Thursday 9 August 2018

రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితాః Ratna-graiveya-chintaka-lola-mukta-phalanvita

 

శుక్లాంబరధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్|

ప్రసన్నవదనమ్ ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||

శ్రీగురుభ్యోనమః

కిమివ వర్ణ్యతామ్ కశశికుణ్డలా|

ఉడుమణిస్రజా ప్రవిలసద్గలా||

 (ఉమా సహస్రము 23.7)

బృహద్రూపియై, అత్యంతప్రకాశవంతమై, సూర్యచంద్రులను (, శశి) కుండలములుగ గలిగి, నక్షత్రములమాలతో ప్రకాశిస్తున్న కంఠముగలిగిన తల్లి వర్ణింపశక్యముగానిది.

 

రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితాః

గ్రీవము - కంఠము

రత్న-గ్రైవేయరత్నములతోకూడిన కంఠాభరణము

చింతాకలోలఊగుచున్న చింతాకు పతకము (pendant)

ముక్తాఫల -  ముత్యములు

అన్వితా - ధరించినతల్లి

 

ఊగుచున్న చింతాకుపతకము గలిగిన ముత్యములు,రత్నముల హారమును ధరించిన కంఠము గల తల్లికి నమస్కారము.

 

ఈ నామమునకు మరియొక విశేషమును కూడా ఆపాదించవచ్చు.

శ్రీవిద్యామంత్రము మంత్రరత్నము. మంత్రజపమును చేయుటకు మూడు పద్ధతులు శాస్త్రమునందు చెప్పబడినవి.

ఉచ్చైర్జపోఽధమః ప్రోక్త ఉపాంశుమధ్యమః స్మృతః

ఉత్తమోమానసో దేవి త్రివిధో కథితో జపః

 (కులార్ణవతంత్రము15.54)

శబ్దము వచ్చునట్లు మంత్రోచ్ఛరణతో జపము చేయుట అధమము. పెదవులు, నాలిక కదుపుతూ పక్కన ఉన్నవారికి వినపడకుండా జపము చేయుట ఉపాంశుయనబడును. ఇది మధ్యమము. మూడవది మానసిక జపము. ఇది ఉత్తమము.

 

దీనినే నిత్యషోడశికార్ణవ తంత్రము 5.18శ్లో నందు ఈ క్రింది విధముగా చెప్పబడినది.

 

నిగదేన యదా జప్తమ్ లక్షమ్ చోపాంశునా కృతమ్|

మానసేన మహేశాని కోటిజాపఫలమ్ లభేత్||

లక్ష ఉచ్చజపఫలము ఒక ఉపాంశు జపముతోనూ, కోటి ఉపాంశుజపఫలము ఒక మానసిక జపముతోనూ పొందవచ్చు.

 

గ్రీవము వైఖరీవాక్స్థానమగుటచే, గ్రీవమునందు చింతనజేయుటయనగా బయటకువినపడునట్లు ధ్యానముజేయుటయని కూడా చెప్పవచ్చును. శ్రీవిద్యామంత్రరత్నమును గ్రీవమునందు చింతనజేయు లోలులను (తీవ్ర ఆసక్తిగలవారిని), సాధనయందు ఉత్తమస్థాయికి పురోగమింపజేసి ముక్తిఫలమును ప్రసాదించు తల్లికి నమస్కారము

 

ముక్తాహారలతోపేతసమున్నతపయోధరామ్ -వామకేశ్వరతంత్రము(122)

స్తనకుడ్మలహిందోళముక్తాదామశతావృతా-

 లలితోపాఖ్యానము (33-79శ్లో)

కస్తూరీ,ఘనసార,కుంకుమ,రజోగంధోత్కటైశ్చందనై

రాలిప్తమ్ మణిమాలయాతిరుచిరమ్ గ్రైవేయహారాదిభిః (32)

కలయామి హీరమణిముక్తావళీ కీలిత

గ్రీవాపట్ట విభూషణేన సుభగమ్ కంఠమ్ చ కంబుశ్రియమ్ (34)

 

కస్తూరి సుగంధద్రవ్యమును గురించి మనము ఇంతకుముందు చెప్పుకున్నాము. ఘనసారమనిన అగరు

 

కస్తూరి, అగరు, కశ్మీర కుంకుమ, మలయ చందనముల చూర్ణము(రజోగంధ) యొక్క సువాసనతో కూడిన వజ్రవైడూర్య మణుల హారములను శంఖమువంటి కంఠమునందు ధరించిన తల్లిని ప్రార్ధిస్తున్నాను అని దుర్వాసముని త్రిపురామహిమ్న స్తోత్రము (32,34శ్లో) నందు వర్ణించారు.

 

పాదారవిందశతకము 20వశ్లోకమునందు మూకకవి, అమ్మా!! నీ పాదములు, వక్షములు రెండునూ ముక్తాశ్రితములు అని తల్లియొక్క ముత్యాలహార ప్రస్తావన చేసారు. అంతేకాదు, తల్లీ!! శివునిగాఢాలింగనచే ఛిన్నమైన నీ ముత్యాలహారమునందలి ముత్యములు శివుని వక్షస్థలమును నెరపగా, నువ్వు మందహాసము చేసావు. ఆ ముత్యముల శోభనుమించిన నీ మందహాసకాంతి నాహృదయమున ప్రసరించుగాక అని మందస్మితశతకము 43వశ్లోకమునందు ప్రార్ధించారు.

 

ఉమా సహస్రమునందు గణపతిమునికూడా తల్లియొక్క ముత్యపుహార కాంతులను వర్ణించారు. అంతేకాకుండా, దిక్కులను బాహువులుగాగల తల్లి, నక్షత్రములను మాలగా ధరించినట్లుగాంచారు గణపతిముని.  

 

ఈవిధముగా, తల్లి కంఠాభరణములకు రెండు విశేషములు ముఖ్యముగా గమనించవచ్చు. ఒకటి, ఈ హారములు వజ్ర, రత్న, వైడూర్య, ముత్యములచే చేయబడినవని చెప్పిననూ, ముత్యములు ముఖ్యముగా చెప్పబడినవి.

 

ముత్యములు ఆరు ప్రదేశములలో దొరుకుతాయి.

గజకుంభేషు వంశేషు ఫణాసు జలదేషు చ

శుక్తికాయామ్ ఇక్షుదండే షోడా మౌక్తిక సంభవా|

ద్విపభుజగశుక్తిశంఖాభ్రవేణుతిమి సూకర ప్రసూతాని

ముక్తాఫలానితేషామ్ బహు సాధుచ శుక్తిజమ్ భవతి|| 

(బృహత్ సంహిత 81-1శ్లో)

మరి తల్లి హారమునందు ఎటువంటి ముత్యములు ఉన్నాయి అన్నదానికి శంకరభగవత్పాదులు సౌన్దర్యలహరి 74వశ్లోకమునందు ఇవి ఖచ్చితముగా ఏనుగు కుంభస్థలమునుండి వచ్చినవేయని చెప్పి దానికి ఆధారముకూడా ఇచ్చారు. శివుడు గజాసురసంహారము చేసి, ఆ వీరసాహసమునకు గుర్తుగా ఏనుగుకుంభ స్థలముయందలి ముత్యములను తల్లికి బహుమానముగా ఇచ్చాడట. ఈ వివరణలనుండి, అమ్మ ఉపాసకులు తల్లి ముత్యపు హారమును విశేషముగా ధ్యానించుట చూడవచ్చు. అందులోనూ ఏనుగు కుంభస్థలమునందు దొరకు ముత్యములు స్వచ్ఛమైన తెల్లని కర్పూరకాంతులతో శోభిల్లుతాయి.

 

ఇక రెండవది, తల్లి కంఠము పతకములు గలిగిన రత్నపు హారములతో శోభిల్లుతున్నది అని మాత్రము చెప్పకుండా, హారముల పతకములు ఊగుచున్నాయి (లోల, హిందోళ) అని వర్ణించారు ద్రష్టలు.


తల్లి హారములందలి పతకములు ఎందువలన ఊగుచున్నాయని చూస్తే
దృశశ్చంద్రార్కదహనా దిశస్తేబాహవోంబికే|
మరుతస్తు తవోచ్ఛ్వాసా వాచస్తే శృతయోఖిలాః
|| (3-13-10)

వాయువే అమ్మయొక్క ఉచ్ఛ్వాసనిశ్వాసలు అని బ్రహ్మాండపురాణమునందు చెప్పబడినది. ఈ వాయువు సదా వీచుటచే తల్లి మెడలోని పతకములు ఊగుచున్నవని భావించవచ్చు.

 

నాయందలి అజ్ఞానమను చీకటివలన, ఐహిక విషయముల చింతలతో (ఆలోచనలతో) ఊగిసలాడుతున్నాను. ఈ చీకటిని నీ కంబుకంఠమునందలి స్వచ్ఛమైన ముత్యములహారపు శోభతో తొలగించు తల్లీ!!

 

శ్రీమాత్రే నమః

No comments:

Post a Comment