Friday 17 July 2020

దశముద్రలు-దశావతారములు - వరాహ, నరసింహావతారములు; Dasa mudras - Dasavatara - Varaha, Narasimha avataras

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్న వదనమ్ ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

కామాక్షి! సన్తతమసౌ హరినీలరత్న

స్తమ్భే కటాక్షరుచిపుఞ్జమయే భవత్యాః|

బద్ధోపి భక్తినిగలైర్మమ చిత్తహస్తీ

స్తమ్భమ్ చ బన్ధమపి ముఞ్చతి హన్త చిత్రమ్||

(కటాక్షశతకము – 41)

ఓ కామాక్షీ తల్లీ!! నీ కటాక్ష కాంతిపుంజమనెడి హరినీలరత్నస్తంభమునందు భక్తిశృంఖలలచే నా మనస్సనెడి ఏనుగు బంధింపబడియున్ననూ, బంధరహితమగుచున్నది, ఏమి చిత్రము!!  


సర్వాకర్షిణీముద్ర (వరాహావతారము)

జ్యేష్ఠావామా సమత్వేన సృష్టేః ప్రాధాన్యమాశ్రితా ||61||

ఆకర్షిణీ తు ముద్రేయమ్ సర్వసంక్షోభిణీ స్మృతా

వామ, జ్యేష్ఠాశక్తుల సమత్వము సృష్టికారకము. ఆకర్షిణీ ముద్రద్వారా సర్వసంక్షోభిణీ(మణిపూరక) చక్రమునందు ఉత్తేజితమగుశక్తి, ఈ రెండుశక్తుల సమత్వసూచితము.

 

ఈ ముద్రయొక్క యోగశాస్త్రపర అన్వయమును చూద్దాము.  సాధారణముగా మూలాధారమునందు జాగృతిచెందిన కుండలినీశక్తి, తిరుగుముఖము పట్టి మరల మూలాధారమునందు నిద్రించుట జరుగుతుంది.  ఇందుమూలముగా పలుమారులు ప్రయత్నపూర్వకముగ సాధనజేయవలసిఉంటుంది. కుండలినీజాగృతికి మణిపూరకచక్రము అతిముఖ్యస్థానముగ యోగచూడామణి, యోగకుండలినివంటి యోగఉపనిషత్తులందు చెప్పబడినది.

 

ఏక ఏవ వాయుః శరీరగతః స్థానభేదాత్కార్యభేదాచ్చ ప్రాణాదినామాభిర్భిద్యతే|


హృదిప్రాణో గుదోపానః సమానో నాభిసంస్థితః|     

ఉదానః కణ్ఠదేశస్థో వ్యానః సర్వశరీరగః||

ఉచ్ఛ్వాసనిఃశ్వాసౌ ప్రాణవ్యాపారః |

మూలమూత్రయోరధఃపాతనమపానవ్యాపారః |

భుక్తస్యాన్నరసస్య శరీరే సామ్యేన నయనం సమానవ్యాపరః |

ఉద్గారాదిరుదానవ్యాపారః| కృత్స్నాసు శరీరనాడీషు వ్యాప్య ప్రాణాపానవృత్త్యోః సంధికాలే శరీరస్య బలప్రదానం వ్యానవ్యాపారః|

(తైత్తిరీయసంహితశయనభాష్యము- 1.6.3)

ప్రాక్ ఊర్ధ్వముఖః అనితి చేష్టత ఇతి ప్రాణః| అప అనితి అవాఙ్ముఖశ్చేష్టత ఇత్యపానః

 (అథర్వవేదసంహిత శయనభాష్యము-2.16.1)

 

శరీరమునందు ఊర్ధ్వదిశగా ప్రయాణముజేయునది ప్రాణవాయువు, అధోదిశగా ప్రయాణముజేయునది అపానవాయువు. వ్యతిరేకదిశలో ప్రసరించు ఈ రెండు వాయువులు సాధారణముగా కలవవు. కానీ యోగాసనములు మరియు బంధములద్వారా, అపానవాయువును ఊర్ధ్వదిశయందును, ప్రాణవాయువును అధోదిశయందును ప్రవహింపజేయుట సాధ్యము. ఈ విధముగ అభిముఖముగా ప్రవహించినప్పుడు,   ఈ రెండువాయువులు, సమానవాయువు స్థానమైన నాభి(అగ్నితత్త్వక మణిపూరకచక్రము) యందు కలుస్తాయి.

 

పాయూపస్థ స్థానములను అదిమిపెట్టి (మూలబంధము), అధోదిశగాప్రాయాణించు అపానవాయువును ఊర్ధ్వదిశగా ప్రయాణింపజేసి సమానవాయు స్థానమునందు ప్రాణవాయువుతో జేర్చుటద్వారా ఈ చక్రమునందలి అగ్ని మరింత ప్రజ్వరిల్లును.  తద్వారా నాభిస్థానమునందేర్పడిన అధిక ఉష్ణమువలన మూలాధారమునందలి కుండలినీశక్తి జాగృతిచెంది ఊర్ధ్వదిశగా ప్రయాణించడము మొదలు పెడుతుంది (హఠయోగప్రదీపిక 3.65-70, యోగకుండలినీ ఉపనిషత్తు-1.42-46).  మొదటిముద్రయందు చెప్పినట్లు యోగినీహృదయమునందలి సర్వాకర్షిణీ ముద్రను వివరించు 61వ శ్లోకమునందలి సృష్టి, ప్రాణాపానసమానవాయువుల కలయికతో జరుగు కుండలినీజాగృతికి సంకేతము.

 

యథా రసాతలాచ్చోర్వీ జలేమగ్నో ద్ధతా పురా తథా మహావరాహ త్వామ్ మామ్ దుఃఖసాగరతామ్

 (నారదపురాణము ఉత్తరభాగము 53.18-19)

ప్రాణ, అపాన వాయువుల సమానత్వమువలన నాభిస్థానమునందావిర్భవించిన అధిక ఉష్ణము కారణముగా భూతత్త్వమూలాధారమునందు నిద్రిస్తున్న కుండలినీశక్తి, జాగృతిచెంది సుషుమ్నానాడిద్వారా ఊర్ధ్వదిశగాప్రయాణము జేయుటయే ఈ ముద్ర ప్రయోజనము. జలనిమగ్నమైన భూమిని తనకోరలతో ఉద్ధరించిన వరాహావతార అనుబంధిత ముద్రగా సర్వాకర్షిణీముద్రను చూడవచ్చును. భవజలధిలో మునిగితేలువారిని మురరిపు అవతారమైన వరాహపు కోరలరూపములో తల్లి రక్షిస్తుంది (సౌన్దర్యలహరి-3).  

 

నిద్రా విస్మృతి మోహాలస్య

ప్రవిభేదైస్సా భవమగ్నేషు

ఏషైవస్యా ద్యుఞ్జానేషు

ధ్వస్త వికల్పః కోపి సమాధిః || (ఉమాసహస్రము 38.14)

జలరూపిణియైన జ్యేష్ఠాశక్తి, భవమగ్నులందు ప్రతికూలతను ప్రేరేపించుటవలన, సత్సంకల్పముతో (వామశక్తి) సాధనజేయుటద్వారా (క్రియాశక్తి), శుద్ధజ్ఞానాగ్ని మరల ప్రజ్వలింపబడి, వీరు జ్యేష్ఠాదేవి అనుగ్రహమునకు పాత్రులగుదురు.  ఆకర్షిణీముద్రయందు చెప్పబడిన సమత్వము, ఈ శక్తుల అనుకూలత/ప్రతికూలత తత్త్వసంబంధము.  ఈ ముద్ర, వామ, జ్యేష్ఠాశక్తుల సమత్వము కలుగజేయుట ద్వారా సర్వసంక్షోభిణీ చక్రమునందు శక్తిని ఉత్తేజింపజేయుట ద్వారా కుండలినీ జాగృతిని జరుపుతుంది.

 

సర్వావేశకరీ/సర్వవశంకరీ ముద్ర (నృసింహావతారము)

వ్యోమద్వయాంతరాళస్థ బిందురూపా మహేశ్వరి ||62||

శివశక్త్యాఖ్య సంశ్లేషాద్ దివ్యావేశకరీ స్మృతా

చతుర్దశారచక్రస్థా సంవిదానందవిగ్రహా ||63||

 

సర్వవశంకరీ/ఆవేశకరీముద్రను సాధనజేయువారలందు ఉత్తేజితమగు శివశక్త్యైక్యశక్తి, రెండు వ్యోమములకుమధ్య బిందురూపముగ చెప్పబడినది.  మేరుదండాంతర్గత అనాహతచక్రస్థానమైన చతుర్దశావరణమునందు ప్రేరేపితమైన ఈ శక్తి సంవిదానందరూపముగ భాసిల్లుతున్నది.

 

ఉదరే పశ్చిమమ్ తానమ్ నాభేరూర్ధ్వమ్ చ కారయేత్|

ఉడ్డియానో హ్యసౌ బన్ధో మృత్యుమాతఙ్గకేసరీ|| (హఠయోగప్రదీపిక 3.54)

బద్ధోయేన సుషుమ్నాయామ్ ప్రాణః ఉడ్డీయతే యతః|

తస్మాదుడ్డీయానాఖ్యం అయమ్ యోగిభి స్సముదాహృతః || (ibid 3.56)

 

ఉదరమును వెన్నెముకవైపు వత్తిపెట్టుటద్వారా, ప్రాణమును సుషుమ్నానాడిగుండా (పక్షివలే) ఎగురజేసి అనాహతచక్రము ఉత్తేజపరుచునది, ఉడ్డియాన బంధము. అత్యుత్తమమైన ఈ బంధము, మతంగమును సంహరించు కేసరి (సింహము) వంటిది, అనగా మృత్యునాశిని.

