Sunday 20 January 2019

Siva-kAmESvaraAnkasthitA శివకామేశ్వరాంకస్థితా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
వామాంకస్థామీశతుర్దీప్యమానామ్
భూషాబృందైరిన్దురేఖావతంసామ్।
యస్త్వామ్ పశ్యన్ సతతమ్ నైవ తృప్తః
తస్మై చ దేవి వషడస్తు తుభ్యమ్॥ 
(త్రిపురసుందరీవేదపాదస్తవము-100)
తల్లీ!! సర్వాలంకారభూషితవై, నెలవంక తలలో తురుముకొని, శివునివామాంకస్థితయైన నిన్ను సదా సర్వదా ధ్యానించి తనివితీరనివారు, యాగాది క్రతువులందలి వషట్కారములను నీతోపాటు వారుకూడా పొందెదరుగాక.

శివకామేశ్వరాంకస్థితా
శివకామేశ్వరుని అంకముపై (తొడపై) కూర్చొని ఉన్న తల్లికి నమస్కారము.
సుమేరుపర్వత శిఖరముమీద విరాజితమైన కామేశ్వరీకామేశ్వరులను వర్ణించునామమిది. వాగ్దేవతలు కామేశ్వరుని అంకముమీద కూర్చున్న తల్లి అనకుండా శివకామేశ్వరుని అంకముమీద కూర్చున్న తల్లియని చెప్పుటయందలి రహస్యమును తెలుసుకొనుటకు ప్రయత్నిద్దాము.
అంతరార్ధము

సర్వము బ్రహ్మము. ఆత్మ బ్రహ్మము. వైశ్వానర (జాగృదవస్థ/అకార), తేజస్సు (స్వప్నావస్థ/ఉకార), ప్రజ్ఞ (సుషుప్తి/మకార) మరియు తురీయముయని (నిశ్శబ్దము) ఆత్మకు(ॐ) నాలుగుపాదములు. (మాండూక్యోపనిషత్తు-2,3,4,5,6)

స ఏష వైశ్వానరో విశ్వరూపః ప్రాణోగ్నిరుదయతే। తదేతదృచాభ్యుక్తమ్॥ 
(ప్రశ్నోపనిషత్తు 1.7)
ప్రాణాగ్నయ ఏవైతస్మిన్పురే జాగృతి। (ibid 4.3)
ప్రాణాగ్నిరూప వైశ్వానరుడు(శివ-శతపథబ్రాహ్మణమ్-X.6.1) జాగ్రదస్థయందు పురమునందు (స్థూలశరీరము) జాగురుకతోయుంటాడు. 

అత్రైష దేవః స్వప్నే మహిమానమనుభవతి (ప్రశ్నోపనిషత్తు 4.5)
మనస్సు(కామ) రూప తైజసుడు స్వప్నావస్థయందు (సూక్ష్మశరీరము) మహిమానుభవమును పొందును.

అత్రైష దేవః స్వప్నాన్న పశ్యత్యథైతదస్మిఞ్శరీరే ఏతత్సుఖమ్ భవతి। (ibid 4.6)
స్వప్నస్థితిని దాటి, సుషుప్తి స్థితినిపొందినప్పుడు, చైతన్యవ్యాప్తిత కారణశరీరము సుఖమునుపొందును. ఈ సుషుప్తి స్థితియందలి ప్రాజ్ఞుడు, సమస్త సృష్టియందలి ఈశ్వరచైతన్యము.

జాగరితిస్థానో వైశ్వానరోకారః ప్రథమా మాత్రా
స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రా
సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్త్రితీయా మాత్రా
మాత్రమనిన వర్ణోచ్ఛారణకాలము. అమాత్రమనిన శబ్దరహితము.
అమాత్రశ్చతుర్థోవ్యవహార్యః ప్రపఞ్చోపశమః
 (మాండూక్యోపనిషత్తు ఆగమప్రకరణము-9,10,11,12)
ప్రణవము/అక్షరబ్రహ్మనందలి పరమాత్మ సూచక తురీయము అమాత్రము/నిశ్శబ్దము.  ఈ తురీయమును పురాణ, ఉపనిషత్తు, తంత్ర గ్రంథములందు అర్ధమాత్రయని కూడా చెప్పబడుచున్నది.

ద్వేవావ ఏవ బ్రహ్మణి అభిధ్యేయే కే తే శబ్దశ్చైకమ్ బ్రహ్మ అశబ్దశ్చ ద్వితీయమ్।
 (మైత్ర్యుపనిషత్తు 6.22)
శివ-కామ-ఈశ్వర-అంకస్థితా:- జాగృత్స్వప్నసుషుప్తులందుండి, మార్పుచెందకుండగ నుండు అనిర్వచనీయమైన తురీయము, పరచైతన్యము.

మాండూక్యోపనిషత్తునందలి పైమంత్రములననుసరించి, ఈ నామమునందు అకార, ఉకార, మకార మరియు నిశ్శబ్దముతో కూడిన అక్షరబ్రహ్మము/ప్రణవమును నిగూఢముగనుంచినారు వాగ్దేవతలు.


చిదగ్నికుండమునుండి సర్వాలంకృతయై ఆవిర్భవించిన లలితామహాత్రిపురసుందరిని వివాహమాడుటకు సర్పాభరణములతో, కపాలమాలాలంకృతుడై, భస్మధారుడైన విరూపాక్షుడు ధరించిన కోటికందర్పలావణ్య దివ్యరూపము కామేశ్వరుడు (బ్రహ్మాండపురాణము ఉత్తరభాగము 14.10,11,12 & 15.12). వీరిరువురి అవినాభావత్వమును తెలియజేయునామమిది.


జన్మజలధిలో మునిగితేలుతున్న నాకు, శివవామాంకస్థిత తల్లి దర్శనభాగ్యము అతిశీఘ్రముగ కలగాలని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment