Thursday 23 July 2020

దశముద్రలు-దశావతారములు - వామన, పరశురామావతారములు; Dasa mudras - Dasavatara - Vamana, Parasuraama avataras

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

ఉన్మధ్య బోధకమాలాకరమమ్బ! జాడ్య-

స్తమ్భేరమమ్ మమ మనోవిపినే భ్రమన్తమ్|

కుణ్ఠీకురుష్వ తరసా కుటిలాగ్రసీమ్నా

కామాక్షి! తావక కటాక్ష మహాఙ్కుశేన ||

(కటాక్షశతకము-29)

అమ్మా!! కామాక్షీదేవీ!! నా మనస్సను అడవిలో భ్రమించు జాడ్యమను (స్తంభమునందు రమించునది/కట్టబడినది) ఏనుగును, వక్రీకరించిన అంచులతో కూడిన మహాంకుశమువంటి నీ కటాక్షముతో విఘాతము జేయుము.


ఉన్మాదినీ ముద్ర (వామనావతారము)

బింద్వంతరాళ విలసత్ సూక్ష్మరూప శిఖామయీ

జ్యేష్ఠాశక్తి ప్రధానా తు సర్వోన్మాదకారిణీ ||64||

దశారచక్రమాస్థాయ సంస్థితా వీరవందితే

 

మూలాధారమునందలి యోనిబిందువు, బ్రహ్మరంధ్రమునందలి మహాబిందువులమధ్య సుషుమ్నానాడిద్వారా సూక్ష్మశిఖరూపముగ ప్రజ్వరిల్లు తేజస్సును ఉత్తేజితపరచునది ఉన్మాదినీ ముద్ర. బహిర్దశార(విశుద్ధి)చక్రమునందు జ్యేష్ఠశక్తి ప్రాధాన్యత కలిగియుండునది.

 

ప్రకాశమానామ్ ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానామ్|

అంతః పదవ్యామనుసంచరంతీమ్ ఆనందరూపామబలామ్ ప్రపద్యే||

(దేవీ గీత 12.3) 

కుండలినీశక్తిరూపిణియైన దేవి, సుషుమ్నానాడిగుండా ఊర్ధ్వదిశగా (ప్రథమప్రయాణమునందు) సూక్ష్మమైన అగ్నిశిఖగా సహస్రారమునుజేరును. తద్వారా సహస్రారమునుండి జరుగు అమృతస్రావముతోకలిసి అధోదిశగా(ప్రతిప్రయాణము) మూలాధారమును జేరును.

 

కుండలినీశక్తి ఊర్ధ్వ, అధోప్రయాణములను సౌన్దర్యలహరి 9 (మహీం మూలాధారే..) మరియు 10 (సుధాధారాసారైః..) శ్లోకములందు శంకరభగవత్పాదులు కూడా వర్ణించారు.

 

యోగశాస్త్రమునందలి జాలంధరబంధ సంబంధితమీ ముద్ర. హృదయమునందు చిబుకమును ధృడముగా నిలిపి కంఠమును సంకుచితముజేయుటయే జాలంధరబంధము. దీనిద్వారా శరీరమునందలి పదినారు ఆధార చక్రములు బంధింపబడి, ప్రాణవాయువు సుషుమ్నానాడిద్వారా చంద్రమండలమందలి సహస్రారమును జేరుటచే అమృతస్రావము జరుగును.


యత్కించిత్స్రవతే చంద్రాదమృతమ్ దివ్యరూపిణః

తత్సర్వమ్ గ్రసతే సూర్యస్తేన పిండో జరాయుతః ||

(హఠయోగప్రదీపిక-3.78)

శరీరము నిటారుస్థితిలో, చంద్రునినుండి స్రవించు అమృతము, నాభిస్థానమందలి సూర్యుడు గ్రసించుటవలన, దేహము ముదిమిని పొందుచున్నది.


బధ్నాతి హి శిరోజాలమ్  అధోగామి నభోజలమ్

తతో జాలంధరోబంధః కంఠ దుఃఖౌఘనాశనః  || (ibid 3.72)

జాలంధరకృతే బంధే కంఠసంకోచలక్షణే

నపీయుషమ్ పతత్యగ్నౌ న చ వాయుః ప్రకుప్యతే|| (ibid 3.74)

కంఠమును సంకోచింపజేయుటవలన, నాడులద్వారా శిరస్సునుండి వెలువడు నభోజలమును అధోభాగమును జేరకుండగ నిరోధించునదిగావున, ఈ బంధమునకు జాలంధరబంధమని పేరు. దీనివలన ఇతరనాడులందు వాయుగమనము (ప్రకోపము) ఉండదు మరియు కపాలకుహరమునుండి వెలువడు సోమకలామృతము జఠరాగ్నియందు పడదు. ఈ కారణముచేత జాలంధరబంధము, జరామృత్యువినాశిని.

 

సాధకులందు ఉన్మాదినీముద్రద్వారా బ్రహ్మరంధ్రమునుండి స్రవించు జలతత్త్వ అమృతమే ఇచ్చట చెప్పబడిన జ్యేష్ఠాదేవి.

 

యద్వేవ విష్ణుక్రమాన్క్రమతే|యజ్ఞోవై విష్ణుః  స దేవేభ్య ఇమామ్ విక్రాన్తిం విచక్రమే యైషామియమ్ విక్రాన్తిరిదమేవ ప్రథమేనపదేన పరస్పరాథేదమన్తరిక్షమ్ ద్వితీయేన దివముత్తమేనైతామ్వేవైష ఏతస్మై విష్ణుర్యజ్ఞో విక్రాన్తిమ్ విక్రమతే తస్మాద్విష్ణు క్రమాన్క్రమతే తద్వా ఇత ఏవ పరాచీనం భూయిష్ఠా ఇవ క్రమంతే||

 (శతపథబ్రాహ్మణ 1.9.3.9) 

స వామనో దివమ్ ఖమ్ పృథ్వీమ్ చ ద్విజోత్తమాః

త్రిభిః క్రమైర్విశ్వమిదమ్ జగదాక్రమత ప్రభుః (బ్రహ్మాండపురాణము 2.73.78)

మూడడుగులతో సకలభువనములను కొలిచిన వామనావతార సంబంధముగనున్నదీ ముద్ర. పిండాండ బ్రహ్మాండసమన్వయకారణముగా, వామనుడు మూడడుగులతో కొలిచిన భూర్భువస్స్వర్లోకములు, జీవులందలి త్రిలోకము/కూటములకు సూచితము.

 

సాధకుల మూలాధారమునందు నిద్రిస్తున్న కుండలినీశక్తి జాగృతిచెంది, సుషుమ్నానాడిద్వారా సూక్ష్మరూప తేజస్సుగ బ్రహ్మరంధ్రమువరకు వ్యాపించుటయే త్రివిక్రమావతార అంతరార్ధము.

 

యత్ర గంగా సముద్భూతా వామనస్య మహాత్మనః

పదాగ్రాత్క్రమతో లోకాంస్తద్బలేస్తు వినిగ్రహే (ibid 2.37.5)

ముల్లోకములను తనపాదముతో కొలిచిన వామనుని కాలిగోటినుండి గంగామాత ఆవిర్భవించినది.

 

స్వర్లోకమునందు మందాకిని, భూలోకమునందు గంగ, పాతాళలోకమునందు భోగవతియనబడు త్రిపథగయైన గంగాదేవి ఆవిర్భావము, సాధకులందు ఉన్మాదినీ ముద్రద్వారా ఉత్తేజితమైన జ్యేష్ఠాదేవి, సాధకులందు బ్రహ్మరంధ్రమునుండి జరుగు అమృతస్రావమునకు సంకేతము.

 

వామపాదాంబుజాఙ్గుష్ఠ నఖ స్రోతో వినిర్గతా|

విష్ణోర్బిభర్తీ యా భక్త్యా శిరసాఽహర్నిశం ధ్రువః||

(విష్ణుపురాణము-2.8.104)

వామనుని పాదపద్మములందలి అంగుష్ఠ నఖమునుండి వెలువడిన గంగను, అహర్నిశలు తన శిరస్సునందు ధరిస్తాడు ధ్రువుడు.

 

గంగాజలమును శిరస్సునందు ధరించుటయనగా, జాలంధరబంధముతో బ్రహ్మరంధ్రమునుండి స్రవించు అమృతప్రవాహమును కంఠమునుండి క్రిందికి ప్రవహించకుండా నిరోధించుటయని అర్ధము. విష్ణుపదను తన శిరస్సునందు అహర్నిశలు నిలిపియుంచినందున, ధ్రువుడు చిరంజీవియైనాడు.  

మరియొక చిరంజీవి వృత్తాంతము:

ముని మృకండుని కుమారుడు మార్కండేయుడు, వల్లీవటమునందు రవిసోమాగ్నిమండలములను ప్రాణాయామ సంయమనముతో వాసుదేవుని హృత్పుండరీకమునందు ధ్యానించి, తపస్సుజేయుటద్వారా విష్ణువు అనుగ్రహముచే కాలపాశమునుండి విముక్తుడైనట్లు నృసింహపురాణమునందు (7,8అధ్యాయములు) చెప్పబడినది. శివలింగమును ఆలింగనముజేసుకొన్న మార్కండేయుని రక్షించుటకొరకు అమృతఘటేశ్వరుడు లింగమునుండి ఆవిర్భవించి, యముని కాలపాశమునుండి కాపాడి, చిరంజీవత్వమును ప్రసాదించినట్లు శివపురాణము (ఉమాసంహిత 2.40)నందు చెప్పబడినది. శివాయవిష్ణురూపాయ శివరూపాయవిష్ణవే!!  

మార్కండేయ వృత్తాంతము తిరుక్కడయూరు (తిరు/శ్రీఘటయూరు)నందు జరిగినట్లు స్థలపురాణ కథనము. ఇక్కడ మూలవిరాట్టు అమృతఘటేశ్వరుడు, అమ్మవారు అభిరామి. కాలసంహారమూర్తి ఉత్సవవిగ్రహము. మనము ఆరంభమునందు అభిరామిభట్టుల గురించి చెప్పుకున్నాము కదా! అదే దివ్యక్షేత్రము. బ్రహ్మరంధ్రమునుండి స్రవించు అమృతము శిరస్సునందు బంధింపబడుటచే, కపాలము అమృతఘటమనబడుచున్నది. అట్టి సాధన మృత్యునాశినియని, స్వామి అమృతఘటేశ్వరుడు, మార్కండేయునకు అజరామరత్వమును అనుగ్రహించిన దృష్టాంతమునుండి తెలియుచున్నది.

***

ఉన్మాదినీ ముద్రద్వారా సాధకులమూలాధారమునుండి బ్రహ్మరంధ్రముజేరిన అగ్నిశిఖ(కుండలినీశక్తి)వలన బ్రహ్మరంధ్రమునందలి అమృతము ద్రవించుటచే కంఠభాగమందు ఉత్తేజితమగు జ్యేష్ఠాశక్తి చిరంజీవత్వకారిణి.

 

మహాఙ్కుశ ముద్ర (పరశురామావతారము)

వామశక్తిప్రధానా తు మహాఙ్కుశమయీ పునః ||65||

తద్వద్విశ్వమ్ వమంతీ సా ద్వితీయే తు దశారకే

సంస్థితా మోదనపరా ముద్రారూపత్వమాస్థితా ||66||

వామశక్తిద్వారా అంతర్దశారచక్రమును చైతన్యవంతము జేయునదీ మహాఙ్కుశముద్ర. అంతర్దశారచక్రము ఆజ్ఞాచక్రస్థానము.

 

అయంఖలు మహాబంధో మహాసిద్ధిప్రదాయకః

కాలపాశమహాబంధ విమోచన విచక్షణః

త్రివేణీసంగమం ధత్తే కేదారమ్ ప్రాప్తయేన్మనః||

(హఠయోగప్రదీపిక 3.24)

యోగశాస్త్రపరముగ (గంగా, యమునా, సరస్వతి) త్రివేణీసంగమమునిచ్చు మహాబంధ (మూలబంధ మరియు జాలంధరబంధముల మేళనము-హఠయోగప్రదీపిక-3.19,20) సంబంధితమీ ముద్ర. సాధకులను కాలపాశమహాబంధమునుండి విముక్తులను జేయునది. అనగా సంకల్పవికల్ప మనోవ్యాపారములను నిలిపివేయునది. మనస్సును కేదారశబ్దవాచ్యమైన శివస్థానరూపమగు భ్రూమధ్యమునందు జేర్చునది.