 

ఇందుగలడందులేడని సందేహమువలదు’, భగవంతుడు సర్వాంతర్యామని చెప్పిన ప్రహ్లాదుని మాటను నిరూపించుటకొరకు స్థంభమును ఛేదించి అవతరించిన నృసింహావతారమునకు అనుబంధమైనదీ ముద్ర.

 

యథా స్వప్నే ధరాధ్వాద్రిపృష్ఠ వ్యవహృతిర్నభః

తథా హ్యహం వ త్వమ్ సా చ తదిదమ్ చ తథా నభః||

(యోగవాశిష్ఠమునిర్వాణప్రకరణము ఉత్తరార్ధము 62.29)

ఎవ్విధముగ స్వప్నమందలి సమస్తకారణకార్యములు చిదాకాశరూపములో, అదేవిధముగ నేను, నీవు మరియు ఆమె, అందరమూ చిదాకాశరూపులే.

 

భూరితి వా అయమ్ లోకః | భువ ఇత్యంతరిక్షమ్| సువరిత్యసౌ లోకః| మహ ఇత్యాదిత్యః| ఆదిత్యేన వావ సర్వే లోకామహీయంతే|

(తైత్తిరీయ ఉపనిషత్తు 1.5.1,2)

(భవన్తి అస్యమ్ భూతాని) భూమి భూలోకము. దానిచుట్టూ ఉన్న ఆకాశము (అంతరిక్షము) భువర్లోకము. దానికంటే పైనున్నది సువర్లోకము. సువర్లోకమునకు ద్యుర్లోకమనికూడా పేరు. దానికంటే పైన ఉన్నది మహర్లోకము. ఇదియే  ఆదిత్యుడు/పరమాత్మ. ఈ పరమాత్ముని వలననే సర్వలోకములు సృజింపబడుచున్నవి.

 

కొన్నిపురాణములందు స్వర్లోకమును వేరేవిధముగా నిర్వచనమునిచ్చి (నిర్వచనము – definition) మొత్తము పదినాలుగు లోకములు చెప్పబడినవి. ఇందువలన పురాణముల సహాయముతో లోకముల అన్వయము చేయునప్పుడు కించిత్తు జాగ్రత్త వహించవలసినది.

 

యో అక్షేణేవ చక్రియా శచీభిః విష్వక్తస్తంభ పృథివీముతద్యామ్। (ఋగ్వేదము 10.89.04)

ఋగ్వేదమునందు మేరువు ఇంద్రుని రధచక్రములనబడు స్వర్లోక, భూలోకములను రెండు చక్రములను కూర్చు ఇరుసు(axle)వంటి దివ్యస్తంభముగ చెప్పబడినది. విశ్వభ్రమణమునకు ఆధారమీ అక్షము.

 

ఋగ్వేదము 10.90.14 నందు విరాట్పురుషుని ముఖమునుండి స్వర్లోకము, నాభినుండి భువర్లోకము, పాదములనుండి భూలోకము సృజించబడినట్లు చెప్పబడినది. పిండాండ, బ్రహ్మాండ సమన్వయముచే, చిదాకాశరూపమైన ఈ శరీరమునందలి ముఖము, పాదములను జతపరుచు మధ్య/మేరుదండభాగము, స్వర్లోక, భూలోకములను కూర్చు భువర్లోకమను స్తంభము.

 

సభాస్తంభాత్తదా విష్ణురభూదావిర్ద్రుతమ్మునే| సంధ్యాయామ్ క్రోధమాపన్నో నృసింహవపుషా తతః||

(శివమహాపురాణము-శతరుద్రసంహిత-10.17)

నరసింహుడు ఏ గోడలోనుంచో, తలుపులోనుంచో, భూమి మీదో, ఆకాశమునుండో కాకుండా స్తంభము నుండి ఆవిర్భవించినట్లు చెప్పబడినది జూచిన, నృసింహ తత్త్వము, స్థంభమువంటి మేరుదండభాగమునందు  ఉత్తేజితమైన శక్తిని సూచించినట్లున్నది.

 

లక్ష్మీనృసింహసాలగ్రామమును పరీక్షించిన, స్థంభమునుండి వెలువడిన నరసింహస్వామి సూచకముగ మధ్యఖాళీస్థలముతో కూడిన స్థమ్భాకారమును చూడవచ్చు.

