నాసాభరణము శిక్షాసూచితముగనున్నది.
నాసాభరణము (తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా) – శిక్ష

నిరుక్తమ్ శ్రోత్రమ్ – నిరుక్తము శ్రోత్రేంద్రియములైన కర్ణములు. కర్ణాభరణములైన తాటంకములు నిరుక్త సంజ్ఞితముగనున్నవి.
తాటంకములు(తాటంకయుగళీభూతతపనోడుపమండలా) – నిరుక్త/Dictionary

అతిముఖ్య వేదాంగమైన వ్యాకరణమును పాణిని శరీరమునందలి అతిముఖ్యాంగమైన నోటితో పోల్చి చెప్పారు; ముఖమ్ వ్యాకరణమ్.
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా–దిగ్దిగంతములకు వ్యాపించు ఆమోదకరమైన పరిమళమును ప్రసరింపజేయు తల్లినోటియందలి కర్పూరవీటిక, వ్యాకరణ సూచితము.

వ్యాకరణమునకు ఆదిగ్రంథముగ చెప్పబడునది సాక్షాత్తు మహేశ్వరునిచే అనుగ్రహింపబడిన శివసూత్ర గ్రంథము.
కామేశునిచే కట్టబడిన మంగళసూత్రము (కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా) – శివోపాయ, శాక్తోపాయ, ఆణవోపాయములను మూడుభాగములతో కూడిన వ్యాకరణ శివ సూత్రములు.

హస్తో కల్పః – యజ్ఞయాగాదుల క్రియావిధానములను తెలుపు కల్పము, వేదమునకు చేతులుగ చెప్పబడుటచే, తల్లియొక్క మణికట్టునలంకరించిన అంగదములు, భుజములనలంకరించిన వంకీలు కల్పసూచితము.
అంగద, కేయురములు(కనకాంగదకేయురకమనీయభుజాన్వితా) – కల్పాంగము
కార్యాచరణకు చేతులు/భుజములు ముఖ్యమైన అంగములు. యజ్ఞయాగాది క్రతువుల పద్ధతులను తెలుపు కల్పమును తల్లిచేతినలంకరించు ఆభరణములతో సూచించారు వాగ్దేవతలు.

చింతాలోలులైన మానవులు, కల్పమునందలి వేదవిహిత కర్మలను ఆచరించుటద్వారా తల్లిఅనుగ్రహపాత్రులై ముక్తాఫలమును పొందగలరని చెప్పుచున్నట్లున్న తదుపరి నామము.
చింతాకుపతక ముత్యాలహారము (రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా) – కల్పసూత్రములు

దూరముగనున్న వస్తువివరములను మనము నేత్రములద్వారా గ్రహించినట్లు, అంతరిక్షమునందలి గ్రహనక్షత్రముల వివరములను జ్యోతిష్యశాస్త్రముచే గణింపబడుటచే, పాణిని జ్యోతిష్యమును వేదమాతకు నయనముగ వర్ణించారు. ఇక ఈ వేదాంగమును సూచించు తల్లి ఆభరణమేమిటో చూద్దాము. వేదకర్మలనాచరించు పవిత్రస్థలమునకు యజ్ఞవేదియని పేరు.  యజ్ఞయాగాదిక్రతువుల నిర్దేశిత ప్రయోజనమును పొందుటకు జరుపు ముహూర్తనిశ్చయ కాలవిధానశాస్త్రమనబడు జ్యోతిషాంగము, కట్యాభరణమునందు సంకేతింపబడినట్లున్నది.
కటిబంధము (రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా) – యజ్ఞవేదికాకారమునుండు నడుమునలంకరించు వడ్డియాణము జ్యోతిషాంగ సూచకము

పైన చెప్పుకున్న పాణిని సూత్రము ప్రకారము వేదములకు పాదములవంటిది ఛందస్సు. తల్లి పాదములనావరించియున్న మంజీరములు, వేదాంగమైన ఛందస్సుకు చిహ్నముగనున్నవి.
మంజీరములు (శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా) – ఛందస్సు

ఈ విధముగ తల్లిని షడాంగములు, రెండుసూత్రములు మరియు వేదాంతమును ప్రతిపాదించు ఉపననిషత్తులతో కూడిన వేదమాతగా దర్శింపజేయు నామము సర్వాభరణభూషితా.

పరమాత్మ-చైతన్యశక్తులవలే, అంగములు-ఆభరణములు అవినాభావములు.

సర్వాంగాలంకృత తల్లి ఆభరణముల కాంతులశోభలయందు జ్ఞానదారిద్ర్యముచే ఏర్పడిన అంతఃతిమిరము సమూలముగ నశించవలెనని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః