Thursday 23 August 2018

kAmESajnAta-saubhAgyamArdavOrudvayAnvitA కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా


శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||


శ్రీగురుభ్యోనమః

కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా
కామేశజ్ఞాతకామేశునికి మాత్రమే తెలియబడిన
సౌభాగ్యసౌభాగ్యవంతమైన
మార్దవమృదువైన
ఊరుద్వయాతొడలజంటను గలిగిన తల్లి
కామేశునికిమాత్రమే తెలియబడిన సౌభాగ్యవంతమైన, మృదువైన ఊరువులు గలిగిన తల్లికి నమస్కారము.

ఈ నామమునందు వశిన్యాది వాగ్దేవతలు, పతివ్రతామతల్లియొక్క సౌన్దర్యము పరమశివునికి మాత్రమే తెలియదగునదని చెప్పుచున్నారు.

శంకరభగవత్పాదులు కూడా ఆనందలహరినందలి రెండవశ్లోకమునందు తథాతే సౌన్దర్యమ్ పరమశివదృంగ్ మాత్ర విషయః అని వర్ణించారు. పరమశివుడు జ్ఞానస్వరూపుడు, తల్లి తత్-జ్ఞానానందరూపిణి. జ్ఞానానందము పొందవలెననిన, జ్ఞానస్వరూపుడైన గురుమూర్తి, దక్షిణామూర్తిని ఆశ్రయించవలెను.  దక్షిణామూర్తి బ్రహ్మవిద్యాస్వరూపుడు. ఆయన అనుగ్రహించునది బ్రహ్మవిద్య. శ్రీవిద్య బ్రహ్మవిద్య అని చెప్పుకున్నాము కదా. తల్లి పంచదశీ/షోడశీ మంత్రద్రష్ట దక్షిణామూర్తి. శివః శక్తిః కామః శ్లోకమునందు ఆదిశంకరులు, భజన్తే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్ మంత్రమందలి వర్ణములనే అవయవములుగా గలిగిన తల్లిని భజిస్తున్నాను అని ప్రార్థిస్తారు. ఇదియే తల్లియొక్క సౌన్దర్యము పరమశివునికి మాత్రమే తెలియునని చెప్పుటయందలి రహస్యము.

సహస్రనామస్తోత్రమునందు వాగ్దేవతలు, తల్లి కేశాదిపాదాంత రూపవర్ణన జేయునామములలో, పంచదశీమంత్రమునందలి వాగ్భవ, కామరాజ/మధ్య, శక్తికూటములు  జాగృతిచెంది వ్యక్తీకరింపబడు స్థానములను (ముఖము, హృదయము, కట్యధోభాగము-ఊరువులు, వరుసగా) కామేశుని సంబంధితముగా వర్ణించుటయందలి ఆంతర్యమిదియే.

కరిశుండదోః కదలికాకాంతితుల్యోరుశోభినీ (బ్రహ్మాండపురాణము ఉత్తర అ37– 71శ్లో)
కదలీలలితస్తంభసుకుమారోరుమీశ్వరీమ్ (వామకేశ్వర తంత్రము – 124శ్లో)
తల్లి ఊరువులను ఏనుగుతొండములతోను, అరటిబోదెల లావణ్యకాంతులతోను పోల్చి బ్రహ్మాండపురాణమునందును, వామకేశ్వర తంత్రమునందును వర్ణించబడినవి.

కానీ మహాకవి కాళిదాసు కుమారసంభవమునందు
నాగేంద్ర హస్తాః త్వచి కర్కశత్వాత్ ఏకాంత శైత్యాత్ కదళీవిశేషాః|
లబ్ధ్వా అపి లోకే పరిణాహి రూపమ్ జాతాః తత్ ఊర్వోః  ఉపమానబాహ్యాః ||
(ప్రథమ సర్గ – 36శ్లో)
(నాగేన్ద్ర) ఐరావతముయొక్క (హస్తాః) తొండముతో పోలుద్దామంటే, దానికి గరుకుదనమున్నది (కర్కశత్వము), నీ ఊరువులు నునుపుతేలి  ఉన్నాయి. అందువలన ఆ పోలిక కుదరలేదు. సరే, నునుపుదనమునకు రాచయరటితో పోలుద్దామంటే అవి నునుపుదనము గలిగియున్నాయిగానీ, వాటికి ఊరువులకున్న విస్తారము వానికి లేదు. ఈ విధముగా, నీ ఊరువులు ఉపమానబాహ్యముగా నున్నవి, తల్లీ!! అని తల్లిఊరువులకు సాటియైన ఉపమానము లేదని వివరించారు. ఇంద్రతేజస్సుతో ఏర్పడిన మధ్యభాగమును పోల్చుటకు ఐరావతముయొక్క తొండమును వాడారు, మహాకవి కాళిదాసు!!

కరీంద్రాణాం శుండాన్ కనకకదలీ కాండపటలీం
ఉభాభ్యామూరుభ్యామ్ ఉభయమపి నిర్జిత్య భవతి|
శంకరభగవత్పాదులు కూడా ఈ అభిప్రాయమునే సౌన్దర్యలహరి 82వశ్లోకమునందు వ్యక్తపరిచారు.

గురువనుగ్రహముతో అమ్మ-అయ్యల సామరస్యస్థితిని తెలుసుకునే యోగము కలగాలని ప్రార్థిస్తూ

శ్రీమాత్రేనమః

No comments:

Post a Comment