Sunday 21 March 2021

మూలమంత్రాత్మికా-సమయాచారతత్పరా Mulamantratmika - Samayachara-tatpara

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

 

మహేశ్వరి మహామంత్రకూటత్రయకళేబరే|

కాదివిద్యాక్షరశ్రేణిముశన్తస్త్వా హవామహే|| 

(త్రిపురసున్దరీవేదపాదస్తవము – 59)

 

సూక్ష్మరూపము సూక్ష్మ(యంత్ర), సూక్ష్మతర (మంత్ర), సూక్ష్మతమ(కుండలినీ)యని మూడువిధములు. మంత్ర, యంత్రముల సహాయముతో దేవతాశక్తిని ఉత్తేజితపరచు పద్ధతిని తెలిపునవి తంత్రములు. యంత్రం మంత్రమయం ప్రోక్తమ్ దేవతా మంత్రరూపిణీ (కులార్ణవతంత్రము-6.85). ఏ దేవతరూపముకైననూ దేవత, మంత్ర, యంత్ర, తంత్రములు అవినాభావములు.  అందువలననే సహస్రనామస్తోత్రమునందు  వాగ్దేవతలు మంత్ర, యంత్ర, తంత్ర సంబంధిత నామములను ఒకవరుసగా కూర్చినట్లున్నది (సర్వమంత్రస్వరూపిణీ-సర్వయంత్రాత్మికా-సర్వతంత్రరూపా; మహాతంత్రా-మహామంత్రా-మహాయంత్రా). 

 

ఇంతకుముందు చూచిన మూడు నామములు, పంచదశీమంత్రమును ఉద్దేశించునవిగ చెప్పుకున్నాము కదా (శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపముఖపంకజా-శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ). వీటి వెంటనే వచ్చునామములు తల్లి యంత్ర, తంత్ర సంబంధితమైనవి. 

 

తదుపరి రెండునామములు (మూలమంత్రాత్మికా, మూలకూటత్రయకళేబరా) శ్రీయంత్రము/శ్రీచక్రమును ఉద్దేశించునవిగనూ, ఆపై తొమ్మిది నామములు (కులామృతైకరసికా-సమయాచారతత్పరా), శ్రీవిద్యాతంత్రమునందు నిర్దేశింపబడిన నవావరణదేవతాశక్తుల సంబంధితముగనూ ఉన్నవి. ఈ నామములందలి విశేషములను ఇప్పుడు చూద్దాము.  

 

యంత్ర సంబంధిత నామములు:   

యథా హి సర్వతత్త్వమయ శరీరస్య విభక్తత్వగాదిసన్తానతన్ త్రితయస్య తదా విభాగప్రకాశవిమర్శ విశ్రాంతిధామ హృదయపదముచ్యతే - తథైవ భగవతో భైరవనాథస్య తదిదమ్ విభక్తతత్త్వభువనాదిమయమ్ విశ్వరూపమ్ పరామర్శసారమ్; పఙ్చాశద్వర్ణమయమ్ శరీరమ్ తస్య తదవిభాగ పరామర్శసారమిదమ్ హృదయమ్|(పరాత్రిశికాలఘువృత్తిః – 9వశ్లోకవిమర్శ)

 

త్వగాదితత్త్వములతోకూడిన శరీరసంబంధిత హృదయమునందు ప్రకాశిస్తూ శరీరమునకు వేరుకాని చైతన్యమెటులనో, విశ్వరూప పఙ్చాశద్వర్ణమయ భైరవనాథుని శరీరసంబంధిత హృదయమందు ప్రకాశించు మంత్రమటులనే.  

 

అథావ్యాహృతమ్ వా ఇదమాసీత్ స సత్యమ్ ప్రజాపతిస్తపస్తప్త్వానువ్యాహరద్ భూర్భువస్స్వరిత్యైషైవాస్య ప్రజాపతేః స్థవిరుస్థా తనుర్యా..(మైత్ర్యుపనిషత్తు – 6.6)

వ్యాహృతరహితమైన స్థితియందు సత్యసంకల్పముతో తపస్సుజేసి సృజించిన భూర్భువస్స్వర్లోకములు, ప్రజాపతి (పరమాత్మ) శరీరము.

 

ఋగ్భిరేతమ్ యజుర్భిరన్తరిక్షమ్ సామభిర్యత్తత్కవయో వేదయన్తే|  (ప్రశ్నోపనిషత్తు – 5)

 

శ్రీచక్రమ్ శివయోర్వపుః త్రిపురము/త్రికూటములకు సంకేతమైన శ్రీచక్రము, లలితామహాత్రిపురసుందరీ దేవతా శరీరము.

 

పంచభూతాత్మకశరీరము, తదంతర్లీన చైతన్యమెటులనో, యంత్రము, మంత్రము అటులనే.  మూలమంత్రాత్మికా, మూలకూటత్రయకళేబరా రెండు నామములు, శ్రీయంత్రసంబంధితము. తల్లి సూక్ష్మరూపము, మూలమంత్రమైన పంచదశాక్షరమంత్రమును ఆత్మ(హృదయము)గాను, మూడుకూటముల సంకేతమైన శ్రీచక్రమును శరీరముగాను గలిగినది.

 

తంత్ర సంబంధిత తొమ్మిది నామములు (కులామృతైకరసికా సమయాచారతత్పరా):

 

శ్రీవిద్యేత్యహమాఖ్యాతా శ్రీపురమ్ మే పురమ్ భవేత్

శ్రీచక్రమ్ మే భవేచ్చక్రమ్ శ్రీక్రమః స్వయన్మమ క్రమః

(త్రిపురారహస్యము మాహాత్మ్యఖండము – 53.46)

త్రిపురారహస్యమునందు తల్లి స్వయముగ శ్రీదేవితోనన్నుశ్రీవిద్యగను, నా పురమును శ్రీపురమనియు చెప్పబడును. నా చక్రము శ్రీచక్రము, క్రమము శ్రీక్రమము” యనినట్లు చెప్పబడినది.

 

శ్రీవిద్యాధిదేవతయైన లలితామహాత్రిపురసుందరి యంత్రము, శ్రీయంత్రమునందలి తొమ్మిదిచక్రనాయికలను ఆరాధించు విధానము, శ్రీవిద్యాతంత్రము. నవావరణములు (తొమ్మిదిచక్రములు)గల్గిన ఈ యంత్రమునందలి ఒక్కొక్క చక్రేశ్వరినామము త్రిపురా సంబంధమైనది.

 

త్రికోణమ్ మండలమ్ చాస్యాస్త్రిపురమ్ తు త్రిరేఖకమ్

మంత్రమ్ తు అక్షరమ్ జ్ఞేయమ్ రూపమ్ త్రయమ్ పునః

త్రివిధా కుండలీశక్తిస్త్రిదేవానామ్ చ సృష్టయే

సర్వమ్ త్రయమ్ త్రయమ్ యస్మాత్ త్రిపురా తేన సా స్మృతా ||

(కాలికాపురాణము 63.55-57)

 

బిందువు - లలితామహాత్రిపురసుందరి –  పరంబ్రహ్మ

త్రికోణము త్రిపురాంబ సృష్టికి  సంకల్పించిన శక్తి

అష్టకోణము త్రిపురసిద్ధాంబ ప్రాథమిక అష్టప్రకృతులను సృజించుటద్వారా త్రిపురముల సృష్టికి రంగము సిద్ధముజేయు శక్తి

అంతర్దశారము త్రిపురమాలిని త్రిపురములందలి వరుస క్రమమును నియంత్రించు శక్తి

బహిర్దశారము త్రిపురాశ్రీ త్రిపురావిభూతి శక్తి

చతుర్దశారము త్రిపురవాసిని త్రిపురములందు వాసముజేయు శక్తి

అష్టదళపద్మము త్రిపురసుందరి త్రిపురాధిదేవత

షోడశదళపద్మము త్రిపురేశి త్రిపురములను పాలించుశక్తి

భూపురము - త్రిపుర త్రిపురములు తానేయైన శక్తి  

 

ఇకపైవచ్చు తొమ్మిదినామములు, శ్రీచక్రార్చనవిధియందు పూజించబడు ఈ తొమ్మిది చక్రనాయికలకు సంకేతము.  

