Thursday 11 April 2019

Srimannagara-nayika to Pancha-Brahmasana-sthita శ్రీమన్నగరనాయికా-పంచబ్రహ్మాసనస్థితా

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే||
శ్రీగురుభ్యోనమః

సుధాసిందోర్మధ్యే సురవిటపివాటీ పరివృతే
మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే।
శివాకారేమంచే పరమశివపర్యంక నిలయామ్
భజంతి త్వామ్ ధన్యాః కతిచన చిదానంద లహరీమ్।।
 (సౌన్దర్యలహరి-8)
సమస్త దేవతలు, భండాసురుని బారినుండి కాపాడమని సుమేరుశృంగమధ్యభాగమున శివకామేశ్వరాంకస్థయైన సృష్టి, స్థితి, లయకారక (శ్రీమాతా, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి) పరంబ్రహ్మస్వరూపిణిని వేడుకొనగా చిదగ్నికుండమునుండి ఆవిర్భవించిన సర్వాభరణభూషిత తల్లి సగుణరూపవర్ణనను, వాగ్దేవతలు చిదగ్నికుండసంభూతా నామమునుండి మహాలావణ్యశేవధిః నామమువరకు చేసినారు. 

సర్వారుణా నామమునుండి పంచబ్రహ్మాసనస్థితా నామమువరకు సుమేరుపర్వత శిఖరభాగమునందలి సుధాసముద్రాంతర్గత మణిద్వీప మధ్యమునగల చింతామణిగృహమునందు పంచబ్రహ్మాసనస్థితయైన కామేశ్వరీదేవిని వర్ణిస్తున్నారు వాగ్దేవతలు.  

ఇపుడు, శ్రీమన్నగరనాయికా నామమునుండి పంచబ్రహ్మాసనస్థితా నామమువరకు అర్ధముచేసుకొనుటకు ప్రయత్నిద్దాము.
శ్రీమన్నగరనాయికా
శ్రీమత్+నగరము - శ్రీమన్నగరము – శ్రీమంతమైన/సౌభాగ్యవంతమైన నగరము
శ్రీమంతమైన నగరమునకు నాయికయైన తల్లికి నమస్కారము.

క్రిందటి నామమునందు పరంబ్రహ్మ స్వరూపిణియైన తల్లి సుమేరు పర్వతశిఖరమునకు మధ్యన ఉన్నట్లు చెప్పుకున్నాము.  ఈ నామము తల్లియొక్క నగరమును వర్ణించునది.

క్రీడార్ధమ్ నగాః వృక్షాః పర్వతావా అత్ర సంతీతి నగరీ
నగాః నగసదృశాః ప్రాసాదాదయోఽత్ర సంతీతి నగరీ (అమరకోశము)
పర్వతసమాన ప్రాసాదములతో కూడిన రాజగృహములతో, విహారార్ధము చలరనరహితములైన వృక్షములు, పర్వతములతోనూ నిండినది నగరము.

వ్యాసదేవులు శ్రీమద్దేవీభాగవతము ద్వాదశఖండము, 10-12 అధ్యాయములందు సుమేరుపర్వత శిఖరాగ్రమునగల సర్వలోకముగ చెప్పబడుచున్న మణిద్వీపమును విపులముగా విశదీకరించినారు.

శ్రీవిద్యాపరముగ, శ్రీచక్రమే శ్రీమన్నగరము.
కగజదశారద్వయ మన్వస్రాష్టదల స్వరపత్రత్రివృత్తభూబింబ సంజ్ఞా కథితం శ్రీసదనమ్।।
 (శ్రీవిద్యారత్నసూత్రభాష్యము 10)
(క -1వ అక్షరము) బిందువు, (గ - 3వ అక్షరము) త్రికోణ, (జ-8వ అక్షరము) అష్టకోణ, దశారద్వయ (అంతర్దశార, బహిర్దశార), (మనువులు-14) చతుర్దశార, అష్టదళపద్మ, (స్వర-16 అచ్చులు) షోడశదళ పద్మ, త్రివృత్త, భూపురములతో కూడినది శ్రీచక్రము.

యదా సా పరమా శక్తిః స్వేచ్ఛయా విశ్వరూపిణీ।
స్ఫురత్తామాత్మనః పశ్యేత్ తదా చక్రస్య సంభవః।। 
(యోగినీహృదయము – 1.9)
పరమశక్తి స్వసంకల్పముతో స్వేచ్ఛగా విశ్వరూపముపొందుటచే శ్రీచక్రము ఏర్పడినది.
గౌడపాదాచార్యులు శ్రీచక్రమును వర్ణించు పై విద్యారత్నసూత్రమును వివరించుచూ, తైత్రేయారణ్యకము మొదటి పాఠమునందలి అరుణప్రశ్నమును (27వ అనువాకము) ఉదహరించి, స్వాయంభువుగా వ్యక్తమైన ప్రపంచమే శ్రీపురమని చెప్పినారు.