***

పింగళ-సుషుమ్న-ఇడనాడులద్వారా ప్రవహించు సూక్ష్మశక్తుల సంగమము ఆజ్ఞాచక్రస్థానమునందు జరుగును. ఈ త్రివేణీసంగమ తత్త్వమును వివిధ మంత్ర, తంత్ర గ్రంథములందు, పురాణములందు సందర్భానుసారము, వివిధ దేవతల స్థూలరూపములతో (శ్రీం-ఓమ్-హ్రీం, సూర్య-అగ్ని-సోమ, లక్ష్మీదేవి-శ్రీలలితామహాత్రిపురసుందరి-సరస్వతి, వల్లీ-సుబ్రహ్మణ్యేశ్వరస్వామి-దేవసేన, లక్ష్మీదేవి-గణపతి-సరస్వతి (గణపతి పరంబ్రహ్మస్వరూపము), రుక్మిణి-కృష్ణపరమాత్మ-సత్యభామ, శ్రీదేవి-విష్ణువు/వెంకటేశ్వరస్వామి-భూదేవి) సంకేతింపబడినది. మంత్రద్రష్టలైన ఋషులద్వారా శాస్త్రములందు ఒక్కొక్క దేవతామూర్తి ఆరాధనకు ఒక్కొక్క ఐహిక, పారమార్ధిక ప్రయోజనములు చెప్పబడినవి. ఇక్కడ గమనించవలసిన మరియొక ముఖ్యవిషయము. పరమశివునికి పార్వతి మాత్రమే పత్ని. కొన్ని కథనములందు గంగను కూడా భార్యగా చెప్పబడుట మనము చూసాము. తత్త్వపరముగా చూచినప్పుడు, శక్తి రూపములు మారుతుందిగాని సృష్టింపబడదు, నష్టబడదు. ఆధునికపరిజ్ఞానభాషలో Conservation of Energy principle - Energy can neither be created nor destroyed, it can only be converted from one form to the other. అందువలన ఆదిశక్తిరూపిణియైన పార్వతి మాత్రమే పరమశివునికి పత్ని.


ఎంతో నిగూఢార్ధములుగల్గిన ఈ శక్తిసంకేతములను యుక్తముగా తెలుసుకొనకుండా కొంతమంది హేతువాదులు విష్ణువు/వెంకటేశ్వరస్వామికి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు, కృష్ణునికి ఎంతోమంది భార్యలు అని అవహేళనచేస్తూ ఉంటారు. కృష్ణుని పదహారువేలభార్యలకూ ఒక సంకేతముగలదు. అది కూడా తొందరలో చూస్తాము.

***

మూలాధారమునుండి ఆజ్ఞాచక్రము వరకు 21 అపరతత్త్వముల: పంచభూతముల (ఆకాశవాయువహ్నిసలిలావని), పంచతన్మాత్రలు (శబ్దస్పర్శరూపరసగంధ), పంచజ్ఞానేంద్రియములు (శ్రోత్రత్వక్చకషుజిహ్వాఘ్రాణ), పంచకర్మేంద్రియములు (వాక్పాణిపాదపాయూపస్థ) మరియు మనసు, స్థానములు.


మూలాధారాదిషట్చక్రమ్ శక్తిస్థానముదీరతమ్

కంఠాదుపరి మూర్ధాంతం శాంభవమ్ స్థానముచ్యతే||

 (వరాహ ఉపనిషత్తు 5.53)

మూలాధారాది ఆజ్ఞాచక్ర పర్యంత  షట్చక్రములు, శక్తిస్థానములు మరియు కంఠముపైనుండి శిరస్సుపైభాగమువరకు శంభుని స్థానములనియు చెప్పబడుచున్నవి.

 

శక్తిస్థానములు ప్రచోదనపరచుటద్వారా ఈ 21 తత్త్వములను నియంత్రించవచ్చును. ఇరవైయొకటి సంఖ్య ప్రకృతి సంబంధితమైనది. సంస్కృత ఛందస్సులలో ప్రకృతి ఛందస్సు పాదమునకు 21 అక్షరములచొప్పున నాలుగు పాదములను గలిగియుండుట గమనించవలసిన విశేషము.

 

అఙ్కుశముద్ర, గొడ్డలిని ఆయుధముగ జేసుకొని ఇరువదియొక్కమారులు అధర్మపరులైన క్షత్రియులను దునుమాడిన పరశురామావతార సంబంధితముగ చూడవచ్చు. ఏదో కొంతమంది రాజులు భయపడి పారిపోయిననూ, క్షత్రియవర్గము చాలావరకు పరశురామునిచే హతమార్చబడుటచే, కులవృద్ధికి క్షత్రియపురుషులు లేనందువలన, క్షత్రియస్త్రీలు వేదవేద్యులైన బ్రాహ్మణపురుషులను పరిణయమాడినారు. వీరిమూలముగ పొందిన పుత్రసంతానముతో కొత్త ధర్మనిరత పాలకవర్గము ఏర్పడినది. (మహాభారతము-ఆదిపర్వము-64.8,9). కొత్తపాలకవర్గమును సృజించుటద్వారా ధర్మరక్షణ జరిపిన పరశురామావతారము వామశక్తి ప్రాధాన్యత గలిగినది.

 

పరశురామావతారముతో సంబంధముగల్గిన ఈ ముద్రను సాధనజేసినపుడు, సాధకులందలి మనస్సు, పంచ-జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, తన్మాత్రలు, మహాభూతములను  21 అపరతత్త్వములు  నియంత్రించబడును.


మనోన్మనిని ప్రార్ధిస్తూ

శ్రీమాత్రేనమః