 

షట్త్రింశత్తత్త్వ సృష్ట్యావిష్కరణమును కశ్మీరశైవసిద్ధాంత త్రిక-ప్రకరణమునందు శివ-విద్యా-ఆత్మ/ పర-పరాపర-అపర/ శుద్ధ-శుద్ధాశుద్ధ-అశుద్ధమను మూడువిధములుగ విభజించబడినది. త్రిపురాసంబంధితమైన చక్రనాయికలను వాగ్దేవతలు, త్రికసంప్రదాయముననుసరించి సంబోధించినట్లు తెలియుచున్నది. అయితే, త్రైలోక్యమోహనచక్రాదిఅంతర్దశారచక్రపర్యంత చక్రనాయికల నామములు కుల” కలిగియుండగా, బిందుత్రికోణచక్రనాయికల నామములు సమయ” కలిగియుండుట గ్రహించవలసినది. అయితే కుల”, సమయ”,  ఏమిటని చూద్దాము.

 

జీవః ప్రకృతితత్త్వమ్ చ దిక్కాలాకాశమేవచ

క్షిత్యప్తేజోవాయవశ్చ కులమిత్యభిదీయతే || (మహానిర్వాణతంత్రము 7.97)

జీవుడు, ప్రకృతి, దిక్కులు, కాలము, పంచభూతములు కులమనబడును. ద్వైతభావనను కలుగజేయునది కులము.

 

మూలాధారాది ఆజ్ఞాచక్ర పర్యంతము, ద్వైతభావనతోకూడిన అపరతత్త్వముల సంబంధితము.  పిండాండ/శరీరము-బ్రహ్మాండ/శ్రీచక్రము సమన్వయముచే, భూపురము నుండి అంతర్దశారచక్రములవరకు అపరతత్త్వముల సంబంధితము. ఈ ఆరు ఆవరణల సంబంధిత నామములందు వాగ్దేవతలు, కుల శబ్దము వాడుటయందలి రహస్యమిదియే.

 

మోక్షదాయక శివ-శక్తి సామరస్య తత్త్వము, శివశక్తైక్య తత్త్వములు రెండునూ పరతత్త్వములు. పరతత్త్వమే సమయమని చెప్పబడుచున్నది. సహస్రార, బ్రహ్మరంధ్రముల సూచక త్రికోణ, బిందు చక్రములు రెండునూ సమయ కలిగియుండుటయందలి అంతరార్ధమిదియే.

 

లలాటచక్రస్థానము కులరహిత పరాపరతత్త్వ సంబంధితము. కులరహితమైన అకులము ద్వంద్వాతీత స్థితి. ఇది సాధకులకు అద్వైతానుభవము సిద్ధింపజేయునదేగానీ, సర్వదా సంపూర్ణ పరతత్త్వమునందు లయించు స్థితికాదు.

 

సహస్రనామస్తోత్రమునందలి కులామృతైకరసికానుండి సమయాచారతత్పరా వరకుగల తొమ్మిదినామములను, వాగ్దేవతలు సంహారక్రమమునందు వర్ణించుట గమనించదగినది.

 

కుల-అమృత-ఏక-రసికా -  కుల/త్రిపురములందలి అమృతమును ఒక్కదానిని మాత్రమే ఆస్వాదించునది

ప్రథమావరణము - భూపురము/మూలాధారముత్రైలోక్యమోహనచక్రము - చక్రేశ్వరి -  త్రిపుర

 

కులసంకేతపాలినీ - కులసంకేత/త్రిపురములకు, తత్సంబంధిత అంగములకు; పాలిని-ఈశ్వరి/పాలకురాలు  

ద్వితీయావరణము - షోడశపద్మము/స్వాధిష్ఠానము సర్వాశాపరిపూరక చక్రము - చక్రేశ్వరి - త్రిపురేశి

 

కులాంగనా కుల/త్రిపుర; అంగన/సుందరి

తృతీయావరణము - అష్టదళపద్మము/మణిపూరకసర్వసంక్షోభిణి చక్రము - చక్రేశ్వరి - త్రిపురసుందరి

 

కులాంతస్థా - కుల/త్రిపురములందు; అంతస్థ/వసించునది

చతుర్ధావరణము -  చతుర్దశారము/అనాహతసర్వసౌభాగ్యదాయకచక్రము - చక్రేశ్వరి -  త్రిపురవాసిని

 

కౌలినీ కుల/త్రిపురముల సంబంధమైనశక్తి (ఐశ్వర్యము/శ్రీ)

పంచమావరణము - బహిర్దశారము/విశుద్ధిసర్వార్ధసాధక చక్రము - చక్రేశ్వరి -  త్రిపురాశ్రీ

 

కులయోగినీ కుల/త్రిపురయోగిని(సమాహారము)/మాలిని;

యోగమనిన చాలా అర్ధములుగలవు. ప్రస్తుత సందర్భములో ఈ అర్ధమును తీసుకొనుటమైనది.

 

కులమనిన సజాతి సమూహము/ కూటమని చెప్పుకున్నాముకదా. కూటమని చెప్పినప్పుడు వరుస/క్రమము ముఖ్యముకాదు. కాని శ్రీచక్రమునందలి నవావరణములు (త్రైలోక్యమోహన-బిందువు), మనశరీరమునందలి (మూలాధార-బ్రహ్మరంధ్ర) చక్రములు/త్రిపురములు ఒక నిర్దిష్ట వరుసక్రమమును  కలిగియున్నవి. వరుస క్రమమును గలిగినది మాల.

షష్ట్యావరణము – అంతర్దశారము/ఆజ్ఞ సర్వరక్షాకరచక్రము - చక్రేశ్వరి -  త్రిపురమాలిని

 

అకులా - కులరహిత స్థితిని గలిగినది

ద్వైతసంబంధితమైనది కులము. అపరతత్త్వములన్నియు ప్రాథమిక అష్టప్రకృతులందు విలీనమైన ద్వంద్వాతీత స్థితి అకుల. పర, అపరతత్త్వముల మధ్యతత్త్వము  పరాపర. ఈ స్థితినిపొందిన సాధకులు, మరింత సాధనతో మోక్షమును లేదా సాధనారాహిత్యములన అపరస్థాయిని పొందుటకు అవకాశముగలదు.  

సప్తమావరణము అష్టకోణము/లలాటసర్వరోగహరచక్రము - చక్రేశ్వరి -  త్రిపురసిద్ధాంబ

 

సమయాంతస్థా  శివునితో సామరస్య స్థితిని గలిగిన శక్తి;

ష్టమావరణము – త్రికోణము/సహస్రారముసర్వసిద్ధిప్రదాచక్రము - చక్రేశ్వరి -  త్రిపురాంబ

 

సమయాచారతత్పరా శివైక్యశక్తి

నవావరణము – బిందువు/బ్రహ్మరంధ్రముసర్వానందమయచక్రము

చక్రేశ్వరి -  మహాత్రిపురసుందరి

 

నిత్యమ్ యస్తవ మాతృకాక్షరసఖీం సౌభాగ్యవిద్యామ్ జపేత్|

సంపూజ్యాఖిల చక్రరాజ నిలయామ్ సాయంతనాగ్నిప్రభామ్|

కామాఖ్యమ్ శివనామ తత్త్వముభయమ్ వ్యాప్యాత్మనా సర్వతో|

దీవ్యన్తీమ్ ఇహ తస్య సిద్ధిః అచిరాత్ స్యాత్ త్వత్స్వరూపైకతా||

 (దేవీమహిమ్నస్తవము-15)

ఎవరైతే నిత్యము చక్రరాజమధ్యగయైన (యంత్రము) సాయంసంధ్య ప్రజ్వలిత వైశ్వానర ప్రభలతోకూడినతల్లిని(దేవత) మాతృకాక్షరములసహిత సౌభాగ్యవిద్యతో (మంత్రము/తంత్రము) జపించుతారో, అట్టి శ్రీవిద్యాసాధకులకు, తల్లి స్వల్పకాలమునందే ఇష్టప్రాప్తితోపాటు స్వరూప ఏకత్వమును అనగా భోగమోక్షములను ప్రసాదిస్తుంది.  

 

త్రిపురసుందరిని ప్రార్ధిస్తూ,

 

శ్రీమాత్రేనమః