చక్రమ్ పురమ్ చ సదనమాగారమ్ చ గుహా స్త్రియామ్।
ఇతి విశ్వాఖ్యే చక్రస్య పర్యాయనామాని।।
పురము, సదనము, ఆగారము, గుహయనునవి చక్రమునకు పర్యాయపదములు.

తత్ర చతుఃశతయోజన-।పరిణాహం దేవ శిల్పినా రచితం।
నానాసాలమనోజ్ఞం। నమామ్యహం నగరమాదివిద్యాయాః। 
 (ఆర్యాద్విశతి- 5)
దేవశిల్పిచే సృజించబడిన మనోహరమైన 400యోజనముల నగరమైన ఆదివిద్యకు నమస్కరిస్తున్నాను – అని దుర్వాసముని ఆర్యాద్విశతియందు శ్రీనగరమును ప్రార్ధించినారు.

నవాక్షరో మహామేరురయమ్ బ్రహ్మాండగోలకః। 
(జ్ఞానార్ణవతంత్రము 11.1)
పంచదశీమంత్రమునందలి పునరావృతముకాని తొమ్మిదిఅక్షరములచే సూచించబడిన మహామేరువు, బ్రహ్మాండగోళము.

యత్పిండే తత్ బ్రహ్మండేయని చెప్పబడినందున పిండాండరూప శ్రీచక్ర నాయిక తల్లి.
ఈ విధముగా శ్రీమన్నగరమనిన అనేకకోటి బ్రహ్మాండములతో కూడిన సమస్తసృష్టి.  అంతేకాదు ప్రతీ బ్రహ్మాండగోళము, పిండాండము శ్రీమన్నగరములే.  తల్లినగరముయొక్క యంత్ర/రేఖారూపము, శ్రీచక్రము.  వీటికి నాయకురాలు తల్లి.

చింతామణిగృహాంతస్థా
చింతామణులతోచేయబడిన గృహమునందు వసించు తల్లికి నమస్కారము.

మకరందఝరీ మజ్జన్మిళింద కులసంకులాం।
మహాపద్మాటవీం వందే యశసా సం పరీవృతాం।।
తత్రైవ చింతామణి తోరణార్చిభిర్వినిర్మితం రోపితరత్నశృంగం।
భజే భవానీ భవనావతంస మాదిత్యవర్ణం తమసః పరస్తాత్।। 
(త్రిపురసుందరీవేదపాదస్తవము-11,12)
దివ్యపుష్పముల మకరందములందు మునిగితేలుతున్న తుమ్మెదలతో విరాజిల్లు సుధాసముద్రమునందలి మహాపద్మటవికి నమస్కరించుచున్నాను (11). ఆ పద్మసముదాయ మధ్యభాగమున రత్నశృంగవిరాజితమగు తమస్సునకావలగల ఆదిత్యవర్ణపు చింతామణులతో నిర్మింపబడిన భవునిపత్నియైన భవాని గృహమునారాధించుచున్నాను (12).

చింతామణిగణరచితం। చింతాందూరీకరోతు మే సదనమ్। 
(ఆర్యాద్విశతి - 105)
చింతించినది (తలచినది/కోరినది) ప్రసాదించు స్వయంప్రకాశక రత్నములు చింతామణులు. అటువంటి మణులచేనిర్మింపబడినది తల్లి గృహము, చింతామణిగృహము.

మణ్యతే స్తూయత ఇతి మణిః (అమరకోశము) స్తోత్రము జేయబడునది మణి, అనగా మంత్రములకు మణులని పేరు. మననాత్ త్రాయతే ఇతి మంత్రః మననము చేసినవారిని కాపాడునది మంత్రము. సకలమంత్రములకు మూలమైన అక్షరబ్రహ్మరూపము అమ్మ. తల్లిగృహము సర్వమంత్రాధిదేవతలకు నిలయము. 

పంచబ్రహ్మాసనస్థితా
పంచబ్రహ్మమయో మంచస్తత్రయో బిందుమధ్యగః
తవ కామేశి! వాసోఽయ - మాయుష్మంతం కరోతు మాం।
 (త్రిపురసుందరీ వేదపాదస్తవము-14)
పంచబ్రహ్మలతో జేయబడిన ఆసనమునందు విరాజిల్లు తల్లికి నమస్కారము. 

తల్లి పంచబ్రహ్మాసనముయొక్క ఆగ్నేయపాదము జపాకుసుమవర్ణముకలిగి బ్రహ్మసూచకముగను, నైఋతీపాదము నీలోత్పలప్రభలతో విష్ణుసూచకముగను, వాయవ్యపాదము శుద్ధస్ఫటికమువలే నిర్మలముగనుండి రుద్రసూచకముగను, ఈశానపాదము పద్మకర్ణిక కాంతులతో ఈశ్వర సూచకముగను, మధ్యలో ఫలకము సదాశివునిసూచితముగను బ్రహ్మాండపురాణము ఉత్తరభాగము 37వ అధ్యాయము(48-52శ్లో)నందు వర్ణించబడినది. సదాశివేశ్వరరుద్రవిష్ణుబ్రహ్మలతో జేయబడినది తల్లి ఆసనము.

పరాశక్తిస్తతో నాదో నాదాద్బిందుసముద్భవః­।­
బిందోః సదాశివస్తస్మాదీశ్వరః సమజాయత।।(4)
తస్మాద్రుద్రస్తతో విష్ణుర్విష్ణోర్బ్రహ్మణ ఉద్భవః। (5)
  (రౌరవాగమము)
పరాశక్తినుండి నాదము, నాదమునుండి బిందువు, బిందువునుండి సదాశివుడు, సదాశివునినుండి రుద్రుడు, రుద్రునినుండి విష్ణువు, విష్ణువునుండి బ్రహ్మ ఉద్భవించినట్లు రౌరవాగమము-3భాగము, క్రియాపాదమునందలి 63 పటలమునందు చెప్పబడినది.

తల్లియొక్క కనుబొమలకదలికద్వారా ఆజ్ఞాపించి, పంచబ్రహ్మలచే సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహకార్యములనబడు పంచకృత్యములను జరుపుతున్నదని ఆదిశంకరులు సౌన్దర్యలహరి24వశ్లోకము జగత్సూతేధాతా హరిరవతి రుద్రఃక్షపయతేనందు వర్ణించి, 47వశ్లోకము భ్రువౌభుగ్నేకించిత్ భువనభయభంగవ్యసనినినందు తల్లి కనుబొమలను మన్మథునివింటివలెనున్నవని చెప్పుటద్వారా సృష్టికిమూలమైన కామమునుజనింపజేయు­ మన్మథుడు, తల్లి సంకల్పముతో మాత్రమే ఉత్తేజితుడౌతాడని సూచించినట్లున్నది.

ఈ పంచబ్రహ్మలను శైవాగమములందు సదాశివ, ఈశాన, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుషులుగను మరియు వైష్ణవాగమములందు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, నారాయణులుగను వర్ణించబడినవి. 

మూర్తయః పంచవిఖ్యాతాః పంచబ్రహ్మాహ్వయాః పరాః।
సర్వలోకశరణ్యస్య శివస్య పరమాత్మనః।
(లింగపురాణము-ఉత్తరభాగము-14అ-5)
ఏక ఏవ శివః సాక్షాత్సత్యజ్ఞానాదిలక్షణః।
వికారరహితః శుద్ధః స్వశక్తయా పఞ్చధా స్థితః।।
 (సూతసంహిత 4.14.2)
సత్య, జ్ఞాన, అనంత, వికారరహిత, సుప్రకాశ, శుద్ధ అద్వైత పరమశివుడు శక్త్యుపాధిగతమయి ఐదుతత్త్వములుగ ప్రకటింపబడుచున్నాడు.

సర్జనశక్త్యుపాధికమ్ పరశివస్వరూపమ్ చిన్మాత్రమేవ సద్యోజాతః 
పాలనశక్త్యుపాధికమ్ వామదేవః। 
సంహరణశక్త్యుపాధికమఘోరః। 
తిరోభావశక్త్యుపాధికమ్ తత్పురుషః। 
అనుగ్రహశక్త్యుపాధికమ్ చిన్మాత్రమీశానః।  (ibid)
సృష్టి, స్థితి, సంహరణ, తిరోభావ మరియు అనుగ్రహ పంచకృత్యములను జరుపు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష మరియు ఈశానులు, ఒకేఒక్క చిన్మాత్ర పరమశివుని, శక్తి ఆధారిత రూపములు.

లింగపురాణము ఉత్తరభాగము (14అ) మరియు సూతసంహిత యజ్ఞవైభవఖండములందు(14అ), పంచబ్రహ్మలను శబ్ద-స్పర్శ-రూప-రస-గంధ పంచతన్మాత్రలు, సదాశివేశ్వరరుద్రవిష్ణుబ్రహ్మ పంచతన్మాత్రాధిదేవతలు, గగనానిలానలజలపృథ్వీ పంచమహాభూతములు, శ్రోత్ర-త్వక్-చక్షు-జిహ్వ-ఘ్రాణ పంచజ్ఞానేంద్రియములు, వాక్పాణిపాదపాయూపస్థ పంచకర్మేంద్రియములు, మనోబుద్ధిచిత్తాహంకారజీవునిగ కీర్తింపబడుచున్నవని చెప్పబడినది.
***
త్రిమూర్తులుగచెప్పబడుచున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సగుణరూపమును కలిగినవారు. దేవీమాహాత్మ్యపారాయణమునందలి ప్రాధానికం రహస్యము (26-29శ్లో) నందు సృష్టి, స్థితి, లయకారకులగు త్రిమూర్తిమిథునముల ఆవిర్భావము వర్ణించబడినది.

అజితాగమము క్రియాపాదము, ద్వితీయపటలమునందు సదాశివునికి, నిష్కళుడైన పరమశివునికిగల అభేదమును పఞ్చబ్రహ్మతనుః సాక్షాత్ స శివోభూత్సదాశివః యని చెప్పబడినది.  అందువలన పఞ్చబ్రహ్మలు సృష్ట్యాదులను జరుపు త్రిమూర్తుల అరూపతత్త్వములుగ తెలుసుకొనవలసినది (లయ, తిరోధాన, అనుగ్రహములను సంహారక్రమమునందు కలిపి చూడవలెను).
***

పంచబ్రహ్మాసనస్థితయని శివాత్మక తల్పము మీద పరమశివాంకస్థితయైన తల్లిని పలుశాక్తేయగ్రంథములలో వర్ణించగా, ఉమాపతిశివాచార్యులు కుంచితాంఘ్రిస్తవమునందు బ్రహ్మాదులను పాదములుగను, సదాశివుని ఫలకముగనుగల పంచబ్రహ్మాసనస్థిత తల్లిని, శ్రీచక్రపరముగ వర్ణించినారు.

త్రైచత్వారింశదస్రే వసునృపకమలే వృత్తభూచక్రమధ్యే
బిందౌ సంతానకల్పద్రుమ నికరయుతే రత్నసౌధే మనోజ్ఞే
బ్రహ్మాద్యాకారపాదే శివమయఫలకే స్వర్ణమంచే నిషణ్ణో
దేవ్యా యః పూజ్యతే తమ్ హరిముఖవిబుధైః కుంచితాంఘ్రిం భజేహం
 (కుంచితాంఘ్రి స్తవము-110)

షట్చక్రనిరూపణయందు, మేరుదండమునందలి మూలాధారము బ్రహ్మస్థానము, స్వాధిష్ఠానచక్రము విష్ణుస్థానము, మణిపూరకచక్రము రుద్రస్థానము, అనాహతచక్రము ఈశ్వరస్థానము మరియు విశుద్ధచక్రము సదాశివస్థానముగాను చెప్పబడినది. 

ఆదిక్షాన్త సమస్తవర్ణ సుమణిప్రోతే వితానప్రభే।
బ్రహ్మాదిప్రతిమాభికీలిత షడాధారాది కక్షోన్నతే।
బ్రహ్మాణ్డాబ్జ మహాసనే జనని! తేమూర్తిం భజే చిన్మయీం।
సౌషుమ్నాయత పీత పఙ్కజ మహామధ్య త్రికోణ స్థితామ్।।
 (త్రిపురామహిమ్నస్తోత్రము-1.2)
బ్రహ్మమొదలగు ప్రతిమూర్తులతో అమరికచేయబడిన షట్చక్రకమలముల ఉన్నతభాగమునందలి బ్రహ్మరంధ్రస్థానమనబడు మహాసనమునందు నిన్నుసేవింతును. 

జ్ఞాత్వా సుషుమ్నా సద్భేదం కృత్వా వాయుంచ మధ్యగమ్
స్థిత్వా సదైవ సుస్థానే బ్రహ్మరంధ్రే నిరోధయేత్।
 (హఠయోగప్రదీపిక-4.16)
సుషుమ్ననాడిద్వారా పైకిప్రయాణించు ఉత్తేజిత కుండలినీశక్తి ఆఖరిమజిలీ, పంచబ్రహ్మలనుగలిగిన సుషుమ్ననాడి ఊర్ధ్వభాగమందలి బ్రహ్మరంధ్రస్థానము.

అటువంటి పంచబ్రహ్మలచే ఏర్పరచబడిన ఆసనముమీద తల్లికూర్చున్నదనిన, సమస్త ప్రపంచము శక్తిరూపిణియైన తల్లివలననే ఉత్తేజితమౌతున్నదని అర్ధము.

అనేకబ్రహ్మాండములకుపైన సుమేరుపర్వతపుటంచులమీద సుధాసముద్రాంతర్గత నీపవనములతోకూడిన మణిద్వీపము మధ్యనున్న చింతామణిగృహమునందు పంచబ్రహ్మాసనముమీద కూర్చున్న అమ్మపాదపద్మములను అతిశీఘ్రముగ చేరాలని ప్రార్ధిస్తూ,

శ్రీమాత్రే నమః