 


ఈ విధముగ, యోగినీహృదయమునందు సర్వావేశకరి/సర్వవశంకరీ ముద్రకు చెప్పబడిన వ్యోమద్వయము, భూలోక, స్వర్లోకముల సూచితము. ఈముద్రవలన సాధకులందు ఉత్తేజితమగు శక్తి, భూలోక, స్వర్లోకముల మధ్యనున్న భువర్లోకసంకేత మేరుదండ మధ్యభాగమునందు ప్రేరేపితమగు కుండలినీశక్తికి సంకేతము. సర్వావేశకరి/సర్వవశంకరీ ముద్ర ద్వారా, ఏడుచక్రములందు మధ్యచక్రమైన అనాహతచక్రమునందు ఈ శక్తి ఉత్తేజితమగుచున్నది.

 

నరసింహావతారము మధ్యభాగ సంబంధింత శక్తిరూపము. ఈ దేవతారూపము, శరీరమునందు మధ్యభాగమైన మేరుదండమునందు ఊర్ధ్వదిశగా ఉత్తేజితమైన కుండలినీశక్తి సూచితము. హిరణ్యకశ్యపుడు బ్రహ్మదేవునినుండి పగలు, రాత్రికాని సమయమునందు, తడి, పొడికాని ఆయుధముతో మాత్రమే మరణము సంభవించునట్లు వరమును పొందినాడు.  పగలు, రాత్రికానిది సంధ్యాసమయము; తడి, పొడికానివి, కరతలమునకు, కరపృష్ఠమునకు మధ్యనున్న గోళ్ళు;

 

తతః స బాహుయుద్ధేన దైత్యేంద్రం తమ్ మహాబలమ్| నఖైర్బిభేదమ్ సంకృద్ధో నార్ద్రాః శుష్కా నఖా ఇతి|

 (బ్రహ్మాండపురాణము మధ్యభాగము 5.29).

సంధ్యాసమయమున స్థంభమునుండి వెలువడిన నృసింహస్వామి, హిరణ్యకశ్యపుని నఖాస్త్రముతో సంహరించాడు.

 

ఈ విధముగా మధ్యభాగముతో అనుబంధము గలిగినది సింహమును, దేవాలయములలో స్థంభమధ్య భాగమునందు చెక్కుటయందలి అంతరార్ధమిదియే. ముఖ్యముగా శరీరమునందలి వాగ్భవకూటమైన ముఖమునకు అశ్వమును, మధ్యభాగమునకు సింహమును, కట్యధోభాగమునకు ఏనుగునుతో సూచించుట సంప్రదాయము. బ్రహ్మరంధ్రమునకుపైన పరమవ్యోమము పరంబ్రహ్మస్థానము.  చెన్నకేశవాలయమందలి మండపశిల్పచాతుర్యమందలి విశేషమిదియే.

 

సుబ్రహ్మణ్యస్వామికూడా మేరుదండమునందలి సుషుమ్నాంతరాళమున ప్రవహించు కుండలినీశక్తి సంకేతముగావున, నృసింహ, సుబ్రహ్మణ్యస్వామిలిరువురునూ ఏకతత్త్వరూపులు.  శంకరభగవత్పాదులు సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రము భజేహమ్ కుమారం భవానీకుమారం నందు, సుబ్రహ్మణ్యస్వామిని నృసింహావతారునిగ స్తుతించుట చూడవచ్చు.  తమిళనాడుయందు సుబ్రహ్మణ్యస్వామి కొలువైయున్న అరుపడైవీడుయని చెప్పబడు ఆరు ప్రసిద్ధ క్షేత్రములు, మూలాధారాది షట్చక్రములకు సంకేతము.

 

ఈ అవతారమునందు మృగ-మానవ సంయోగము ఎందులకు?

ప్రాణి తు చేతనో జన్మీ జన్తు జన్యు శరీరిణః (అమరకోశము) అట్టి జంతువులందు నరజన్మ బహుదుర్లభమని ఆచార్యులు వివేకచూడామణియందు చెప్పినారు. ఇంతవరకు చెప్పుకున్న మూడు అవతారములు జలచర, భూచర మృగజాతికి చెందినవి. అనాహతచక్రమునందు ఉత్తేజితమైన శక్తి మధ్యసంబంధమైనదిగావున, ఇచ్చట చెప్పబడిన అవతార రూపము, ఉత్తమమైన నరులకు, మిగిలిన జంతువులకు మధ్యస్థముగా నర-సింహ(మృగేంద్రమైన సింహము) అవతారముగ చెప్పబడుచున్నది.

సింహవాహినియైన తల్లిని ప్రార్ధిస్తూ,

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment