Sunday 12 August 2018

నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ Nabhyaalavala-romali-latha-phala-kucha-dvayi

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

సుశోణాంబరాబద్ధనీవీ విరాజ

న్మహారత్నకాంచీకలాపమ్ నితంబమ్

స్ఫురద్దక్షిణావర్తనాభించ తిస్రో

వలీరంబ తే రోమరాజిమ్ భజేహమ్ 

 (భవాని భుజంగ ప్రయాత స్తోత్రముశ్లో 4)


నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ

నాభిబొడ్డు

ఆలవాల - పాదు

రోమ+ఆళి - రోమములవరుస

లతతీగ

తల్లి బొడ్డు ఒక తీగకు పాదువలెనున్నదని చెప్పబడినది ఈ నామమునందు. ఏమిటా తీగయనిన నూగారు!! బొడ్డునుండి వక్షస్థలమునకు మధ్యలో నిలువుగా రోమముల వరుస గలిగియుండుట ఉత్తమసాముద్రికా లక్షణముగా జెప్పబడినది. దీనినే నూగారు/రోమరాజి యందురు. బొడ్డుయనెడు పాదునుండి బయలుదేరినతీగకు కాచిన రెండుఫలములవలెనొప్పు కుచద్వయము గలిగిన తల్లికి నమస్కారము.

 

తల్లియొక్క మూడు మడతలతోకూడిన నాభి, ఇంద్ర తేజస్సుతో ఏర్పడినదని దేవీభాగవతము స్క5 – 8 - శ్లో 71 నందు ఐంద్రేణాస్యాస్తథా మధ్యమ్ జాతమ్ త్రివలిసంయుతమ్ చెప్పబడినది.  బృహత్-సాముద్రిక శాస్త్రమునందు నాభిలక్షణములను వివరిస్తున్నప్పుడు వామావర్తా చ సాధ్యమ్ వై మేధామ్ చ దక్షిణస్తథా మరియు సుఖీగంభీరా దక్షిణావర్తానాభిః స్యాత్ సుఖసంపదే వామావర్తుల నాభిగలవారు శక్తిమంతులనియు, దక్షిణావర్తుల నాభిగలవారు మేధస్సుగలవారనియు, గంభీరమైన దక్షిణావర్త నాభిగల స్త్రీ ఐశ్వర్యప్రదాయినియని 114,115వ శ్లోకములందు చెప్పబడినది. ఇదియే సర్వైశ్వర్యస్వరూపియైన శ్రీమాతకు అట్టి దక్షిణావర్తుల నాభియని చెప్పుటయందలి రహస్యము.

 

ఆదిశంకరులు సౌన్దర్యలహరి 76వశ్లోకమునందు నూగారును నాభియను సరస్సునుండి వెలువడిన సన్నని పొగవలెయున్నదని వర్ణించారు. నాభిని సరస్సుతో పోల్చారు సరే, ఆ సరస్సులోనుంచి పొగ ఎలా వచ్చినది అంటే, ఏదైన మిక్కిలి వేడివస్తువును చల్లని నీటిలో ముంచితే వెంటనే బయటకు ఆవిరి పొగ వస్తుంది కదా!! అలా వచ్చింది ఆ పొగ. మరి అమ్మవారి నాభీసరస్సునందు మునగిన ఆ వేడివస్తువు ఏమిటో!! హరుని జ్ఞాననేత్రమునుండి వెలువడిన క్రోధజ్వాలలకు తపించిన మనసిజుని శరీరము (మనసునుండి పుట్టినవాడుకాముడు/మన్మథుడు) ఆ వేడివస్తువు

 

ఇక గణపతిముని ఉమా సహస్రమునందు, అమ్మా!! నీ నాభియను బావిలోనికి దూకిన హరుని బయటకు లాగడానికిగాను వేసిన త్రాటివలెనున్నది నీ నూగారు అని వర్ణించారు (10.19).

 

ఈ వివరణలనుండి తల్లి నాభిని జలస్థానముగా చెప్పబడుట గమనించవచ్చు.

 

ఇక్కడ చెప్పుకున్న మూడు వివరణలు, ఈ నామసంబంధిత బాహ్యార్ధము మాత్రమే! సౌన్దర్యలహరి, లలితా సహస్రనామస్తోత్రమునకు ఒక విధముగా శంకరభగవత్పాదుల భాష్యమని చెప్పబడుచున్న గ్రంథము. కాంచీమహాపెరియవా శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామివారు సౌన్దర్యలహరిని వ్యాఖ్యానించుచూ, ఉపాసనారహస్యములు గలిగిన కొన్నిశ్లోకములను మాత్రము వదిలేసారు. వారు వివరణ ఇవ్వకుండా వదిలేసిన శ్లోకములలో క్రిందటి నామమునకు సంబంధించిన 19వ శ్లోకము, ఈ నామమునకు సంబంధించిన 76వశ్లోకము ఉన్నాయి. మిగిలినవి సందర్భమువచ్చినప్పుడు చెప్పుకుందాము.

 

త్రివలీయుతమై, గంగానదిసుడివలె గంభీరమైన తల్లియొక్క దక్షిణావర్తుల నాభియను పాదునుండి వెలువడిన రోమరాజికి నమస్కారము.

 

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment