Saturday 25 August 2018

indragOpaparikshipta-smaratUNAbha-jaMghikA ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
శ్రీగురుభ్యోనమః
ఆధారేతరుణార్క బింబరుచిరం హేమప్రభం వాగ్భవం
బీజం మన్మథమిన్ద్రగోపసదృశమ్ హృత్పంకజే సంస్థితమ్|
విష్ణుబ్రహ్మ పదస్థశక్తి కలితమ్ సోమప్రభాభాసురమ్
యే ధ్యాయంతి పదత్రయమ్ తవశివేతేయాంతి సౌఖ్యం పదం||

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా

ఇంద్రగోప-పరిక్షిప్తఇంద్రగోపములచే చుట్టబడిన (surrounded by)
స్మర మన్మథుని
తూణాభఅంబులపొదవంటి
జంఘికాకాలిపిక్కలుగల తల్లి

ఇంద్రగోపకీటకములు ఎర్రనివర్ణముగలిగియుండు అగ్ని-కీటకములు (fire-flies).
ఇంద్రగోపములవంటి ఎర్రని వర్ణముగలిగి మన్మథుని అంబులపొదవలెనున్న కాలిపిక్కలు గలిగిన తల్లికి నమస్కారము.
జంఘోరూ వరుణస్యాథ తేజసా సంబభూవతుః
 (శ్రీమద్దేవీభాగవతముస్క 5 – 72శ్లో)
అనంగవరతూణీరదర్పోన్మథనజంఘికా
 (బ్రహ్మాండపురాణము-ఉత్తరభాగము-37-70శ్లో)

వరుణతేజస్సుతో ఏర్పడిన ఎర్రని తల్లికాలిపిక్కలు అనంగుని అంబులపొద దర్పమును మథనపెడుతున్నాయని బ్రహ్మాండపురాణమునందు హయగ్రీవస్వామి చెప్పగా, కామదేవుని తూణీరమును తల్లి జంఘములు జయిస్తున్నాయని దుర్వాసముని ఆర్యాద్విశతియందు జంఘాజితకామజైత్రతూణీరామ్ అని వర్ణించారు.

లావణ్యకదలీతుల్యజంఘాయుగలమండితామ్ (వామకేశ్వరతంత్ర – 125)
అంబులు, తూణీరములు కాదు, అతిలావణ్యయైన తల్లిజంఘములు లేతఅరటిఊచలవలె ఉన్నాయని వామకేశ్వరతంత్రమునందు చెప్పబడినది.

శంకరభగవత్పాదులవారు అమ్మా! స్థాణ్వాశ్రమునందు తపస్సుజేయు రుద్రుని తపోభంగపరచి సృష్టోన్ముఖుని గావించుటకు వెళ్ళునప్పుడు మన్మథుడు తనవద్దనున్న ఐదుబాణములకన్న మిన్నయైన, ద్విగుణీకృతమైన బాణములతో వెళ్ళుటకుదలచి, నీజంఘములను తూణీరములుగను, పాదములవేళ్ళను బాణములుగను, నీకుమొక్కుచున్నప్పడు, పాదములవద్దవంగిన దేవతలమకుటములచే సానపెట్టబడినట్లున్న నీకాలిగోళ్ళను ములుకులుగను జేసుకొనెను అని 83వశ్లోకము పరాజేతుం రుద్రమ్ ద్విగుణశరగర్భౌ గిరిసుతే యందు వర్ణించారు.

కామదేవునికి పలనామములుండగా, స్మర యను నామము మాత్రము సహస్రనామస్తోత్రమునందు (వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా, ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా) రెండునామములందు మాత్రమే వాడినారు వాగ్దేవతలు. మనస్సుతో చేయునది స్మరణ. అట్లు స్మరించబడిన విషయములు (కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ) ఇంద్రియములద్వారా క్రియారూపమును పొందుతాయి. మనస్సు, ఇంద్రియములను ఉత్తేజపరచు హృదయ స్థానములను వర్ణించు ఈ రెండునామములందు స్మర వాడబడినది.

వాగ్దేవతలు కామదేవుని స్మరయని జెప్పిన మొదటినామము భ్రూమధ్యమును సూచించు వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా.
కామస్తదగ్రే  సమవర్తతాధి మనసో రేతః ప్రథమమ్ యదాసీత్|
(ఋగ్వేదము 10.129.04)
సృష్టికిముందు, ప్రప్రథమముగా మనస్సు నుంచి పుట్టినది కామము. అందువలన, ఈ నామమునందలి స్మర పరమశివుని సూచిస్తుంది.

ఇక రెండవనామము, రెండవహృదయమని (peripheral heart/secondary heart) చెప్పబడు కాలిపిక్కలను/జంఘములను సూచించు ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా. హృదయమునుండి ధమనులద్వారా శరీరమంతా ప్రవహించు రక్తమును, సిరలద్వారా మరల హృదయమునకు ప్రవహించునట్లు చేయుటకు కాలిపిక్కలు ముఖ్యపాత్ర వహించుటచే వీటికి రెండవహృదయమని పేరు.
కేతుమాలేపి భగవాన్ కామదేవరూపేణ లక్ష్మ్యాః…(5.18.15)
శ్రీమద్భాగవతమునందు స్మరుని విష్ణుసూచితముగ చెప్పబడినది.

శరీరమంతా వ్యాపించి (వ్యాప్నోతీతి విష్ణుః) ఇంద్రియములను ఉత్తేజితపరచి క్రియోన్ముఖముజేయు హృదయసంబంధిత విష్ణుశక్తి ఇచ్చట ప్రచోదితమైయుంటుంది. వరుణతేజస్సుతో ఏర్పడిన జంఘములను సూచించు ఈ నామమునందలి స్మర విష్ణువును సూచిస్తుంది.

శరీరవాఙ్మనోభిర్యత్కర్మ ప్రారభతే నరః| (భగవద్గీత -18.15)
ఏష హి ద్రష్టా స్ప్రష్టా శ్రోతా ఘ్రాతా రసయితా మన్తా బోద్ధా కర్తా విజ్ఞానాత్మా పురుషః
(ప్రశ్నోపనిషత్తు 4.9)
విజ్ఞానఘనమైన ఆత్మపురుషుడు పంచజ్ఞానేంద్రియ, కర్మేంద్రియముల సహాయముతో త్రివిధములైన (కాయిక, వాచిక, మానసిక) క్రియలను చేయుచున్నాడు.

సంపూర్ణ మనోఇంద్రియనిగ్రహములను సాధించుటకు అనుగ్రహించవలసినదిగా తల్లియొక్క జంఘములను ప్రార్ధిస్తూ
శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment